పోస్ట్ లెటర్‌ మాట్లాడితే..!

రేయ్.. ఎలా ఉన్నావురా?.. ఏంట్రా ఏదో పరాయివాడిని చూసినట్లు ఆ చూపేంటి? చాలా రోజుల తర్వాత పలకరిస్తున్నానని ఏమనుకోకే. నువ్వు కూడా నన్ను మర్చిపోయి చాలా ఏళ్లయిందిలే, ఎలా గుర్తుంటా చెప్పు? ఎంతైనా నా అవసరం నీకు తీరిపోయిందిలే. నా తర్వాత నీ అవసరాలు తీర్చేవి చాలా వచ్చాయి. ఇలా అనుకోగానే అలా చిటికెలో నీకు ఏ కష్టం లేకుండా సులభంగా పనులు జరిగిపోతున్నాయి. అందుకే అవి నాకన్నా ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువైనా, అలాంటివి ఎన్ని వచ్చినా నాతో నీకు ఉన్న అనుబంధానికి సాటి వస్తాయా చెప్పు? ఇంతకీ నేనేవరినో గుర్తు పట్టావా? అదేరా.. నేను.. పోస్ట్ లెటర్‌ని.

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

పేరు చెప్తే తప్ప గుర్తు పట్టవా బడుద్దాయ్.. అవునులే.. ఈ మధ్య మహా అంటే పోస్ట్ బాక్సుని కూడా ఏ పోస్టాఫీసు గోడ మీదో, ఏ ఊరి చివరో చూస్తున్నావు. అది కూడా తుప్పు పట్టిపోయి దీనావస్థలో కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాడిలా కనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగిపోయి, కొత్త వాటికి అలవాటు పడిపోయి మర్చిపోయిన నీకు.. నేనూ ఒకడిని ఉన్నానని గుర్తు చేద్దామని ఇలా వచ్చానన్నమాట. అయినా ఇప్పుడు నా గురించి తెలుసుకుని మాత్రం ఏం చేస్తాంలే అంటావా? అవుననుకో.. కానీ, జ్ఞాపకాలే కదరా మనిషి ఎంత ఎదిగినా తోడుగా వచ్చేవి. ఈ ఊరి పోస్టాఫీసు బాక్సులో ఉండే నాకు తెలియని విషయమంటూ ఉందంటావా? ఊళ్లోని ప్రతి ఒక్కరి జీవితం నా కళ్ల ముందు సినిమాలా కనిపిస్తుందిరా. ఇప్పుడంటే మొబైల్ అని, కంప్యూటర్ అని, ఐపాడ్ అని అలవాటు పడ్డావు కానీ.. నాతో ఉన్నప్పుడు నేను పంచిన అనుభూతులు, మధుర స్మృతులు వేరు కదా. ఏమంటావ్..?


నీకు గుర్తుందా?.. పోస్టాఫీసు ముందు వీధిలో ఉండే శివాలయం పూజారి వాళ్లబ్బాయి బాగా పెద్ద చదువులు చదివాడు. అప్పట్లో ఆ పిల్లాడు పదో తరగతి చదివేటప్పుడు పరీక్షల రిజల్ట్ కోసం ఆ పూజారి గారు ఎంత ఎదురుచూశారని. ఇప్పుడంటే నువ్వు మెయిల్స్, ఏవేవో సైట్స్ అని చెక్ చేస్తున్నావు. కానీ అప్పట్లో ఎగ్జామ్స్ రిజల్ట్స్, జాబ్ ఆఫర్స్ లాంటివి ఉత్తరం రూపంలోనే వచ్చేవి. మొత్తానికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ రిజల్ట్ అందిస్తే తప్ప ఆయన మనసు కుదుటపడలేదు. నేను అందించిన ఆ శుభవార్త చూసి ఎంత సంబరపడిపోయారని ఆ కుటుంబమంతా. ఊరంతా స్వీట్లు పంచిపెట్టారు. ఆ రోజు ఆ ఆనందం వాళ్ల కళ్లల్లో చూడడానికి నేను కూడా ఓ కారణమైనందుకు మొదటిసారి గర్వంగా అనిపించింది.

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

అన్నట్లు ఈ ఊరి సర్పంచ్ గారి అబ్బాయిని ఎక్కడో హాస్టల్లో ఉండి చదివించారట కదా అప్పట్లో. ఆ అబ్బాయి కుటుంబానికి దూరంగా ఉంటూ బాగా చదువుకుని ఇప్పుడు మంచి ప్రయోజకుడు అయ్యాడనుకో.. అది వేరే విషయం. అక్కడ తాను ఎలా ఉన్నాడు, చదువు ఎలా సాగుతుందని వారానికి ఒక్కసారైనా ఇంటికి ఉత్తరం రాసేవాడు. ఆరోగ్యం బాగుందా నాన్నా.. డబ్బులు ఏమైనా కావాలా? సరిపోతాయా? అంటూ సర్పంచ్ గారి ప్రత్యుత్తరం మళ్లీ. కొడుకు రాసిన ఉత్తరాన్ని.. అంటే నన్ను చేతితో ఆప్యాయంగా పట్టుకుని ఒక్కో అక్షరం చదువుతూ ఎంత సంతోషపడేవాడు అనుకున్నావ్. అలా చదువుతున్నప్పుడు ఆ తండ్రి ఉద్వేగాన్ని నేను ఏమని చెప్పగలను? కన్న కొడుకే ఎదురుగా వచ్చి నిలబడినట్లు నా వంక అపురూపంగా చూసేవాడు. అంతా చదివాక ఒక్కసారి నన్ను తనివితీరా గుండెకు హత్తుకునేవాడు. అప్పుడు నాకు వినపడే ఆ తండ్రి గుండె చప్పుడులో ఉండే ఆప్యాయత, ప్రేమ.. ఇప్పుడు నువ్వు ఒక్క బటన్ నొక్కి పంపే మెయిల్‌లో ఉందంటావా చెప్పు?

