నా 'తిరుమల' ప్రయాణం


తిరుమల.. 
కలియుగ వైకుంఠం. సాక్షాత్తూ ఆ వేంకటేశుడే ఏడుకొండలపై వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఎన్ని సార్లు చూసినా.. ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరని అద్భుతం. నాలాగే చాలా మందికి తిరుమలతో ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఉండే ఉంటుంది. అందుకే ఇక్కడ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. ఇది చదివి మీ అనుభవాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఏవైనా ఉంటే చెప్పగలరు.
నా 'తిరుమల' ప్రయాణం
ఎప్పుడూ వెళ్తున్న మాదిరిగానే ఈ సారి వైకుంఠ ఏకాదశికి ఆ స్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ, కొన్ని కారణాల వల్ల సమయం సరిపోక ముందుగా అందుకు కావాల్సిన అన్ని ప్లాన్స్ చేసుకోలేకపోయా. ఎంత పని ఒత్తిడి, హడావిడిలో ఉన్నా సరే.. ఈ సారి వెళ్లాలని మాత్రం గట్టిగా అనిపించింది. చూస్తుండగానే వెళ్లాల్సిన తేదీ దగ్గర పడుతోంది. కానీ టికెట్ బుకింగ్, కావాల్సిన బట్టలు సర్దుకోవడం.. ఇలాంటి పనులన్నీ ముందుగా చేసుకోకపోవడంతో ఒకానొక సమయంలో ఈ సారి వెళ్లడం అసలు కుదురుతుందా అనే అనుమానం కూడా వచ్చింది. అయినా సరే ఏది ఏమైనా వెళ్లి తీరాల్సిందే. ఇదే నా మనసులో ఇంకా ఉండిపోయింది.
నా 'తిరుమల' ప్రయాణం
నా కోరికని ఆ శ్రీహరి విన్నాడో ఏమో.. నా సంకల్పం బలపడిందో ఏమో.. వెళ్లాల్సిన రోజుకి ఒకరోజు ముందే బస్సు టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. దర్శనం టికెట్ల గురించే ఇప్పుడు బెంగ అంతా..! వైకుంఠ ఏకాదశి కదా.. ముందుగానే ఇవన్నీ చూసుకోవాలి.. అక్కడ వరకు వెళ్లినా  దర్శనం దొరకడం కష్టమే.. చాలా మంది భక్తులు వస్తారు.. ఆ జనంలో వైకుంఠ ద్వార దర్శనం ఇక అయినట్లే.. ఎక్కడ విన్నా ఇవే మాటలు, ఎక్కడ చూసినా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలే. వైకుంఠ దర్శనం కాకపోయినా సరే.. ఇలాంటి ఉత్సవాల సమయంలో కనీసం స్వామి దర్శనం అయితే చాలు అని సరిపెట్టుకుని సిద్ధమయ్యాను. అనుకున్న సమయాని కన్నా బస్సు లేటుగానే వచ్చి ఇబ్బంది పెట్టినా.. ఉదయం 9-10 మధ్యలో తిరుపతిలో దిగాను.
నా 'తిరుమల' ప్రయాణం
వెళ్లడం వెళ్లడమే విష్ణు నివాసం కాంప్లెక్స్ చేరుకొని.. అక్కడ దర్శనం టిక్కెట్ల కోసం లైన్లో ఉన్నాను. కానీ, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అప్పటికి 4 రోజుల తర్వాత రోజుకి ఇస్తున్నారని తెలుసుకుని, అప్పటివరకు ఇక్కడే ఉండలేమని వద్దనుకున్నాం. ఇక ముందుగా అనుకున్నట్లు అదృష్టం ఉంటే సర్వదర్శనంలో వెళ్లి స్వామిని దర్శించుకోవడమే మిగిలింది. ఇక తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకోవాలి. మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని మొదట అనుకున్నా.. ఆ రోజు పరిస్థితి, టిక్కెట్లు దొరక్కపోవడం, దర్శనం ఇవన్నీ గుర్తొచ్చి ఎంత వీలైతే అంత త్వరగా కొండపైకి వెళ్లిపోతే మంచిదని అనిపించింది. దాంతో మెట్ల ద్వారా కాదు.. బస్సు ఎక్కేయాలని నిర్ణయించుకున్నా. అయితే.. ఈ సందర్భంలో మనం మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కే అనుభూతిని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే.
