పెళ్లి.. రెండక్షరాల బాధ్యత

పెళ్లి.. రెండక్షరాల బాధ్యత

'ఏమే.. ఆ కారు తాళాలు ఇలా అందుకో..' వంటింట్లో పని చేసుకుంటున్న సుమతికి వినపడేలా గట్టిగా అరిచాడు రఘు. చేతిలో గరిటెను పక్కన పెట్టేసి, వెలుగుతున్న స్టవ్ మంటను కాస్త తగ్గించి ఉడుక్కుంటూ బయటికి వచ్చింది సుమతి. తనకు ఎడమవైపుగా డైనింగ్ టేబుల్ మీద చూసింది.. అక్కడ ఉన్న కారు తాళాలను తీసుకుని గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్న రఘు చేతిలో విసిరినట్లుగా ఇచ్చేసింది. 'ఇక్కడే ఉన్నాయి మీరే తీసుకోవచ్చు కదా! నేను వంట చేస్తున్నాను లోపల. నన్ను పిలిచి మరీ ఈ చిన్న చిన్న పనులు కూడా చేయించుకోవాలా?' అని కాస్త ఆవేశంగానే చెప్పేసి ఎదురు సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా మళ్లీ వంటగదిలోకి దూరిపోయింది.పెళ్లి.. రెండక్షరాల బాధ్యతకనుబొమ్మలు ఎగరేస్తూ మూతిని వెటకారంగా పెట్టేసి చేతిలో ఉన్న కారు తాళాలను ఒకసారి గాలిలోకి విసిరి పట్టుకుని కారు వైపు నడిచాడు రఘు. కాలనీ దాటి మెయిన్ రోడ్డు మీద కారు వేగంగా పోతుంది.. కారు విండోలో నుంచి వస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తూ కాస్త కుదుటపడినట్లుగా ఒక్కసారిగా ఉఫ్ అనేశాడు. ఇంట్లో మాటామాటా అనుకుని రోజూ చూస్తున్న చిర్రుబుర్రుల నుంచి కొంచెం ఇలా దూరంగా వస్తే హాయిగా ఫీల్ అవుతున్నాడు. పోపు చప్పుళ్ల మధ్య వంటగది వేడికి చెమటలు కక్కుతున్న సుమతికి కిటికీలోంచి వస్తున్న సన్నని గాలి కొంత సేదతీర్చినట్లుగా అనిపించింది. హాలులోకి నడిచింది. అంతా చిందరవందరగా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడే పారేసినట్లుగా ఉంది.. దానికి కారణమైన మనిషిని లోలోపలే తిట్టుకుంటూ ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలా అన్నట్లుగా నడుముకి చేతులు పెట్టుకుని ఒక్కసారిగా నిట్టూర్చింది. ఎందుకో ఈ మధ్య ఇద్దరికీ పడట్లేదు.

                                       *******************************

పెళ్లయి మూడేళ్లు దాటింది. కొత్తలో అంతా బాగానే ఉంది. ఇప్పటికీ కూడా బాగానే ఉందా లేదా అనేది వాళ్లు ఆలోచించుకోవాలి. ఒక మనిషిని మనం ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ల దృష్టిలో చులకన అయిపోతాం అనే మనస్తత్వంతో సుమతి ఉంటే.. పెళ్లి చేసుకుని తన కోసం వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలనే బాధ్యతలో తనని తాను కోల్పోతున్నానని రఘు మనసు ఆలోచిస్తుంది. ఒక మనిషి తన సొంతం అనుకున్నాక వాళ్ల బంధాన్ని వాళ్లు చూసే కోణం మారుతుంది.. ఎక్కువగా తనతోనే ఉండాలి, తనతోనే సమయం గడపాలి అనే ఆరాటాన్ని పరిస్థితులకు అనుగుణంగా తగ్గించుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే ఆ ప్రేమ పరిపక్వత చెందినట్లు. ఎక్కువ సమయం ఒక మనిషికి ఇవ్వలేకపోతున్నాం అంటే ఆ మనిషిని దూరం పెడుతున్నట్లు కాదు.. ముందున్న జీవితం మరింత అందంగా ఉండడం కోసం ఆ ఇద్దరు జీవితంతో చేసే పోరాటంలో కాస్త ఎడబాటు అంతే. అది అర్థం చేసుకున్న రోజు ఏ బంధం అయినా అందంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఇష్టంగా పెళ్లి చేసుకున్న రోజే నిర్ణయించుకున్నారు.. తమకు అప్పుడే పిల్లలు వద్దు అని. చూపించాల్సిన ప్రేమ మొత్తం కొన్ని రోజులు తన భాగస్వామికే చెందాలని. అంత ప్రేమ పెంచుకుని.. మరి ఇప్పుడు ఏంటి? పక్కన ఉంటేనే ఒకరిపై ఒకరికి చిరాకులు..?పెళ్లి.. రెండక్షరాల బాధ్యతఒక మనిషి విలువ దూరంగా ఉంటే తెలుస్తుందట.. అదే మనిషిలో లోపాలు దగ్గరగా ఉంటే గుర్తిస్తామట. కానీ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా స్వీకరించగలిగే మెచ్యూరిటీ మాత్రం నిజమైన ప్రేమలోనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరి పనుల్లో వాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న రఘు, సుమతిల మనసులు కూడా ఇదిగో ఇలానే ఆలోచిస్తున్నాయి. కారును పార్క్ చేసి సిటీలోనే పేరున్న ఒక పెద్ద షాపు ముందు నిలబడ్డాడు రఘు. అద్దాల డోరును తోసుకుని లోపలికి వెళ్లిన రఘుకి నమస్కారం పెట్టి స్వాగతం చెబుతూ ఒక అమ్మాయి ఎదురొచ్చి కావాల్సిన వైపు దారి చూపించింది. తలను చిన్నగా ఆడించినట్లు థాంక్స్ అని చెబుతూ ముందుకు నడిచాడు. ఎదురుగా ఉన్న ఇద్దరు మనుషులు చెప్పండి సార్ అన్నట్లుగా రఘునే చూస్తున్నారు. చుట్టూ గ్లాసులతో మూసి ఉన్న షెల్ఫుల్లో ఉన్నవాటిపై రఘు కళ్లు వేగంగా పరిగెడుతున్నాయి. అక్కడ ఉన్నవన్నీ బాగానే అనిపిస్తున్నాయి రఘుకి. కానీ, ఎన్ని బాగున్నా నచ్చిన మనిషి ఇష్టాన్ని మాత్రమే మన మనసు వెతుకుతుంది. 'అది ఒక్కసారి చూపించండి' అని రఘు వేలితో సైగ చేస్తూ చూపించగానే అక్కడ పని చేసే వ్యక్తి తీసి అందించాడు. దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకున్న రఘు.. ఒక్కసారిగా ఎటో ఆలోచిస్తున్నట్లు మనసులో తలుచుకుని తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడు. ఆ వెంటనే తాను ఒక షాపులో అందరి మధ్యన  ఉన్న విషయం గుర్తొచ్చినట్లుగా ఈ లోకంలోకి వచ్చి.. 'హా.. ఇది ప్యాక్ చేయండి' అని చెప్పాడు.

