శ్రీరంగం వెళ్లినా.. దొరకని స్వామి దర్శనం

రంగనాథా.. సాక్షాత్తూ నువ్వే కొలువై ఉన్న శ్రీరంగం పుణ్యక్షేత్రానికి వచ్చాను.. సుందరమైన నీ ఆలయం చూశాను.. ఎత్తైన ఆ గోపురాలు, స్తంభాలు, వాటిపై అందంగా చెక్కబడిన శిల్ప సౌందర్యం చూసి మైమరచిపోయాను.. ఇంతటి అద్భుతాన్ని తమ చేతులతో ఇంత అపురూపంగా మలిచిన శిల్పుల ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. విశాలమైన నీ ఆలయం లోపల తిరుగుతుంటే మనసులో మొత్తం నీ రూపమే మెదులుతోంది. కానీ, ఆ రూపం ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం మాత్రం నాకు కలగలేదు. అదేంటో.. ఏం తప్పు చేశానో.. అంత దూరం ప్రయాణం చేసి, అక్కడి వరకూ వచ్చి నీ దర్శనం చేసుకోలేకపోయాననే బాధ మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

శ్రీరంగం

తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఆనుకుని కావేరీ నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే శ్రీరంగం. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని తరించాలనుకునే చాలా మందిలో నేనూ ఒకడిని. ఆ ఉద్దేశ్యంతోనే జనవరి 23, 2024న శ్రీరంగం బయలుదేరా. అక్కడికి చేరుకునే సరికి సాయంత్రం 7 దాటింది. రోజంతా రైలు ప్రయాణం, ఆ అలసట, మళ్లీ అక్కడికి వెళ్లాక ఉండడానికి రూమ్ చూసుకోవాలి, తర్వాత వెంటనే దర్శనానికి వెళ్లిపోవాలి. ఇది ముందుగా అనుకున్న ప్లాన్. కానీ, ఊహించని విధంగా అంతా తారుమారు అయిపోయింది. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్లు జరిగిన నా శ్రీరంగం అనుభవం ఇలా అక్షర రూపంలో మీతో పంచుకుంటున్నా.

శ్రీరంగం

తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయా. ఆహా.. శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది..! మధ్యలో పెద్ద గుడి.. దాని చుట్టూ ఎత్తైన ప్రాకారం.. ఆ ప్రాకారాన్ని ఆనుకుని చుట్టూ రోడ్డు.. ఆ రోడ్డుపై అక్కడక్కడా వేసిన ముగ్గులు. ఆటో దిగగానే ఓ ఊరేగింపు ఎదురొచ్చింది. ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగిస్తూ హరి నామ స్మరణ చేస్తూ పండితులు ముందుకు వెళుతున్నారు. దిగీ దిగగానే ఆ స్వామి ఎదురుగా కనిపించి స్వాగతం చెప్పినట్లుగా అనిపించింది. 

శ్రీరంగం

సుమారు ఒక వంద మంది వరకైనా ఉంటారు ఆ పండితులు. ఊరేగింపు కదులుతూ ఏ ఇంటి ముందు ఆగితే, ఆ ఇంటి నుంచి ఆడవాళ్లు బయటికి వచ్చి హారతులు ఇస్తున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు మడికట్టు చీరలో, నుదుటిపై నామాలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని తమిళ సొగసు అంతా ఇక్కడే ఉందేమో అన్నట్లు చేయెత్తి మొక్కేలా ఉన్నారు. ఎలాగైనా ఆ ఊరేగింపులో కలవాలని ఒక ఐదారేళ్ల పిల్లాడిని వాళ్ల అమ్మగారు తొందరపెడుతున్నారు. ఆ అబ్బాయి పంచె సరిచేసుకుంటూ.. నిలువు నామాలతో, పిలకతో హడావిడిగా వెళ్తూ ముచ్చటగా కనిపించాడు. ఇలా అక్కడ ఏ సంఘటన చూసినా ఎంతో మనోహరంగా అనిపించింది. పండితుల వేద మంత్రాల నడుమ సాగుతున్న ఆ ఊరేగింపుతో పాటు చివరలో నేను కూడా నడిచా. దేనికైనా రాసి పెట్టాలి ఉండాలి కదా.. ఈ సమయానికి ఇలా ఇక్కడికి చేరుకోవడం ఏంటి? వాళ్లతో పాటు ఈ ఊరేగింపులో నేనూ ఉండడమేంటీ? అంతా ఆ నారాయణుడి లీల.

శ్రీరంగం

ఆలయం దగ్గర్లోనే ఏదైనా లాడ్జి దొరికితే బాగుండు అనిపించింది. అనుకున్నట్లుగానే.. అది కూడా మన తెలుగు వాళ్లు(విజయవాడ) నడుపుతున్న ఒక లాడ్జి కనిపించింది. పైగా చాలా తక్కువ ఖర్చుకు రూమ్ దొరికింది. పొద్దున నుండి ప్రయాణంలోనే ఉన్నాం కదా.. చాలా నీరసంగా ఉంది. ఏమైనా తినాలి అనిపించింది. అందుకే ఇంకాస్త ముందుకు నడిచాం. అలా రోడ్డు వెంట నడుస్తూ ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాము. ఎటు చూసినా తమిళ వాళ్లే. అంతా కొత్తగా ఉంది. ఒకటి, రెండు పదాలు తప్ప మనకేమో అసలు తమిళం రాదు. అది కూడా సినిమాల నుంచి తెలుసుకున్న తమిళమే. ఏం తినాలా అని ఆలోచిస్తూనే.. ఇక్కడ ఏంటి స్పెషల్ అని ఆ హోటల్ వాళ్లతో వచ్చీరాని తమిళంలో అడిగాం. 'మిలగు వడై' ఇక్కడ ఫేమస్ అని చూపించి చేతిలో పెట్టాడు. కొంచెం ఘాటుగా ఉన్నా రుచిగానే ఉంది. మన తెలుగులో చెప్పాలంటే అవి మిరియాల వడలు. అలాగే వేడివేడిగా ఒక టీ తాగి తిరిగి రూంకి చేరుకున్నాం.

శ్రీరంగం

తక్కువ ఖర్చులోనే అంత మంచి రూమ్ ఇవ్వడం చాలా గ్రేట్ అనిపించింది. మూడో ఫ్లోర్‌లో ఇచ్చారు.. చాలా నీట్‌గా కూడా ఉంది. మధ్యలో గుడి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతమంతా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని వీధులుగా విభజించారు. మనం దక్షిణ వీధిలో ఉన్నామన్న మాట. రూమ్ దాటి అలా బాల్కనీలోకి వచ్చి బయటికి చూస్తే కనుచూపు మేరలోనే శ్రీ రంగనాథ ఆలయం. పైనుంచి చూస్తున్నా కదా.. ఆ ఆలయ పరిసరాలు, విశాలమైన ప్రాకారం మొత్తం కనిపిస్తోంది. ఎంత చక్కగా ఉందో ఆ వ్యూ. చుట్టూ ఎక్కడ చూసినా పురాతన ఇండ్లు, దేవుని సేవకే అంకితమై కల్మషం లేని మనసున్న బ్రాహ్మణ జనాలు, సన్నగా చెవులకు వినిపిస్తున్న హరి నామ స్మరణలు, గుడిలో నుంచి గంటల శబ్దాలు, చీకటి పడిన ఆ ప్రాంతమంతా వీస్తున్న చల్లటి గాలి.. ఆహా మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంది. నిజంగా రంగనాథ స్వామి అక్కడే ఉన్నాడు.. మనల్ని చూస్తున్నాడు.. మన వెంట నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనిపించక మానదు అదంతా చూస్తే.

శ్రీరంగం

రాత్రయితే గుడి మూసేస్తారు.. దర్శనాలు ఆపేస్తారని తెలుసుకుని హడావిడిగా స్నానాలు చేసి బయటపడ్డాం. దగ్గర్లోనే గుడి కదా వెళ్లిపోతాంలే అనుకున్నాం. కాసేపట్లో ఆ స్వామి దర్శనం చేసుకోబోతున్నామని ఉత్సాహం మరోవైపు. ఆలయ ద్వారాలు ఎంత పెద్దగా ఉన్నాయనుకున్నావ్.. ఎత్తైన గోపురాలు పైగా. లోపలికి అడుగుపెట్టి చూస్తే విశాలమైన మండపాలు, మిగతా దేవతల ఆలయాలు కొన్ని.. చాలా మంది భక్తులు, ఎవరి హడావిడిలో వాళ్లు. ముందుగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శనం చేసుకున్నా. ఇక మనమైతే స్వామివారి గర్భగుడి వైపు వెళ్లిపోవాలి. దర్శనం ముందు పూర్తయితే మిగతావన్నీ తీరిగ్గా చూద్దాంలే అనుకున్నాం.

శ్రీరంగం

శ్రీరంగంలోని రంగనాథ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. విస్తీర్ణంలో చూస్తే సుమారు 4 కి.మీ ఉంటుందట. అదంతా తిరగడానికే ఒకరోజు పడుతుందేమో కదా..! ఇక వచ్చేశాంలే అనుకుని అలా లోపలికి అడుగుపెట్టామో లేదో.. సెక్యూరిటీ వాళ్లు అక్కడ ఉన్న భక్తులందరినీ బయటికి పంపించేస్తున్నారు. అదేంటని అడిగితే దర్శనాలు రాత్రి 8.30 గంటల వరకే అంట. పోనీ ఎంత పొద్దున వీలైతే అంత త్వరగా వద్దాంలే అని కనుక్కుంటే.. రేపు రథోత్సవం ఉంది.. అసలు దర్శనాలే ఉండవు అని మరో షాక్.. రంగనాథా ఏం చేసేది...!

శ్రీరంగం

గర్భగుడికి దగ్గర్లోనే ఉన్నాం. భక్తులందరినీ పంపిస్తుండడంతో ఆలయం లోపల మొత్తం హడావిడిగా ఉంది. ఎటు వైపు వాళ్లు అటు వెళ్తున్నారు. ఏ కొంచెం అవకాశం అయినా ఉండదా అని ఆ గందరగోళంలోనే వాళ్లందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లాం. రాత్రిపూట స్వామికి చేయాల్సిన సేవలన్నీ పూర్తి చేసి పూజారులు గుంపులుగా వచ్చేస్తున్నారు అనుకుంటా. ఇదే గర్భగుడి ముఖద్వారం అని తెలిసి అంతవరకూ వెళ్లిపోయాం. చూస్తే అప్పటికే తెర వేసి ఉంది. నీలం రంగు తెరపైన మూడు నామాలు, అటు ఇటు శంకు చక్రాల గుర్తులు.. ఆ తెర వెనక నాకు కనిపించకుండా రంగనాథుడు. అయ్యో.. దర్శించుకుందామని చివరి అడుగు వరకు వచ్చేశానే. అయినా ఫలితం లేదు.

శ్రీరంగం

సమయం విలువ అప్పుడు అర్థమైంది. ఒక్క 5 నిమిషాలు ముందుగా వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. అందరూ మెల్లగా వెళ్లిపోతూనే ఉన్నారు ఇంకా బయటికి. నేను మాత్రం కాసేపు అక్కడే ఉండిపోయా ఆ విష్ణు నామాలను చూస్తూ. ఆ తెర వెనక నా స్వామి అప్పుడప్పుడే నిద్ర పోవడానికి సిద్ధమవుతున్నట్లు శేషతల్పంపై పడుకున్న ఆ ఆకారం నా మదిలో నుంచి పోవట్లేదు. అక్కడ ఉండడానికి లేదు.. బయటికి వెళ్లిపోవాలి.. తప్పదు.. కానీ వెళ్లాలని లేదు. మనసు అక్కడే ఉంది.. మరి నా కాళ్లు ఎలా కదులుతాయి. తెలియకుండానే ఉద్వేగానికి లోనైపోయా. కదిలిస్తే ఏడ్చేస్తానేమో అన్నంత భారం మనసులో. దేనికైనా అదృష్టం ఉండాలేమో కదా.. మరి అక్కడి వరకు వచ్చి ఇలా జరగడం ఏంటి..? నేనేమైనా తప్పు చేశానా? దర్శనానికి అప్పుడే నేను ఇంకా అర్హత సంపాదించలేదా?.. ఇలా కూడా మాయ చేస్తావా స్వామీ..? నీ నిర్ణయం ఇదేనా..? అనుకుంటూ కష్టంగా అక్కడి నుంచి బయటికొచ్చా. 

శ్రీరంగం

THANK YOU 

PC: CH. VAMSHI MOHAN





కామెంట్‌లు

  1. *ఆటో దిగగానే ఓ ఊరేగింపు ఎదురొచ్చింది. ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగిస్తూ హరి నామ స్మరణ చేస్తూ పండితులు ముందుకు వెళుతున్నారు. దిగీ దిగగానే ఆ స్వామి ఎదురుగా కనిపించి స్వాగతం చెప్పినట్లుగా అనిపించింది.*

    👆👆👆👆👆👆
    Enduke Swamy varu gharbha gudi dharshanam kaledelu ragane darshanam chesukunnav kada bhaktha ani I..KANi marunadu unte Niike SWAmy vari modati gharbha gudi darashnam dorikedhi Anna but An dark I teliyajeshav gudi prakaram gurinchi months varaki.. Thankq ..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి