చిన్నతనం నుండి కమర్షియల్ సినిమాలు పెద్దగా ఇష్టపడి చూసేది కాదు. ఒకవేళ చూసినా అందులో కొంతైనా మంచి కథ ఉన్న వాటినే ఎంచుకుని చూసేవాడిని. అదేంటో మరి.. నా తోటివాళ్లంతా ఒక రకమైన ఇష్టాలు కలిగి ఉంటే.. నాకు మాత్రం కథ, సంగీతం, మంచి పాట అని వెతుక్కునే వాడిని. ఇలాంటి ఇష్టాలు ఉన్న నాకు సాధారణంగానే కళాత్మక చిత్రాలు నచ్చుతాయి. ఎందుకంటే.. అందులో ఇది లోటు అని చెప్పడానికి ఏదీ ఉండదు. మంచి నటీనటులు, అభినయానికి ప్రాధాన్యం, కళ్లతోనే పలికించే ఎన్నో భావాలు, అర్థవంతమైన పాటలు.. వీటన్నిటి సమాహారంగా కళాత్మక చిత్రాలు సాగుతాయి. మరి అలాంటి చిత్రాలు తీయడంలో సిద్ధహస్తులు, నేర్పరి.. కళాత్మక చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారు.
ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలియకుండానే ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను. తెలిసీ తెలియని వయస్సులో కూడా ఎందుకో నా మనసుకి అవి బాగా నచ్చేవి. అర్థం చేసుకునేంత పరిజ్ఞానం, మేథస్సు అప్పుడు లేకపోయినా చూడటానికి ఎంతో ఇష్టపడేవాడిని. విశ్వనాథ్ గారి సినిమాల్లో కథ కావచ్చు.. నాలాంటి అల్పజ్ఞాని అంత తొందరగా అర్థం చేసుకోలేని సన్నివేశాలు కావచ్చు.. అందులోని నటీనటులు మొహంలో పలికించే భావాలు కావచ్చు.. నిగూఢమైన సంభాషణలు కావచ్చు.. కానీ, ఆయన సమాజానికి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని మాత్రం అనిపించేది. నా వయస్సు పెరుగుతున్న కొద్దీ విశ్వనాథ్ గారి సినిమాలపై మరింత ఇష్టం పెరిగింది. అంతో ఇంతో అర్థం చేసుకునేంత జ్ఞానం కొంచెం వచ్చింది. ఒక మనిషి ఇలా ఎలా సినిమాలు తీయగలడు..? ఇంత కళాత్మకంగా ఎలా రక్తి కట్టించగలడు..? ఎక్కడా అసభ్యకరం అనేదే లేకుండా సినిమాని ఎలా నడిపించగలడు..? ఆయన సినిమాల్లోనే నటీనటులు ఇంత గొప్పగా ఎలా జీవించగలరు..? ఆయన సినిమాల్లో పాటలు, సంగీతం ఎందుకు అంత గొప్పగా ఉంటాయి..? మనసులో అనుకున్నది ఇంత అద్భుతంగా ఎలా తెరపై చూపించగలడు..? మనలాంటి సామాన్యుల గుండెలో స్థానం ఎలా సంపాదించగలడు..? అది ఆ కాశీనాథుని విశ్వనాథ్ ఒక్కరికే సాధ్యం. ఆయనకి ఉన్న కోటానుకోట్ల భక్తులలో నేనూ ఒకడిని. అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు ఊహ తెలుస్తున్న ఆ తొలి రోజుల్లోనే అనుకున్నాను.. ఏ రోజుకైనా ఆ మహానుభావుడిని ఒక్కసారైనా కళ్లారా చూడాలని.. ఆయన పాదాలు తాకాలని. కానీ ఎలా..? ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన నాకు బయట ప్రపంచం పెద్దగా తెలియదే..!! అసలు కలవాలి అంటే ఎలా, ఏ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలో కూడా నా ఆలోచనలో లేదే.. ఎలా ఎలా…?
నా పది, పదిహేనేళ్ల వయస్సులో పుట్టిన ఆ కోరిక ఎలా తీరుతుందా అని ఎదురుచూస్తున్నాను. విశ్వనాథ్ గారి సినిమాలు ఒక్కోటి ఎన్నెన్ని సార్లు చూసానో లెక్కే లేదు. రోజులు గడిచాయి. చదువు, ఉద్యోగం.. అలా నా జీవితం సాగిపోతుంది. ఉద్యోగం చేస్తున్నాను.. ఆయన సినిమాలు, ఆయనపై గౌరవం, భక్తి భావం మరింత పెరుగుతూ వచ్చాయి. ఏళ్లు గడిచినా ఆయన్ని కలవాలనే కోరిక ఇంకా తీరడం లేదు.. ముందుగా దానికి నా వంతు ప్రయత్నం ఎలా చేయాలో తెలియదు. నా కోరిక ఆ దేవుడు విన్నాడో ఏమో మరి.. మన సంకల్పం గట్టిదైతే అనుకున్నది నెరవేరుతుందేమో మరి.. ఎట్టకేలకు పదిహేనేళ్ల నా సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ రోజు రానే వచ్చింది. నేను ఆశ పడింది నాకు దక్కింది.. ఆ దేవుడి దర్శన భాగ్యం లభించింది.
ఎలా ఎలా అని అనుకుంటూ ఎదురుచూస్తున్న నేను ఫేస్‌బుక్‌లో విశ్వనాథ్ గారి అభిమానులు నడుపుతున్న కొన్ని పేజీలు చూశా.. కొందరితో మాట్లాడా.. విశ్వనాథ్ గారిని కలవాలనే నా కోరిక వాళ్లతో పంచుకున్నా. అలా ఎంతో మందిని అడిగిన నాకు చివరగా ఒక పేజీ ద్వారా ఆయన హైదరాబాద్‌లో ఉండే అడ్రెస్ తెలుసుకున్నా. కానీ.. వెళ్లాలా..? వెళ్తే కలవడం కుదురుతుందా..? అసలు ఆ ఇంటి దగ్గర వరకూ వెళ్లినా ఆయన్ని కలవడానికి నాకు ఎవరు సాయం చేస్తారు..? ఇలా.. మరో రెండు, మూడు నెలలు గడిచాయి. చివరగా ఒకరోజు గట్టిగా నిర్ణయించుకున్నా ప్రయత్నిద్దామని. వెళ్లాను.. ఇంటి వరకూ వెళ్లిపోయాను.. ఇదే విశ్వనాథ్ గారి ఇల్లు అని ఖచ్చితంగా అనుకుంటున్న ఆ ఇంటి బయట చేతిలో బుట్టతో ఎవరో నిలబడ్డారు. వాళ్ల అబ్బాయి అనుకుంటా..! కొంచెం దూరంగానే ఉండి ఆ ఇంటి వైపు చూస్తున్నాను. కానీ దగ్గర వరకు ఎలా వెళ్లేది.. ఏం అనుకుంటారో ఏమో అని నా లోలోపల భయం. నా బాధ అర్థం చేసుకున్నాడేమో ఆయన.. 'ఎవరమ్మా.. ఎవరు కావాలి?' అని అడిగాడు. ఇక ధైర్యం చేసి దగ్గర వరకు వెళ్లాను. “సర్.. విశ్వనాథ్ గారి ఇల్లు ఇదేనా.. ఆయన అభిమానిని.. ఎప్పటి నుండో ఆయన్ని కలవాలని అనుకుంటున్నా” అని నా మనసులో మాట చెప్పేశా. “ఇదే ఇల్లు, కానీ ఆయన ఇంట్లో లేరు.. మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను.. ఆయనతో మాట్లాడండి” అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. హమ్మయ్య.. ఎలా అయితేనేం కొంచెం దారి దొరికింది అని మనసులో అనుకుని అక్కడ నుండి ముందుకు వచ్చాను. ఆ నెంబర్‌కి కాల్ చేశాను. అవతల మనిషికి నా కోరిక చెప్పి బ్రతిమిలాడాను. ఆయన కూడా అంతే ఓపిగ్గా మాట్లాడి.. ఒక వారం తర్వాత రండి.. ఒకరోజు ముందు నాకు కాల్ చేయండి.. ఈలోపు నేను సార్‌తో మాట్లాడి ఖాయం చేస్తాను అన్నాడు. ఎంతో సంతోషంతో ఆయనకి థాంక్స్ చెప్పి అక్కడి నుండి వచ్చేశాను.
ఇక ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు.. మనసు గాల్లో తేలిపోతోంది. ఒక వారంలో నా అభిమాన దర్శకుడిని చూడబోతున్నాను.. నా పదిహేనేళ్ల కల నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడు ఆ వారం గడుస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నా. చివరికి ఆయన ఇచ్చిన గడువు ముగిసింది. ఒకరోజు ముందుగా కాల్ చేశా. కానీ నాకు రిప్లై లేదు.. ఫోన్ ఎత్తట్లేదు.. ఆ రోజు నన్ను ఫోన్ చేయమని చెప్పిన వ్యక్తి నుండి నాకు సమాధానం లేదు. ఏం చేసేది..? మళ్లీ కుంగిపోయాను. అవకాశం అందినట్లే అంది చేజారిపోయిందా..! ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు నిరాశే మిగిలింది. ఆ తర్వాత రోజు కూడా ప్రయత్నించా. ఫోన్ మోగుతుంది.. కానీ ఆయన సమాధానం ఇవ్వట్లేదు. సరే.. చూద్దాం అని మరొక్క వారం ఆగాను.
ఇక ఎలా అయినా సరే తప్పదు.. కలవాలి.. అని మళ్లీ విశ్వనాథ్ గారి ఇంటి వరకు వెళ్లాను. ఎవరైనా బయటికి రాకపోతారా..? వాళ్లని బతిమాలి ఎలాగోలా అవకాశం పొందాలనేది నా ఆలోచన. అందుకే అక్కడే చాలాసేపు ఉండిపోయాను. ఒక గంట వరకు అక్కడే అటూ ఇటూ నడుస్తూ ఎదురుచూశాను. అప్పుడే ఒక కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులో నుండి ఒక మహిళ(విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యురాలు) కిందికి దిగారు. వేగంగా వెళ్లి ఆవిడ ముందు నిలబడ్డాను. నా గురించి చెప్పాను.. నా వివరాలు అడిగారు. అన్నీ చెప్పగానే సరే.. అని ఒప్పుకుని కాసేపు వెయిట్ చేయమని లోపలికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆవిడ నెంబర్ ఇచ్చి ఒక అరగంటలో కాల్ చేయండి, లోపల కనుక్కుని చెప్తాను అన్నారు. సరే అని అక్కడే బయట ఉన్నాను. అరగంట తర్వాత ఆవిడకి కాల్ చేశా. రేపు ఫలానా టైంకి రండి.. ఎక్కువ లేట్ చేయొద్దని చెప్పి నాకు విశ్వనాథ్ గారిని కలిసే అవకాశం కల్పించింది ఆ దేవత.
మరుసటి రోజు చెప్పిన టైంకి వెళ్లి ఇంటి బయట ఉండి.. ఆవిడకి కాల్ చేశాను. ఒక పది నిమిషాల్లో లోపలికి రండి అని అన్నారు. మెల్లగా గేటు తీసుకుని లోపలికి వెళ్లాను. లిఫ్ట్ ఎక్కాను. మొదటి అంతస్తుకు చేరాను. అక్కడే ఆయన ఉండేది. గుమ్మం బయట ఉండిపోయాను. నా అంతే వయస్సు ఉన్న ఒక అబ్బాయి లోపలికి వెళ్లండి అని సైగ చేశాడు. గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టి నాకు ఎడమ వైపుగా చూశాను. అక్కడే సోఫాలో ఆ కళాతపస్వి అటు వైపు మొహం చేసి చేతిలో పుస్తకంతో కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎడమ పక్కగా నడుస్తూ దగ్గర వరకు వెళ్లి కొంచెం ముందుకు వంగి దండం పెడుతూ ఆ దేవుడిని నా కళ్లతో చూశాను. మొదటిసారిగా ఆయన్ని ప్రత్యక్షంగా చూడగానే నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆ సమయంలో నా మనసులో ఒకటే అనిపించింది. ‘ఈ వయస్సులో కూడా ఆయన మొహంలో తేజస్సు ఉట్టిపడుతుంది’ అని. ఆయన పాదాలు తాకి నమస్కరించాను. మా మధ్య జరిగిన చిన్న సంభాషణ మీ కోసం…
నేను: సర్.. నమస్కారం
(విశ్వనాథ్ గారు తల కొద్దిగా ఊపి అలా కూర్చోండి అన్నారు)
నేను: పర్లేదు సర్.. నిలబడే ఉంటాను. ఎప్పటి నుండో మిమ్మల్ని చూడాలని అనుకున్నాను సర్.. ఈ రోజు నా కోరిక తీరింది.
విశ్వనాథ్ గారు: ఏం చేస్తారు మీరు..?
నేను: సర్.. నేను మీడియాలో పని చేస్తాను.
విశ్వనాథ్ గారు: ఓహ్.. ఈ రోజు వెళ్లాలా ఆఫీస్ ఇప్పుడు?
నేను: లేదు సర్.. వెళ్లొచ్చాను. అయిపోయింది. ఇక మళ్లీ రేపే వెళ్లాలి.
(ఆయన సరే అని తల ఊపి మౌనంగా ఉండిపోయారు)
నేను: నా చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను సర్.. ఎంతో ఇష్టం సర్ మీరంటే.. మిమ్మల్ని చూడాలన్న నా కల ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది.
(ఆయన నా మాటలు వింటూ చిన్నగా నవ్వారు)
నేను: నేను కథలు అవీ రాస్తుంటాను సర్.. మీ సినిమాలపై కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను సర్.
విశ్వనాథ్ గారు: చాలా సంతోషం.
నేను: ఎంతో ఆనందంగా ఉంది సర్.. ఇలా మిమ్మల్ని కలవడం..
విశ్వనాథ్ గారు: ఓహ్.. సరే.. ఫోటో ఏమైనా తీసుకోవాలా..?
నేను: అవును సర్.. (అని నేను ఆయన పక్కన కింద కూర్చుండి నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ సాయంతో ఫోటోలు తీయించుకున్నా)
నేను: మీకు చాలా థాంక్స్ సర్.. లోపలికి వచ్చి మిమ్మల్ని ఇలా కలవడానికి ఒప్పుకున్నందుకు.. చాలా థాంక్స్ (ఆయన చిన్నగా నవ్వుతూ సంతోషం.. చాలా సంతోషం అన్నారు)
ఇక ఎక్కువ సమయం అనుమతి లేకపోవడంతో మరొక్కసారి ఆయన పాదాలు తాకి కళ్లకు అద్దుకున్నాను.
నేను: వెళ్లొస్తాను సర్.. మరొక్కసారి థాంక్స్( అని ఆయన దగ్గర సెలవు తీసుకుని మెల్లగా బయటికి నడిచాను).
కళాతపస్విని చూసిన ఆనందం, ఎన్నో ఏళ్ల కల తీరిన నా సంతోషం జీవితాంతం గుర్తుండిపోతుంది.
మీరు ఈ లోకం నుంచి వెళ్లిపోయినా.. ఎప్పటికీ నా గుండెలోనే ఉంటారు. మీ సినిమాల ద్వారా చాలా తెలుసుకున్నాను. స్ఫూర్తి పొందాను. మీరు సజీవంగా లేకపోయినా.. మీ కళాత్మక చిత్రాల ద్వారా ఎప్పటికీ బతికే ఉంటారు. మీరు 'సాగర సంగమం' సినిమా చివరలో 'NO END FOR ANY ART' అని చెప్పినట్లు మీలాంటి వారికి కూడా END అనేదే లేదు అని నమ్ముతూ.. కృతజ్ఞతలు.
-మీ రాకేష్ 🙏
Nice Anna
రిప్లయితొలగించండిThanks 🙏
తొలగించండిSir ni Kalavali ani me tapanaki aaa madam meku adyam posaru alage meru time Ki response ayyaru .. Machi explanation eccharu allage sir lanti Manchi vallanu kalavali ani evarikina unte Nev vellina Margame variki Dari.....Nice
రిప్లయితొలగించండిThanks andi
తొలగించండి