ఆడపిల్ల

ఆడపిల్లఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికే కళ అంటారు.. ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అంటుంటారు.. ఆడపిల్లని అలా అనకూడదురా అని మనకే బుద్ధి చెప్తారు.. ఆడపిల్ల దానికేం తెలుసు, నువ్వు చూసుకోవాలిగా అని పనంతా మనకే చెప్తారు.. నీకేంట్రా మగ మహారాజువి, కష్టాలన్నీ ఆడపిల్లకే అంటారు.. ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదు అంటారు.. ఇవన్నీ ఎందుకు అంటారో తెలియాలంటే ముందు మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ఉండాలి.ఆడపిల్ల'రేయ్.. ఏంట్రా ఆ గాలి తిరుగుళ్లు..? చదివేది ఏమైనా ఉందా లేదా.. దాన్ని చూడు ఎంత బుద్ధిగా పుస్తకాలు పట్టిందో' అని ఎప్పుడైనా మీ అక్క/చెల్లిని చూపిస్తూ మీకు చీవాట్లు పడ్డాయా? పడే ఉంటాయిలెండి.. అబ్బాయిగా పుట్టాక ఎన్ని పనులో కదా మరి. బయటికి వెళ్లాలి.. ఫ్రెండ్స్‌ని కలవాలి.. ఆడుకోవాలి.. ఒళ్లంతా దెబ్బలు తగిలించుకోవాలి.. ఎప్పుడో చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవాలి. ఇంత కష్టపడి తిరిగి తిరిగి ఇంటికొస్తే అమ్మేమో చీవాట్లు పెట్టేస్తుంది. అమ్మ అలా మహాంకాళిలా మారి తిడుతున్నప్పుడు.. అవి వినలేక నువ్వు తల పట్టుకుని కూర్చున్నపుడు.. ఒక చిన్న నవ్వులాంటిది లోపలి నుంచి వినిపించీ వినిపించనట్లు వినబడుతుంది.. ఇంకెవరిది?.. తనని పొగిడేసి నిన్ను తిట్టింది కదా అమ్మ. అందుకే నీ చెల్లికి అంత ఆనందం.. అప్పుడు చిరాకులో ఉండి నువ్వు గమనించవేమో కానీ, ఆ నవ్వులో ఒక స్వచ్ఛత ఉంటుంది.ఆడపిల్లఅమ్మ చీరని వచ్చీ రానట్లుగా చుట్టేసుకుని, అమ్మలాగే నుదుటన బొట్టు పెట్టేసుకుని, ఒక చేతిని చెంప పైన, ఇంకో చేతిని నడుంకి ఆనించి అద్దం ముందు నిలబడినప్పుడు ఆడపిల్లని చూశావా? ఎంత అందంగా ఉంటుందో..! తనకు తానే అమ్మలా మారిపోయినట్లు ఊహించేసుకుని అటు ఇటు పరిగెడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో..! ఘల్లుఘల్లున మోగే ఆ పట్టీల చప్పుళ్లు ఆ రోజు మాత్రం నీకు మరింత శ్రావ్యంగా వినిపిస్తాయి. ఇదంతా అప్పటివరకూ గమనించని అమ్మ.. కూతురిని అలా చూసేసరికి దగ్గరికి తీసుకుని నా బంగారు తల్లి అంటూ నుదుటన ముద్దు పెడుతుంది చూడు.. అదీ ఆడపిల్ల కోరుకునే చిన్ని ఆనందం.ఆడపిల్లఆడపిల్లని స్కూలుకి రెడీ చేయాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా నేను ఆగలేను, నా ఫ్రెండ్స్ వచ్చేశారని నువ్వు లేచి వెళ్లిపోబోతుంటే.. రేయ్ చెల్లి ఒక్కతే ఎలా వస్తుంది.. కాసేపాగి దీన్ని కూడా తీసుకెళ్లు, పెద్దగా లేటు ఏం అవ్వదులే అని పెద్ద బాధ్యతను నెత్తి మీద పెట్టేస్తారు. యూనిఫామ్ వేసుకుని రెడీ అయిపోయి, ఫ్రెండ్స్ నా కన్నా ముందు ఎక్కడ వెళ్లిపోతారేమో అని ఆరాటపడిపోతూ ఒకవైపు నువ్వు ఆలోచిస్తుంటే.. నీ గోస చూడలేక పళ్లికిలిస్తుంది అప్పటికే నోట్లో ముందర రెండు పళ్లు ఊడిపోయిన ఆ చిట్టిది. స్కూల్ వరకూ జాగ్రత్తగా తీసుకెళ్లాలా.. తన క్లాసు వరకు వెళ్లి కూర్చోబెట్టాలా.. అమ్మ ఇచ్చిన క్యారేజీ అప్పగించి లంచ్ టైంలో మిగల్చకుండా తినమని చెప్పాలా.. మళ్లీ తిరిగి నీ క్లాసుకు నువ్వు వెళ్లిపోవాలా.. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలో నాకు అనుకుంటావ్ కదా.. కానీ, మా అన్నయ్య నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకున్నాడనే ధైర్యం ఆ పసిదానిది.ఆడపిల్ల'అమ్మా.. చూడవే అన్నయ్య కొడుతున్నాడు' అని బుంగమూతి పెట్టుకుని, లేనిపోనివి ఇంకో రెండు ఎక్కువ కల్పించి చెప్పేసి ఏడుపు రాకపోయినా వస్తున్నట్లు నటించేయడంలో ఆడపిల్ల రెండాకులు ఎక్కువే చదివేసింది. నిన్ను అమ్మ దగ్గర బుక్ చేసేశానని లోలోపల ఓ ఆనందం, చెల్లిని ఏమన్నావురా అని అమ్మ నిన్ను పట్టుకుని వాయించేస్తుంటే పొందే సంతోషం.. రాక్షసి అని నీకు మళ్లీ తిట్టాలని లోపల ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతలో నాన్న కూడా వచ్చేసి 'ఏరా.. రోజురోజుకీ దాని మీద నీ పెత్తనం ఎక్కువైపోతుంది, ఏంటీ సంగతి.. వెధవ' అని కమ్మగా తిడుతుంటే.. చూడు మా నాన్నకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అని కళ్లతోనే నీకు సైగ చేసి చెప్తూ, తన పొడవాటి జడని వెనక్కి నెట్టేసి, పట్టు పరికిణీని పైకి పట్టుకుని వెళ్లిపోయే ఆడపిల్ల గర్వం అదిగో అలా ఉంటుంది.ఆడపిల్ల'ఇప్పడు అది చిన్నపిల్ల కాదు.. వయసొచ్చిన ఆడపిల్ల. దాన్ని ఎలా పడితే అలా తిట్టినా, కొట్టినా నీ చెంపలు వాయిస్తా చెప్తున్నా' అమ్మ దగ్గరి నుంచి ఆర్డర్ వచ్చేస్తుంది. అప్పటిదాకా అన్నేళ్లు పక్కనే కూర్చోబెట్టి ఆడించుకున్న చెల్లికి.. ఇకపై ఎన్నో నియమాలు, అడ్డంకులు వచ్చి ఆపేస్తాయి. ఆఖరికి నువ్వు కూడా ఎప్పుడూ పడితే అప్పుడు తనని బయటికి తీసుకెళ్లడం కుదరదు. ఏది కావాలన్నా నిన్నే అడిగి మరీ తెప్పించుకుంటుంది. పసి బుగ్గలు కాస్తా పసుపు రాసుకుంటాయి.. ముఖంలో కొత్త కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది.. పరికిణీల నుంచి లంగా ఓణిలోకి మారిపోతుంది ఆ సోయగం. చెల్లెలు పెద్దదైపోయింది మరి..!ఆడపిల్లపెళ్లి భజంత్రీలు మోగుతుంటాయి.. బంధువులతో అంతా హడావిడి.. అమ్మానాన్నకి క్షణం తీరిక ఉండదు.. ముఖ్యంగా ఎన్ని పనులో  నీకు ఆ రోజు. పట్టుచీర కట్టుకుని, పూల జడకొప్పుతో సింగారించుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని పీటల మీద కూర్చున్న చెల్లెలు పెళ్లి కూతురిలా పడే ఆ సిగ్గు ఎంత ముచ్చటగా ఉంటుందో. మెడలో తాళి పడ్డ మరుక్షణం కళ్లల్లో సన్నగా వచ్చిన నీటి తడి ఇచ్చే ఆనందంతో నీవైపు ఒక్కసారి ప్రేమగా చూస్తుంది.. అప్పటిదాకా పరిచయం లేని ఓ కొత్త మనిషిని తన పక్కనే చూసుకుంటూ ఇకపై ఇదే నా జీవితం అని మురిపెంగా కళ్లతోనే నీకు చెప్పేస్తుంది. అమ్మ కొంగుచాటు ఆడపిల్ల ఇంకో ఇంటికి యజమానిగా వెళ్లిపోయే ఆ క్షణం.. నిన్ను నువ్వే చూసుకుంటూ ఖచ్చితంగా గర్వపడతావు. పట్టుకొంగుకు కండువాతో వేసి ఉన్న ముడిని చూస్తూ తనకు ఇక ఓ తోడు దొరికిందని నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటావు. అప్పటిదాకా అన్నీ నువ్వై చూసుకుని, ఆ రోజు నుంచి ఇక తన బాధ్యత నీదేనంటూ గోరింటాకుతో ఎర్రగా పండిన తన చేతులని తాళి కట్టిన అతని చేతుల్లో పెడుతూ అప్పగిస్తావు.. ఆ క్షణం నీకు తెలియకుండానే నీ కళ్లు చెమర్చుతాయి.. ఆ రోజు నిన్ను హత్తుకుని మనస్ఫూర్తిగా ఏడ్చేస్తుంది ఆ పిచ్చిది. గుక్క పట్టుకుని ఏడుస్తున్న ఆ కళ్లను నీ చేతివేళ్లతో తుడుస్తూ పెద్దరికం చూపిస్తావు. అదిగో.. ఆ క్షణం గుర్తుకు వస్తాయి.. చిన్ననాడు నువ్వు పంచి ఇచ్చిన మిఠాయి, స్వయంగా నీ చేతులతో తినిపించిన గోరుముద్ద, స్కూల్ వరకూ నువ్వే మోసిన తన పుస్తకాల బ్యాగు, కోపం తెప్పించినప్పుడు చెంప మీద నువ్వు వేసిన ఆ చిన్న దెబ్బ, వెనక కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పిన సైకిల్ తాలూకు జ్ఞాపకాలు.ఆడపిల్లఆడపిల్లచిన్నప్పటి నుంచి ఆడపిల్లకి ఇల్లే ప్రపంచం.. కన్నవాళ్లు, తోడబుట్టినవాళ్లే లోకం.. పెళ్లయాక అత్తవారిల్లే జీవితం. వాళ్లకంటూ పెద్దగా ఆశలు, కోరికలు ఏవీ ఉండవు.. అందుకే వాళ్లతో అప్పుడప్పుడూ నవ్వుతూ మాట్లాడండి.. కుదిరితే తనకు ఇష్టమైనవి తెచ్చి ఇవ్వండి.. అత్తింట్లో ఉన్న ఆడపిల్లని సంతోషంగా ఉన్నావా అని అడిగి తెలుసుకోండి.. ఏదేమైనా నేనున్నానంటూ ఓ చిన్న మాట చెప్పండి.. అదే ఆడపిల్లకు కొండంత ధైర్యం. అందుకే.. ఆడపిల్ల అపురూపం.


THANK YOU

PC: CH.VAMSI MOHAN




  





కామెంట్‌లు