                ***********************************************

పొద్దున్నే లేచి ఇంటి చాకిరీ అంతా చేస్తూ, అటు భర్తకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ సగటు ఇల్లాలి పోస్టుకి జీవితకాలం అప్పగించేసింది సుమతి. తనకు పెద్దగా ఆశలు, కోరికలు లేవు. భర్త పక్కన ఉంటే చాలు.. అదే కోట్ల ఆస్తి.. అంత ఇష్టం కూడా భర్త అంటే. కానీ, సంసారం అనే బరువైన బాధ్యత పేరు చెప్పి ఎప్పుడూ ఏదో వంకతో తప్పించుకుంటాడు అని చిన్న అలక అంతే. పైగా ఎప్పుడూ ఎక్కడికీ ఎక్కువ తీసుకెళ్లిందే లేదు.. సరదాగా గడిపింది లేదు. అదే మాట తనని అడిగితే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అవన్నీ సెట్ కావు.. పైగా మన జీతాలు కూడా అంతంత మాత్రమే అని చెప్పి ఎప్పుడూ ఉండే బాగోతాన్నే గుర్తు చేస్తాడు. ఇక ఈ జీవితానికి ఇంతేలే అనుకుంటూనే హాల్లో పారేసినట్లుగా ఉన్న వస్తువులు అన్నిటినీ ఎక్కడివక్కడ సర్దేస్తోంది సుమతి. ఇంతలో లోపల సన్నని మంట మీద మరుగుతున్న కూర గుర్తొచ్చి వంటగదిలోకి పరిగెత్తింది. మూత తీసి గరిటెతో కలుపుతూ ఉంటే వేడి ఆవిరి సెగతో పాటే వచ్చిన కమ్మని ఘాటు వాసన తన ముక్కుని తాకింది. బలంగా శ్వాస తీసుకుంటూ వచ్చే ఆ కమ్మని వాసనను ఆస్వాదించింది. ఎప్పుడూ చెప్పుకోదులే కానీ, సుమతికి వంటల్లో మంచి ప్రావీణ్యమే ఉంది. ఎంత బాగా చేసినా, ఎంత విద్య తెలిసినా మనం ఇష్టపడే మనిషికి మన వంట నచ్చినప్పుడే కదా పడిన కష్టానికి ఒక విలువ.. అనుకుంటూ మొహం మీద చిన్నగా నవ్వు వస్తుండగా.. కాసేపు ఊహాలోకంలో విహరించి మనసులోనే తనని తలుచుకుంది.

                          *********************************************

అందమైన డిజైన్ ఉన్న కవర్‌తో ప్యాక్ చేసి ఉన్న డబ్బాను పట్టుకుని సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న కారును బయటికి తీశాడు రఘు. డ్రైవింగ్ చేస్తూ పక్క సీటులోనే ఉంచిన ఆ కవర్ బాక్స్‌ని పదేపదే ఇష్టంగా చూసుకుంటున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది.. నల్లని తారు రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న రఘు కారును.. సర్కిల్ రాగానే సిగ్నల్ నిలిపివేసింది. తన ముందు చాలా కార్లు, బస్సులు ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయాయి. కిటికీ అద్దాన్ని కాస్త కిందికి దించి బయటకు చూస్తూ సిగ్నల్ దగ్గర కనిపిస్తున్న టైమర్‌ను చూస్తూ లెక్క పెడుతున్నాడు ముందుకు కదలడానికి. ఇంతలో దించిన కారు అద్దంలో నుంచి జీవకళ తగ్గిన ఒక చేయి లోపలికి వచ్చింది. అర్థిస్తున్నట్లుగా చేయి చాచి దానం చేయమంటూ కళ్లతోనే వేడుకుంది అరవయేళ్లు పైబడిన ఓ ముసలావిడ. జుట్టు పాలిపోయి, వంగిన శరీరంతో దీనంగా చూస్తున్న తన కళ్లల్లో కూడా ఎలాంటి జీవం లేదు. ఆవిడని అలా చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రఘుకి. అనిపించిందే తడవుగా పర్సులో నుంచి వంద రూపాయల నోటు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. తళతళ మెరుస్తున్న ఆ నోటుని అందుకున్న ఆవిడ చేయి ఇంకా వణుకుతూనే ఉంది. ఆనందం నిండిన కళ్లతో రెండు చేతులెత్తి దండం పెడుతూ దేవుడివయ్యా.. చల్లగా ఉండు అన్న ఆ ముసలావిడ వేదన.. రఘుకి ఆశీర్వాదంలా తోచింది. చిన్న సహాయానికే మనిషిలో దాగి ఉండే దేవుడిని బయట పెట్టే ఇలాంటి పనులు చేయడం ఎంతో మంచిదని ఎప్పుడూ చెప్పే తన భార్య సుమతి ఒక్కసారిగా మదిలో మెదిలింది. ఆ పెద్దావిడ అన్న మాటలకు మనసు నిండిపోయింది రఘుకి. అంతలోనే సిగ్నల్ క్లియర్ అవ్వడంతో ఒక మంచి పని చేశాననే సంతోషంలో కారును కదిలించాడు రఘు.  

