అయోధ్య రామ మందిరం

 

అయోధ్య రామా..! ఇన్నేళ్ల పోరాటం తర్వాత మళ్లీ నువ్వు పుట్టిన గడ్డపై కాలు మోపావా? నీ ఇంటికి నువ్వు రావడానికి, మమ్మల్ని కరుణించడానికి ఇంత సమయం తీసుకున్నావా? మానవ రూపంలో జన్మించావు.. మనిషిలా బాధలు అనుభవించావు.. నీ కథ నిండా కష్టాలే అని విన్నాం.. అవి అంతటితో అయిపోయాయి అనుకున్నా.. భద్రాచలంలో నీకు గుడి కట్టడానికి ఆ రామదాసు ఎన్ని బాధలు అనుభవించాడో మేం కళ్లారా చూడలేదు కానీ, నీకు అయోధ్యలో గుడి కట్టడానికి మేం ఎన్ని కష్టాలు పడ్డామో నువ్వు చూసే ఉంటావుగా..! ఎందుకు రామయ్యా..? నీకు మందిరం కట్టించుకోవడానికి మేం ఇంత పోరాటం చేయాలా? ఇంత మంది ప్రాణాలు అర్పించాలా?
అయోధ్య రామ మందిరం
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. 2024, జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల శుభ ముహుర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇది సాధ్యం కావడం అంత తేలికగా జరగలేదు. చాలా మందికి తెలియని దాదాపు 500 ఏళ్ల చరిత్ర దీని వెనక ఉంది. ఎంతో మంది పుణ్యాత్ముల పోరాటం, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం ఉంది. లంక చేరడానికి వారధి కట్టిన ఆ రాముడికి ఉడత సాయం చేసినట్లు.. ఆలయ నిర్మాణం జరగడానికి ఉడతా భక్తిగా పోరాడిన మహనీయుల గురించి మనం ఈ సమయంలో తప్పక గుర్తు చేసుకోవాల్సిందే. అయితే.. అసలు అయోధ్యలో ఏం జరిగింది? ఎందుకు రామ మందిర నిర్మాణానికి అక్కడ సమస్యలు ఏర్పడ్డాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరం
మొదట ఈ సమస్య మొదలైంది 1528లో.. అయోధ్యలోని రామ మందిరాన్ని అప్పటి నవాబు మహ్మద్ బాబర్ పడగొట్టించాడు. ఈ మందిరాన్ని శ్రీరాముడి కొడుకు కుశుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఆలయాన్ని పడగొట్టించిన బాబర్.. అక్కడ మసీదు కట్టించాడు. దాన్నే బాబ్రీ మసీదు అంటారు. ఆ తర్వాత 190 ఏళ్ల అనంతరం 1717లో జైపూర్ రాజు రాజా జైసింగ్ మసీదుకు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూశాడు. కానీ, అది జరగలేదు. దీంతో రాజా జైసింగ్ హిందువుల కోసం మసీదుకు దగ్గర్లోనే ఓ చిన్న రామ మందిరం నిర్మించాడు. ఇక తర్వాత ముస్లింలు మసీదులో నమాజ్ చేస్తే.. హిందువులు ఆ మందిరంలో పూజలు చేసేవారు.
అయోధ్య రామ మందిరం
వందల ఏళ్లు గడిచిపోయాయి.. అయినా బాబర్ రామ మందిరాన్ని పడగొట్టి, మసీదు నిర్మించాడనే విషయాన్ని హిందువులు మర్చిపోలేదు. దానికి తగ్గట్టుగానే ఆ మసీదులో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని కొందరు హిందువులు, బ్రిటిష్ ఆఫీసర్లు కూడా వాదించారు. ఆ మసీదులో రామ మందిరానికి సంబంధించిన పిల్లర్లు కూడా దొరికాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే 1885లో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. మసీదు దగ్గర్లో ఉన్న రామ మందిరానికి పందిరి వేసుకుంటామని మహంత్ రఘుబీర్ దాస్ అర్జీ పెట్టుకున్నప్పటికీ.. దానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు.
అయోధ్య రామ మందిరం
1934లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ అల్లర్లలో బాబ్రీ మసీదు గోడ విరిగిపోయింది.. ఆ గోడ మళ్లీ కట్టించినప్పటికీ అప్పటి నుంచి అక్కడ నమాజులు చేయడం ఆగిపోయింది. ఇక 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. భారతీయులు ఆ ఆనందంలో ఇప్పటికైనా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆశపడ్డారు. కానీ అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి ఆలోచించలేదు. ఇదిలా ఉంటే.. 1949లో అందరూ ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. రాత్రికి రాత్రే ఆలయంలో సీతారాముల విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఎవరికీ తెలియకుండా కావాలనే హిందువులు ఆ విగ్రహాలను పెట్టారని ముస్లింలు ఆరోపణలు చేశారు. దీంతో రెండు మతాల ప్రజల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవ్వకముందే మందిరంలోని రాముడి విగ్రహాన్ని తీసేయాలని అక్కడి మేజిస్ట్రేట్ KK నాయర్‌కు ప్రధాని నెహ్రూ ఆదేశాలు ఇచ్చారు.
అయోధ్య రామ మందిరం
KK నాయర్‌ ఎవరు? ఏం చేశారు?
అయోధ్యలో శ్రీరామ జన్మభూమి సాధించడంలో ముఖ్యమైన ఒకరు కందంగళం కరుణాకరన్ నాయర్(KK నాయర్‌) గారు. హిందువులు అయోధ్యను రాముడి జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని.. అది ఇప్పుడు ఒక మసీదుగా ఉందని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు.. కానీ అది ఒక హిందూ దేవాలయమని KK నాయర్ నివేదిక ఇచ్చారు. అంతేకాదు.. అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని, దానికోసం ప్రభుత్వమే భూమి కేటాయించాలని కూడా అన్నారు. దీనికి ఒప్పుకోని నెహ్రూ.. ఆ ప్రాంతం నుంచి హిందువులను వెంటనే ఖాళీ చేయించి రామ్ లల్లా విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేయాలని ఆదేశించారు. కానీ, నాయర్.. నెహ్రూ మాటలను లెక్క చేయలేదు. అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూకు వ్యతిరేకంగా విజయం సాధించారు. అలా నాయర్ కృషి వల్లే ఈ రోజుకీ హిందువులు అయోధ్య రామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నారు.
అయోధ్య రామ మందిరం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్య వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఎల్ కే అద్వానీ ఆధ్వర్యంలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కి.మీ రథయాత్ర చేపట్టారు. ఆ సమయంలో అద్వానీని అరెస్ట్ కూడా చేశారు. రథయాత్ర పూర్తయ్యే రోజు ఎక్కువ సంఖ్యలో హిందువులు రావడంతో అప్పటి ప్రభుత్వం తుపాకీ కాల్పులు కూడా జరిపింది. ఈ కాల్పుల్లో చాలా మంది మరణించారు. ఆ తర్వాత 1992లో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఉన్న సమయంలో దాదాపు 2 లక్షల మంది హిందువులు అయోధ్యకి తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయంపై ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దాదాపు 900 మంది చనిపోయారు.
అయోధ్య రామ మందిరం
తర్వాత వాజపేయి గారు ప్రధానిగా అధికారంలోకి వచ్చిన సమయంలో మళ్లీ రామ మందిరం గురించి చర్యలు మొదలయ్యాయి. అసలు ఆ ప్రాంతంలో ముందు ఏం ఉండేదో గుర్తించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించగా.. అక్కడ ఒక హిందూ ఆలయం ఉండేదని ఆ సర్వే తేల్చింది. దీంతో కోర్టు ఆ ప్రాంతాన్ని రామ జన్మభూమి ట్రస్ట్, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డుకి సమానంగా పంచింది. కోర్టు నిర్ణయం ఎవరికీ నచ్చకపోవడంతో 2011లో కేసు సుప్రీంకోర్టుకి వెళ్లింది. సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ఉన్నప్పుడు అందులో ముఖ్య పాత్ర పోషించిన న్యాయవాది పరాశరన్ గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరం
ఎవరు ఈ పరాశరన్?
కేశవ పరాశరన్ గారు సీనియర్ సుప్రీంకోర్టు లాయర్. అయోధ్య కేసు సుప్రీంకోర్టులో ఉన్న చివరి 40 రోజుల్లో పరాశరన్ గారు ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజూ కేసు వాదనలో పాల్గొన్నారు. ఆయనకు అప్పటికే 92 ఏళ్లు. ఈ రోజు మనకు రామ మందిర నిర్మాణం సాధ్యపడింది అంటే అందులో పరాశరన్ గారి పాత్ర చాలా ఉంది. సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పుడు ప్రతిసారి పరాశరన్ గారు నిలబడే వాదించేవారట. ఆయన వయసు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది పడతారని.. కూర్చుని వాదించాలని అక్కడి జడ్జీలు ఆయన్ను కోరారట. దానికి పరాశరన్ గారు.. "అయోధ్యలో రాముడు నిలబడే వరకు.. నేను నిలబడే వాదిస్తాను" అని సమాధానం ఇచ్చారట. తాను చనిపోయే లోపు అయోధ్య కేసులో పరిష్కారం జరిగేలా చేయడమే తన చివరి కోరిక అని చెప్పేవారట. అది ఆయనకు హిందూ ధర్మం మీద, అయోధ్య రాముడి మీద ఉన్న అపారమైన గౌరవం అని చెప్పొచ్చు. రామసేతుకు సంబంధించిన కేసులో కూడా పరాశరన్ గారు సుప్రీంకోర్టులో వాదించారు.
అయోధ్య రామ మందిరం
కళ్లు లేకపోయినా సాక్ష్యం చెప్పి..
రామ జన్మభూమికి సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు.. అలహాబాద్ హైకోర్టుకు హాజరైన మరో మహానుభావుడు శ్రీరామ భద్రాచార్య గారు. హిందువులకు అయోధ్య ఎందుకు అంత ముఖ్యమైనది, శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించారని ఋగ్వేదంలో రాసి ఉందని ఆయన కోర్టులో మాట్లాడారు. ఈయన 22 భాషల్లో మాట్లాడగలరు.. 14 భాషల్లో పండితులు. అయోధ్య మహత్యం గురించి కోర్టులో వివరించి.. ఈ రోజు రామ మందిర నిర్మాణం జరగడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి రామ భద్రాచార్య గారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. రామ భద్రాచార్య గారు అంధుడు(గుడ్డివారు). ఆయనకు తన చిన్నతనంలో 2 నెలల వయసు ఉన్నప్పుడే కళ్లు పోయాయి.
అయోధ్య రామ మందిరం
అయోధ్య ఉద్యమంలో తెలుగువాడు
అయోధ్య కేసుకు సంబంధించి మొదట్లో కోర్టు కేసు వాదించడానికి కూడా ఎక్కువ డబ్బులు లేవట. అలాంటి సమయంలో నేనున్నానంటూ మన తెలుగువాడు ముందుకు వచ్చారు. ఆయన ఎవరో కాదు.. మీ అందరికీ పుల్లారెడ్డి స్వీట్స్ గురించి తెలిసే ఉంటుంది కదా..? దాని యజమాని జి.పుల్లారెడ్డి గారు. విశ్వ హిందూ పరిషత్ నాయకుడిగా ఆయన అయోధ్య ఉద్యమంలో ఎప్పుడూ ముందుండి ఆర్థిక సాయం అందించారు. తాను బతికి ఉన్నంత వరకు అయోధ్య ఉద్యమం ఆగకూడదని చెప్పిన మహానుభావుడు పుల్లారెడ్డి గారు.
అయోధ్య రామ మందిరం
అయోధ్యను కాపాడిన హనుమంతుడు
అది 1998వ సంవత్సరం. అయోధ్య ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో ఓ అద్భుతం జరిగింది. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో బాంబు దాడి నుంచి ఓ కోతి కాపాడింది. రాములవారిని ఆ హనుమంతుడు కాపాడారని అందరూ చెప్పుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో భాగంగా హనుమాన్ గర్హి ఆలయంలోని వాటర్ కూలర్ మెషీన్‌లో బాంబు పెట్టారు. అది తెలియని పోలీసులు ఆలయం చుట్టుపక్కల అంతా వెతికినా బాంబు దొరకలేదు. ఇంతలో వారికి ఎలక్ట్రిక్ వైర్ నములుతూ ఓ కోతి అక్కడ కనిపించింది. ఎంత తరిమినా అది ఆ వైర్ వదిలేసి అక్కడ నుంచి పోవట్లేదు. చివరికి ఒక అరటి పండు విసరగానే అది తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందట. చూస్తే బాంబుకి పెట్టిన వైర్ అప్పటికే మొత్తం కొరికేసి అది పేలకుండా డిస్పోజ్ అయి ఉందట. ఇది ఆ ఆలయంలో జరిగిన ఒక మిరాకిల్ అని చెప్తారు.
ఇక 2011లో సుప్రీంకోర్టులో మొదలైన అయోధ్య కేసు విచారణకు 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2019లో న్యాయం దొరికింది. వివాదంలో ఉన్న ఆ ప్రాంతం రామ జన్మభూమికి చెందుతుందని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇక ఫిబ్రవరి 5, 2020లో రామ మందిర నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరిగి పనులు మొదలయ్యాయి. జనవరి 22, 2024లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 1528లో అయోధ్యలో ఎక్కడైతే రామ మందిరం పడగొట్టారో.. అదే ప్రాంతంలో 492 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం జరిగింది.

ఇది హిందువులందరి విజయం

జైశ్రీరామ్..! జైజై శ్రీరామ్..!!!
అయోధ్య రామ మందిరం
చదివినందుకు ధన్యవాదాలు. అయోధ్య రాముడిని దర్శించుకోవాలని నా లాగా మీలో ఎంత మందికి కోరికగా ఉంది. కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. మీకు నా ఆర్టికల్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి.

Thank you 

PC: CH. VAMSHI MOHAN 

కామెంట్‌లు