నా 'తిరుమల' ప్రయాణం
నేను ఇదివరకు మూడు సార్లు మెట్ల మార్గం గుండా వెళ్లి, వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాను. మొదటిసారి అలిపిరి మార్గంలో వెళ్లినప్పుడు మాత్రం కలిగిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు మా ఫ్రెండ్స్‌తో పాటు వెళ్లిన నాకు.. ఆ నడక ప్రయాణం చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. గోవింద నామాలు స్మరిస్తూ.. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పొదలు.. అక్కడ స్తంభాలపై, గోడలపై రాసి ఉండే హరి నామాలను పఠిస్తూ.. ఆహా ఎంత చక్కని ఫీలింగ్ కదా అది..! అలిపిరి ప్రాంతంలో భక్తులకు నమస్కరిస్తూ నా స్వామి కొండకి స్వాగతం అన్నట్లుగా నిలబడిన ఎత్తైన గరుడ విగ్రహం ముందుగా మనల్ని ఆకర్షిస్తుంది. పాదాల మండపం నుండి మొదలయ్యే ఈ ప్రయాణం వెళ్లే ప్రతి భక్తుడికి కొత్త ఉత్సాహం ఇస్తుంది. శ్రీవారు కొండపైకి వెళ్లేటప్పుడు మొదటి అడుగు ఇక్కడే  పెట్టారని చరిత్ర చెబుతుంది. సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే నడిచి వెళ్లిన మార్గంలో వెళ్లడం మన అదృష్టమని భక్తులు నమ్ముతారు. ఈ మార్గంలో తలయేరుగుండు, గాలి గోపురం, కురువ మండపం, యోగ నరసింహస్వామి, నామాల గవి, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి 30 అడుగుల విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.
నా 'తిరుమల' ప్రయాణం
అన్నిటి కన్నా ముఖ్యంగా నన్ను ఈ మార్గంలో ఆకర్షించినవి స్వామివారి దశావతారాల విగ్రహాలు. దాదాపు ప్రతి 200 మెట్ల దూరంలో ఒకటి చొప్పున ఒక్కో అవతారానికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తుంటాయి. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ కోసం భగవంతుడు ఎత్తిన ఒక్కో అవతారానికి సంబంధించిన విగ్రహాలు మనోహరంగా చెక్కబడి తిరుమల కొండల్లో మనల్ని ఆశీర్వదిస్తాయి. మెట్లు ఎక్కుతూ అలిసిపోతుంటే, మధ్యమధ్యలో దాహం తీర్చుకుంటూ, గోవింద నామాలను స్మరిస్తూ.. ఆ తిరుమల ప్రకృతిలో కనిపించే ప్రతి పొదలో, ప్రతి సెలయేటిలో, ప్రతి చెట్టులో, ప్రతి పువ్వులో, ప్రతి రాయిలో ఆ నారాయణుడే ఉన్నాడని భావిస్తూ.. ముందుకు కదలడం ఎంత అదృష్టం. ఇలాంటి అనుభవాలు మీలో చాలా మందికి ఉండే ఉంటాయి కదూ..!
నా 'తిరుమల' ప్రయాణం
ఇక, కొండపైకి బస్సులో వెళ్లిపోదామని నిర్ణయించుకున్న నాకు.. కాస్త సమయం దొరకడంతో ఈలోపు కొండ కింద కొలువై ఉన్న గోవిందరాజ స్వాములవారిని దర్శించుకుందామని అనిపించింది. అయితే.. ఈ సందర్భంలో నేను ఎక్కడో విన్న ఒక సంఘటన గురించి మీతో పంచుకుంటా. మీలో చాలా మంది 'దశావతారం' సినిమా చూసే ఉంటారు కదా. సినిమా మొదట్లో వైష్ణవ భక్తుడైన కమల్ హాసన్ గారి పాత్రను శివ భక్తుడైన ఆ దేశాన్ని పాలించే ఓ రాజు చిత్రహింసలు పెట్టడం మనం చూస్తాం. వైష్ణవ మతాన్ని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో శేషతల్పంపై నిద్రిస్తున్న చిదంబరంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా తాళ్లతో బంధించి సముద్రంలో పారవేయిస్తాడు కదా. అప్పుడు అలా పారవేసిన విగ్రహాన్ని అక్కడి కొందరు భక్తులు రహస్యంగా తిరుపతి వరకు తరలించారట. ఆ సమయంలో తిరుపతిలోనే ఉన్న రామానుజ స్వాములవారు ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాలని అనుకున్నారు. కానీ, సముద్రంలో పారవేయడంతో విగ్రహంలో కొంత భాగం విరిగినట్లు ఉండడంతో అది పూజకు వాడకూడదని.. అప్పటికప్పుడు సున్నపురాయితో మరో విగ్రహాన్ని చేయించారట. అలా చేయించిన విగ్రహమే ప్రస్తుతం మనం తిరుపతిలో దర్శిస్తున్న గోవిందరాజ స్వామివారిది. సున్నపురాయితో చేసిన విగ్రహం కావడంతో కరిగిపోతుందని.. గోవిందరాజ స్వామి ఆలయంలో ఉన్న ఆ విగ్రహానికి అభిషేకాలు చేయరు. మరి అయితే.. చిదంబరం నుంచి తరలించిన అసలైన విగ్రహం ఎక్కడ ఉంది? అది కూడా తిరుపతిలోనే మంచినీళ్ల గుంట అనే ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. ఆ స్వామికి సంబంధించిన ఫోటో కింద ఇస్తున్నాను చూడండి.
నా 'తిరుమల' ప్రయాణం
ఇక మధ్యాహ్న సమయానికి కొండపైకి వెళ్లేందుకు బస్సు ఎక్కాను. అలిపిరి ప్రాంతం దాటి, బస్సు ఒక్కో కొండ ఎక్కుతూ పైకి వెళ్తుంటే.. బస్సులో ఉన్న నేను కిటికీలో నుంచి ఆ తిరుమల గిరులను చూస్తూ ఆనందిస్తున్నా. నిజంగా ఆ కొండపై ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు ఆ శ్రీనివాసుడి రూపాలేనా అన్నంత అద్భుతంగా అనిపిస్తుంది ఆ ప్రాంతం. ఒక్కో కొండకి ఒక్కో పేరు.. ఆ ఏడుకొండల వాడికి ఎన్నో పేర్లు.. ఆ ప్రకృతి అందాలను చూస్తూ.. ఒక్కో కొండ ఎక్కుతూ పైకి చేరుతున్నప్పుడు మన మనసులో ఆ స్వామి తప్ప వేరే ధ్యాస ఉండదంటే నమ్మండి. ప్రకృతినే తన ఇంటిగా చేసుకున్న ఆ తండ్రి ఒడికి చేరుతున్న బిడ్డల్లా మనకు అది అనుభవిస్తే తప్ప అర్థం కాని భావన.
నా 'తిరుమల' ప్రయాణం
కొండపైకి చేరుకున్నాను. తెల్లవారితే వైకుంఠ ఏకాదశి.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజుకి దర్శనాలు నిలిపివేస్తున్నామని మైక్‌లో అనౌన్సుమెంట్. అదేంటీ.. ఈ రోజు మొత్తం దర్శనాలే ఉండవా? అది వినగానే కొంచెం నిరుత్సాహ పడిపోయా. అయినా సరే.. ఎలాగో వచ్చేశా కదా. అలా ఆలయ పరిసరాల్లో కాసేపు గడిపి తిరిగి వెళ్లిపోదాంలే అనుకున్నా. ముందుగా స్వామివారి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణికి వెళ్లి అక్కడ స్నానం చేశా. తర్వాత ఆనవాయితీ ప్రకారం.. ముందుగా వరాహ స్వామివారి దర్శనం చేసుకోవాలన్నది మనకు తెలిసిన సంగతే కదా. కొంచెం రద్దీగా ఉన్నా కూడా.. కాసేపు ఓపికతో లైన్లో వెళ్లి లక్ష్మీ సమేత వరాహ స్వామివారి దర్శనం చేసుకున్నా. గుడి బయటికి వచ్చి తిరుమల మాఢ వీధుల్లో అటుఇటుగా తిరుగుతూ.. ఎందుకైనా మంచిది ఇంకోసారి దర్శనం టిక్కెట్ల కోసం ప్రయత్నిద్దామని అనిపించింది. ఎక్కడో ఏదో ఆశ.. స్వామివారి దర్శనం లేకుండా ఎలా తిరిగి వెళ్లేది? అవకాశం ఉంటే బాగుండు అనే చిన్న కోరిక మనసులో నుంచి పోవట్లేదు. అందుకే ఇంకోసారి ప్రయత్నిద్దామని అటువైపు నడిచా.
నా 'తిరుమల' ప్రయాణం
అప్పటికే మైక్‌లో అనౌన్స్ చేసేశారు.. ఎలాగో ఉండదు అని తెలుసు.. అయినా మనసు మాట వినట్లేదు. అలా నడుస్తూ వెళ్తుంటే.. ఎదురుగా ఉన్న సెక్యూరిటీ వాళ్లు 'బాబూ.. దర్శనం కోసమా? తొందరగా వెళ్లండి.. మళ్లీ క్లోజ్ చేస్తారు' అని పిలుపు. ఇదేంటీ... ఇదేనా విష్ణు మాయ. దర్శనం లేదనుకుని నిరుత్సాహ పడిన నాకు.. ఇలా ఎదురొచ్చి అడగడం ఏంటి? ఏదైతే ఏంటి? స్వామి దర్శనం ఉంది.. అది చాలు.. ఇంకేం ఆలోచించలేదు. మా చుట్టూ ఉన్నవారితో పాటు మేము కూడా పరుగులు పెట్టాము. త్వరత్వరగా తెచ్చుకున్న బ్యాగులు, సెల్ ఫోన్లు అక్కడ కౌంటర్లలో అప్పగించడం కూడా జరిగిపోయింది. ఉచిత దర్శనం కోసం ఇచ్చే టికెట్ తీసుకుని.. మళ్లీ భక్తులతో పాటు లైన్లో చేరాం. కావాలనుకున్నది జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో కానీ.. జరగదు అనుకున్నది మాత్రం అనుకోకుండా జరిగితే ఆ ఆనందమే వేరు. ఆ రోజు స్వామివారే స్వయంగా నన్ను తన దగ్గరికి పిలుచుకున్నట్లు అనిపించింది. ఇక ఆలస్యం చేయలేదు. ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఒక్క దగ్గర మాత్రం కంపార్టుమెంట్లలో ఉంచి ఓ గంటపాటు వేచి ఉండేలా చేశారు. ఆ సమయంలో అక్కడ భక్తుల కోసం టీటీడీ వారు అందించే సాంబార్ అన్నం, ఉప్మా, పాలు లాంటివి మీకు కూడా మధుర జ్ఞాపకమే అనుకుంటా.
నా 'తిరుమల' ప్రయాణం
కంపార్టుమెంట్లు తెరిచారు. భక్తులు ఎక్కడ లేని ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు. తెల్లవారితే వైకుంఠ ఏకాదశి.. ఆ లోపే భక్తుల దర్శనాలన్నీ ముగించేసి స్వామివారి పవళింపు సేవకు అవకాశం ఉండాలనేది ఆలయ అధికారుల ఆలోచన అయి ఉండొచ్చు. ఇక ఎక్కడా ఆపకుండా భక్తులను వెంటవెంటనే పంపించేస్తున్నారు. ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆలయ పరిసరాలన్నీ దీప కాంతులతో, పూల మాలలతో అందంగా అలంకరించారు. ఎక్కడ చూసినా పచ్చని తోరణాలు, అక్కడక్కడా అందంగా అమర్చిన పూలు, కళ్లు జిగేలుమనేలా దీపాల వెలుగులు.. మొత్తంగా చూస్తుంటే ఆ స్వర్గమే భూమిపైకి వచ్చిందా అన్నంత అద్భుతంగా ఉంది తిరుమల.
నా 'తిరుమల' ప్రయాణం
ఆలయ ప్రధాన ద్వారం నుంచి అడుగు లోపల పెట్టగానే మనసుకు, శరీరానికి మరింత ఉత్సాహం వచ్చేసింది. ఉత్సాహం అనే కన్నా భావోద్వేగం అంటే మరింత బాగుంటుందేమో..! ఇంకొద్దిసేపట్లోనే ఆ మూల విరాట్టుని కళ్లారా చూడబోతున్నాను. ఇదేం మొదటిసారి కాదు.. అయినా నా మనసు ఎందుకు ఇలా పరిగెడుతుంది? ఒక్క తిరుమలలోనే ఆ మహత్యం ఉందేమో..! ఆ స్వామివారిలోనే ఏదో ఆకర్షణ ఉందేమో..! ఎన్నో మెట్లు ఎక్కి, కష్టపడి, ఆయాసపడి, అలిసిపోయి కొండకి చేరి.. మళ్లీ లైన్లలో, కంపార్టుమెంట్లలో భక్తుల మధ్య ఇరుక్కుని.. ఒక్కోసారి ఇదంతా జరగడానికి ఒకరోజు కూడా పట్టొచ్చు. అయినా అప్పటిదాకా పడ్డ కష్టం.. ఆ స్వామిని దర్శించే ఆ 5 సెకన్ల ముందు దిగదుడుపే. దొరికే ఆ కొంత సమయం కోసం ఎంత కష్టాన్ని భరించి అయినా వస్తాం. అప్పటిదాకా పడిన బాధని తన దివ్యరూప సందర్శనంతో మాయమయ్యేలా చేస్తాడు ఆ స్వామి.
నా 'తిరుమల' ప్రయాణం
గోవిందా.. గోవిందా అంటున్న భక్తుల మధ్య ఆనంద నిలయంలోకి నేనూ ప్రవేశించాను.. ఇక ఇంకా కొన్ని సెకన్లే.. ఈ ప్రపంచంలో ఏది కూడా ఇంత సంతోషాన్ని ఇవ్వదేమో. స్వామివారి ఆనంద నిలయంలో మనం గడిపే ఆ కాసేపు సమయం మన జీవితంలో అత్యంత విలువైన క్షణాలని నా అభిప్రాయం. ఆ సమయంలో మనకు ఏదీ గుర్తుండదు.. మన జీవితం, కష్టాలు, బాధలు ఏవి కూడా ఆలోచనకు రావు. దృష్టంతా స్వామివారి గర్భగుడి ద్వారం వైపే ఉంటుంది. కళ్లు పెద్దవి చేసి ఆ మూర్తిని దర్శించే కాసేపు సమయం వచ్చేసింది. అదిగో.. దేవదేవుడు నా ఎదురుగా.... గోవింద నామ స్మరణతో చుట్టూ మార్మోగిపోతుంటే... నేను కూడా గోవిందా గోవిందా అని జపిస్తుంటే, రా నాయనా అన్నట్లు నా స్వామి నన్ను పిలుస్తున్నట్లే ఉంది. చుట్టూ దీపపు వెలుగుల్లో నిండైన ఆభరణాలు, పూల మాలలతో ఆ నారాయణుడి నిలువెత్తు రూపం దర్శనమిచ్చింది. ఆయన కోసమే వెలుగుతున్నాయేమో అన్నంత కాంతితో ఆ జ్యోతులు.. ఆయన సేవ కోసమే పూచాయేమో అనేలా ఆ పూలు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. నీ కన్నా మేము స్వామికి మరింత దగ్గరలో ఉన్నామని అవి వయ్యారాలు పోతూ, మురిసిపోతూ చెబుతున్నట్లుగా కనిపించింది. ఇంకాస్త సమయం ఉంటే బాగుండు అని అనిపించినా.. అదే మహాభాగ్యం అనుకున్న నాలోని భక్తుడు కోవెల నుంచి బయటికి వచ్చాడు. ఆ స్వామిని దర్శించిన తన్మయత్వం ఇంకా మనసులోనే ఉంది. అదే ఆనందంలో ఆలయం ఎదురుగా కూర్చుని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తింటూ.. మళ్లీ ఎప్పుడు నీ దర్శన భాగ్యం ఇప్పిస్తావో అని వేడుకున్నాను.


గోవిందా..!! గోవిందా..!!!
నా 'తిరుమల' ప్రయాణం

ఇలాంటి అద్భుతమైన అనుభూతులు మీకూ ఉన్నాయా?.. అయితే కింద కామెంట్ చేయండి. నా ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేయండి ప్లీజ్..
Thank you 


కామెంట్‌లు

  1. Super anna...🙏🏻 nenu Tirumala 7 months back vellanu...kani ni TIRUMALA PRAYANAM chadivite ninna ne vellina feeling kalugutundi

    రిప్లయితొలగించండి
  2. బావుంది... స్వామికి నీకంటే దగ్గరగా వున్నామని వయ్యారాలు పోతున్న పూలు.. మాటలు కూర్పు.. నేరేషన్ అన్ని అద్భుతంగా ఉన్నాయి సోదరా.. గోవిందా... గోవింద🙏🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి