హైదరాబాద్ బుక్ ఫెయిర్.. డిసెంబర్ 19, 2025.. ఎన్టీఆర్ స్టేడియం(కళాభారతి).. కనులపండువగా కోటి దీపోత్సవం కార్యక్రమం ఇదే స్టేడియంలో జరిగితే అప్పుడెప్పుడో ఓసారి ఇక్కడికి వచ్చా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇటు వైపు రావడం. ఒకప్పుడు బుక్ ఫెయిర్ వస్తే పుస్తకాలు కొనుక్కుని వెళ్లడమే అలవాటు ఉన్న నేను.. ఈ సారి ఓ పుస్తక రచయితగా అక్కడ అడుగుపెట్టడం కొత్త అనుభూతినిచ్చింది. మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తూనే పుస్తకాల పండుగ అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు.. అబ్బ ఎంత భారీ ఎత్తున చేస్తున్నారో అనిపించింది. వెళ్లేవాళ్లు వచ్చేవారితో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా ఉంది. పుస్తకాలను ప్రేమించే మనలాంటి ఎంతో మందిని ఒక్క చోట చూడడమే అసలు మర్చిపోలేని అనుభవం నన్నడిగితే. పుస్తకం కన్నా మంచి మిత్రుడు లేడంటారు.. అలాంటి మిత్రుడులాంటి ఓ పుస్తకమే ఆ రోజు లోపలికి వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను పిలుస్తూ నడిపించినట్లు అనిపించింది. అన్నట్లు చెప్పడం మర్చిపోయా.. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సారి ఈ బుక్ ఫెయిర్‌లో మన మొదటి పుస్తకం 'కళాతపస్వి' కూడా ఉండడం మరింత గర్వపడేలా చేసింది.
మీతో ఇలా చెప్తున్నానో లేదో.. అదిగో.. ఎదురుగా చూడండి.. ఓ స్టాల్ దగ్గర పెట్టిన పుస్తకాల షెల్ఫ్‌లో ఎందరో గొప్ప గొప్ప రచయితలు రాసిన ఎన్నో వేల పుస్తకాల మధ్య మన 'కళాతపస్వి' కూడా అందంగా అమరిపోయి నిలబడింది. గడ్డం దగ్గర చేయి పెట్టుకుని.. ఓ వేలితో మీసాన్ని సుతిమెత్తగా దువ్వుతున్నట్లు.. ఓ పక్కగా చూస్తూ మహానుభావుడు విశ్వనాథ్ గారు పుస్తకం కవర్ పేజీకే గొప్ప కళని తీసుకొచ్చారు.
మొదటి పుస్తకం.. మొదటిసారి బుక్ ఫెయిర్‌లో చూసుకోవడం ఎంత ఆనందంగా ఉందో అని నాలో నేనే అనుకుంటూ.. ఇంకా కొన్ని స్టాల్స్ వాళ్లకు మన పుస్తకాలను అప్పగించాలని అలా నెంబర్లు చూసుకుంటూ వెళ్తున్నానా.. 'హే హాయ్.. ఎలా ఉన్నావ్.. గుర్తు పట్టావా నన్ను' అని ఎదురైన ఓ ప్రశ్నతో ఆ మనిషి ఎవరా అని అలాగే చూస్తుండిపోయా. నేను ఆలోచనలో పడడం గమనించి మళ్లీ అతనే కలగజేసుకుని.. 'నేను.. విద్మహీ' అని చెప్పేసరికి 'ఓహ్.. మీరా మహేశ్ గారూ(Writer).. సారీ అండి.. ఇదే మొదటిసారి కదా మనం ప్రత్యక్షంగా కలవడం.. ఉన్నట్లుండి గుర్తు రాలేదు' అని సంజాయిషీ ఇచ్చుకున్నా. 'నిన్న ట్రైన్‌లో వస్తూ వస్తూ కొంతవరకు మీ పుస్తకం చదివా.. చాలా బాగుంది. అసలు విశ్వనాథ్ గారి సినిమాల మీద ఓ పుస్తకం వచ్చిందని తెలిసినప్పుడే ఎందుకో తెలియకుండానే నా కళ్లల్లో నీళ్లొచ్చాయ్. అలాంటి గొప్ప కళాఖండాల గురించి పుస్తకం రాసిన మీ గురించి తెలుసుకున్నాక చాలా ఆనందంగా అనిపించింది..' అని మహేశ్ అలా ఇష్టంగా నాతో మాట్లాడుతుంటే చేసిన పనిని గుర్తించిన సంతృప్తి దక్కింది. అదే సమయంలో నా చేతిలో పట్టుకున్న 'కళాతపస్వి' పుస్తకంపై ఉన్న విశ్వనాథ్ గారు 'చాల్లేవోయ్ గొప్ప..' అని నన్ను చూస్తూ కళ్లెగరేసినట్లు అనిపించి నాలో నేనే నవ్వుకున్నా.
చుట్టూ ఎన్ని వేల పుస్తకాలో.. చదివే ఆసక్తి, ఆ ఇష్టం ఉండాలే గానీ జీవితానికి ఇంకేం అక్కర్లేదు అనేంత సంపద కళ్ల ముందే కదలాడుతున్నట్లు కనిపించింది. ఎంతో మంది రచయితల కృషి.. ఎందరో మేధావుల బుర్రల్లో పుట్టిన ఆలోచనలు.. ఎన్నో రోజుల తపన.. ఇలా అక్షర రూపం దాల్చి పుస్తకాలుగా రూపుదిద్దుకుని మనకు అందుబాటులో ఉండడం.. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అని పెద్దలు ఊరికే చెప్పలేదు బహుశా. అలాంటి మంచి సంప్రదాయాన్ని మనమూ కొనసాగించాలని మన వంతుగా ఈ సారి ఓ పుస్తకం తీసుకురావడం.. గొప్పలు చెప్పుకోవట్లేదు కానీ, జీవితంలో ఓ నిజమైన సంతృప్తి ఇది. అంత కష్టపడి ఇష్టంగా రాసుకున్న 'కళాతపస్వి'కి ఈ బుక్ ఫెయిర్‌లో డిసెంబర్ 26న ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. అంటే చాలా ఏళ్ల తర్వాత స్టేజ్‌పై నిలబడి మాట్లాడబోతున్నా.. పుస్తకం గురించి అందరికీ తెలిసేలా చెప్పబోతున్నా.. ఎలాగైనా బాగా చేయాలి.. బాగా జరగాలి.. ఇదే అప్పుడు నా మనసులో ఉండిపోయింది.
ఏదైనా స్టాల్ ముందు నిలబడి అలా చూస్తూ వెళ్తున్నప్పుడు.. బుక్ ఫెయిర్‌కి వచ్చినవాళ్లు ఎవరో ఒకరు అక్కడ పెట్టి ఉన్న 'కళాతపస్వి'ని ఇష్టంగా చేతిలోకి తీసుకోవడం.. ప్రతి పేజీని తిప్పుతూ నేను రాసుకున్న అక్షరాలను తడమడం.. ఆ దృశ్యాన్ని నేను కాస్త దూరం నుంచి చూస్తూ అలాగే ఉండిపోవడం.. ఈ అందమైన అనుభూతి నాకు ఈ బుక్ ఫెయిర్‌లో చాలాసార్లు ఎదురైంది. అలా ఎవరో మనకు పరిచయం లేనివాళ్లు మనం ఇష్టంగా రాసుకున్న పుస్తకాన్ని మరింత ఇష్టంగా చూడడం, చదివేద్దామని కొనుక్కుని తీసుకెళ్లడం.. ఎప్పటికీ మర్చిపోలేనిది. ఓ చిన్న ప్రయత్నంగా మొదలైన పుస్తక ప్రయాణం ఇక్కడివరకూ చేరుకుందంటే మనసుకి ఎంతో ఆనందం.. అది కూడా విశ్వనాథ్ గారి సినిమాల మీద రాయడం అంత తేలిక కాదని ఎవరైనా చెప్తుంటే కూసంత గర్వం.. అప్పుడే అనిపించింది ఇంకా ఏదో చేయాలి.. ఇంకెంతో రాయాలని.
అలా ఆలోచిస్తూ ఉండిపోయిన నన్ను ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశా.. 'మీరేనా కాదా అని చూస్తున్నా.. ఎలా ఉన్నారు?' అని ఆరుద్ర ఈశ్వర్(Book Reviewer) గారి పలకరింపు. 'హాయ్.. మొత్తానికి ఈ రోజు ఇలా కలిశాం.. నా కళాతపస్విని చదివి మంచి రివ్యూ ఇచ్చినందుకు చాలా థాంక్స్' అని ఆయనతో చెప్పుకున్నా. 'నాకెందుకు థాంక్స్.. మీకు చెప్పాలి. మీ పుస్తకం చదువుతుంటే మీరు రాసిన ఒక్కో సినిమా అలా నా కళ్ల ముందు కదలాడింది.. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది' అని ఆరుద్ర ఈశ్వర్ గారి మెచ్చుకోలుకు మురిసిపోయాను.
డిసెంబర్ 26.. 'కళాతపస్వి' ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజే సాయంత్రం 5 గంటలకు. రాసుకున్న పుస్తకానికి ఎంతో మంది మధ్యలో ఆవిష్కరణ కార్యక్రమం అంటే మనసుకి కాస్త గర్వంగా ఉన్నా.. మరోవైపు తెలియని చిన్న బెరుకు. ఎలా జరుగుతుందో.. అంతా బాగానే ఉంటుందా.. జనాల్లోకి మన పుస్తకాన్ని మరింత బాగా తీసుకెళ్లే అరుదైన అవకాశం.. అసలు తగ్గకూడదు.. ఏదైతే ఏం మన ప్రయత్నం మనం చేయాలి అనుకుంటుండగానే ఆ సమయం కాస్తా దగ్గర పడింది. ప్రముఖ నిర్మాత ఏడిద రాజా గారు.. 'శంకరాభరణం', 'సాగరసంగమం' లాంటి గొప్ప కళాఖండాలను మనకు అందించిన పూర్ణోదయా మూవీస్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు గారి కుమారుడు నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జీవితంలో మర్చిపోలేని ఓ అనుభవం. మరో ముఖ్య అతిథిగా వంశీ రామరాజు గారు (ప్రముఖ రచయిత, వేగేశ్న ఫౌండేషన్ స్థాపకులు) విచ్చేయడం నేను జీవితంలో నిజంగా చేసుకున్న ఓ అదృష్టం. ఊహించని విధంగా అప్పటికప్పుడు ప్రముఖ రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ గారు, గాయని రాధారాణి గారు కార్యక్రమానికి మరో ఇద్దరు అతిథులుగా తోడవడం.. గుండెల నిండా అభిమానంతో ఒక్క విశ్వనాథ్ గారి చేయి పట్టుకుని పుస్తకం రాస్తే ఇంత మంది పెద్దల ఆదరణ నాకు లభించిందా.. ఏదో ఓ మూల నేనూ అదృష్టవంతుడినే నిజంగా.. విశ్వనాథ్ గారూ మీరు నా చేయి ఎప్పటికీ వదలొద్దు..!
'శంకరాభరణం' సృష్టికర్తలే నా పుస్తకాన్ని పట్టుకుని ఆ రోజు స్టేజ్‌పై ఆ సినిమా గురించి అందరితో పంచుకోవడం కన్నా నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి. సినిమా గురించి ఏడిద రాజా గారు గొప్పగా మాట్లాడడం.. వాళ్ల నాన్నగారిని ఆ సందర్భంలో తలుచుకుని ఆ కళాఖండం తాలూకు అనుభవాలు గుర్తు చేసుకోవడం.. ఆ మాటలు వింటూ నేనెంత పొంగిపోయానో కొత్తగా చెప్పాలా..? వంశీ రామరాజు గారు.. ఎందరో ప్రముఖులతో పరిచయాలు ఉన్న ఆయన.. నాలాంటి చిన్నవాడి గురించి, నేను రాసిన పుస్తకం గురించి గొప్పగా చెప్పడమేంటండీ.. కలలోనైనా ఊహించానా అసలు ఇది. 'ఈ పుస్తకంపై ఓ సెమినార్ పెట్టాలి.. పెద్ద పెద్ద వాళ్లందరూ దీని గురించి మాట్లాడాలి' అని రామరాజు గారు అంటున్నప్పుడు తల దించుకుని ఉన్న నా కళ్లల్లో కన్నీటిని ఎవరూ గమనించలేదేమో ఆ సమయంలో బహుశా. మరోవైపు శ్రీకాంత్ గారు 'శంకరాభరణం' గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పడం, రాధారాణి గారు పాట పాడడం.. కార్యక్రమానికి ఓ పరిపూర్ణత లభించింది. కార్యక్రమం పూర్తి చేసుకుని స్టేజ్ దిగిన నన్ను నాకు అప్పటివరకు సాయంగా నిలిచిన నా స్నేహితులు వంశీమోహన్, భరత్, రామ్, తేజ నా వెన్నుతట్టి నిలవడం.. నిజంగా ఇవన్నీ జరిగాక మనసు ఉప్పొంగిపోయింది. చిన్నదో పెద్దదో జీవితంలో ఓ మంచి పని చేశాననే సంతృప్తి కలిగింది. ఏమో.. కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా విశ్వనాథ్ గారు అక్కడే ఏదో ఓ మూలన కూర్చుని నన్ను చూశారేమో.. నా మాటలు విన్నారో ఏమో.. వినే ఉంటారులే ఖచ్చితంగా.
శ్యామ్ గారు(శ్యామవర్ణం) పుస్తకం నా దగ్గర నుంచి అందుకుని.. ఇష్టంగా చదివి.. పుస్తకం ఎంతో మంది పాఠకులకు చేరేలా మంచి రివ్యూ ఇచ్చి నాకెంతో సాయపడ్డారు. మరీ ముఖ్యంగా పుస్తక ఆవిష్కరణకు ఎంతో ఇష్టంగా వచ్చి నాకు అండగా నిలిచారు. ఆ రోజు కార్యక్రమంలో మాట్లాడాలని ఆయన అనుకుని నాకు చెప్పడం.. సమయం సరిపోకపోవడంతో అవకాశం ఇవ్వనందుకు నేను ఈ సందర్భంగా క్షమాపణ చెప్పాలేమో!.. అలా మరో రోజు ఓ స్టాల్‌లో కూర్చుండి వచ్చీపోయే జనాలను గమనిస్తున్న నాకు.. మాతో పాటే స్టాల్ లోపల ఒకావిడ గడగడా మాట్లాడుతుండడం, అందరితో కలిసిపోయి పలకరిస్తుండడం చూసి ముచ్చటేసింది. ఇంతలో ఆవిడే నాతో.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండీ అని అంటూ తనను తాను పుస్తకవల్లి అని పరిచయం చేసుకున్నారు. మన 'కళాతపస్వి' పుస్తకాన్ని అందుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు పుస్తకవల్లి గారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. అదే సమయంలో విశ్వనాథ్ గారి రూపం మరోసారి మదిలో మెదిలి 'ఇదంతా నేనిచ్చిందేరా నీకు..' అని చెప్తున్నట్లు అనిపించి మనసులోనే ఆ మహానుభావుడికి దండాలు పెట్టుకున్నా.
బుక్ ఫెయిర్ జరిగిన ఆ పది రోజుల్లో ఎందరో పెద్దవాళ్లను కూడా కలవడం గుర్తుండిపోయే మరో విషయం. ఓ రోజు మన పుస్తకాల అమ్మకాలు అసలు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తున్న నాకు.. దూరంగా ఓ పెద్దాయన ముఖానికి మాస్క్ పెట్టుకుని హడావిడిగా వెళ్లడం కనిపించింది. ఈయన ఎవరో మనకు బాగా తెలిసిన మనిషే అనుకుంటూ సరేలే అనుకుని అక్కడితో వదిలేసి నా పనిలో నేనుండిపోయా. ఇంతలో అదే పెద్దాయన మళ్లీ ఎదురుపడినట్లు నా ముందే అటూ ఇటూ వెళ్తూ కనిపించారు. మరెవరో కాదులెండి.. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి గారు. 'కళాతపస్వి' పుస్తకానికి ఆయన ముందుమాట ఇచ్చారన్న మాటే కానీ, మళ్లీ భరణి గారిని కలవడం, పుస్తకం అందించే అవకాశం దొరకడం కష్టమైపోయింది. కానీ, ఆ రోజు ఆ అదృష్టం బుక్ ఫెయిర్‌లో అనుకోకుండా కలిగిందన్నమాట. నాకు అత్యంత ఆప్తులు హేమంత్ గారి సాయంతో దగ్గరివరకూ వెళ్లిపోవడం, 'కళాతపస్వి' పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టడం, ఆయనతో ఫోటో దిగడం చకచకా జరిగిపోయాయి.
ఇంకోరోజు అలాగే వెళ్తూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు కనిపించారు.. ఇప్పటివరకూ ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలపై ఆయన పేరు చూడడమే తప్ప ప్రత్యక్షంగా ఆయన్ని చూడడం ఇదే మొదటిసారి. అంత పేరున్న రచయితకి మన పుస్తకాన్ని కూడా పరిచయం చేయాలనే ఆశ ఖచ్చితంగా మనకు ఉంటుందిగా. అందుకే ముందు నన్ను నేను పరిచయం చేసుకుని.. విశ్వనాథ్ గారి సినిమాలపై 'కళాతపస్వి' అనే పుస్తకాన్ని తీసుకొచ్చానని ఆయనకు పుస్తకాన్ని అందించడం అలా జరిగిపోయాయి.
'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' రచయిత రవి మంత్రి గారు.. అప్పటికే ఆయన పుస్తకాలతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి మంత్రి గారికి 'కళాతపస్వి' పుస్తకాన్ని బహుమానంగా ఇద్దామని వెళ్లి మాట్లాడితే.. పుస్తకంపై ఉన్న విశ్వనాథ్ గారి ఫోటో చూసి ఆయన వెంటనే కళ్లకు అద్దుకుని.. బహుమానంగా కాదు, ఈ పుస్తకాన్ని నేను కొంటానని చెప్పి తీసుకోవడం నాకు ఆశ్చర్యం వేసింది.
'వెండితెర వాకిట్లో' అనే సోషల్ మీడియా పేజీ ద్వారా ఎన్నో అద్భుతమైన పాటలను, ఆ పదాల్లోని అర్థాలను, దాని వెనుక కథాకమామీషును తనదైన శైలిలో ఎంతో ఇష్టంగా పంచుకునే బాలాజీ కార్తీక్ గారిని కూడా కలిసి 'కళాతపస్వి'ని అందజేయడం మరో గుర్తుండిపోయే విషయం.
ఇవే కాదు.. ఈ బుక్ ఫెయిర్ ఎందరో పెద్దవాళ్లను పరిచయం చేసింది.. ఎంతో మంది రచయితలను నాకు దగ్గర చేసింది.. ఇంకెందరో పుస్తక ప్రియులను నాకు ఆత్మీయులను చేసింది. ఇదంతా విశ్వనాథ్ గారు ఇచ్చిందే.. ఆయన మీద నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం, గౌరవం, భక్తి వల్ల నాకు దక్కిన అదృష్టాలే.. ఓ గొప్ప దర్శకుడు తీసిన పది సినిమాల గొప్పతనాన్ని పది మందికి పంచాలని నేను చేసిన ప్రయత్నం 'కళాతపస్వి' ద్వారా జీవితానికి సరిపడా జ్ఞాపకాలు నాకు దొరికాయి. జీవితం అన్నాక కష్టం, సుఖం రెండూ ఉంటాయన్నట్లుగా 2025 సంవత్సరం నా జీవితంలో కూడా కొన్ని కష్టాలతో పాటు చివరి వరకూ గుండెల్లో పదిలం చేసుకునే అనుభవాలను, ఆనందాలను పంచింది. మొదటి పుస్తకం 'కళాతపస్వి'తో మిమ్మల్ని పలకరించిన నేను.. ఇకపై కూడా మీ ఆదరాభిమానాలతో మరెంతో రాయాలని, మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నా..
- మీ రాకేశ్ బొద్దుల
THANK YOU 🙏
PC: CH.VAMSI MOHAN








కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి