'సిరివెన్నెల' గారికి..

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారూ..!

స్వర్గంలో ఉన్న సరస్వతీ పుత్రులైన మీకు కోట్లాది అభిమానుల్లో ఒకడినైన నేను ఇలా రాస్తానని ఏ రోజూ అనుకోలేదు. మీరు రాసిన రాతలు చక్కని సంగీతంతో మమేకమై పాట రూపంలో వచ్చినప్పుడు అవి విని బాగుందే అనుకోవడం తప్ప.. అందులో ఉన్న అసలు అర్థం.. ఆ పదం పెట్టడానికి మీరు చేసే ఆలోచన.. ఆ వాక్యం అలా అందంగా తీర్చిదిద్దడానికి మీరు పడే తపన.. మొత్తంగా ఆ పాట అలా తరతరాలుగా నిలిచిపోయేలా రాయడానికి మీరు పడే ప్రసవ వేదన నాలాంటి అల్పజ్ఞానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ వస్తుంది. రాత్రి ఉదయించే సూర్యుడు మీరు.. రాత్రిపూట మాత్రమే పాటలు రాసేవారని విన్నాను. ఆ చీకటిని చీల్చుకుంటూ మీ కలంతో రాసే ఒక్కో అక్షరం రేపటి ఉదయానికి వెలుగును చూపిస్తుంది.. మమ్మల్ని మేల్కొలుపుతుంది. సినిమా పాటల విషయానికొస్తే 'సిరివెన్నెల' నుంచి మొదలైన మీ కలం ప్రయాణం.. నిన్నటి 'రంగమార్తాండ', 'సీతారామం' వరకు ఆగకుండా సాగింది.'సిరివెన్నెల' గారికి..అప్పుడెప్పుడో 'సిరివెన్నెల' సినిమా చూస్తూ మీరు రాసిన 'మెరిసే తారలదే రూపం..' పాట వింటున్నా. అందులో 'ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?' అన్న ఒక్క లైన్ వినగానే ఎందుకో ఆగిపోయాను. ఆ మాట వెనక ఎంత గొప్ప అర్థం దాగి ఉందో.. దాన్ని అలా అంత తేలికగా మీరు ఎలా రాయగలిగారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. 'విధాత తలపున..'లో రాసిన పదాల అర్థం తెలుసుకోవడానికి మాకు తెలుగు డిక్షనరీ ఖచ్చితంగా అవసరమే. ఇక 'ఆదిభిక్షువు వాడినేమి కోరేది.. బూడిదిచ్చేవాడినేది అడిగేది' గురించి ఏమని చెప్పను? కష్టమొస్తే నువ్వే కాపాడు అని ఆ శివయ్యని మొక్కుతాం.. కానీ, ఆ దేవుడినే నిందిస్తూ అలాంటి వాడినేది కోరేది అని రాయడం వెనక మీ ధైర్యం ఎంతని చెప్పగలం?'సిరివెన్నెల' గారికి..'రుద్రవీణ'లో 'చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది' అంటూ సమస్యలకు ఎదురెళ్లమని వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపిన మీ పదాలు మాకు ఒక ఆదర్శ పాఠం. 'ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం.. మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం.. కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది.. దు:ఖానికి తలవంచితే తెలివికింక విలువేది'.. ఈ మాటలకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం.'సిరివెన్నెల' గారికి..'శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా..' అని 'స్వర్ణకమలం'లో ఓ పాట రాశారు. మువ్వలు చివురించడం ఏంటండీ శాస్త్రి గారూ..! ఎక్కడైనా అలా ఉంటుందా? 'అందెల రవమిది పదములాదా.. అంబరమంటిన హృదయముదా' పాటను సన్నివేశానికి తగినట్లుగా ఎంత గొప్పగా వర్ణించారో చెప్పేంత అర్హత అయినా నాకు ఉందా? ఆ పాటలో నృత్యం చేస్తున్న హీరోయిన్ ఎద లోతుల్లో నుంచి ఉప్పొంగిన భావనకు మీరు మీ పదాలతో సజీవ రూపం ఇచ్చారు. ఆ మాటల వెనక దాగి ఉన్న అసలైన అర్థం తెలుసుకునేంత మేధావిని కాదండీ నేను.. అది కూడా మీరు వివరించాకే ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నా.. ఇందులో ఇంత అర్థం ఉందా అని మిమ్మల్ని మనసులోనే మొక్కుకున్నా.'సిరివెన్నెల' గారికి..'సింధూరం' చూశాక ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని ఎంత మెచ్చుకున్నా, చివరలో వచ్చే ఆ ఒక్క మాటకు ఆలోచనలో పడక తప్పదు. స్వాతంత్య్రం వచ్చి చాలా ఏళ్లయిపోయింది, స్వేచ్ఛగా బతికేస్తున్నామని అనుకున్నా.. మనిషి ఇప్పటికీ లోలోపల పడుతున్న సంఘర్షణకు అద్దం పడుతూ.. 'అర్ద శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా..' అని ప్రశ్నించి మరోసారి మమ్మల్ని మీరు ఆలోచనలో పడేశారు. 'కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం.. చితి మంటల సింధూరం.. చూస్తూ ఇంక నిదురిస్తావా విశాల భారతమా.. ఓ విషాద భారతమా..' అని పడుకున్న ప్రపంచాన్ని మీ పాటతో నిద్ర లేపే ఉద్యమ స్ఫూర్తి మీరు.'సిరివెన్నెల' గారికి..'ఎవరు రాయగలరూ..' అని అమ్మ గురించి మీరు తప్ప ఇంకెవరు రాయగలరు? సృష్టికే మూలమైన అమ్మ మన కోసం ఎంతటి త్యాగాలు చేస్తే ఇంతటివాళ్లం అవుతామనేది మీరు మరో అమ్మలాగా అనుభవించి రాశారు. 'నూరేళ్లు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో.. నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో..' మీరు రాసిన ఈ పదాలు ఈ నేలపై అమ్మ కడుపున పుట్టిన ప్రతి ఒక్కరి విషయంలో అక్షర సత్యం కదా..! 'గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం.. అందె కట్టి ఆడుతుందే ఈ తల్లి ప్రాణం' అని 'ఊయల' సినిమాలో ఓ అమ్మ తన బిడ్డను మురిపెంగా చూసుకుంటూ పాడుతుంది. ఒక ఆడది తల్లయ్యాక పొందే ఆనందం.. ఆ కన్నపేగు పిచ్చి ప్రేమను ఎంత అనుభవిస్తే తప్ప మీరు అంత అద్భుతంగా రాశారో కదా. 'సిరివెన్నెల' గారికి..సినిమాలో పబ్ సాంగ్‌కి జీవితసత్యాన్ని జోడించి ఎవరైనా పాట రాయగలరా? కానీ, మీరు రాస్తారు శాస్త్రి గారు. 'సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని..' అని మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా అని పాట వింటున్న ప్రతి ఒక్కరికీ ఉత్సాహం అందించి ప్రోత్సహిస్తారు. మరోవైపు 'జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..' పాటతో ఒంటరిని అని చెప్తూనే ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అని జీవితానికి సరిపడా ధైర్యాన్ని నూరిపోస్తారు.'సిరివెన్నెల' గారికి..ప్రేమలో మునిగితేలుతున్న ఇద్దరు ప్రేమికులు త్వరలోనే ఒక్కటవ్వాలి అనుకున్నప్పుడు ఆ పెళ్లి తంతును ఊహిస్తూ పాడితే ఎలా ఉంటుందో తెలుసా శాస్త్రి గారు..! మీరు 'సీతారామం' కోసం అనుభవించి రాసినంత అందంగా ఉంటుంది. ఆ పదాలతోనే పెళ్లి పందిరి కట్టేస్తారు మీరు. దానికి అసలైన అక్షర రూపం ఇదిగో ఇలాగే ఉంటుంది.. "చుట్టూ ఎవరూ ఉండరుగా?.. కిట్టని చూపులుగా, చుట్టాలంటూ కొందరుండాలిగా?.. దిక్కులు ఉన్నవిగా,  గట్టి మేళమంటూ ఉండదా?.. గుండెలోని సందడి చాలదా?, పెళ్లి పెద్దలెవరు మనకి?.. మనసులే కదా".. ఆహా ఎలా వర్ణించగలం.. మీ తెలుగులోని తియ్యదనాన్ని..?'సిరివెన్నెల' గారికి..ఇలా చెప్పుకుంటూ పోతే మీరు రాసిన ప్రతి పదమూ అద్భుతమే.. ప్రతి వాక్యమూ అద్భుతమే.. ప్రతి పాటా అద్భుతమే. ఇన్నేళ్లుగా మీరు ఓ ఋషిలా చేసిన పాటల తపస్సును ఆస్వాదించి.. అనుభవించి.. అర్థం చేసుకుని విని తరిస్తున్న అల్పజ్ఞానిని నేను. మీరు ప్రాణం పెట్టి రాసిన ప్రతి పాట నా లాంటి ఎంతో మంది అభిమానులకు ఆరోప్రాణం. మీ పాటతో పసిపాపకు జోల పాడొచ్చు.. మీ పాటతో ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచొచ్చు.. మీ పాటతో కన్నీరు పెట్టొచ్చు.. మీ పాటతో సాధించాలనే ప్రేరణ పొందొచ్చు.. మీ పాటతో దేవుడిని సైతం నిలదీయొచ్చు.. మీ పాటతో జీవిత సత్యం తెలుసుకోవచ్చు.. మొత్తంగా మీ పాటతో ఒక జీవితకాలం బతికేయొచ్చు.

మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. 🙏'సిరివెన్నెల' గారికి..


THANK YOU

PC: CH. VAMSI MOHAN


కామెంట్‌లు