నా కాలేజ్ డేస్...

నా కాలేజ్ డేస్...
మనకంటూ ఓ కుటుంబం ఉన్నా, అవసరానికి అందరూ ఉన్నా ఎప్పుడో ఒకసారి నువ్వు ఒంటరిగా ముందుకు నడవాల్సిన పరిస్థితిని కాలం ఏర్పరుస్తుంది. ఆ ఒంటరితనమే నీకు నువ్వేంటో నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ధైర్యంతో పెరిగిన నీకు మొదటిసారి నువ్వంటే ఏంటో అర్థమయ్యేది ఎప్పుడో తెలుసా?.. జీవితంలో భయంతో కూడిన స్వేచ్ఛ మొదటిసారి వచ్చేది ఎప్పుడో తెలుసా..? నువ్వు నీ వాళ్ల సాయం లేకుండా ఉండగలిగినప్పుడు. అలాంటి అనుభవాలనే ఈ రోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా.. ఆ అనుభవాలు నాకు నా జీవితంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కలిగాయి. నా అనుభవాలను మీరూ కళ్లారా చూడాలంటే నా చేయి పట్టుకుని నాతో పాటు కాలంతో కాస్త వెనక్కి నడవాల్సిందే...

                           *****

పదో తరగతి పూర్తయింది.. మంచి మార్కులు వచ్చాయి.. వేసవి సెలవులు కూడా అయిపోయాయి.. ఇక ఇంటర్మీడియట్‌లో చేరాలి.. ఏ కాలేజ్‌లో చేరితే మంచిది.. ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది.. ఇలా ఎన్నో ప్రశ్నలు బుర్రలో. పెద్దగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోలేని ఆ వయసులో ఇంట్లో పెద్దవాళ్ల సాయంతో ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. పదో తరగతి వరకు ఊళ్లోనే చదివి, ఇంటి పట్టునే ఉండి అదే ప్రపంచం అనుకున్న నాలాంటి వాడికి మొదటిసారి అందరికీ దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. కాలేజ్‌లో చేరాల్సిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఓవైపు భయంతో పాటు మరోవైపు చదువు గురించి ఆలోచనలు. ఇంటిని విడిచి హాస్టల్‌కు వెళ్తున్నాననే బాధ.. భవిష్యత్తు కోసం తప్పదు కదా అని నాకు నేనే నచ్చజెప్పుకునే అవసరం.. అలా నాకు నేను మెంటల్లీ ప్రిపేర్ కావడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. ఈ లోపు అడ్మిషన్లు, ఫీజులు, పుస్తకాలు, బట్టలు.. ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.

                          *****

కాలేజ్‌లో చేరాల్సిన మొదటి రోజు.. కావాల్సినవన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నా.. ఇంట్లోవాళ్లు తలా ఒక పని చేసి పెడుతూ నాకు హెల్ప్ చేస్తున్నారు. గడియారంలో ముళ్లు ముందుకు కదులుతున్న కొద్దీ నా గుండెల్లో అంతకంతకూ ఎక్కువవుతున్న బాధ.. వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడితే అక్కడి నుంచి బయలుదేరాలి కదా.. ఆ రోజు ఆ చిన్న ముల్లు నా భవిష్యత్తుకు దారి ఎటు వైపో చూపించింది. ఎవరి పనుల్లో వాళ్లున్నారు.. అంతా నిశ్శబ్దం. నేను కూడా ఆ రూమ్ నుంచి ఈ రూమ్‌కు ఏదో పని ఉన్నవాడిలా అటూ ఇటూ తిరుగుతున్నా.. ఇంట్లోవాళ్ల ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నా.. తల దించుకునే నడుస్తున్నా. గుండెల్లోంచి బాధ తన్నుకువస్తోంది. అలా అని బయటపడి అప్పుడు నాకేం అనిపిస్తుందో చెప్పుకోవాలని లేదు, లోలోపలే కంట్రోల్ చేసుకుంటున్నా. ఏం చేయాలో తెలియట్లేదు.. వెళ్లాల్సిన సమయం మరింత దగ్గర పడింది. ఇక నా వల్ల కాలేదు, ఇంటి హాలులో ఉన్న టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నా. ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా వస్తున్న కన్నీటిని ఒక్కసారిగా బయటపెట్టేశా.. నేను వెళ్లనంటే వెళ్లనని మారాం చేస్తూ గట్టిగా ఏడ్చేశా. ఆ సమయంలో ఆ బాధ ఎలా ఉండిందో ఈ రోజుకీ నాకు బాగా గుర్తుంది. నా ఏడుపును చూసి అందరూ దూరం నుంచే చూస్తుంటే అమ్మ మాత్రం దగ్గరికొచ్చి గట్టిగా పట్టేసుకుంది. నా ఏడుపుని చూసి తట్టుకోలేని తాను కూడా కన్నీటిని ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే నాకు నచ్చజెపుతోంది. వెళ్లాలి కదా.. బాగా చదువుకోవాలి కదా.. ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని. తను అలా నాకు ధైర్యం చెబుతోందే కానీ, నేను వెళ్తున్నందుకు నా కన్నా తనే ఎక్కువ బాధ పడుతోందని నాకు బాగా తెలుసు. ఆ రోజు అమ్మ కౌగిలి నుంచి విడిపోతుంటే కొత్తగా అనిపించింది.. చెట్టు నుంచి వేరవుతున్న కొమ్మలా.. ఆ రోజు నా కన్నీటిని తుడిచిన అమ్మ చీర కొంగు స్పర్శ ఇప్పటికీ నా చెంపలను తడుముతున్నట్లే ఉంది.

                                  *****

అన్నయ్యను వెంటబెట్టుకుని చేతిలో ఇనుప ట్రంక్ పెట్టెతో కాలేజ్‌కి చేరుకున్నా.. దానికి ఆనుకునే హాస్టల్ కూడా. రూమ్‌కి వెళ్లి నా కోసం ఒక బెడ్ చూసుకున్నా.. ఆ ఒక్క రూమ్‌లోనే పది వరకు బెడ్స్ ఉన్నాయి.. ఒక్కొక్కరు ఒక్కో దగ్గరి నుంచి వచ్చినవాళ్లు.. అంతా నాకు కొత్తవాళ్లు. కొందరు వచ్చీరాగానే హుషారుగా అల్లరి కూడా చేసేస్తున్నారు.. ధైర్యంగా మాట్లాడుతున్నారు.. కానీ, నాకేంటి ఈ బెరుకు. నేను వీళ్లతో ఎలా నెట్టుకురావాలో అనే భయం ఆ మొదటి రోజే మొదలైంది. కానీ తప్పదు. కొత్త ప్రదేశం.. కొత్త వాతావరణం.. రేపటి నుంచి అంతా కొత్తగా ఉండబోతుంది. ఇకపై ఇక్కడే ఉండాలి.. అన్నీ అలవాటు చేసుకోవాలి.. ముఖ్యంగా ఇంటికి, అమ్మకి దూరంగా ఉండేలా నన్ను నేను మార్చుకోవాలి. నా వస్తువులన్నీ కావాల్సినట్లుగా సర్దేసి, నన్ను వదిలి వెళ్లడానికి అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. ఆ లోపు పక్కనే అప్పుడే వచ్చిన ఓ అబ్బాయికి నా గురించి చెప్తున్నాడు. మా వాడిని కాస్త చూసుకో, వెళ్తే నీతో పాటు వెంటబెట్టుకుని తీసుకెళ్లమని నన్ను అప్పజెప్తున్నాడు. చెప్తే బాగుంటుందో లేదో కానీ.. అమ్మాయికి అత్తారిల్లులా, ప్రతి అబ్బాయికి ఇలా చదువు కోసం దూరంగా వెళ్లి ఉండడం ఓ రకంగా అత్తారింటికి వెళ్లినట్లే లెక్క.. 

