మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

ఒక మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ ప్రోత్సహించే వాళ్లు ఉండడంతో పాటు పుట్టిన దగ్గర నుంచి చచ్చేవరకు ప్రశ్నించేవాళ్లు, సలహాలు ఇచ్చేవాళ్లు, కుళ్లుకునేవాళ్లు, తమ గొప్పలు చెప్పుకునేవాళ్లు కూడా ఉంటారని చెప్తున్నా. ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కడు కూడా తన జీవితాన్ని తన కోసం బతకడు. ఎప్పుడూ సమాజం కోసమే. నీ జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నాయా బాస్? అయితే చదువు. పుట్టుక నీది, చావు నీది అయినప్పుడు ఈ మధ్యలో జీవితం మాత్రం పక్కవాడి కోసం బతకడం ఎందుకని? ఆలోచించండి.

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

ఏమీ తెలియని వయసులో స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టిన ఓ పిల్లాడికి జీవితం ఏంటో అంటే అప్పటికి ఇంకా పూర్తిగా తెలియదు. వాడి బాల్యాన్ని వాడు ఏ ప్లానింగ్ లేకుండానే పూర్తి చేస్తాడు. ఇక తర్వాత పైచదువులు.. మరోవైపు ఆడుకోవడానికి ఇష్టపడే వయసు, ఇంకోవైపు బాగా చదవాలి, ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని ఇంట్లో కోరికలు. ఈ ఒత్తిళ్లతోనే అసలు వాడు దేనికోసం చదువుతున్నాడో తెలియకుండానే చదువు పూర్తి చేస్తాడు. అప్పుడు మొదలవుతాయి.. ఎన్ని మార్కులు వచ్చాయి, పక్కింటి అబ్బాయిని/అమ్మాయిని చూసి నేర్చుకో లాంటివి. అదిగో అక్కడే మీ పిల్లల్లో మొదటిసారి వాళ్లు దేనికీ పనికిరారేమో అనే ఒక నెగటివ్ వైబ్ స్టార్ట్ అవుతుంది.

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

సరే ఎలాగోలా చదువు అయింది కదా అని సంబరపడే లోపే నెక్స్ట్ ఏంటి అని మరో ప్రశ్న. ఉద్యోగం చూసుకోవాలి. ఫలానా వాళ్ల అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? మొన్నే అమెరికా వెళ్లాడు, ఏడాది తిరిగే లోపే కారు కొన్నాడని ఉచిత సలహాలు. అవి విని అయ్యో అవునా మనం ఇంకా ఇక్కడే ఉండిపోయామా అని గుబులు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. పక్కనోడిని చూసి మనం కూడా ఏదో పొడిచేయాలనే ఆశలు స్టార్ట్ అవుతాయి. నువ్వు నిజంగా కష్టపడితే నీకు తగ్గ ఉద్యోగం ఏదైనా వస్తుంది. అది వదిలేసి పక్కనోడిని చూసి తలకు మించిన భారం ఎందుకు పెట్టుకుంటావు చెప్పు?

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

ఉద్యోగం వచ్చింది.. ఇక తర్వాత వచ్చే ప్రశ్న..పెళ్లెప్పుడు? ఏం బాబు వయసు అయిపోతుంది, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. ఇంకెప్పుడు చేసుకుంటావ్? పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్? నీకు అంతగా తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లు, అంతేగానీ నీకు ఆకలేస్తుందని చెప్పి నేను పెళ్లి చేసుకోలేను కదా! ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వాడు బయటకు కూడా వెళ్లడం తగ్గించేస్తాడు. ఎప్పుడో ఖర్మ కాలి అలా ఏదైనా పని మీద రోడ్డు వరకు వెళ్లాడా.. మళ్లీ అవే ప్రశ్నలు.. పెళ్లెప్పుడు, పెళ్లెప్పుడు?.. ఏ నువ్వేమైనా నన్ను పోషిస్తున్నావా? తిండి పెడుతున్నావా? నేను పెళ్లి లేటుగా చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటి? అంతవరకూ వస్తే ఇంట్లో అమ్మానాన్నకి సమాధానం చెప్పుకుంటా, అంతేకానీ నీకెందుకు చెప్పాలి నేను?

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

కాలేదు కాలేదు అంటే ఆ పెళ్లి కూడా అవుతుంది. పోనీ అక్కడితో అయినా ఇది ఆగుతుందా? అబ్బే.. అస్సలు.. ఎందరు పిల్లలు? ఏంటి ఇంకా పిల్లలు లేరా మీకు? ఇంకా ప్లాన్ చేసుకోలేదా? ఇలాంటివన్నీ మొదలవుతాయి. పిల్లల్ని కనడం అన్నది వాళ్ల ఇద్దరికి సంబంధించింది. అప్పటికీ కనాలో లేదో డిసైడ్ అవ్వాల్సింది కూడా వాళ్ల ఇష్టం. మధ్యలో ఈ చుట్టుపక్కల అమ్మలక్కల లొల్లి దేనికి? పొరపాటున ఎవరికైనా అదృష్టం కలిసి రాక పిల్లలు పుట్టలేదనుకో.. పెళ్లి అయ్యి ఇన్నేళ్లయినా పాపం పిల్లలు లేరు అని సూటిపోటి మాటలు. అసలే వాళ్ల  బాధలో వాళ్లు ఉంటారు, మీ జాలి మాటలు వాళ్లకు అవసరం లేదు. మనిషి పుట్టిన దగ్గరి నుంచి, మళ్లీ వాడికి ఇంకొకడు పుట్టేదాకా ఈ చట్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది.

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

అసలు నాకో డౌట్.. మనం బతికేది మన కోసమా? సమాజం కోసమా? ఇవి నా ఒక్కడి ఫీలింగ్స్ మాత్రమే కాదు.. ఈ సమాజంలో బతుకుతున్న ప్రతి ఒక్కరూ జీవితమంతా ఎదుర్కొనే అనుభవాలే. సో.. మై డియర్ నైబర్స్.. కష్టమొస్తే మేమున్నామని ధైర్యం చెప్పండి. సంతోషంగా ఉంటే అందులో సగం మీరూ పంచుకోండి. అంతేగానీ నాకు దొరికిన ఈ ఒక్కగానొక్క జీవితాన్ని రూల్ చేసే హక్కు మీకు లేదు.

మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా..?

ఒక్క నాకే అనిపించిందా? మీ జీవితంలో కూడా ఇలా జరిగాయా? ఇలాంటి ఏ సందర్భాల్లో మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఇది రాశాను. నా ఫీలింగ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.


THANK YOU 

PC: CH. VAMSHI MOHAN 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి