శ్రీ రాముడు.. ఎన్నో ఏళ్లుగా మనం మొక్కుతున్న దేవుడు. భగవంతుడు మనిషి రూపంలో ఈ భూమి పైకి వచ్చిన అవతారమే రఘురాముడు. తండ్రి మాట దాటని, తల్లిని దైవంగా భావించే కొడుకులా.. తమ్ముళ్లని ప్రేమించే అన్నగా.. భార్యకి మంచి భర్తగా.. ప్రజలకు అసలైన పాలకుడిగా.. మాట ఇచ్చి తప్పని స్నేహితుడిగా రాముడు ఒక సంపూర్ణ రూపం. కొందరికి రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపం.. మరి కొందరికి ఆదర్శ పురుషుడు.. ఇంకొందరికి గుడిలో దేవుడు మాత్రమే. అసలు రామాయణమే కల్పితం.. రాముడు అనేవాడే లేడు అని వాదించేవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే.. నేను తెలుసుకున్న రామాయణంలో నాకు నచ్చిన కొన్ని అద్భుతమైన సందర్భాలను, అసలు రాముడు నా జీవితంలో ఎందుకు అంత భాగమయ్యాడనే విషయాలను ఇక్కడ మీతో పంచుకుంటాను.
అయోధ్యను పాలించే దశరథ మహారాజు గారాల బిడ్డ రాముడు. ఒకసారి చిన్నతనంలో అన్నం తిననని రాముడు మారాం చేశాడట. ముగ్గురు తల్లులు నేనంటే నేను తినిపిస్తానని పాల బువ్వ కలిపి ప్రేమను కురిపిస్తుంటే, అది చూసి దశరథుడు ముసిముసిగా నవ్వుకుంటుంటే.. రాముడు మాత్రం ఆకాశంలో చందమామని చూపిస్తూ అది తెచ్చి ఇస్తేనే అన్నం తింటానని బెట్టు చేశాడట. చేసేది లేక ఒక అద్దం తీసుకొచ్చి, ఆకాశంలోని చంద్రుడి ప్రతిబింబం అద్దంలో కనపడేలా చూపించగానే తన దగ్గరగా కనిపించిన చంద్రుడిని చూసి మురిసిపోయాడట ఆ పసి బాలుడు. నాకు మాత్రం.. అయోధ్య అంతఃపురంలో పట్టు పంచె కట్టుకుని, మెడలో ధగధగలాడే హారాలు వేసుకుని, నడుముకు కట్టిన బంగారు మొలతాడు కిందికి జారుతుంటే, చిట్టి చిట్టి పాదాలతో బుడిబుడి అడుగులు వేస్తూ మూతికి అంటుకున్న పాల బువ్వతో పసిడి బుగ్గల బాల రాముడు కనబడుతున్నాడు.
తాము చేసే యజ్ఞ యాగాదులకు రాక్షసులు భంగం కలిగిస్తున్నారని.. వారి నుంచి రక్షణ ఇవ్వడానికి రాముడిని తన వెంట పంపాలని విశ్వామిత్రుడు దశరథ మహారాజును అడిగాడట. ఒక వైపు చూస్తే గురువు విశ్వామిత్రుడు.. ఎదురు చెప్పలేడు, ఇచ్చిన మాట తప్పలేడు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రాముడు. ఏం చేసేది?.. అప్పటికే ఇచ్చిన మాట తప్పుతావా? ఇదేనా నీ వంశ ధర్మం అని విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోతుంటే.. 'పసి బాలుడు.. సుకుమారుడు.. రాముడిని అడవులకు పంపడమా? రాక్షసులతో యుద్దానికి పంపడమా?' అని దశరథుడు కళ్ల నీళ్లు పెట్టుకున్నాడట. కంటికి రెప్ప దూరం కావొచ్చేమో కానీ, నా రాముడిని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేనని దశరథుడు అన్నాడనే ఘట్టం తలుచుకున్నప్పుడల్లా నా మనసు కరిగిపోతుంది. ఎంత ఎదిగినా కన్నవాళ్లకు మనం ఇంకా చిన్న పిల్లలమే అనే ఒక పిచ్చి తండ్రి ప్రేమ కనిపిస్తుంది.
స్వయంవరంలో శివ ధనుస్సు విరిచి సీతను పెళ్లాడుతానని, లోక కళ్యాణం జరుగుతుందని నీకు గట్టి నమ్మకమే కదా రామయ్యా.. అయినా ఎక్కడా పౌరుషం చూపలేదు. స్వయంవరానికి వచ్చిన మిగతా దేశాల రాజులంతా ఇదెంత పని అని గర్వంతో విర్రవీగి, ధనస్సును ఎత్తలేక ఓడిపోయి అవమాన భారంతో నిలబడినప్పుడు వారిని చూసి నవ్వలేదు. శివ ధనుస్సు విరిచావని పరశురాముడు ఆగ్రహంతో నీపై ఊగిపోతుంటే.. గురువు విశ్వామిత్రుడి ఆదేశంతో మాత్రమే విల్లు ఎక్కుపెట్టానని, అది విరిగిపోవడం నీ చేతుల్లో లేదని ఒప్పుకున్నావే తప్ప ఎదురు మాట్లాడలేదు. ఎక్కడిదయ్యా అంత వినయం నీకు?.. పెద్దలంటే గౌరవం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా హద్దులు దాటని నీ స్వభావం.. ఇవి కదా నీ నుంచి మేము నేర్చుకోవాల్సింది..!
తండ్రి పట్ల కొడుకు ఎలా మెలగాలో చెప్పడానికి నా రామ చంద్రుడు ఒక్కడు సరిపోడా..? తెల్లారితే అయోధ్యకి అధిపతి అయ్యే అవకాశం ఉన్న సమయంలో తల్లి కైకేయి.. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని, నువ్వు వనవాసం చేయాలని చెప్పగానే ఏ మాత్రం ఆశలు కోల్పోకుండా.. కోపం చూపించకుండా చెప్పింది చేయాలంటే ఎంత నిష్ఠ ఉండాలో, స్వార్థం లేని నీ మనసు ఎంత గొప్పదో అర్థమైంది నాకు. తమ్ముడు లక్ష్మణుడు నీ వెంటే వస్తానని, నువ్వు లేకపోతే ఉండలేనని చెప్తే.. భార్యను ఒంటరిగా వదిలి రావడం సరికాదని నచ్చజెప్పావు. అన్న వెంట అడవులకు వెళ్తున్నాడని తెలిసి తల్లి సుమిత్ర లక్ష్మణుడితో ఇలా చెప్పిందట. "ఇకపై రాముడిలో నీ తండ్రిని చూసుకో, సీతలో నీ తల్లిని చూసుకో, అడవినే అయోధ్య అనుకో.. వెళ్లిరా" అని.
రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. కానీ.. నువ్వు ఏనాడూ కులం, మతం, మనుషుల్లో బేధాలు చూడలేదు తండ్రీ.. వేటగాడు, పడవ నడుపుకునే గుహుడిని గుండెలకు హత్తుకున్నావు. శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను తిన్నావు. హనుమంతుడిని అక్కున చేర్చుకున్నావు.. అందరి కన్నా ఎక్కువగా నమ్మావు. వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశావు.. తన భార్యని ఎత్తుకెళ్లి బాధ పెడుతున్న అన్న వాలి బారి నుంచి సుగ్రీవుడిని రక్షించావు. చెట్టు చాటు నుంచి వాలిపై బాణం వేసి సుగ్రీవుడి కష్టం పోగొట్టావు. దీనిపై ఎంతో మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒక రాజు అయి ఉండి.. పిరికివాడిలా చెట్టు చాటు నుంచి వాలిని చంపడం ఏంటని..? వాలి వానర జాతికి చెందినవాడు. వేటాడేటప్పుడు జంతువును చెట్టు చాటు నుంచే చంపాలి. ఇదే ఇక్కడ నా రామచంద్రుడు పాటించిన నియమం.
వనవాసంలో ఉండగా దారిలో వెళుతున్నప్పుడు ఓ వనదేవత ప్రత్యక్షమైందట. ఆ దేవత రాముడిని చూసి.. 'స్వామీ.. నేను మీకు ఏమైనా సాయం చేయగలనా?' అని అడిగిందట. దానికి రాముడు.. 'ఈ అడవిలో చాలా ముళ్లు ఉన్నాయి. అవి లేకుండా చూడగలరా' అని కోరాడట. దానికి ఆ దేవత.. 'మీరు ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా.. అక్కడ ముళ్లు తీసేస్తే లాభం ఏముంది? ఇక ముందు మీరు నడవబోయే దారిలో ముల్లులు లేకుండా చూస్తాను' అని చెప్పిందట. దానికి రాముడు..'లేదు.. నా వెనకాల ఏదో ఒకరోజు నా తమ్ముడు భరతుడు నా కోసం వస్తాడు. అతనికి ఈ ముల్లులు గుచ్చుకోకుండా చూడండి' అన్నాడట. అయితే.. 'మీ తమ్ముడు మరీ అంత బలహీనుడా?' అని దేవత అడిగేసరికి.. 'కాదు.. నా తమ్ముడు శక్తివంతుడే. కానీ ఈ ముల్లులు తమ్ముడికి గుచ్చుకుంటే నా అన్న కూడా ఇదే ముళ్ల దారిలో వెళ్లాడా అని నా గురించి కుమిలిపోతాడు. నా తమ్ముడు బాధ పడితే నేను తట్టుకోలేను' అని సమాధానం ఇచ్చావట. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీ అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ వేల తరాలకు ఆదర్శం.
రావణుడు సీతమ్మని అపహరించుకు పోయేటప్పుడు తన ఒంటి మీద నగలన్నీ తీసి విసిరేసిందని.. అవి హనుమంతుడికి దొరికాయని.. అవి తీసుకెళ్లి హనుమంతుడు రాముల వారికి చూపించి అవి సీతమ్మ నగలో కాదో గుర్తించాలని అడగడం మనకు తెలుసు కదా..! భార్య లేదన్న దుఃఖంతో ఉన్న రాముడు వాటిని చూడలేకపోయాడట. అప్పుడు లక్ష్మణుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడట. 'మెడలో ధరించే హారాలు నాకు తెలియదు, చేతికి వేసుకునే గాజులు మొదలైనవి కూడా నేను గుర్తు పట్టలేను. కానీ, కాళ్లకు ధరించే ఈ పట్టీలు మాత్రం నిజమే. ఎందుకంటే రోజూ నా సీతమ్మ తల్లి పాదాలకు మొక్కినప్పుడు వాటిని చూసేవాడిని' అని. ఎంత అద్భుతమైన సందర్భం కదా ఇది..!
హనుమంతుడు సీత జాడ వెతుక్కుంటూ ఎగిరి సముద్రం దాటి లంకను చేరి.. అక్కడ సీతమ్మను చూసి జరిగిందంతా చెప్పి, రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వడం తెలుసు కదా. తిరిగి రాముడి దగ్గరికి వచ్చి హనుమంతుడు ఆ సమాచారం చెప్పాలి. అప్పుడు రాముడితో హనుమంతుడు.. 'చూశాను సీతమ్మను' అన్నాడట. ఎవరైనా మామూలుగా 'సీతమ్మను చూశాను' అని పలుకుతారు. కానీ చూశాను అనే పదం ముందుగా వాడారు హనుమంతుడు అని వాల్మీకి రామాయణంలో చెప్పారు. దానికి కారణం.. అప్పటికే సీత గురించి ఏం వార్త తెస్తానో అని నా ప్రభువు రామచంద్రుడు ఎదురుచూస్తుంటాడు. అప్పుడు ముందుగా సీతమ్మ అనే పదం పలికితే ఆ తర్వాత క్షణంలో ఏం చెప్తానో అని నా రాముడు కంగారు పడకూడదు.. అందుకే ముందుగా చూశాను అని మొదలుపెడితే నా స్వామి కళ్లల్లో ఆనందం చూడొచ్చని హనుమంతుడి అభిప్రాయం అంట. అంటే తాను చెప్పే ఆ ఒక్క క్షణం కూడా రాముడి మనసు బాధ పడడం చూడలేడట హనుమంతుడు. ఇది కదా స్వామి భక్తి అంటే..!
రావణుడి తమ్ముడే అయినా విభీషణుడు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాడు. తన అన్న చేసింది పాపం అని నీ శరణు కోరాడు. రావణుడిని చంపి, లంకను అప్పగిస్తానని విభీషణుడికి మాట ఇచ్చావు. ఇది అక్కడే ఉన్న వానర సైన్యానికి, మిగతా వారికి నచ్చలేదట. 'అలా ఎలా ఒక శత్రువు తమ్ముడిని నమ్ముతారు? ఈ రోజు విభీషణుడు వచ్చాడు, మాట ఇచ్చారు. మరి రేపు ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తారు?' అని ప్రశ్నించారట. అప్పుడు నా రామభద్రుడు చెప్పిన అద్భుతమైన సమాధానం.. 'నిజంగా అదే గనక జరిగి క్షమించమని కోరితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా' అని. నీకంటూ ఏ స్వార్థం లేదు.. శత్రువు అని తెలిసి కూడా క్షమించే నీ గొప్ప గుణాన్ని ఏమని వర్ణించగలను రామా..?
శత్రువు.. భార్యని ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు అని తెలిసి.. ఇంకో అవకాశం ఇస్తామా? కానీ నా రాముడు ఇచ్చాడు... చేసిన తప్పు తెలుసుకోమని అన్నాడు. శత్రువుని చంపడమే అసలైన న్యాయం అని ఏ రోజూ అనుకోలేదు. శత్రువైనప్పటికీ ఏ రోజూ రావణుడిని నిందించలేదు.. తప్పుగా మాట్లాడలేదు. యుద్ధంలో రావణుడు ఆయుధాలు కోల్పోయి నిస్సహాయుడై ఉన్నప్పుడు 'నేడు పోయి రేపు రా..' అని అవకాశం ఇచ్చాడు. అది మనసు మార్చుకుని, తప్పు తెలుసుకుంటాడని రావణుడికి నువ్వు ఇచ్చిన అవకాశమే కదా రామయ్యా..! కానీ అది జరగలేదు.
లోక కళ్యాణం కోసం రావణుడిని వధించావు. ఎట్టకేలకు తన రామచంద్రుడి పాదాల దగ్గరకు చేరానని సంతోషపడిన సీతమ్మ తల్లితో ఇలా అన్నావట. 'ఒక రాజుగా నిన్ను రక్షించడం నా కర్తవ్యం. ఇప్పుడు నువ్వు స్వతంత్రురాలివి. నీకు ఇష్టం వచ్చినవాళ్లతో ఉండే హక్కు ఇప్పుడు నీకు ఉంది' అని. నీ కఠినమైన మాటలకు కుంగిపోయిన నా తల్లి అగ్నిప్రవేశం చేసి తనను తాను నిరూపించుకుంది. భార్యని అవమానించావనే నింద నీపై పడుతుందని తెలిసి కూడా ధర్మం వైపే నిలబడ్డావు స్వామీ.. ఏళ్లుగా ఒక మనిషి వేరే వాళ్ల దగ్గర ఉండి వచ్చిందంటే వాళ్ల మనసు మారి ఉండొచ్చు, మన మీద ఇష్టం పోయి ఉండొచ్చు. అందుకే నచ్చిందే చేయమని ఆ అవకాశం తనకే ఇచ్చావు.. నా భార్య నా మాటే వినాలనే పురుష అహంకారం అక్కడ చూపించలేదని ఎంత మందికి అర్థమై ఉండొచ్చు. అది తెలియకుండా కట్టుకున్న భార్యను తప్పు పట్టావని నిన్ను ఈ లోకం ఎందుకు నిందిస్తుంది తండ్రీ..?
సీత పరాయివాడి దగ్గర ఉండి వచ్చిందని, అలాంటి స్త్రీని రాముడు ఎలా ఏలుకుంటాడని.. ఎవడో ఏదో అన్నాడని, పోతే పోయిందని నువ్వు అంతఃపురంలో తలుపులు వేసుకుని కూర్చోలేదు. ప్రజల మాటలను గౌరవించి కట్టుబడ్డావు. నిందలు మోశావు.. గర్భవతి అయిన భార్యను తిరిగి అడవులకు పంపావు. అది అనుమానం కలిగి కాదు.. నిజం ఏంటో లోకానికి తెలిసేలా చేయడానికి. ఆ రోజు నువ్వు నిందలు పడి ఉండొచ్చు.. కానీ ఆ రోజు నువ్వు తీసుకున్న ఆ కఠిన నిర్ణయమే ఈ రోజుకీ సీతారాములు ఆదర్శ దంపతులని ప్రజలు అనుకునేలా చేసింది. అందుకే నువ్వు ఎప్పుడూ నా దృష్టిలో తప్పు చేయలేదు.. తప్పుగా ప్రవర్తించలేదు రామా.. ధర్మాన్ని నమ్మావు.. నీవు నమ్మిన ధర్మమే నిన్ను కాపాడి ఈ రోజుకీ అందరూ నువ్వు దేవుడివని నిన్ను మొక్కేలా చేసింది.
ఇది నాకు తెలిసిన నా రాముడు. నా రాముడు పితృవాక్య పరిపాలనా దక్షుడు.. నా రాముడు ఏకపత్నీ వ్రతుడు.. నా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు.. నా రాముడు సర్వ మానవ సౌభాతృత్వాన్ని సాధించి చూపించిన మహనీయ చక్రవర్తి.. వేల తరాల నుంచి మనిషి ఎలా బతకాలో లోకానికి చాటి చెప్పిన నా రామ సక్కని తండ్రి.
చదివినందుకు ధన్యవాదాలు.. మీలో ఎంత మందికి రాముడు అంటే ఇష్టమైన దేవుడు. నాతో కామెంట్ ద్వారా తెలపండి. నా ఆర్టికల్ నచ్చితే లైక్ చేయగలరు.. షేర్ చేయగలరు.
THANK YOU
PC: CH. VAMSHI MOHAN
Superb writing
రిప్లయితొలగించండిThank you so much
తొలగించండిJai Sri ram
రిప్లయితొలగించండిJai sriram
తొలగించండిజై శ్రీ రామ్ అనే ఒక మాట ✍️ ప్రపంచం అంత ఎంత ఆనందాని ఇస్తుందో కథ 🙌🙌
రిప్లయితొలగించండిThanks.. Jai Sri ram
తొలగించండిజై శ్రీరామ్
రిప్లయితొలగించండిశ్రీరాముని అన్న ఎంత చక్కగా వివరించారు చాలా బాగా చెప్పారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి