మనం ఎన్నో సినిమాలు చూస్తాం.. కానీ, అందులో కొన్నే మనకు నచ్చుతాయి.. కొన్ని మళ్లీ మళ్లీ ఇష్టంతో చూస్తాం.. కొన్నిటిని చూసి కనెక్ట్ అయ్యి ఏడ్చేస్తాం కూడా. అలాంటి ఒక సినిమా పిచ్చోడినే నేను కూడా. ఇదంతా పక్కన పెడితే.. సినిమా మొత్తం ఎంత బాగున్నా క్లైమాక్స్ సరిగా ఉండకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అలా తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప క్లైమాక్స్ ఏది అని నన్ను అడిగితే.. నేను 'అన్నమయ్య' పేరు చెబుతా.
పద కవితా పితామహుడు, తెలుగు పాటకు పట్టం కట్టిన మహానుభావుడు అన్నమయ్య జీవిత చరిత్రను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అన్నమయ్య పాత్రలో నాగార్జున గారు అంతే అద్భుతంగా నటించారు.. కాదు, జీవించారు. ఈ తరానికి అన్నమయ్య అంటే అతనే గుర్తొచ్చేలా పాత్రలో ఒదిగిపోయారు. అయితే.. ఈ సినిమా క్లైమాక్స్ నన్ను విపరీతంగా కట్టిపడేసింది. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి ఎందుకో నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. అసలు ఒక భక్తుడికి, భగవంతుడికి మధ్య కన్వర్జేషన్ పెట్టడమే ఈ సీన్ హైలెట్ అని చెప్పొచ్చు.
తాను రాసిన 32 వేల సంకీర్తనలను ఆ వేంకటేశుడికి సమర్పించి ఇక తన జీవితాన్ని ముగిద్దామని బయల్దేరతాడు అన్నమయ్య. ఒంట్లో సత్తువ లేక తడబడుతూ నడుస్తున్న అన్నమయ్య చేతిలోని కర్రతో పాటు సంకీర్తనల తాళపత్రం ఒకటి కింద పడిపోతుంది. కర్రను అలాగే వదిలేసి, తాళపత్రాన్ని మాత్రం తిరిగి తీసుకుని ముందుకు కదిలిన అన్నమయ్య కాస్త తూలగానే.. సాక్షాత్తూ ఆ ఏడుకొండల వాడే ప్రత్యక్షమై అన్నమయ్యను తన గుండెల మీదికి చేర్చుకుంటాడు.ఆహా.. ఎంతటి అదృష్టం కదూ..!
భగవంతుడిని చూసిన తన్మయత్వంలో 'ఈ సాక్షాత్కారం కల కాదు కదా.. కల్పన కాదు కదా?' అని అన్నమయ్య అడుగుతుంటే.. చిద్విలాసులుడై ఒంటి నిండా బంగారు ఆభరణాలతో, భుజాలపై శంఖుచక్రాలు ధరించిన స్వామివారి సుందర రూపం ముచ్చటగా మనకు దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఈ పాత్రలో సుమన్ గారు ఎంత ముద్దుగా ఉంటారో కదా..! ఆపాద మస్తకం ఆ రూపం దైవత్వం ఉట్టిపడేలా ఉంటుంది. దానికి తోడు బాలు గారి వాయిస్. ఆహా.. దేవతలు నిజంగా ఇలాగే మాట్లాడతారేమో అన్నంత అందంగా ఉంటుంది ఆ మధుర కంఠం.
నీ పాటలు వింటూ ఎంత పులకరించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను అంటూ స్వామివారే స్వయంగా 'జో అచ్యుతానంద..' అని పాడడం మొదలెట్టగానే వెనక భాగంలో కనిపించీ కనిపించకుండా పరవశుడై చూస్తున్న అన్నమయ్య ఉండే ఆ షాట్ అద్భుతంగా ఉంటుంది. అలా ఆ దేవదేవుడే పాడి వినిపిస్తుంటే అన్నమయ్యతో పాటు మనమూ మైమరిచిపోతాం. ఆ కీర్తనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని శ్రీనివాసుడు గోముగా అడుగుతుంటే.. ఆనందంతో కళ్ల నీళ్లు పెట్టుకుంటూ అటువైపు తిరిగే నాగార్జున గారి ఎక్స్‌ప్రెషన్ ఒక్కసారి చూడండి.. మీ మనసు కరగకుండా ఉంటే నాకు చెప్పండి..!
నువ్వు వెళ్లిపోతే అలా ఎవరు పాడుతారు?.. ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా?.. అని లోకాలను ఆడించే ఆ భగవంతుడే అన్నమయ్య ముందు పసి పిల్లాడై మారాం చేస్తాడు. పట్టలేని అలిసిపోయేంత ఆనందంతో ఉన్న అన్నమయ్య.. ఇది కదా జీవితానికి సౌభాగ్యం అంటుంటే, చూస్తున్న ప్రేక్షకుడి కదలకుండా ఎలా ఉండగలదు? దేవుడు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం.. ఈ సీన్ ఎప్పుడు చూసినా నన్ను ఉద్వేగానికి లోను చేస్తుంది. 'అంతర్యామి.. అలసితి సొలసితి' అంటూ చేతులు చాచి అన్నమయ్య ఆ దేవుడిలో ఐక్యం కావడం నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. తనివి తీరా చూశాక మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలను.. ఎన్ని సినిమాలు వచ్చినా టాలీవుడ్ చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయే ఓ అద్భుత కళాఖండం 'అన్నమయ్య'.
THANK YOU
PC: CH. VAMSHI MOHAN
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి