ఆడపిల్ల అపురూపం

'ఏయ్.. చెప్పేది నీకే.. రోడ్డుకు ఏదో ఒక పక్క నడువు.. బైకులు, ఆటోలు స్పీడ్‌గా వెళ్తున్నాయ్, చెప్తే అర్థం కాదా..' అంటూ ఒకవైపు వేలాడుతున్న రిబ్బను జడని పట్టుకుని గట్టిగా లాగాను.

'సరే అన్నయ్యా.. అదిగో స్కూలు కూడా వచ్చేసిందిగా..' అంటోంది లాగిన చిన్ని జడని సవరించుకుంటూ.. రోడ్డుకు అడ్డంగా నడుస్తూ, ఏ భయం లేకుండా గెంతుతూ భుజానికి బరువైన స్కూల్ బ్యాగు వేసుకున్న నా ఆరేళ్ల చిట్టి చెల్లెలు.

ఆడపిల్ల అపురూపం

'ఈ రోజు ఎక్కువ సేపు ఉండను.. నిన్ను నీ క్లాసురూంలో దిగబెట్టేసి నేను నా క్లాసుకి వెళ్లిపోవాలి. అసలే నాకు ఫస్ట్ పీరియడ్ మాథ్స్, అర్థమైందా? బుద్ధిగా ఉంటావు కదా!' అని చిన్న బెదిరింపుతో నడుస్తున్నదాన్ని రెక్క పట్టుకుని ముందుకు కదిలించా. అలాగేలే అన్నట్లు బుంగమూతి పెట్టి కాస్త చిరాకు చూపుతో చూస్తూ భుజానికి వేలాడుతున్న బ్యాగును సరిచేసుకుంది.

రోజూ స్కూలుకు వెళ్లేటప్పుడు ఇదో తలనొప్పి నాకు.. అయినా ముందు అమ్మని అనాలి. నాకు నా హోమ్‌వర్క్, నా చదువు, నా పనులకే సరిపోతుందంటే మళ్లీ దీన్ని రోజూ నాకు అంటగడుతుంది. ఛ.. వీళ్లంతా నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని నాలో నేనే గొణుక్కుంటూ ఒకటో తరగతి క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోయా. తను ఎప్పుడూ కూర్చుండే బెంచీ దగ్గర మధ్యాహ్నానికి కావాల్సిన లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి కూర్చో అన్నట్లు సైగ చేశా. అదే బెంచీపై పక్కనే కూర్చున్న చెల్లెలి వయసే ఉన్న మరో అమ్మాయితో.. 'చూస్కోవా కాస్త.. క్లాసు రూమ్ దాటి బయటికి వెళ్లకుండా చూడు.. నువ్వు వెళ్తే నీతో పాటు కూడా తీసుకెళ్లు' అని అప్పగింతల కార్యక్రమం పెట్టుకున్నా. ఆ అమ్మాయి కూడా నావైపు సరే అన్నట్లు తల ఆడించి చెల్లికి మరింత దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేసింది.

చేయాల్సిన పెద్ద పని పూర్తయిందన్నట్లు.. నా భుజంపై వేసుకున్న బరువైన బ్యాగును సరిచేసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డా.. వేగంగా నా క్లాస్‌రూమ్‌ వైపు నడిచా. ఏంటో రోజూ నాకు ఈ టార్చర్. తనేమో తిన్నగా ఉండదు. ఏమైనా అంటే పెద్దవాడివి కదరా.. చెల్లిని నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారని అంటుంది అమ్మ. 'స్కూలుకు కలిసే వెళ్లాలి.. తనని జాగ్రత్తగా దిగబెట్టాలి.. నువ్వు కూడా బాగా చదువుకోవాలి.. మంచి పేరు తెచ్చుకోవాలి..' ఇలా రోజూ చెప్తూనే ఉంటుంది సోది పురాణం. రోజూ తీసుకెళ్లడానికి తనేమైనా నా పుస్తకాల బ్యాగా? ఒక్కతే వెళ్లలేదా ఏంటి? ఇలా అయితే నేనెప్పుడు చదివేది.. దీనితోనే సరిపోతుంది రోజూ నాకు అనుకుంటూ నా క్లాస్‌రూమ్‌లోకి వచ్చేశా.

'హమ్మయ్య మాథ్స్ టీచర్ ఇంకా రాలేదు. ఈ రోజు పెద్దగా లేట్ అవ్వలేదు. లేదంటే సార్ చేతిలో నా పని అయిపోయేది, రోజూ లేటుగా వస్తున్నానని నా చెవి పట్టుకుని మెలేస్తున్నాడు.. ఇదంతా ఆ రాక్షసి చెల్లి వల్లే..' అని అనుకుంటూ నా బ్యాగు తెరిచి కావాల్సిన పుస్తకాలు బయటికి తీస్తున్నా. 'గుడ్ మార్నింగ్ సార్..' అని దీర్ఘాలు తీస్తూ ఓ రాగంలా అంటున్న నా తోటివాళ్లందరి మాటలు మెల్లమెల్లగా దూరమవుతుండగా.. ఒక్క కుదుపుతో బస్సు ఆగడంతో నేను కూడా ఈ లోకంలోకి వచ్చేశా. తేరుకుని చుట్టూ చూసుకున్న నాకు ఎందుకో తెలియకుండానే ముఖంలో చిన్నగా నవ్వు పుట్టింది. ఎందుకంటే అది గతంలోని నా క్లాస్‌రూమ్‌ కాదు.. ఆర్టీసీ బస్సు.

మొత్తానికి వచ్చేశాం. నాతో పాటు అమ్మానాన్న కూడా బస్సు దిగారు చేతిలో లగేజీ బ్యాగులతో. కాస్త ఓ 30 అడుగులు వేశామంటే గమ్యం చేరిపోతాం. అమ్మానాన్న ముందు నడుస్తున్నారు. వాళ్ల చేతిలో బ్యాగులు తీసుకుని నేనూ వాళ్లను వెనకాలే అనుసరిస్తున్నా. ఔను.. నాకేంటి.. ఒక్కసారిగా స్కూల్ రోజులు గుర్తొచ్చేశాయి. ఏదేమైనా ఆ రోజులు భలే ఉండేవిలే. ఇప్పటిలాగా అప్పుడు ఏ టెన్షన్ లేదు.. చక్కగా స్కూలుకు వెళ్లిపోయి, బుద్ధిగా చదువుకుని.. సమయానికి తింటే చాలు. ఇక స్కూలు అయ్యాక హోమ్‌వర్క్ చేసేసి ఎంచక్కా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోవడానికి బయటికి పరుగులు. మళ్లీ ఎప్పుడో రాత్రి భోజనానికే ఇంటికి వచ్చేది. ఎంతైనా ఆ రోజులు మళ్లీ రావులే.. ఇలా నాలో నేనే ఆలోచిస్తున్న నన్ను మాటిమాటికీ ముందు నడుస్తున్న అమ్మానాన్నలు 'రారా తొందరగా' అన్నట్లు వెనక్కి తిరిగి సైగలు చేస్తున్నారు. ఇదిగో వస్తున్నా అంటూ చేతిలోని లగేజీ బ్యాగులపై పట్టు బిగించి నడకలో కాస్త వేగం పెంచా.

ఇంటి గేటు తీసిన చప్పుడు కాగానే లోపలి నుంచి నా చిన్ని అల్లుడు పరుగెత్తుకుని వచ్చి అమాంతం నన్ను హత్తుకున్నాడు. అటుఇటుగా మూడేళ్లు ఉంటాయనుకోండి ఆ బుడ్డోడికి. మనవడిని చూసిన ఆనందంలో అమ్మానాన్న కూడా చిన్న పిల్లలైపోయారు. జేబులో నుంచి చాక్లెట్ తీసి మనవడికి ఇస్తున్నాడు మా నాన్న. వెనకే నా చెల్లి ఇంట్లో నుంచి బయటికి వస్తూ మా చేతిలోని బ్యాగులను అందుకుంది. 'లేట్ అయ్యామా అమ్మా..' అని నాన్న అడుగుతుంటే.. 'పర్లేదు నాన్నా.. ఇంకా పూజ మొదలవలేదులే.. రండి, కాళ్లు కడుక్కోండి' అంటూ లోపలికి తీసుకెళ్లింది. చిన్నప్పుడు చేయి పట్టుకుని స్కూలుకు తీసుకెళ్లిన నా రెండు జడల చెల్లెలు.. ఇప్పుడు ఓ ఇంటి ఇల్లాలు. సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంతులు గారు ముందే వచ్చేసి పూజ సమయం దగ్గర పడుతోందని తొందర పెడుతున్నారు. లోపల హడావిడి వాతావరణం బాగానే ఉంది. మా బావగారు మమ్మల్ని చూడగానే కళ్లతోనే పలకరించి.. అలా కూర్చోండి అన్నట్లు చూపించాడు.

ఎంత మారింది.. ఈ 15 ఏళ్లలో చాలా మారింది.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన అనుకున్నవి కాస్తా మనకు దూరమవుతాయి.. దూరంగా ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. తెలియకుండానే సొంతవాళ్లు పరాయివాళ్లు అయిపోతారు. వాళ్లకంటూ ఓ జీవితం ఏర్పడుతుంది. బాధ్యతలు తెలిసి వస్తాయి. వాళ్ల లోకంలో వాళ్లు మునిగిపోతారు. ప్రతిసారి బయటికి చూపించుకోలేని కొన్ని ప్రేమలు మనసులోనే శాశ్వతంగా ఉండిపోతాయి. ఇవన్నీ ఆ రోజు నా చెల్లిని చూశాక నాకు అనిపించాయి. చిన్నప్పుడు దీనికి ఏమీ తెలియదు.. ఎలానో ఏంటో అనుకున్నా, కానీ ఇప్పుడు ఓ కుటుంబాన్నే నడిపిస్తుంది.
ఆడపిల్ల అపురూపం
పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరీ చేయిస్తూ హడావిడి పడిపోతున్న నా చెల్లిని చూస్తుంటే.. తనేనా చిన్నప్పుడు నా చేత చీవాట్లు తిన్నది? అసలేమీ తెలియదు, దీంతో పెద్ద తలనొప్పి, ఎలారా బాబు అనుకున్న ఆ పసిపాపేనా ఈ రోజు బాధ్యత తెలిసిన ఇల్లాలు? అంతేలే.. కాలం అన్నీ నేర్పిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకునే శక్తినిస్తుంది. పూజ మొదలైంది. చెల్లె, బావగారు పూజలో కూర్చున్నారు. ఆరుబయట వంటలు ఘుమఘమలాడుతూ సిద్ధమవుతున్నాయి. బంధువులు, చుట్టుపక్కలవాళ్లతో ఇల్లంతా కళకళలాడుతోంది. నా ముద్దుల అల్లుడు అల్లరి చేయకుండా నేనే కట్టడి చేస్తున్నా.. అలా ఒక రెండు గంటల తర్వాత పూజ పూర్తయింది. 

ముందుగా అందరం భోజనాలు చేసేశాం. వ్రతానికి వచ్చిన చుట్టుపక్కల ఆడోళ్లందరికీ వాయనం ఇచ్చేసి చెల్లెలు జాగ్రత్తగా సాగనంపుతోంది. కాస్త సందడి తగ్గింది కదా అని నేను వెళ్లి ఓ మూలగా ఉన్న గదిలో నడుం వాల్చా. అలా చిన్నగా కునుకు పట్టిందో లేదో కాసేపటి తర్వాత ఎవరో మెల్లగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. మంచం దిగి గది దాటి బయటికి వచ్చి ఎవరా అన్నట్లు అటూ ఇటూ చూశా. అత్తయ్య, మావయ్య వాళ్లంతా వేరే వేరే గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దూరపు బంధువులు కొందరు హాల్లోనే అక్కడక్కడా సర్దుకుని మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు. చడీచప్పుడు లేదు. సన్నగా ఆ మాటలు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అదే నిద్ర కళ్లతో నా పక్కనే ఉన్న మరో గదిలోకి తొంగి చూశా.. అక్కడ అమ్మ, చెల్లెలు ఇద్దరే మెల్లిగా మాట్లాడుకుంటున్నారు.

నన్ను చూసీ చూడగానే అమ్మ పక్కనే కూర్చున్న చెల్లెలు లేచి.. 'రారా.. పడుకున్నావు అనుకున్నా. నిద్ర పట్టకపోతే అమ్మతో కాసేపు ఏదో అలా మాట్లాడుతున్నా. చాయ్ ఏమైనా తాగుతావా.. తీసుకురమ్మంటావా..' అని నా సమాధానం కోసం ఎదురుచూడకుండానే అక్కడి నుంచి వంటగదిలోకి దూరిపోయింది. వెళ్తున్నదల్లా తన చీర కొంగుతో కళ్లను కొంచెం తుడుచుకుంటున్నట్లుగా అనిపించింది నాకు ఎందుకో. వెంటనే అమ్మ వైపు తిరిగి చూసి.. 'ఏమైందమ్మా.. చెల్లె ఏంటి, అలా ఉంది? ఏం జరిగింది?' అంటున్న నా ప్రశ్నలకు 'ఏముంటుందిలేరా.. ప్రతి ఆడపిల్లకు ఉండేవేలే. ఏవో కొన్ని చిన్న చిన్న అత్తారింటి కష్టాలు' అంటూ నిట్టూర్చి ఊరుకుంది. ఆ సమాధానంతో ఎందుకో సంతృప్తి చెందని నేను మళ్లీ.. 'ఏంటో వివరంగా చెప్పమ్మా.. చెల్లెలు ఇక్కడ సంతోషంగానే ఉంది కదా?' అని కాస్త భయంగానే గొంతు తగ్గించి అడిగా.

అప్పుడు అమ్మ ఇలా చెప్పడం మొదలెట్టింది.. 'సంతోషంగా ఉందా అంటే ఉందన్నట్లేరా.. పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేసిన ప్రతి ఆడపిల్లకి ఉండేవే ఇవి. కొత్తలో అంతా బాగానే ఉంటుంది కానీ, పోను పోను బాధ్యతలు పెరుగుతాయి. బావగారికి ఈ మధ్య చేస్తున్న ఉద్యోగంలో ఏవో టెన్షన్స్.. దాంతో కొంచెం రాబడి తగ్గిందట. పైగా ఇప్పుడు పిల్లాడు కూడా.. ఖర్చులు అవీ ఉంటాయిగా. ఇది సరిపోదన్నట్లు పోయిన నెలలో వాళ్ల ఆడపడుచు అత్తారింటి నుంచి వచ్చి ఓ వారం రోజులు ఇక్కడే ఉందట. చేసిన వంట నచ్చలేదని ఆ అమ్మాయి ఓ రోజు చెల్లెలి ముఖం మీదే అనడం, దానికి వీళ్ల అత్తగారు వంత పాడడం జరిగాయట. మా అమ్మాయికి నేను ఏ రోజు కూడా ఇలాంటి వంటలు చేసి పెట్టలేదు, మేమంటే సరే ఎలాగోలా తింటాం, అది రాక రాక ఇలా వచ్చినప్పుడైనా కొంచెం రుచిగా వండరాదూ అని పెత్తనం చూపించిందట. దానికి చెల్లెలు కాస్త నొచ్చుకుందట. అత్తమామలు, భర్త అంతా మంచివాళ్లే, తనని బాగానే చూసుకుంటారు.. వాళ్ల వరకూ ఉన్నప్పుడు సరే గానీ, ఇలా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడే కొత్తగా చీవాట్లు మొదలవుతాయి ఏ ఆడపిల్లకైనా. అదీ కాకుండా ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదైనా ఉద్యోగం చేస్తానని తన మనసులో మాట బయటపెట్టిందట చెల్లెలు ఓ రోజు. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు చేసి ఊళ్లేలాలా ఏంటి?.. మావాడి సంపాదన సరిపోవట్లేదనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అత్తామామలు కొంచెం గట్టిగానే అన్నారట.. అదిగో అదే మాట చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇంతలో నువ్వొచ్చావు' అని అమ్మ చెప్పడం పూర్తి చేసింది.

'అదేంటమ్మా.. అత్తింట్లో ఆడపిల్లకి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా.. తనకూ కొన్ని ఇష్టాలుంటాయి, పెళ్లయ్యాక బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తే తప్పేంటి? అయినా చిన్నప్పుడు మన దగ్గర ఎంత గారాబంగా పెరిగింది.. అడిగినవన్నీ నాన్న కాదనకుండా తెచ్చిపెట్టేవారు తనకి. ఇంట్లో పరిస్థితి బాలేకపోతే ఆడపిల్ల మీద అరవాలా.. తనేం తప్పు చేసిందని..?' అని అమ్మతో అంటుంటే నా కళ్లల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. 'చూడు నాన్నా.. పుట్టింట్లో ఏ ఆడపిల్లైనా మహారాణే, అత్తింట్లో కూడా ఆ హోదా దక్కాలంటే అందరికీ ఆ అదృష్టం దొరకదు. ఇవేం తీరిపోని పెద్ద సమస్యలు కాదు.. అలాగని పోనీలే అని వదిలేసేవీ కావు, సర్దుకుపోవాలంతే' అని అమ్మ నా మాటలకు నచ్చజెపుతోంది.

'ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావు.. మనమంతా ఉన్నాంగా.. ఈ విషయంలో మనమేం చేయలేమా?' అని మనసు ఊరుకోక వస్తున్న మాటలకు అమ్మ..'ఏం చేస్తాం చెప్పు.. ఇది తన ఇల్లు.. తన సంసారం.. తన జీవితం.. చక్కదిద్దుకునే బాధ్యత కూడా తనదే. కాలానికి, పరిస్థితులకు తగ్గట్టుగా తట్టుకునే ధైర్యం, ఆ తెగువ ఆడపిల్లకు అలా వచ్చేస్తాయిలే.. అప్పుడే ఓ ఇంటి ఇల్లాలిగా తను గెలిచినట్లు. అత్తారింట్లో కష్టం వస్తే ఆడపిల్లకు ముందు గుర్తొచ్చేది పుట్టింటివాళ్లే. అలా నిజంగా ఏదైనా అవసరంతో వచ్చినప్పుడు నువ్వు ఒంటరివి కాదని, నీకు మేమంతా ఉన్నామని చెప్పే ధైర్యం తాలూకు ఒక్క మాట చాలు.. అంతకన్నా ఏ ఆడపిల్లకైనా పెద్దగా ఆశలు, కోరికలు ఏవీ ఉండవురా.. ఆడపిల్ల అపురూపంరా.. ఒకప్పుడు నేనూ ఇవన్నీ దాటుకుని వచ్చిందాన్నేలే..' అని అమ్మ నా కంగారుని పోగొట్టేలా మాట్లాడుతూ ఉండగా ..ఇంతలో బయటి నుంచి చెల్లెలి కాలి పట్టీల శబ్దం వినిపించింది. 

నా కోసం చేతిలో చాయ్ గ్లాసు పట్టుకుని చెల్లెలు గదిలోకి వస్తుంటే.. తనకి ఎదురుగా నడిచా. చిన్నప్పుడు నాతో పాటు స్కూలుకు తీసుకెళ్తున్నప్పుడు అన్నీ నేనే చూసుకోవాలా ఏంటని చెల్లెలి మీద పడిన చిరాకు ఆ క్షణం ఒక్కసారిగా నా బుర్రలో గిర్రున తిరిగింది. ఎన్ని మాటలు పడుతున్నా, ఎన్ని బాధలు ఉన్నా మనసులోనే దాచుకుని బయటికి చెప్పుకోకుండా ఓర్పుగా భరించే ఆడపిల్లల సహనానికి ఆ సమయంలో సలాం కొట్టాలనిపించింది. వేడిగా పొగలు కక్కుతున్న చాయ్ గ్లాసును తన చేతి నుంచి అందుకుని అక్కడ పక్కనే ఉన్న బల్ల మీద ఉంచా. ఏమీ మాట్లాడకుండా నన్నే చూస్తూ ఎదురుగా నిలబడిన చెల్లెలి కళ్లల్లో అంతకు ముందు తడి ఇంకా ఆరకపోవడం గమనించిన నేను.. తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ 'నేనున్నారా.. నేను చూసుకుంటా' అని పెగలని గొంతుతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మాట ఇచ్చా.
ఆడపిల్ల అపురూపం

నా చెల్లెలికి.. పుట్టింట్లో గారాబంగా పెరిగి అత్తవారింట్లో అన్నీ భరించి మసులుకుని కన్నవాళ్లకి మంచి పేరు తెచ్చే ప్రతి ఆడపిల్లకి ఈ నా ఆర్టికల్ అంకితం.. 💗


THANK YOU

PC: CH.VAMSI MOHAN

కామెంట్‌లు