పెళ్లి

ఎలాంటి సంబంధం, పరిచయం లేని ఒక స్త్రీ, ఒక పురుషుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యేదే  'పెళ్లి'. పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలవడమే కాదు.. రెండు మనసులు ఒక్కటవడం. ఆ తర్వాత ఆ ఇద్దరికీ ఓ కొత్త ప్రపంచం ఎదురవుతుంది. అలాంటి ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుని, ఒకరికి ఒకరు తోడుగా ఉండి అర్థం చేసుకుని ముందుకు సాగితే ఆ దాంపత్య జీవితం పరిపూర్ణం అవుతుంది. మరి ఇప్పటి జనరేషన్‌లో ఎంత మంది అలా ఉంటున్నారు? నిజంగా పెళ్లికి అంత విలువ ఉందా? ముందే చెప్తున్నా.. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. భారతీయ వివాహ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. కానీ, ఇప్పుడు దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అనేదే నా పాయింట్. అందుకే నాకు అనిపించిన కొన్నిటిని మీ ముందుకు ఇలా తెస్తున్నా.

పెళ్లి

ఈ ప్రపంచంలో అసలు పెళ్లి అంటే ఏంటి? అసలెందుకు చేసుకోవాలని నిజంగా క్లారిటీ ఉండి ఎవరూ చేసుకోరు. వయసు వచ్చిందని కొందరు, వయసు అయిపోతుందని కొందరు, అందరూ చేసుకునేదే కదా అని కొందరు, ఇంట్లో వాళ్ల బలవంతంతో కొందరు, ఒక తోడు ఉండాలని ఇంకొందరు. ఇక ఆ తర్వాత బంధాలు, బాధ్యతలు, సంసారం.. ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్కరూ చూడాల్సినవే అని చెప్తారు. జీవితానికి పెళ్లి ఎంత అవసరమో.. ఆ తర్వాత ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే అవసరం.

పెళ్లి

మీ ఇద్దరికీ ఎప్పుడో రాసి పెట్టి ఉందని అంటారు. అలా రాసి పెట్టి ఉంటే మరి మొదటి సంబంధం అదే ఎందుకు రాలేదు? ఒక 3-4 సంబంధాలు చూశాక అన్నీ కుదిరితే ఆ 5వ దానికి ఓకే అంటారు. అమ్మాయి లేదా అబ్బాయి తెల్లగా ఉన్నారా.. నల్లగా ఉన్నారా? జీతం ఎంత సంపాదిస్తాడు? ఆస్తులేమైనా ఉన్నాయా? అమ్మాయి ఎంత కట్నం తెస్తుంది? మనం ఎంత పెట్టాలి? ఇంకా కొందరి విషయాల్లో అయితే అమ్మాయి/అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది అని కూడా ఎంక్వయిరీ చేస్తారు. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి ఇన్ని లెక్కలు వేసుకుని చేసుకునే పెళ్లి రాసి పెట్టినట్లు ఎలా అవుతుంది? అవసరానికే కదా అంతా..!!

పెళ్లి

పెళ్లి చూపులు.. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి మంచి పని జరిగింది కానీ, ఒకప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. అమ్మాయి టీ తీసుకుని తెచ్చి, అందరికీ ఇచ్చి కింద చాప మీద కూర్చుంటే అబ్బాయి కుర్చీలో దర్జాగా కూర్చోవాలా? పాట పాడమంటే పాడాలా? నిజంగా చూస్తే వరకట్నం అనే పేరుతో నీకే తను డబ్బులు ఇచ్చి నిన్ను కొనుక్కుంటుంది. డబ్బులు తనే ఇచ్చి, పెళ్లి చూపుల్లో నువ్వు అడిగినవన్నీ చేసి ఇదంతా అయ్యాక ఇందాక చెప్పినట్లు అన్ని లెక్కలు కుదిరితేనే అప్పుడు ఓకే అంటారు. ఇవన్నీ ఒకప్పటి పద్ధతులు అనుకోండి. కాలం మారినా ఇప్పటికీ కొన్ని అలాగే ఉన్నాయిలెండి. అసలు అందరి ముందు అలా సినిమాటిక్‌గా పెళ్లి చూపుల కాన్సెప్టే ఏదోలా ఉంటుంది. ఎందుకంటే.. అదే సీన్ మళ్లీ రిపీట్ అవ్వొచ్చు కదా..! ఆ రోజు నీ మనసు ఆలోచించి తీసుకునే ఆ డెసిషనే నీ లైఫ్‌ని, ఆ అమ్మాయి లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. ఇంత సింపులా పెళ్లి అంటే? కాదు.. ఆ మనిషి లేకపోతే మనం ఉండలేం అనిపించాలి. అది నిజంగా ఎంత మందిలో అనిపించి పెళ్లి చేసుకుంటున్నారు మరి..? ఒకవేళ నువ్వు ఆ రోజు వద్దు అని అనుకుని ఉంటే.. తర్వాత నీకు ఇంకో పెళ్లి చూపులు, ఆ అమ్మాయి లైఫ్‌లో ఇంకో అబ్బాయి.. అంతే కదా? ఎక్కడుంది నిజమైన బంధం. అంతా ఆప్షన్‌లే కదా మనకు..!

పెళ్లి

పెళ్లికి ఓకే అనుకున్న తర్వాత మనవాళ్లు చేస్తున్న అతి ముఖ్యమైన పని, నాకు నచ్చనిది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఒక మంచి లొకేషన్, ఓ మంచి కెమెరామెన్‌ని చూసుకోవడం, ఫోటోషూట్‌కు కావాల్సిన నాలుగైదు రకాల బట్టలు కొనుక్కోవడం. ఇక కుర్రాడు సూట్ వేసుకుని హీరోలా ఫీల్ అవ్వడం, అమ్మాయి అందంగా రెడీ అయ్యి హీరోయిన్‌లా తనని తాను ఊహించుకోవడం. కెమెరామెన్ నవ్వమంటే నవ్వడం, ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం, అమ్మాయిని ఎత్తుకుని అబ్బాయి స్లో మోషన్‌లో రావడం. మీ ఫోటోలకు పోజులే తప్ప ఆ నవ్వులో నిజం ఉందా? అమ్మాయి కళ్లలోకి చూసే ఆ చూపులో నిజమైన ప్రేమ ఉందా? అంతా ఆ షూట్ కోసమే కదా.. రేపు పెళ్లయ్యాక ఇలాంటి ఒక ఫోటోని ఇంటి హాల్లో పెట్టుకోవడానికే కదా? ఏదీ.. అదే అబ్బాయిని ఒక పదేళ్ల తర్వాత అమ్మాయి కళ్లలోకి అంతే ప్రేమగా చూడమనండి చూద్దాం..! గట్టిగా మాట్లాడితే నేను ఒకటి చెప్తా. వైదిక ధర్మం ప్రకారం.. పెళ్లిలో అమ్మాయి తండ్రి, ఎంతో గారాబంగా పెంచుకున్న తన కూతురి చేతిని నీ చేతిలో పెట్టి నీ కాళ్లు కడిగి కన్యాదానం చేసి అప్పగించినప్పుడు కదా ఆ అమ్మాయి నీ సొంతం అవుతుంది. ఫోటోషూట్ల పేరుతో ఆ అమ్మాయిని పట్టుకుని, ముట్టుకునే హక్కు నీకు ఎవడు ఇచ్చాడు?

పెళ్లి

ఇక పెళ్లి.. జీవితంలో ఒకేసారి వచ్చే అందమైన, అద్భుతమైన ఘట్టం(కొందరు రెండు, మూడు కూడా చేసుకుంటారు అనుకోండి.. వాళ్ల గురించి నేను మాట్లాడట్లేదు). అందుకని జీవితాంతం గుర్తుండాలని చక్కగా రెడీ అయ్యి పీటలు ఎక్కుతారు. పెళ్లిలో పురోహితుడు చదివే మంత్రాలకు చాలా విలువ ఉందని, అవే మీ జీవితాన్ని ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండేలా చేస్తాయని అందరి నమ్మకం. మరి వేద మంత్రాలతో పెళ్లి చేసుకున్న వాళ్లలో ఎందుకు చాలా మంది విడిపోతున్నారు? మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి. పెళ్లిలో ఫోటోలు, వీడియోల కోసం చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే.. మన దృష్టి అంతా మన అలంకారం మీదే. ఫొటోలకు నవ్వుతున్నామా లేదా?.. వీడియోల్లో ఎంత బాగా పడుతున్నాం అనేదే ముఖ్యం మనకు. తల మీద పెట్టే జీలకర్ర బెల్లంని కూడా కాసేపు ఆపి ఫొటోలో అది కరెక్ట్ యాంగిల్ వస్తుందా లేదా అని మళ్లీ మళ్లీ చెక్ చేస్తారు. నాయనా.. నువ్వు పెళ్లి చేసుకునేది నీ సోకుల కోసం కాదు.. ఆ మంత్రాలు, చేసే కార్యాలు అన్నీ సరిగ్గా టైంకి జరిగిపోవాలి. అప్పుడే దానికి విలువ.
పెళ్లి

పెళ్లి తర్వాత ఎంత మంది నిజంగా పార్ట్‏న‌ర్ చెప్పిన మాటలకు విలువ ఇస్తున్నారు. మీరు అంటున్నట్లే తన కోసమే పుట్టానని పెళ్లి చేసుకున్నారు కదా.. మరి ఎంత మంది నిజాయితీగా ఉన్నారు? పెళ్లయి కొన్నేళ్లు పోయాక ఎంత మంది వేరేవాళ్లతో సంబంధాలు పెట్టుకోవట్లేదు. నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే అలా చేస్తామా.. చేయాలనే ఆలోచన వస్తుందా అసలు? ఇదేనా మనం పెళ్లికి, భాగస్వామికి ఇచ్చే గౌరవం. దీని కోసమేనా అంత ఆరాటపడి పెళ్లి చేసుకున్నది. ఇంత దానికేనా పెళ్లి అంటే అందరి జీవితాల్లో జరగాల్సిన ముచ్చట అని చెప్పేది. అలా అని అందరూ అలాగే ఉన్నారని కాదు నా ఉద్దేశ్యం. ఇప్పుడు కలిసి ఉన్నవాళ్లు కూడా ఒకప్పుడు అందరిలాగా పెళ్లి చేసుకుని జీవితంలో అడ్జస్ట్ అవుతున్న వాళ్లే. మొదట అందరిలాగే పెళ్లి చేసుకున్నా కూడా.. ఎంత మంది ఇప్పుడు నిజంగా ఇష్టంతో ఉంటున్నారు? అందరూ అడ్జస్ట్ అయ్యేవాళ్లే.
పెళ్లి

వేద శాస్త్రాల నడుమ పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు అంటే అది ఇప్పటి జనరేషన్ మెంటాలిటీ. జీవితం అంటే అడ్జస్ట్‌మెంట్. అది ఒక్క పెళ్లి అనే విషయంలోనే కాదు.. ప్రేమ, స్నేహం, కుటుంబం ఎందులోనైనా సరే. మనిషిని అర్థం చేసుకుని వాళ్ల తప్పులను కూడా క్షమిస్తూ ఒకరి కోసం ఒకరు ఉండడమే జీవితం అంటే. అలా ఉండలేని రోజు ఏ బంధం కూడా నిలబడదు. దానికి సాక్ష్యం మన అమ్మానాన్నలే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని, మనల్ని పెంచి ఇంత వాళ్లను చేసి ఇప్పటికీ కలిసి ఉన్నారంటే అది వాళ్లు అడ్జస్ట్ అయిన విధానం. అది ఇప్పటి జనరేషన్‌కి లేదు. 
పెళ్లి

కావాల్సింది.. వయసు వచ్చిందని చేసుకోవడం కాదు.. నిజంగా మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవడం. అలా అనిపించలేదంటే ఎప్పటికీ చేసుకోకు. ఒక మనిషిని మనం బాగా చూసుకుంటాం, నిజమైన ప్రేమని ఇస్తామని అనిపించినప్పుడు చేసుకోవడం. పైన చెప్పిన అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అని వాదించట్లేదు. ఏమో.. నాది కూడా తప్పు అయి ఉండొచ్చు, నాకే అసలేం తెలియకపోవచ్చు. ఏదో నాకు అనిపించినవి మీతో పంచుకున్నాను. ఇలా సూటిగా చెప్తే నాది తప్పు అనేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ నేను చెప్పినవన్నీ కష్టమైనా ఒప్పుకోవాల్సిన నిజాలు.
పెళ్లి

నా అభిప్రాయాలు నచ్చితే కామెంట్ చేయండి.. నచ్చకపోయినా అసలు పెళ్లి అంటే మీ ఉద్దేశ్యంలో ఏంటో నాకు చెప్పడానికి కామెంట్ చేయండి. 😀

THANK YOU

PC: CH. VAMSHI MOHAN


కామెంట్‌లు