                          *********************************************

నడుముని చుట్టుకుని ఉన్న చీర కొంగు పక్కనే, వంట మధ్యలో తుడుచుకోవడాని కోసం వాడే ఓ చిన్న రుమాలు కూడా బొడ్డు కింద దోపుకుని, కొంచెం చెరిగిన జుట్టుతో, నుదుటిపై చెమటతో ఉండే సగటు ఇల్లాలి అందం ఎంత సహజంగా ఉంటుందో వేరే చెప్పాలా? కిచెన్‌లో ఉన్న వంటకాలన్నీ డైనింగ్ టేబుల్ మీద చకచకా అమరిపోయాయి. టేబుల్ మీద పెట్టిన వంటకాల్లో ఒక్కోటీ లెక్క పెట్టుకుంటూ ఇంకా ఏదైనా మర్చిపోయానా అనుకుంటూ నిలబడి చూసుకుంటుంది సుమతి. చికెన్ బిర్యానీ, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ మసాలా కర్రీ, మజ్జిగ చారు.. ఇంకా... హా.. అన్నీ వచ్చినట్లేలే అని మరోసారి కన్ఫర్మ్ చేసుకుంది. గడియారం వంక చూసింది. పొద్దున్న నుంచి ఇంటి పనిలో మునిగి తేలిన తన జిడ్డు అవతారాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంది. వెళ్లి స్నానం చేయాలి ముందుగా.. అనుకుంటూ అద్దం మీద పేరుకున్న దుమ్మును చీర కొంగుతో తుడిచింది. అంతకు ముందు కన్నా ఇప్పుడు శుభ్రంగా కనిపిస్తున్న అద్దం వంక చూస్తూ.. మనిషి మనసు కూడా ఇంతే కదా అనుకుంది. పైపైన కనిపించే చీవాట్లు, కోపాలు, తప్పులే చూస్తాం కానీ, లోపల ఉండే స్వచ్ఛమైన ప్రేమ మనకు కనపడదు. ఈగోలు, స్వార్థాలు అనే దుమ్మును తుడిచి మనిషి లోతుల్లో ఉన్న అనురాగాన్ని గుర్తించాలని కూడా అనుకోం కదా అనుకుంది. ఆ వెంటనే తన మనసులో మెదిలిన భర్త రఘు రూపాన్ని మూసుకున్న కళ్లతో బంధించేసింది.