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

ఇదంతా చెప్తుంటే.. ఇంకో విషయం గుర్తొచ్చింది. ఆ వెనక వీధిలో ఉండే అన్నపూర్ణమ్మ గారి భర్త దుబాయ్‌లో ఉండేవాడు. అక్కడికి వెళ్లి బాగా సంపాదించాడనుకో. పాపం.. ఓ రోజు ఎప్పటిలాగే పని కోసమని బయటికి వెళ్లినప్పుడు అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోయింది. ఈ విషయాన్ని అన్నపూర్ణమ్మ గారికి చెప్పాలని, అతను పని చేసే కంపెనీ వాళ్లు ఉత్తరం రాసి పంపించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాన్ని వారం రోజుల్లో ఇంటికి పంపిస్తామని. మరి ఇప్పట్లోలాగా ఫోన్లు లేవు కదా అప్పుడు. ఇంటికి ఉత్తరం వచ్చిందని తెలియగానే భర్త నుంచే అనుకుని ఆనందంగా నన్ను అందుకున్న ఆవిడకి ఆ చెడు వార్త చెప్పాల్సి వచ్చింది. ఏం చేస్తానురా.. నాకు కూడా బాధగానే ఉంది. కానీ, నా పనే అది కదా మరి. పాపం ఆవిడ.. ఉత్తరంలో వార్త చదువుకుని ఎంత ఏడ్చింది అనుకున్నావు. ఆవిడ ఏడుపుతో కళ్ల నుంచి జారిపడిన నీటి తడితో నేను మొత్తం తడిసిపోయాను. నాకు ఇప్పటికీ గుర్తుంది.. ఆ కన్నీటి మరకలు నాపై ముద్రలుగా చెరిగిపోకుండా అలాగే ఉన్నాయి.

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

రేయ్.. ఏడుస్తున్నావేంట్రా?.. ఇదంతా చెప్తుంటే విన్న నీకే ఇంత బాధగా ఉంటే, మరి అవి మోసుకొచ్చిన నా బాధ ఏమని చెప్పగలను? సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు ఎంత గర్వపడేవాడినో, ఇలాంటి కష్టాన్ని తెలియజేసినప్పుడు ఎందుకు ఈ పని చేశానా అని మనసు నొచ్చుకునేది. నాకు మనసు ఏంటి అంటావా? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందిరా. ఆనందమైనా, బాధ అయినా నేను తీసుకొస్తేనే కదా ఒకప్పుడు నువ్వు తెలుసుకునేది. ఇప్పుడంటే క్షణాల్లో ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్, ఒక్క వీడియో కాల్‌తో మనిషి పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నావు. కానీ, నా కోసం నువ్వు ఎదురుచూసే చూపులు, చదువుతుంటే నువ్వు పొందే ఆనందం ఇప్పటి టెక్నాలజీలో ఉందంటావారా? కొందరైతే నన్ను ఓ జ్ఞాపకంగా భద్రంగా దాచుకునేవాళ్లు కూడా తెలుసా? అంత ప్రేమ మరి జనాలకు నేను అన్నా, నేను మోసుకొచ్చే ఆ వార్తలన్నా. ఏమనుకున్నావు మరి..!

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

 సర్లే.. ఏం చేస్తాం ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. ఇప్పుడు నా అవసరం మీకు తీరిపోవచ్చు.. పర్లేదు. కానీ, నేను చెప్పేది ఒకటే. ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఎలాగోలా, ఏదో రకంగా, ఏదో ఒక రూపంలో మనిషితో మనిషి కమ్యూనికేషన్ ఉంచుకుంటున్నాడు. అది చాలు. ఉపయోగించుకునే సాధనం ఏదైనా చెప్పుకునే విషయాలు అవే.. పంచుకునే ప్రేమలు అవే. అందుకే దయచేసి టెక్నాలజీతో పాటు మీరూ మారిపోకండిరా. మనిషితో సంబంధాలు తెంచుకోవద్దు.

పోస్ట్ లెటర్‌కి మాటలొస్తే..!

ఎప్పుడూ ఆ ఫోన్లు, ల్యాపుటాపులు అని అందులో మునిగిపోయి నిర్లక్ష్యం చేయకుండా ఇంటివాళ్లతో కూడా కాసేపు గడపండి. నా అనుకునే వాళ్లకు కాస్త సమయం ఇవ్వండి. మనిషి జీవితానికి చివరి వరకూ తోడు వచ్చేది ఆ అనుబంధాలు, ఆ జ్ఞాపకాలే.. వాటిని దూరం చేసుకుని ఒంటరి కావొద్దు. ఏదో వేదాంతం మాట్లాడుతున్నానని అలా మొహం పెట్టావేంట్రా?.. చాల్లే.. కష్టం, సుఖం అంటే ఏంటో కళ్లారా చూసినవాడిని. ఆ విలువ తెలుసు కాబట్టి అందుకే నేను చూసినవి, అనుభవించినవి ఇలా చెప్పుకొచ్చానన్నమాట. ఎన్ని మారినా ఒకప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్‌ని నేనేరా.. నన్ను మర్చిపోకే.. ఉంటానే మరి..! టాటా...


THANK YOU...

PC: CH.VAMSHI MOHAN


కామెంట్‌లు