అందమైన మా ఊరు.. అందులో ఓ చిన్న స్కూలు.. పాఠాలు చెప్పిన టీచర్లు.. కలిసి చదువుకున్న స్నేహితులు.. ఆ జ్ఞాపకాలు.. ఇవన్నీ జరిగి అప్పుడే ఏళ్లు గడిచిపోయాయి. నా స్నేహితులంతా ఎక్కడో ఓ చోట ఉద్యోగాల్లో, జీవితాల్లో సెటిల్ అయిపోయారు. పదో తరగతి పూర్తయిన ఇన్నేళ్లలో చాలా మారిపోయాయి. పండగ అని, జాతర అని, పెళ్లిళ్లు అని ఊరికి వచ్చినప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్ కొందరు అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నారు. ఎంత కలిసినా ఒకప్పటి బాల్యం, ఆ స్కూలు జీవితం మళ్లీ రాదు కదా..! అందుకే, స్నేహితులందరం కలిసి ఆ జీవితాన్ని మరొక్కసారి బతికేద్దామని డిసైడ్ అయ్యాం. అదే 'గెట్ టూ గెదర్' పేరుతో...
పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్, డిగ్రీ, బీటెక్ అంటూ కొందరు.. పెళ్లి పేరుతో మరికొందరు చెరో వైపు వెళ్లిపోయారు. తర్వాత జాబ్, కెరీర్ ప్లానింగ్ అంటూ ఎవరి దారి వారిది. ఈ క్రమంలో ఎంతో మంది కొత్త ఫ్రెండ్స్, కెరీర్ విషయాల్లో గైడ్ చేసి సపోర్ట్ చేసే ఎంతో మంది ఆత్మీయులు పరిచయం అయ్యారు. ఎంత మంది వచ్చినా, ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా.. చెడ్డీలు వేసుకుని చదువుకున్న రోజులను ఎలా మర్చిపోతాం. ఆ స్నేహితులను, వారితో చేసిన అల్లరిని, ఆడిన ఆటలను, ఆ మధుర క్షణాలను ఎలా మరువగలం. అవన్నీ మరోసారి గుర్తు చేసుకోవడానికి, ఆ జ్ఞాపకాల ఒడిలో సేద తీరడానికి, మళ్లీ మేం స్కూల్ పిల్లలం అయిపోవడానికి ఒకరోజుని నిర్ణయించుకున్నాం.
అనుకున్న వెంటనే మా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాం. కలవడానికి ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాం. ఎంత మందికి రావడానికి వీలవుతుంది? అసలేం చేయాలి? పిలవాల్సిన టీచర్లు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ల ఫోన్ నంబర్లు ఎలా కనుక్కోవాలి? పార్టీకి ఎంత ఖర్చవుతుంది? ఇలా అన్ని లెక్కలు వేసుకున్నాం. చాలా రోజుల తర్వాత మా వాట్సాప్ గ్రూపు మెసేజులతో నిండిపోయింది. గెట్ టూ గెదర్ పార్టీకి చేయాల్సిన ఏర్పాట్లు, మధ్యమధ్యలో ఒకరి మీద ఒకరు వేసుకునే జోక్స్, అన్నిటికీ మించి కొన్ని రోజుల్లోనే అందరం ఒక దగ్గర కలుస్తున్నామనే ఆనందం మా వాట్సాప్ గ్రూపులో కనపడింది. తలా ఒక పని షేర్ చేసుకుని.. అనుకున్న సమయానికి అన్నీ పూర్తి చేసుకుని కలిసేది ఎప్పుడప్పుడా అని రోజులు లెక్క పెట్టుకున్నాం.
ఆ సమయం వచ్చేసింది. అనుకున్న సమయాని కంటే ముందే గెట్ టూ గెదర్ ప్లేస్‌కి ఫ్రెండ్స్‌తో కలిసి చేరుకున్నా. ఏర్పాట్లు దాదాపు పూర్తయిపోయాయి. చక్కగా రెడీ అయ్యి ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్ వస్తున్నారు. అందులో కొందరు ఎప్పుడూ టచ్‌లో ఉండేవాళ్లే అయితే.. కొందరిని నెలలు, మరి కొందరినైతే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నా. ఒకప్పుడు నాతో పాటు స్కూల్ డ్రెస్సుల్లో చిన్నపిల్లలుగా చూసినవాళ్లను, కలిసి పక్కనే కూర్చుని చదువుకున్నవాళ్లను, కలిసి అల్లరి చేసినవాళ్లలో.. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకుని జీవితాన్ని బాధ్యతగా నడిపిస్తున్న పెద్దరికాన్ని చూశా.
అందరి ముఖాల్లో చిరునవ్వు, ఎలా ఉన్నావనే పలకరింపులు, వీళ్లంతా నా ఫ్రెండ్స్ అని ఫీల్ అయ్యే చూపులు, ఇన్నేళ్ల దూరాన్ని ఈ ఒక్కరోజుతో మాయం చేసి మరింత దగ్గరవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో నాకు కనిపించింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ సరిగా మాట్లాడని కొందరు కూడా ఆ రోజు చూడగానే పలకరించడంతో వీళ్లంతా మనవాళ్లు అనే ఫీలింగ్ కలిగింది. మేం ఆహ్వానించిన టీచర్లు కూడా ఒక్కొక్కరుగా వస్తుండడంతో వాళ్లను రిసీవ్ చేసుకునే పనిలో పడిపోయాం.
ప్రోగ్రాం మొదలయ్యింది. టీచర్లను స్టేజ్ మీదికి పిలిచి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాం. మాకు చదువు చెప్పి ఇంతటివాళ్లను చేసి జీవితంలో ఎదిగేలా చేసిన టీచర్లను సన్మానించుకున్నాం. ఆ తర్వాత వాళ్లు ప్రసంగిస్తూ మా కోసం, మా ఎదుగుదల కోసం చెప్పిన మాటలను శ్రద్దగా విన్నాం. తెలిసీతెలియని వయసులో స్కూల్లో పాఠాలు వింటున్నప్పుడు భయంతో వినేవాడిని. ఇన్నేళ్ల తర్వాత మా టీచర్లు మా కోసం జీవిత పాఠాలు చెబుతుంటే ఒక సంపూర్ణ అనుభవం నా ముందు నిలువెత్తు రూపంతో నిలబడినట్లు అనిపించింది.
అందుకే పెద్దవాళ్లు మన అమ్మానాన్నల తర్వాత 'ఆచార్య దేవోభవ' అని ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని, ఇంత దూరం పిలిచి గౌరవించినందుకు వాళ్ల కళ్లల్లో ఆనందం కనిపించింది. ప్రతి టీచర్ తిరిగి వెళ్లిపోతూ నవ్వు మొహంతో వీడ్కోలు చెప్పడం, ఇదంతా చాలా బాగుందని చెప్పడం మాకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.
ఇక టీచర్లందరూ వెళ్లిపోవడంతో కొద్దిగా రిలాక్స్ అయ్యి.. ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరి కబుర్లు చెప్పుకున్నాం. పర్సనల్ లైఫ్ గురించి కొందరు మాట్లాడితే.. మరికొందరు స్కూల్లో చేసిన అల్లరి పనులు, టీచర్లతో తిన్న తిట్లు, చీవాట్లు, ఆ అనుభవాలు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ వినని, తెలియని కొన్ని జ్ఞాపకాలను కొందరు గుర్తు చేసి మరీ చెప్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది.
గుర్తున్నాయా ఫ్రెండ్స్.. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని, టెన్త్ వరకు ఎలా గడిచాయో ఆ రోజులు. కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే.. కొందరు చదువులో నాకు కాంపిటీషన్.. వీటన్నిటికీ మించి మనల్ని ఎప్పటికప్పుడు చదువులో సపోర్ట్ చేసిన టీచర్లు. అన్నట్లు.. మనం స్కూల్ నుంచి టూర్ వెళ్లాం గుర్తుందా?.. మన ఫ్రెండ్స్‌లో కొందరు రాలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని.. అందరం మన టీచర్లతో కలిసి ఇంటింటికీ తిరిగి వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడి ఒప్పించడం మర్చిపోతామా అసలు? ఎప్పుడూ ఊరు తప్పితే బయట ప్రపంచం తెలియని మనకు.. ఒక్కసారిగా అలా టూర్ పేరుతో అంతా తిరగడం చాలా మెమరబుల్ కదా! చూసిన ప్రదేశాలు, తెలుసుకున్న విషయాలు, బస్సులో చేసిన డాన్సులు, తీసుకున్న ఫోటోలు.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేవే.
మా ఊళ్లో మాదే పదో తరగతి ఫస్ట్ బ్యాచ్. అందుకే ఎంత కష్టమైనా ఖచ్చితంగా టెన్త్ పాస్ అవ్వాలని బాగా చదివాం. దానికోసం చాలా రోజులు స్కూల్లోనే పడుకునేవాళ్లం. మళ్లీ పొద్దున్నే లేచి చదివేవాళ్లం. ఫస్ట్ బ్యాచ్ 100% రిజల్ట్స్‌తో అందరం పాస్ అయ్యి ఊళ్లో మంచి పేరు తెచ్చుకున్నాం. దానికోసం మా టీచర్లు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవన్నీ ఈ రోజు ఇలా గెట్ టూ గెదర్ సందర్భంగా గుర్తు చేసుకుంటుంటే మళ్లీ మళ్లీ కావాలని అనిపిస్తుంది.
ఫేర్ వెల్ పార్టీ రోజు మేమంతా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామో.. చివరలో అంతే బాధతో ఏడ్చేశాం కూడా. ఇక ఇదే మనకు స్కూల్ జీవితంలో చివరి రోజు అని.. ఇకపై ఎవరు ఎక్కడ ఉంటామో అని తెలియక ఏడుస్తుంటే మమ్మల్ని దగ్గరికి తీసుకుని మా టీచర్లు ఓదార్చడం, అందరం ఎప్పటికీ ఇలాగే ఉంటామని ధైర్యం ఇవ్వడం మర్చిపోలేని జ్ఞాపకాలు. ఏది ఏమైనా ఆ రోజు జరిగింది.. ఈ రోజు ఇలా ఈ గెట్ టూ గెదర్‌లో తలుచుకుంటే బాగుంది. మళ్లీ అందరం చిన్నపిల్లలం అయిపోవాలని, స్కూలుకు వెళ్లి మళ్లీ పాఠాలు వినాలని పిచ్చి ఆశ కలుగుతోంది. ఈ సమయం ఇలాగే ఇక్కడే ఆగిపోతే బాగుంటుందని అనిపించింది. కానీ తిరిగి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు ఫేర్ వెల్ పార్టీ మనకు చివరి రోజు అని ఎంత ఎమోషనల్ అయ్యామో.. ఈ రోజు ఈ గెట్ టూ గెదర్ అప్పుడే అయిపోయిందా అన్నపుడు, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి అన్నప్పుడు అంతే బాధగా అనిపించింది. ఈ రోజు ఇంకోసారి తిరిగొస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకాసేపు ఇక్కడే ఉందామని ప్రతి ఒక్కరికీ అనిపించినా, వెళ్లాలని లేకపోయినా అయిష్టంగానే అక్కడ నుంచి బయలుదేరాం.
జీవితంలో ఎంతో మంది వస్తారు.. వెళ్లిపోతారు. పరిస్థితుల కారణంగా మధ్యలో ఎంత మంది వదిలేసి వెళ్లినా స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ కష్టం, సుఖం అన్నీ వాళ్లకే తెలుస్తాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక్క ఫోన్ చేసి చూడు.. క్షణాల్లో మీ ముందు ఉండే స్కూల్ ఫ్రెండ్స్ మీకు కూడా ఉండే ఉంటారు. అందుకే మీ బిజీ లైఫ్‌లో వారికి కాస్త సమయం ఇవ్వండి. ఏది ఏమైనా అలాంటి వాళ్లను ఎప్పటికీ వదులుకోకండి. నా జీవితంలో కూడా అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు గర్వపడుతూ.. ఈ ఆర్టికల్‌లో రాసిన అక్షరాల్లోనే వారి మీద నా ప్రేమను వెతుక్కుంటారని అనుకుంటున్నా.
FRIENDS.. WE ARE FOREVER
THANK YOU 🙏
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి