ఈ సృష్టిలో తల్లి ప్రేమ కన్నా గొప్పది మరొకటి ఉంటుందని నేను అనుకోను. నీ పుట్టుకకు మూలమై.. పాలబువ్వ తినిపించే దగ్గర నుంచి పరిగెత్తి ఈ ప్రపంచంలో నీకంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకునే పూర్తి జీవితంలో అమ్మ అనే రెండు అక్షరాల అద్భుతానికి పెద్ద స్థానమే ఉంది. అలాంటి అమ్మ పిచ్చి ప్రేమ గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒక పాట ఇప్పుడు పాడుకుందాం.. తన బిడ్డ గురించి ఒక తల్లి పాడుకున్న ఈ పాటను విని మనమూ మన అమ్మను ఓసారి తలుచుకుందాం.గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా...
ఒక అమ్మకు తన బిడ్డ కన్నా అపురూపం ఏముంటుంది చెప్పండి? ఆడదానిగా పుట్టినప్పుడు కాదు.. అమ్మ అని పిలుపించుకున్నాకే ఆ పుట్టుకకు అసలైన సార్థకత అని ప్రతి స్త్రీ భావిస్తుంది. ఇక్కడ కూడా ఈ తల్లి తను నవమాసాలు మోసి కన్న బిడ్డను గోపాల బాలుడిగా అంటే ఆ చిన్ని కృష్ణుడిగా.. చందమామ రూపంగా అనుకుని మురిసిపోతోంది. తన బిడ్డను ఎన్నిసార్లు చూసుకుంటున్నా ఆ తల్లికి తనివి తీరడం లేదట. తల్లయ్యాక ప్రతి ఆడపిల్ల ఈ ప్రపంచాన్నే మరిచిపోతుంది.. ఇక ఇంకో లోకం అంటూ ఏదీ ఉండదని కవి తానే ఒక అమ్మ అవతారమెత్తి తల్లి ప్రేమను మరింత అందంగా వర్ణించాడు అనిపిస్తుంది నాకు ఈ పాట వింటుంటే.
రారా కన్నా కడుపారా కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న
నిను ఆడించే నీ అమ్మనురా
నువ్వు ఆడుకొనే నీ బొమ్మనురా
కడుపారా కన్నా అనే మాట ఎంత అద్భుతంగా ఉందో అసలు..! ఇంకా మాటలు కూడా నేర్వని బుజ్జాయికి చిటికెలతో చప్పుడు చేస్తూ బిడ్డ చూపును తన వైపుకు తిప్పుకుంటుంది తల్లి. ఆ చిటికెల చప్పుడు వింటూనే అమ్మను గుర్తు పట్టడం అలవాటు చేసుకుంటుంది ఆ పసిపాప. కానీ, ఇక్కడ ఈ తల్లి మాత్రం తన చిటికెలు వింటూ నేనెవరో తెలుసా అని అడుగుతూనే.. ఎంత ప్రేమను ఒలకబోస్తుందో చూడండి. నేను నిన్ను ఆడించే అమ్మనురా అని చెప్తూనే.. తన బుజ్జి చేతులతో ఆడుకోవడానికి బొమ్మలా కూడా మారిపోతానని అంటోంది.. ఆ చిట్టి ప్రాణానికి దాసోహం అంటోంది. ఎంత పిచ్చి ప్రేమ ఈ తల్లిది.గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం
అందె కట్టి ఆడుతుందే ఈ తల్లి ప్రాణం
ఉంగాలతోనే సంగీత పాఠం.. నేర్పావా నాకు నీ లాలి కోసం
ఉగ్గు పట్టనా.. దిష్టి తగలని చుక్క పెట్టనా..
బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి
ఊసులు చెబుతూ పలకరిస్తావు
పసిపాపను ఆడిస్తున్నప్పుడు ఆ చిట్టి చిట్టి పాదాలు గుండెను తాకుతున్నప్పుడు ఎలాంటి తీయటి అనుభూతి ఉంటుందో ఎప్పుడైనా అనుభవించారా? ఇక్కడ ఈ తల్లి ప్రాణం ఏకంగా అందె కట్టి ఆడుతుందట ఆ అనుభూతికి. మాటలు రాని పసిబిడ్డ మొదట్లో ఉంగా ఉంగా అంటూ పలుకులు మొదలుపెడుతుంది. ఆ ఉంగాలే ఈ తల్లికి సంగీత పాఠం అంట.. ఆ ఉంగాలతో తన కోసం పాడాల్సిన లాలి పాటను ఆ బిడ్డే తల్లికి నేర్పిందని రాయడం ఎంతో అద్భుతంగా ఉంది. బోసి నవ్వులు అంటే ఇంకా పళ్లు కూడా రాని పసి పాపాయి నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది..? కల్మషం లేని ఆ నవ్వు చెప్పే ఊసులు వింటూ బిడ్డ పలకరిస్తుంటే పిచ్చిదాన్ని అయిపోయేంత అపారమైన ప్రేమ పెంచేసుకున్నా అని చెబుతోంది ఈ తల్లి.ఏ నోము ఫలమో పండి ఈ మోడు కొమ్మ
ఈనాడు నిన్నే పొంది అయిందిరా అమ్మా
ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ
ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ
మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచేరా
నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన
వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు
ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప ఒక ఆడది అమ్మ అని అనిపించుకోలేదు అంటారు.. అమ్మ అనే చిన్న పిలుపు కోసం పురిటి బాధలు ఓర్చుకుని చావు అంచుల వరకూ వెళ్లేంత నొప్పిని భరించడానికి ఒక ఆడది సిద్దపడుతుందంటే వాళ్లను మించిన శక్తివంతులు ఇంకెవరూ లేరనిపిస్తుంది నాకు. తాను పుట్టినప్పుడు కాదు.. తను ఇంకొకరిని పుట్టించినప్పుడు మరో జన్మ ఎత్తుతుందట ప్రతీ ఆడపిల్ల. తనకు బిడ్డగా పుట్టి తనను అమ్మను చేసిన బిడ్డను బ్రహ్మగా ఊహిస్తుంది ఇక్కడ ఈ తల్లి. బ్రహ్మ అంటే మన తల రాతలు రాసేవాడని అంటుంటాం. ఈ చిన్ని బ్రహ్మ కూడా తన కడుపున పుట్టి తన రాతనే మార్చేశాడని ఉప్పొంగిపోతున్న ఈ తల్లిని చూసి అమ్మ ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్కరి హృదయం కరగకుండా ఉంటుందా?అమ్మ పొత్తిళ్లలో ఉండే పాపాయి పిడికిలి ఎప్పుడూ బిగించి ఉంటుంది. కొన్ని సార్లు మనం విడిపిద్దామన్న వీడనంత గట్టిగా బిగుసుకుని ఉంటుంది అది.. ఆ బిగిసిన పిడికిలిలోనే తన బిడ్డ వరాలు తీసుకొచ్చాడని అంటుంది ఈ తల్లి. ఆ దేవుడు నిన్ను పంపుతూ ఈ అమ్మ కోసం వరాలు ఇచ్చాడా.. అంత గొప్ప వరం నువ్వే నాకు అని తన పిచ్చి ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఇంతకన్నా ఎలా చెప్పగలం ఒక అమ్మ ప్రేమని..? ఒక కన్నతల్లి బిడ్డ కోసం పడే ఆరాటాన్ని..? ఈ లోకంలో నిజంగా స్వచ్చమైనవి ఏమైనా మిగిలి ఉన్నాయంటే అది ఒకటి తల్లి ప్రేమ, రెండు పసిపాప నవ్వు మాత్రమే. అందులో దొరికే స్వచ్ఛత, అవి పొందితే మనకు కలిగే అనుభూతి ఎన్ని కోట్లు పెట్టినా దొరకవు. దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకంలో అపురూపమైన తల్లి ప్రేమను ఇంత చక్కగా వర్ణించిన సిరివెన్నెల గారికి శతకోటి దండాలు పెట్టినా చాలదు. ఈ భూమి మీద నడిచే దైవాన్ని పిచ్చితల్లి అనే ఒక్క మాటతో చెప్పి ఆ ప్రేమ ఎంతటి స్వచ్ఛమైనదో.. ఆ మాతృత్వపు మధురిమ ఎంతటి గొప్పదో మనకు మరోసారి ఈ పాటతో తెలియజేశారు. ఇదంతా కాదు.. అప్పుడే పుట్టిన పసికందును ఎప్పుడైనా తాకే అవకాశం మీకు వచ్చిందా? ఆ స్పర్శను అనుభవిస్తే ఎంత బాగుంటుందో.. ఈ పాట అంత బాగుంది. కన్న వాళ్ల ప్రేమను పిల్లలు మర్చిపోతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఈ పాటతో అమ్మ విలువను తెలుసుకుందాం.. అమ్మను ప్రేమిద్దాం.. అమ్మను కాపాడుకుందాం.. అమ్మకు ఈ పాటను అంకితమిస్తూ శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి