ఓ కన్నతల్లి కన్నీటి గాథ

మనిషి జీవితం విలువ ఎంత..? ఒక అనుభవమంత.. ఒక ఆదర్శమంత.. ఒక గుణపాఠమంత. ఊపిరి తీసుకుని పసిపాపలా ఈ లోకంలోకి వచ్చి అనుబంధాలు పెంచుకుని.. కష్టాలకు ఓర్చుకుని.. నీకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని జీవితాన్ని సంపూర్ణం చేసుకుని ఊపిరి వదిలేస్తావు. మరి అంత అందమైన జీవితాన్ని నీ చేతులతోనే చిదిమేసుకుంటే ఎలా..? దేవుడు ఇచ్చిన అపురూపమైన జన్మని చిన్న చిన్న కష్టాలకే భయపడి అంతం చేసుకుంటే ఎలా..? నీ పుట్టుక వెనక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు.. కానీ, నీ చావుతో ముడిపడి ఒక సమాజమే ఉంటుంది. నేను నీకు చెప్తున్నది కూడా అలాంటి ఒక సంఘటనే. కార్పొరేట్ జాబ్ ఒత్తిడిలో నలిగి ఆత్మహత్య చేసుకున్న ఓ అమ్మాయి వ్యథ ఇది. కూతురి ఆత్మహత్యతో దిక్కు తోచని స్థితిలో ఏడుస్తున్న ఓ కన్నతల్లి కన్నీటి గాథ ఇది...ఓ కన్నతల్లి కన్నీటి గాథమంచి ఉద్యోగం చేసి, బాగా సంపాదించి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందరిలాగే ఈ అమ్మాయి కూడా అనుకుంది. కానీ, పరిస్థితులను ఎదుర్కోలేక చివరికి తన ప్రాణాలు తీసుకుంది. కూతురి చావుతో అమ్మాయి తల్లి ఆ కంపెనీ చైర్మన్‌కి ఒక ఈ-మెయిల్ పంపింది. ఎంతో వేదన పడుతూ బరువెక్కిన గుండెతో ఆ తల్లి రాసిన తన కూతురి చివరి జ్ఞాపకాన్ని చదివి మనమూ ఓ కన్నీటి బొట్టు రాలుద్దాం.

*****

"అల్లారుముద్దుగా పెంచుకున్న నా కూతురుని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ తల్లిగా నేను ఈ లేఖ రాస్తున్నా. ప్రస్తుతం మా జీవితం చిన్నాభిన్నం అయింది. మా ఆశలన్నీ అడియాసలయ్యాయి. కానీ, మేము అనుభవిస్తున్న ఈ బాధ మరో కుటుంబం పడకూడదని ఆశిస్తూ మా కథను మీతో పంచుకుంటున్నా. నా బిడ్డ తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది. ఇంత పెద్ద కంపెనీలో తనకి ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషపడింది. కానీ, సరిగ్గా నాలుగు నెలల తర్వాత జులై 20, 2024న మేము తన మరణవార్త విని తట్టుకోలేక కుప్పకూలిపోయాం. తన వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. నా బిడ్డ చిన్నప్పటి నుంచి అన్నిట్లో బెస్ట్ అనిపించుకునేది. తాను స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, కల్చరల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండేది. నవంబర్ 2023లో CA పరీక్షలు పాస్ అయింది. మార్చి 19, 2024న పూణేలో మీ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. మీ కంపెనీ అప్పగించిన ప్రతి పనిని ఎంతో శ్రద్దగా కష్టపడి పూర్తి చేసేందుకు కృషి చేసింది. కానీ, కొత్త వాతావరణం, ఎక్కువ సేపు పని చేయడం ఇవన్నీ తనలో మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెంచాయి. దీంతో ఉద్యోగం చేరిన కొద్ది రోజులకే తనకి మానసిక ఆందోళన, నిద్ర లేకపోవడం మరియు ఒత్తిడి అనిపించడం మొదలయ్యాయి. కానీ, కష్టపడి పట్టుదలతో ముందుకు వెళ్లడమే విజయానికి మార్గమని నమ్మింది. 

అది జులై 6, 2024. నేను నా భర్తతో కలిసి నా కూతురు CA  CONVOCATION అటెండ్ అవడానికి పూణే వెళ్లాను. తాను సంపాదించిన డబ్బుతో మమ్మల్ని CONVOCATIONకి తీసుకెళ్లాలని తన కల. అనుకున్నట్లుగానే మాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది. మేము అక్కడికి వెళ్లాం. ఆ రోజు తనకి ఛాతీలో ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో హాస్పిటల్ తీసుకెళ్లాం. ఈసీజీ తీసి అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్లు చెప్పారు. టైంకి తినక, సరిగా నిద్రపోక తనకు ఈ సమస్య వచ్చిందని చెప్పి కొన్ని మందులు వాడమని ఇచ్చారు. సీరియస్ ప్రాబ్లమ్ కాకపోవడంతో మాకు టెన్షన్ తగ్గింది. తనను చూడడానికే మేము కేరళ నుంచి పూణే వరకు వస్తే.. తనకి చాలా వర్క్ ఉందని, సెలవు ఇవ్వరని హడావిడిగా హాస్పిటల్ నుంచే డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి కూడా ఆఫీస్ నుంచి లేటుగానే వచ్చింది. ఆ తర్వాత రోజు జులై 7, 2024, ఆదివారం.. తన CONVOCATION DAY. ఆ రోజు మార్నింగ్ మమ్మల్ని కలిసింది. కానీ, మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తూ ఉండిపోయింది. మా బిడ్డతో ఉన్న ఆ చివరి రెండు రోజులు కూడా వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల మాతో గడపలేకపోయానని తను చెప్పడం మా మనసును ముక్కలు చేసింది. వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల అంతకు ముందు తన టీంలో పని చేసిన చాలా మంది రిజైన్ చేసి వెళ్లిపోయారని కొలీగ్స్ తనకి చెప్పేవారట. దానికి వాళ్ల మేనేజర్ మాత్రం.. 'నువ్వు బాగా వర్క్ చేసి, మిగతా వాళ్ల ఒపీనియన్ మార్చాలి' అని తనతో అనేవాడట. తన ప్రాణాలనే పణంగా పెట్టి పని చేయాల్సి వస్తుందని నా బిడ్డ అప్పుడు గ్రహించలేకపోయింది. అంత కష్టంగా ఉంటే ఆ వర్క్ చేయొద్దని నేను తనకి చాలాసార్లు చెప్పాను. అంత ఎక్కువగా వర్క్ ఇస్తే తనకి నిద్ర పోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఇదే విషయాన్ని కంపెనీ మేనేజ్‌మెంట్‌కి చెబితే.. 'రాత్రిపూట పని చెయ్.. మేమంతా అలాగే చేస్తాం' అని వెటకారంగా మాట్లాడేవారట. కానీ, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇంత జరుగుతున్నా తాను ఎప్పుడూ ఆఫీస్ మేనేజ్‌మెంట్‌ గురించి తప్పుగా మాట్లాడేది కాదు. అదే తన మంచితనం.

మా అమ్మాయి సొంత ఊరుని, కన్నవాళ్లని వదిలి సిటీకి వచ్చింది. అక్కడ పరిస్థితులకు అలవాటు పడి ముందుకు వెళ్లడానికి చాలా కష్టపడింది. ఇది నా ఒక్క కూతురి సమస్య మాత్రమే కాదు.. దాదాపు ప్రతి కార్పొరేట్ ఆఫీసులో పరిస్థితి ఇలాగే ఉంది. ఏదేదో సాధించాలనే ఆశతో ఉండే నా కూతురు ఇప్పుడు మాకు అందనంత దూరం వెళ్లిపోయింది. నేను ఇదంతా మీకు ఎందుకు రాస్తున్నానంటే.. మీ కంపెనీలో పని చేసే ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా చూడకుండా చాలా అమానుషంగా ఎక్కువ వర్క్ ఇచ్చి మనోవేదనకు గురి చేస్తున్నారని చెప్పడానికి. దానికి నా కూతురు ఎదుర్కొన్న అనుభవాలే సాక్ష్యం. నా కూతురి మరణం మీ కంపెనీకి మేల్కొలుపు కావాలి. ప్రతి కార్పొరేట్ కంపెనీలో వర్క్ కల్చర్ మారాలి. చివరగా.. నా బిడ్డ అంత్యక్రియలకు మీ కంపెనీ నుంచి ఎవరూ రాలేదు. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మీ కంపెనీ కోసం పని చేసిన నా బిడ్డని చివరి చూపు చూడడానికి కూడా ఎవరూ రాకపోవడం నా మనసుని దహించేసింది. నా బాధ అంతా కూతురు చనిపోయిందని మాత్రమే కాదు.. తనకి సపోర్ట్ గా ఉండాల్సిన వాళ్లే తన చావుకు కారణమయ్యారని. ఏళ్ల తరబడి నా బిడ్డ పడిన కష్టం.. మీ నిర్లక్ష్య వైఖరితో నాలుగు నెలల్లో అంతం అయిపోయింది. 9 నెలలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన సొంత బిడ్డను పోగొట్టుకుంటే ఒక తల్లి పడే బాధ ఎలా ఉంటుందో.. అది అనుభవించిన వాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. మా బిడ్డ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది.. కానీ, తన గాథ ఒక కొత్త మార్పుకి శ్రీకారం కావాలి"

                                                                                                                                 - ఇట్లు

                                                                                                                                  ఓ తల్లి

*****

ఇది జరిగి దాదాపు వారం రోజులు గడిచింది. ఇది తెలుసుకున్నాక నా మనసు చాలా బాధ పడింది. అందుకే ఈ విషయాన్ని మీతో చెప్పుకోవాలని ఈ ఆర్టికల్ రాశాను. గంపెడు పుస్తకాలను భుజాలకు తగిలించి, లక్షలు పోస్తున్నామని చెప్పి చదువు అంటే ఈ రోజుల్లో పిల్లలకు భారంగా తయారుచేశాం. అందుకే మీ పనిలో మీరు పడిపోకుండా మీ పిల్లలతో కాసేపు మాట్లాడండి.. వాళ్లు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో తెలుసుకోండి. బాగా సంపాదించాలి..  నలుగురిలో తల ఎత్తుకుని తిరగాలని ఉద్యోగాలు అంటూ ఆఫీసులకే పరిమితమైపోయి కుటుంబానికి సమయం ఇవ్వడం లేదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది.. ఏ కష్టం వెనక అయినా అది తొలగించే చిన్న మార్గం ఉంటుంది. సమాజం కోసం అన్నీ భరించి నిన్ను నువ్వు ఎప్పుడూ కోల్పోకు.. నువ్వు తీసుకునే ఏ పెద్ద నిర్ణయం వెనక అయినా నీ తల్లిదండ్రుల కోటి ఆశలు దాగి ఉంటాయి. అది గుర్తు పెట్టుకుని నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో.. అంతేకానీ, అన్నిటికీ చావే పరిష్కారం కాదు. అన్ని బంధాలను వదులుకుని నిన్ను నువ్వు అంతం చేసుకోవాలని అనిపిస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.. దేవుడు నీ కోసం ఖచ్చితంగా ఇంకో దారి ఉంచుతాడు.ఓ కన్నతల్లి కన్నీటి గాథ

ఓ కన్నతల్లి కన్నీటి గాథ


THANK YOU 


కామెంట్‌లు