                                   *****

కొత్త ఫ్రెండ్స్, క్లాసులు, పరీక్షలు.. ఇక అలా సాగిపోతుంది కాలేజ్ లైఫ్. ఇంటి ధ్యాస మెల్లమెల్లగా దూరమవుతూ చదువు మీద ఫోకస్ పెరిగింది.. అంత బాగా చదివించేవాళ్లు ఆ కాలేజ్‌లో. పొద్దుపొద్దున్నే నిద్ర లేపేవాళ్లు.. మత్తు వదలకపోయినా సరే నిద్ర ఆపుకుని మరీ చదవాల్సిందే. పొరపాటున నిద్ర ఆగట్లేదని చిన్నగా అలా కునుకు తీశామో.. దూరం నుంచి 'ఏయ్' అని గట్టిగా ఓ గొంతు వినిపించేది. ఇక అంతే.. వెంటనే తేరుకుని, పిలిచేది నన్ను కాదు ఇంకెవరినో అన్నట్లు, తల కూడా పైకి ఎత్తకుండా తెగ చదివేస్తున్నట్లు నటించడంలో మనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే. అప్పుడు అదంతా కష్టంగా అనిపించేది కానీ, పొద్దున్నే లేచి చదివితే బుర్రకు బాగా ఎక్కేది.. పైగా తొందరగా నిద్ర లేవడం వల్ల ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండేది. పాఠాలు చెప్పిన లెక్చరర్లు, కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, సొంతవాళ్లలా ప్రేమగా చూసుకున్న వార్డెన్లు.. అన్నట్లు ఏ మాటకు ఆ మాట.. హాస్టల్ ఫుడ్ కూడా అద్ధిరిపోయేది. పొద్దున్నే టిఫిన్లు, మధ్యాహ్నం మంచి భోజనం, ఈవెనింగ్ స్నాక్స్.. ఆ కమ్మకమ్మటి రుచులు ఇంకా నా నాలుకకి బాగా గుర్తున్నాయ్.. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు.. మామూలుగానే మనకు పెరుగు అంటే అస్సలు పడదు, కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయను అంటాం కదా.. అందులో పెరుగు తినడం మొదటిది నాకు. రోజూ భోజనంతో పాటు ఒక కప్పు పెరుగు ఇచ్చేవాళ్లు అక్కడ. నేనెలాగో తినను కాబట్టి, నా వాటా దొరుకుతుందని మెస్‌లో నన్ను వాళ్ల పక్కన కూర్చుబెట్టుకోవడానికి నా ఫ్రెండ్స్ పోటీ పడేవాళ్లంటే నమ్మండి.   

                                     *****

కాలేజ్‌లో చేరిన నెల రోజులకు Home Sick Holidays అని ఇచ్చారు.. చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను. అదేంటో దూరం వెళ్తున్నప్పుడు కలిగిన బాధని, మళ్లీ మనవాళ్లను చూస్తున్నామనే ఆనందం అలా చిటికెలో మాయమయ్యేలా చేస్తుంది. ఏంటి ఒక్క నెలకే ఇలా అంటున్నావా అని మీరు అనుకోవచ్చు.. కానీ అప్పటి నా మైండ్‌సెట్‌కి, ఇంటి మీద పెట్టుకున్న బెంగకి అదే నాకు చాలా ఎక్కువ అప్పుడు. ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పట్లోలాగా మొబైల్స్ లేవు, అనుకుంటే క్షణాల్లో చేసుకునే వీడియో కాల్స్ లేవు.. అలాంటి రోజుల్లో ఇంటివాళ్లను చూడాలని ఎదురుచూసే ఆ తాపత్రయం ఎంత గొప్పగా ఉండేదో..! చాలా రోజులకు అమ్మను చూశాను.. ఇంటివాళ్లతో గడిపాను.. నన్ను చూడగానే అమ్మ కళ్లల్లో కనిపించిన ఆనందం వెనుక విలువ ఎన్ని కోట్లు పెట్టినా వస్తుందా? ఇంటికి వెళ్లేటప్పటికే అమ్మ నాకు ఇష్టమైన వంటలన్నీ చేసింది. చాలా రోజుల తర్వాత నాన్న పక్కన కూర్చుని ఆ రోజు భోజనం చేశా. కాలేజ్ కబుర్లు, హాస్టల్ ఫ్రెండ్స్ గురించి.. ఈ నెల రోజుల్లో ఏమేం జరిగాయో అన్ని విషయాలు వాళ్లతో షేర్ చేసుకున్నా.. చెప్పండి.. ఇంతకన్నా గొప్పగా ఏం కావాలి అప్పటి నా పసి మనసుకి..?

                                  *****      

హాస్టల్‌లో ఉన్నప్పుడు మరో సరదా ఏంటంటే.. ఎప్పుడైనా వారానికి ఒకసారి అలా ఔటింగ్ ఇచ్చేవాళ్లు. ఆ రోజంతా ఇక క్లాసులు ఉండవు. ఫ్రెండ్స్‌ అంతా కలిసి బయటికి వెళ్లేవాళ్లం.. ఏదైనా సినిమా చూసేవాళ్లం. నేను కాలేజ్‌లో చేరిన తర్వాత మొదటి ఔటింగ్ రోజు చూసిన సినిమా ఏంటో ఇప్పటికీ నాకు గుర్తుందంటే ఆ రోజులు ఎంతగా నచ్చేవో మీరే అర్థం చేసుకోండి. అలా బయటికి వెళ్లిన రోజు ఖచ్చితంగా ఇంటికి ఫోన్ చేసేవాడిని.. అప్పట్లో ఇంట్లో ల్యాండ్‌లైన్ మాత్రమే.. ఇంకా సెల్‌ఫోన్‌ రాలేదు. మరి నేను ఫోన్ చేయాలంటే బయట కాయిన్ బాక్స్ నుంచే చేయాలి. దాని కోసం రూపాయి బిళ్లలు అవసరం అవుతాయని ముందు నుంచే దాచిపెట్టి ఉంచుకునేవాడిని. మాట్లాడుతుంటే నిమిషం దగ్గర పడుతుందనగా ఆ కాయిన్ బాక్స్ ఒక సౌండ్ చేసేది.. నిమిషం పూర్తయితే కాల్ కట్ అయిపోతుందన్న మాట. ఎక్కడ కట్ అవుతుందేమోనని ఆ సౌండ్ వినిపించగానే ముందుగానే ఇంకో రూపాయి వేసి ఇంకాసేపు మాట్లాడి సంతృప్తి పడేవాడిని. ఇప్పుడైతే అసలు ఆ కాయిన్ బాక్సులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అలా చాలా రోజులకు అమ్మతో, ఇంటివాళ్లతో మాట్లాడిన జ్ఞాపకాలు ఎంత బాగుండేవో.. మాట్లాడే ఆ ఒకటి, రెండు నిమిషాలు మళ్లీ ఇలా బయటికి వచ్చినప్పుడు ఫోన్ చేసేంతవరకు గుర్తుంచుకునేలా మనసులో ఎంతగా నాటుకుపోయేవో...!

                             *****

పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేశాయి.. ఎంసెట్ కోచింగ్ కోసమని నేను హాస్టల్‌లోనే ఉండిపోయా. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి మాది. ఆ సమయంలో జరిగిన ఓ మర్చిపోలేని సంఘటనను మీతో పంచుకుంటాను. ఇంటి దగ్గర నాన్నకి రోజూ పొద్దున్నే అలా బయటికి వెళ్లి హోటల్‌లో టీ తాగడం అలవాటు.. ఎప్పటిలాగే ఆ రోజు కూడా వెళ్లి టీ తాగుతున్నాడు. మామూలుగా ఊళ్లల్లో హోటళ్ల దగ్గర నలుగురూ కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం.. న్యూస్ పేపర్ చదవడం చూస్తూనే ఉంటాంగా. అలా వెళ్లి టీ తాగుతూ పేపర్ చదువుతున్న నాన్నకి చివరి పేజీలో అనుకోకుండా మా కాలేజ్‌ గురించి కనిపించింది. ఏంటా అని చూస్తే.. అందులో మా కాలేజ్‌ నుంచి ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవాళ్ల ఫోటోలు వేశారన్నమాట.. అందులో నాది కూడా ఉంది. అసలు దాని గురించి ఏ మాత్రం ఊహించని నాన్న.. నా ఫోటో, దాని కింద నా పేరు చూడగానే ఎంతో సంబరపడిపోయాడు. నన్ను పదేపదే ఆ పేపర్‌లో చూసుకుంటూ మురిసిపోయాడు. ఆ పేపర్‌ని అలాగే చేతిలో పట్టుకుని ఇంటి వైపు నడుచుకుంటూ వస్తూ మా వాడి ఫోటో పేపర్‌లో పడిందని రోడ్డు మీద కనిపించిన వాళ్లందరికీ గొప్పగా చెప్పుకున్నాడు. గల్లీ మొత్తం స్వీట్లు పంచిపెట్టాడు. ఈ విషయం ఆ తర్వాత ఓసారి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కలవాళ్లు చెప్తేనే నాకు తెలిసింది. అది తెలుసుకున్నాక మొదటిసారి అనిపించింది.. ఆ క్షణమే అర్థమైంది.. పిల్లలు చేసే ఓ చిన్న పని, సాధించే చిన్న విజయం కన్నవాళ్లని ఇంతగా సంతోషపెడుతుందా

                             *****

హాస్టల్‌లో ఉన్న నన్ను చూడడానికి చాలా రోజుల తర్వాత అమ్మానాన్న వచ్చినప్పుడు.. ఎలా ఉంటున్నానో, ఏం తింటున్నానో అని బెంగగా మాట్లాడినప్పుడు.. పక్కనే ఉన్న వార్డెన్ నా భుజం మీద చేయి వేసి.. చనువుగా దగ్గరికి తీసుకుని.. ఇక వీడు మావాడు, మేమున్నాంగా చూసుకోవడానికి అని చెప్తే ఎంత ధైర్యంగా ఉంటుందో ఆలోచించండి.. ఆ ధైర్యం తాలూకు అనుభవం ఇంకా నా మనసుకి ఇప్పటికీ బాగా గుర్తుంది. అలా ఇంటి నుంచి దూరంగా వెళ్లాలంటేనే మొదట భయపడిన నేను.. రెండేళ్లు ఇంటర్ చదువు హాస్టల్‌లో ఉండే పూర్తి చేశా. ఆ రెండేళ్లలో ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు. చదువుకున్న పాఠాలు, రాసిన పరీక్షలు, వచ్చిన మార్కులు, నోటీస్ బోర్డులో నా పేరు చూసుకోవాలనే ఆరాటం, అది చూసి లెక్చరర్లు మెచ్చుకుంటే పొందిన ఆనందం, ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న గొడవలు, మళ్లీ అంతలోనే సర్దుకుపోవడాలు, కాలేజ్ ఫంక్షన్లలో కల్చరల్ ప్రోగ్రామ్స్, అవి చూస్తూ వేసిన విజిల్స్.. ఇలా ఒకటా, రెండా.. ఆ రెండేళ్లలో ఒక చిన్న జీవితాన్నే చూశా.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు దాచుకున్నా.. జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనుభవాల ద్వారా తెలుసుకున్నా.

                           *****

నచ్చింది చేసి పెట్టమని మారాం చేద్దామంటే అమ్మ ఉండదు.. తప్పు చేస్తే బెదిరించే నాన్న ఉండడు.. గొడవలు పడదామంటే పక్కన తోడబుట్టినవాళ్లు ఉండరు.. సరదాగా ఆడుకుందామంటే చిన్ననాటి స్నేహితులు ఉండరు.. అన్నీ నువ్వే.. నీకు నువ్వే. మరో ముఖ్యమైన విషయం.. అంతా నాకే తెలుసనే అహంకారం ఆ వయసులో కొద్దిగా వస్తుంది.. కానీ, నిజానికి ఏమీ తెలియదు, అప్పుడలా అనిపిస్తుంది అంతే. హాస్టల్ అంటే ఇంటివాళ్లతో మనల్ని దూరం చేసేది మాత్రమే అనుకుంటారంతా.. కాదు, హాస్టల్ అంటే జీవితంలో ఎలా ఉండాలో చూపించే అనుభవం.. ఎలా ఉండకూడదో నేర్పే గుణపాఠం.


నా కాలేజ్ డేస్...


(NOTE: ఇందులో నేను ఎక్కడ ఉన్నానో దయచేసి వెతకొద్దు.. 😜😜😜)


THANK YOU

PC: CH.VAMSI MOHAN

కామెంట్‌లు