                             *****************************************

రఘు ఇంటికి వచ్చేసరికి సుమతి లోపల స్నానం చేస్తున్నట్లు ఉంది. తనతో పాటు తెచ్చిన బాక్సుని టీపాయ్ మీద పెట్టేసి భార్య కోసం ఎదురుచూస్తూ అలాగే సోఫాలో కూలబడిన రఘుకి చిన్నగా కునుకు పట్టేసింది. కాసేపటికి బెడ్ రూంలో అలికిడికి మెల్లగా కళ్లు తెరిచాడు. ఒక తలుపు తెరిచే ఉండడంతో బెడ్ రూంలో రెడీ అవుతున్న సుమతి కొంచెంగా కనిపిస్తోంది. రఘుకి ఇష్టమైన నీలం రంగు చీర కట్టుకుంటోంది. మెల్లగా లేచి బెడ్ రూమ్ వైపు నడిచాడు. రఘు రావడం చూసి చీర కుచ్చిళ్లను సర్దుకుని తల ఎత్తి చూసింది. సుమతికి దగ్గరగా చేరి.. తన చెంప మీద చేయి పెడుతూ 'మర్చిపోయావ్ అనుకున్నా' అని మెల్లగా అడిగాడు. 'మర్చిపోయే రోజేనా ఇది.. మీరే మర్చిపోయారేమో అనుకున్నా' అని కొద్దిగా తల దించుకుంది. 'జన్మంతా మర్చిపోను..' అని ప్రేమగా అంటూ తనతో పాటు తెచ్చిన బాక్సును సుమతి చేతిలో పెట్టాడు. ఏంటిది అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుంటే 'తెరిచి చూడు..' అన్నాడు రఘు. పక్కనే ఉన్న బెడ్ మీద కూలబడి బాక్సును ఆశగా తెరిచింది. లోపల అందమైన ఆకృతిలో అమర్చి ఉన్న రవ్వల నెక్లెస్ జిగేలుమంటూ కనబడింది. అంతకు రెట్టింపు ఆనందంతో ఉన్నపలంగా రఘుని హత్తుకుంది. అది తాను మొదటి పెళ్లిరోజు అడిగిన బహుమానం. మూడేళ్లు గడిచినా మర్చిపోకుండా ఇలా తన కోసం తేవడం నమ్మలేకపోయింది. హత్తుకున్న సుమతిని మరింత దగ్గరికి అనుకుంటూ.. ఈ కౌగిలి దొరుకుతుంది అంటే ఈ గిఫ్ట్ ఏదో ఇంకా ముందే తెచ్చేవాడిని కదా అన్నాడు కవ్విస్తూ.. బుంగమూతి పెట్టి చిన్నపిల్లలా ఉడుక్కుంటూ రఘుని కొట్టినట్లుగా చిన్నగా చెంప మీద దెబ్బ వేసింది. హహ.. ఊరికే అన్నాలే అని మళ్లీ తనని దగ్గరికి లాక్కున్నాడు.పెళ్లి.. రెండక్షరాల బాధ్యతతనకు తెలుసు.. ఈ ఆడంబరాలు.. ఆర్భాటాలు కాదు.. భర్త తన మనసు తెలుసుకుని, తన ఇష్టాన్ని గుర్తు పెట్టుకుని తెచ్చిన ఆ గిఫ్ట్ వెనక ప్రేమే తాను కోరుకుంటుంది అని. చేతితో సుమతి తల మీద మొట్టికాయ వేస్తూ.. 'పిచ్చి.. నా కోసం ఈ నీలం రంగు చీర కట్టినప్పుడే అర్థమైంది. ఎలా మర్చిపోతా చెప్పు' అని నాలుకని బయటపెట్టి రఘు వెక్కిరిస్తుంటే, 'చీర ఒక్కటే కాదు.. మీరు ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద చూస్తే ఇంకా చాలా తెలుస్తాయి' అని ఎదురు సమాధానం ఇచ్చింది. 'ఓహ్.. అవునా.. అయితే ఇప్పుడే వెళ్లి చూస్తా' అని కౌగిలిని విడిపించుకుని లేవబోతుంటే..'ఆహా.. ఇలా ఈ అవతారంలో కాదు. వెళ్లి ముందు స్నానం చేసి రండి. ఆ తర్వాతే..' అంది. హ్మ్.. సరేలే అనుకుంటూ అక్కడ అప్పటికే తీసి ఉంచిన టవల్ తీసుకుని బాత్ రూంలో దూరిపోయాడు. షవర్ నుంచి చల్లని నీరు ఒంటి మీద పడుతుంటే సేద తీరినట్లుగా అనిపించింది రఘుకి. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాడు. ఏదైనా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో కదా.. పొద్దున్న ఇంటి నుంచి ఉసూరుమంటూ వెళ్లిన తనకి ఇంట్లో కూడా సంతోషం ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చకచకా స్నానం ముగించుకుని అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న సుమతి నీలం రంగు చీరలో వదులైన జుట్టుతో అందంగా కనిపించింది. కొంటెగా చూస్తూ కళ్లతోనే సైగ చేస్తున్న సుమతిని ఓరకంట చూసి టేబుల్ మీద పెట్టి ఉన్న వంటకాల మూతలు ఒక్కోటీ తీసి చూసి నాలుకను చప్పరించాడు.

                ************************************************

'అన్నీ నాకు నచ్చిన వంటకాలే.. బిర్యానీ, గోంగూర.. ఆహా.. ఇంత ఇష్టం పెట్టుకుని మరి పొద్దున్న వెళ్తున్నప్పుడు ఎందుకు నా మీద చిర్రుబుర్రులాడావు' అని అడిగాడు. 'హా మీరు మాత్రం అన్నిటికీ వెటకారం మాటలు మాట్లాడుతూ నేనంటే అసలు లెక్క లేనట్లు ప్రవర్తిస్తారు. మరి దానికి ఏమంటారు?' అని గోముగా అడిగింది. 'పిచ్చీ.. లే ఒకసారి..' అని భుజం పట్టుకుని లేపాడు. 'మనసులో ఉన్న ప్రేమని ప్రతిసారి బయటికి చెప్పుకుంటామా? ఎలా దొరికావే నువ్వు నాకు ఇంత అమాయకంగా' అని మొట్టికాయ వేశాడు. 'హా.. ఎప్పుడూ చూసినా ఇంతే. ఎప్పుడూ మీ పని, మీ హడావిడి, అసలు నాతో సమయం గడుపుతారా? ఏదైనా అంటే మళ్లీ మన ఫ్యూచర్ కోసమేగా అని మాట దాటేస్తారు.. పోండి' అంది. 'అదే మరి నేను కూడా చెప్పేది.. పొద్దున్న నా మీద అరిచావు. కానీ, అప్పటికే నాకు ఇష్టమైన ఈ వంటలన్నీ చేసే పనిలో ఉన్నావు. నా కోసమే కదా.. నేను కూడా బయటికి వెళ్లిపోయా .. దేనికి.. నువ్వు మన మొదటి పెళ్లి రోజున అడిగిన ఈ నెక్లెస్ నీకు కొనడానికే కదా.. నీ కళ్లల్లో ఈ ఆనందం చూడాలనే కదా.. ప్రేమ అనేది మనసు లోతుల్లో ఉంటుంది. అది అన్నిసార్లు బయటపెట్టాల్సిన పని లేదు. నాకు నచ్చిన వంటలు నువ్వు చేశావు.. నీకు కావాల్సిన నెక్లెస్ కోసం నేను వెళ్లిపోయా. మనం పైకి మాత్రమే అరుచుకుంటున్నాం.. లోపల గాఢంగా ప్రేమించుకుంటున్నాం. అందుకే కదా నువ్వు మన పెళ్లి రోజును మర్చిపోకుండా నాకు ఇష్టమైన రంగు చీర కూడా కట్టుకున్నావు. 'అవునండీ మర్చిపోయాను.. ఇంత ప్రేమతో తెచ్చారు సరే.. కానీ, చాలానే ఖర్చు అయ్యి ఉంటుంది కదా మీకు.. ఎంతయిందో చెప్పరూ..!' అని సుమతి రఘు నుదుటిని ప్రేమగా నిమిరింది. భార్య స్పర్శలోని ప్రేమకు కరిగిపోతున్న రఘు.. 'దాని విలువ నన్ను ఇన్ని రోజులు భరించినంత... ఇంత కమ్మనైన వంటలు నా కోసం చేసిన ఆరాటమంత.. నా కోసం ఈ చీర నువ్వు కట్టుకునేంత.. అన్నిటికీ మించి నా మీద నీకున్న ప్రేమ అంత..' అనగానే ఇద్దరి పెదాలు  విచ్చుకుని నవ్వులు విరబూశాయి.పెళ్లి.. రెండక్షరాల బాధ్యతదాంపత్యం అనేది రెండు మనసుల కలయిక. ఒక మనిషి మనల్ని దూరం పెట్టినా, గొడవలు పడినా, తప్పు చేశారని తెలిసినా అర్థం చేసుకుని ముందుకు సాగడంలోనే అనుబంధం విలువ తెలుసుకుంటాం. ప్రతి జంటలోనూ ఇలాంటి అలకలు, అనుమానాలు సహజమే.. అందుకే భాగస్వామి మనసు తెలుసుకుని నడుచుకున్నప్పుడే ఆ బంధం మరింత దృఢంగా మారుతుంది. మన చుట్టూ కనిపించే అందరి  జంటల్లాగే ఈ జంట కూడా.....



THANK YOU

PC: CH.VAMSI MOHAN


కామెంట్‌లు