స్వాతిముత్యం

నెరిసిన గడ్డం, జుట్టు, తలపై టోపీ, కళ్లజోడు, నుదుటన విభూది బొట్టు, తెల్లని లాల్చీ పైజామాతో.. వయసు మీద పడిన హీరో శివయ్యని సినిమా మొదట్లోనే చూస్తాం. సినిమాకి హీరో అంటే ఇలా కూడా ఉంటాడా? ఎస్.. లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి విశ్వనాథ్ గారి సినిమాల్లో ఉంటారు.

స్వాతిముత్యం

కల్లాకపటం లేని మనసు కలిగి, మనం చేసే పని ఎదుటివాళ్లకు ఉపయోగపడుతుంది అంటే నిస్వార్థంగా సాయపడడం అనేది దైవత్వంతో సమానం. అలాంటి ఒక అమాయకమైన పాత్రతో సినిమా మొత్తం నడిపించాలంటే సాహసమే. నడిపించి మెప్పించగలగడం మరో సాహసం. కానీ, పాత్రలను కళా రూపాలుగా తీర్చిదిద్దే దర్శక మహానుభావులు విశ్వనాథ్ గారికి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మరి ఆ కళా దర్శకుడికి, నటనకే ఓనమాలు నేర్పించే లోక నాయకుడు కమల్ హాసన్ తోడైతే ఆ సాహసం పేరు 'స్వాతిముత్యం' అయ్యిందని చెప్పొచ్చు.

స్వాతిముత్యం

శివయ్య(కమల్ హాసన్) మనిషి ఎదిగినా లోకజ్ఞానం తెలియని అమాయకుడు. తన పిల్లలు, వారి పిల్లలు అంతా కలిసి తన కోసం చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్నారని హడావిడి చేస్తుంటాడు. ఇంటి బయట పనమ్మాయి వేసిన ముగ్గుని చూస్తాడు. అదే సమయంలో ఎదురింటి ముందు ఉన్న ముగ్గులో గొబ్బెమ్మలు చూసి, తన ముగ్గులో అవి లేవని వెళ్లి అందులో నుంచి ఒక పెద్ద గొబ్బెమ్మ, చిన్న గొబ్బెమ్మను తెచ్చుకుని తన ముగ్గులో పెట్టుకుంటాడు. అది చూసి రోడ్డు మీద ఉన్న కుక్కలు మొరుగుతుంటే దూరం పొమ్మన్నట్లు చేతితో కసురుతాడు. ఇక్కడ పెద్ద గొబ్బెమ్మ, చిన్న గొబ్బెమ్మ అంటే ఒక తల్లి, కొడుకుని తన జీవితంలోకి తెచ్చుకున్నాడని.. అది చూసి సమాజం నానా మాటలు అంటుంటే ఎదురుతిరిగాడు అన్నట్లు దర్శకుడు సింబాలిక్‌గా చూపించారని ఓ అభిమాని అంటే.. తను ఆ ఉద్దేశ్యంతో ఆలోచించి పెట్టలేదని స్వయంగా విశ్వనాథ్ గారే ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆయన అలా పెట్టకపోయినా సీన్ చూస్తుంటే అది నిజమే కదా అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో ఇల్లంతా నిండిపోయి కళకళలాడుతుంటే.. తన గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు శివయ్య. తన తాతయ్య జీవితాన్నే కథగా రాయాలని భావించిన మనవరాలు.. దానికి 'స్వాతిముత్యం' అని టైటిల్ పెడుతూ పేపర్ మీద రాయడంతో అసలు కథ మొదలవుతుంది.

స్వాతిముత్యం

శివయ్య ఎలాంటివాడో సినిమా మొదట్లో ఒక్క సీన్‌తో చూపించేస్తారు. చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్న శివయ్యకు ఆ చెరువులో ఒంటిపై సగం బట్టలతో స్నానం చేస్తూ కాబోయేవాడి గురించి పాడుకుంటున్న సుబ్బులు(బట్టలు ఉతికే చాకలి మనిషి)ని చూస్తాడు. శివయ్యని దగ్గరికి పిలిచి మాట్లాడుతూ వీపు రుద్దమని సబ్బు చేతికి ఇస్తుంది సుబ్బులు. అసలు ఏ మాత్రం అసభ్యం లేకుండా ఆ సీన్ నడుస్తుంది. ఇంతలో ఆమెకి తెలియకుండా ఇంకో వ్యక్తి వచ్చి సుబ్బులు మీద చేయి వేస్తాడు. అది నచ్చని ఆమె కసురుకుంటుంది. ఇలా ఒక అమ్మాయిని అర్ధనగ్నంగా చూపించే సీన్ విశ్వనాథ్ గారు ఎందుకు పెట్టారనే సందేహం రావొచ్చు. శివయ్య ముట్టుకుంటే ఏమీ అనని ఆ అమ్మాయి.. ఇంకో మగాడు చేయి వేయగానే ఎదిరించింది అంటే మిగతావారికి శివయ్యకు తేడా ఉందని, ఎలాంటి దురుద్దేశం లేని పసి మనసు శివయ్యది అని చూసే ప్రేక్షకుడికి అర్థమవాలి.

స్వాతిముత్యం

చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని, పక్కన కొడుకుతో లలిత పాత్రలో రాధిక గారు కనిపిస్తారు. ఇంట్లో వాళ్లని ఎదిరించి తన కొడుకు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని, ఇప్పుడు కొడుకే లేకుండా పోయాడు, ఒంటరైన ఈ తల్లీకొడుకుల గురించి తమకు ఎందుకని అత్తవారింటి నుంచి లలితను వెళ్లగొడతారు. చేసేది లేక లలిత అన్న తిరిగి తన ఇంటికే తెచ్చుకుంటే, అక్కడ వదిన కూడా లేనిపోని మాటలతో లలితను కష్టపెడుతుంది. బాధల్ని దిగమింగుతూ, ఉన్న ఆ కొడుకే జీవితంగా బతుకు బండి ఈడ్చుకొస్తుంటుంది. గుడిలో ప్రసాదంతో కొడుకు కడుపు నింపి పిల్లాడిని స్కూలుకు పంపుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా లలితకు శివయ్య పరిచయమవుతాడు. తెలిసినవారి దగ్గర సంగీత పాఠాలకు సాయం కోరుతుంది. తన పేరు చెప్తూ వీర వెంకట సత్య శివ సుందర రామయ్య అని.. అందులో వాళ్ల నాన్న, తాత పేర్లు కలిపి ముగ్గురు ఉన్నారని, మరి మీ పేరులో ఎవరున్నారని శివయ్య అమాయకంగా అడిగినప్పుడు.. ప్రస్తుతానికి నేను, నా బాబు అని లలిత చెప్పే అద్భుతమైన సమాధానం మనల్ని ఆలోచించేలా చేస్తుంది.

స్వాతిముత్యం

లలితకు వచ్చిన బాధలు పోవాలంటే, ఆవిడ పేరు చెప్పి ఎవరు మంచి పని చేసినా పుణ్యం వచ్చి కష్టాలు తీరుతాయని చెపితే నమ్మేస్తాడు. దేవుడికి మొక్కుకుని నిప్పుల్లో నడుస్తాడు. ఇదంతా తన కోసం చేస్తున్నాడని తెలుసుకున్న లలితకు శివయ్య అంటే కృతజ్ఞతా భావం కలుగుతుంది. రామాయణంలోని సీతమ్మ కష్టాలను శివయ్య పాటగా పాడుతుంటే.. అది తన జీవితమే అని లలిత ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆమెకు వచ్చిన బాధలు ఇంతటితోనే తీరవని.. ఎవరో ఒక మహానుభావుడు ఆదరించి, తాళి కట్టి అండగా నిలవాలని, అప్పుడే ఈ కష్టాల కడలి నుంచి గట్టెక్కగలదని ఓ రోజు తన బామ్మ చిన్నపిల్లాడికి చెప్పినట్లు చెప్పి నిద్ర పుచ్చితే.. అది తానే ఎందుకు కాకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకే పవిత్రమైన శ్రీ రామనవమి రోజు సీతమ్మ వారికి కట్టాల్సిన తాళిని లాక్కుని అందరూ చూస్తుండగా.. లలిత మెడలో కట్టి తనకు భర్త అవుతాడు. ఊరి పెద్దలంతా కలిసి అపచారం అని, శివయ్యకి ఏమీ తెలియదని, తప్పు చేశావని నిలదీస్తే.. లలిత కష్టాలు పోవాలనే ఈ పని చేశానని ధైర్యంగా సమాధానం చెప్తాడు. అందరి ముందు జరిగిన ఈ హఠాత్ పరిణామానికి ఏం చేయాలో తెలియక అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది లలిత.

స్వాతిముత్యం

ఇంటికి వెళ్లగానే వదిన సూటిపోటి మాటలు తట్టుకోలేక తల పట్టుకుని కూర్చుంటే.. పసివాడైన తన కొడుకు అదేమీ అర్థం కాక తల్లి మెడలో ఉన్న తాళిని చేతితో పైకెత్తి ఆశ్చర్యంగా చూస్తాడు. దీని కోసమా ఇంత రాద్ధాంతం?.. అసలు ఈ పసుపు తాడుకు అంత విలువ ఉందా? .. అన్నట్లు ఓ చిన్నపిల్లాడి కోణంలో నుంచి చూపించే ఆ షాట్ విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టికి నిదర్శనం అని చెప్పొచ్చు.

స్వాతిముత్యం

వదిన తిడుతున్న మాటలకు అడ్డు పడుతూ అప్పుడే అక్కడికి వచ్చిన శివయ్య.. లలిత చేయి పట్టుకుని రోడ్డుపై అందరూ చూస్తుండగా తీసుకెళ్తాడు. ఈ సీన్‌లో వాళ్లు రోడ్డుపై నడుస్తూ ఒక దగ్గర చిన్న బురద కాలువని దాటి మంచిగా ఉన్న దారిలోకి వెళతారు. అంటే కష్టాలను దాటి కొత్త జీవితంలోకి వెళ్తున్నారని చూపించారా ఇక్కడ విశ్వనాథ్ గారు. ఏమో నాకైతే అలాగే అనిపించింది. ఇంటికి తీసుకెళ్లి తన బామ్మ ముందు నిలబెట్టగానే.. మనవడు చేసిన పనికి మనసులోనే ఆనందపడుతూ ఆ పట్టుకున్న చేయిని, లలిత మెడలో తాళిని చూసి పొంగిపోతుంది ఆ ముసలావిడ.

స్వాతిముత్యం

ఆ వెంటనే అల్లుడి దగ్గరికి వెళ్లి లెక్క ప్రకారం తన మనవడికి చెందాల్సిన డబ్బు, పొలం కాగితాలను ఇచ్చేయమని అడుగుతుంది. ఈ క్రమంలో ఆస్తి కాగితాలను లాక్కోవడానికి శివయ్య ప్రయత్నిస్తుంటే.. ఎదురుతిరిగిన ఆ అల్లుడు శివయ్యను కింద పడేసి కర్రతో చావబాదుతాడు. అప్పటివరకు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయిన లలిత కింద పడి ఉన్న తన భర్తకు చేయి అందించి, ఇంకో చేతికి కర్ర అందించి ఎదురుతిరగమని ముందుకు తోస్తుంది. ఇక అంతే ఒక్కసారిగా విరుచుకుపడుతూ శివయ్య.. ఆ అల్లుడిని కొడతాడు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, సినిమాలో హీరో స్టైల్‌గా కొట్టినట్లు కాకుండా చాలా సహజమైన పద్దతిలో నడుస్తుంది ఈ సీన్ అంతా. శివయ్యను ఆపి, మళ్లీ చేయి పట్టుకుని నడిపిస్తూ బామ్మ ముందుకు తీసుకెళ్లి నిలబడుతుంది లలిత.

స్వాతిముత్యం
పట్టు విడిపోతున్న ఇద్దరి చేతులను చూస్తూ.. 'వదలొద్దమ్మా.. అలాగే పట్టుకో, ఇన్ని రోజులు వాడికి అన్నీ నేనై చూసుకున్నా. నా చేయి పట్టుతప్పే సమయానికి దేవుడు నిన్ను నాకు చూపించాడు' అంటుంది. అక్కడే గడపకి ఉన్న పసుపు, బొట్టుని అప్పటివరకు విధవరాలిగా ఉన్న లలిత నుదుటిపై పెట్టిస్తుంది. ముఖ్యంగా ఈ షాట్‌లో ఒకవైపు శివయ్య, తన మెడలో తాళి, నుదుటన పెడుతున్న బొట్టుని హైలైట్ చేస్తూ చూపించడం ఎంతో అందంగా ఉంటుంది.

స్వాతిముత్యం
ఇక తన బాధ్యత తీరిందని సంతోషపడుతూ నొప్పితో కూలిపోతూ సంతృప్తిగా కన్నుమూస్తుంది. ఇదంతా ఏమీ తెలియని అమాయకుడైన శివయ్య.. తన మోకాలి గాయాన్ని చూసుకుంటూ ఉంటాడు. అదే ఫ్రేమ్‌లో మరోవైపు గోడను పట్టుకుని లలిత కొడుకుని చూపిస్తారు. బామ్మ పోయిందని మనవరాలు, లలిత బాధ పడుతుంటే.. ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ శివయ్య, ఆ బాబు స్పందించకపోవడం బట్టి ఆ ఇద్దరూ లోకజ్ఞానంలో ఒక్కటే అని ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చూపించారు. ఒకవైపు వాళ్లు బాధతో ఏడుస్తుంటే.. ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని శివయ్య అడగడం, అది విని లలిత ఆశ్చర్యంగా శివయ్య వైపు చూడడంతో ఇక తన కర్తవ్యం ఏంటో మొదటిసారిగా లలితకు పూర్తిగా అర్థం అవుతుంది.
స్వాతిముత్యం
అక్కడి నుంచి ముందుకు నడుస్తూ.. శివయ్యని ఒకవైపు, కొడుకుని మరోవైపు దగ్గరికి తీసుకుని ఇకపై తనకి ఇద్దరు బిడ్డలు అనేలా గుండెలకు అదుముకుంటుంది. ఇక్కడ శివయ్య, బాబు మధ్య లలిత మెడలో వేలాడుతున్న తాళిని చూపించే షాట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అంత ఎమోషనల్ సీన్‌లో హీరో చేత 'అన్నం పెట్టవా..' అనే డైలాగ్ చెప్పించడం ఏ దర్శకుడు కూడా చేయలేని సాహసం. అక్కడ కథని మాత్రమే నమ్మి అలా చేసిన విశ్వనాథ్ గారు, కమల్ గారు మీ పాదాలకు నా నమస్కారం.
స్వాతిముత్యం
ఇక ఆ ఊళ్లో ఉండలేక లలిత.. శివయ్యని, బాబుని తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోతుంది. సంసార బాధ్యతలు తీసుకుని, ఇంటిని నడిపించాల్సింది మగవాడే కదా! ఉద్యోగం, ఇల్లు గడవడం గురించి లలిత అడిగినప్పుడు.. 'వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు రాదు.. నువ్వే ఉద్యోగం చేయాలి' అని అమాయకంగా శివయ్య చెప్పడంతో లలిత ఆ ఇద్దరు పసివాళ్లను చూసి ముసిముసిగా నవ్వేస్తుంది.
స్వాతిముత్యం
ఓసారి బాబు పక్కన నిద్రపోయిన శివయ్య.. మధ్య రాత్రి అక్కడ నుంచి లేచి వచ్చి లలిత పక్కన పడుకుంటాడు. మెలకువ వచ్చిన లలిత ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి శివయ్యని లేపుతుంది. ఆ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక.. 'ఇదేంటీ.. ఇక్కడ పడుకున్నారు?' అని అడుగుతుంది. దానికి శివయ్య నిజం చెప్పనా? అబద్దం చెప్పనా అంటాడు. నిజమే చెప్పండని ఏం సమాధానం వస్తుందో తెలియని అయోమయంలో ఉన్న లలితతో.. 'బాబు పక్కంతా తడిపేశాడు. అందుకే ఇక్కడ పడుకున్నా' అంటాడు. ఎలాంటి చెడు ఆలోచనలు కూడా లేకుండా కడిగిన ముత్యం లాంటి మనసుని తనివితీరా చూస్తూ.. తన చీర కొంగుని కొంచెం ముడుచుకుని తల కింద పెట్టుకుని శివయ్య పక్కనే పసిపాపలా ముడుచుకుని పడుకుంటుంది లలిత కూడా. ఎంత గొప్పగా ఉంటుందో ఆ సన్నివేశం.
స్వాతిముత్యం
కట్టుకున్న భార్య అవసరాలు ఇంకా చాలా ఉంటాయని, అవి తీర్చాలని సుబ్బులు చెప్పిన మాటలు విని తెలుసుకుంటాడు శివయ్య. అప్పుడే మొదటిసారిగా లలితకు ఒక భర్తకు దగ్గర అవుతాడు. ఈ సందర్భంలో వచ్చే పాట వినడానికి ఎంత బాగుంటుందో, చూడటానికి కూడా అంతే అందంగా ఉంటుంది. ఒక రొమాంటిక్ పాటని కూడా ఇంత కళాత్మకంగా, ఎక్కడా అసభ్యకరం లేకుండా హద్దులు దాటకుండా చిత్రీకరించారు విశ్వనాథ్ గారు. దానికి తగ్గట్లే పాటను కంపోజ్ చేసిన విధానం కూడా. మొదట లలిత పాడుతుంటే, అదే లైన్ శివయ్య పాడుతున్నట్లు.. తాను ఏం చేస్తే శివయ్య కూడా అలాగే అనుకరిస్తూ చేసినట్లు చూపిస్తారు. అంటే తనకు ఆ సంసార బాధ్యత ఎలా చేయాలో నేర్పిస్తున్నట్లుగా సాగుతుంది పాట మొత్తం.
స్వాతిముత్యం
వయసు మీద పడి కొనఊపిరితో చావుబతుకుల మధ్య ఉన్న లలితతో అప్పుడే వెళ్లిపోవాలా అని ఆవేదనగా అడుగుతాడు శివయ్య. అంతవరకూ ఆ దేవుడు ఉంచొద్దా అని లలిత అనగానే.. శివయ్య పైకి చూస్తూ దేవుడిని కొడుతున్నట్లు తనదైన ఒక మేనరిజంతో సైగ చేస్తాడు. శివయ్య పాడిన లాలి పాట వింటూ హాయిగా ఊపిరి వదిలేస్తుంది లలిత. సినిమా మొదట్లో తన బాబుకు లలిత పాడుకున్న అదే లాలి పాటని.. ఇప్పుడు శివయ్య ఏడుస్తూ పాడడంతో లలిత చనిపోయినట్లు ముగించడం విశేషం.
స్వాతిముత్యం
ఈ ఒక్క పాటేమిటీ.. ఇళయరాజా గారు స్వరపరచిన ఈ సినిమాలోని అన్ని పాటలు అద్భుతాలే. అర్థవంతమైన లిరిక్స్‌కి ఆయన మ్యూజిక్ తోడైతే చెప్పేదేముంది.. ఇప్పటికీ ఎప్పటికీ మరిచిపోలేనివి. ముఖ్యంగా సినిమా మొదటి నుంచి వచ్చే ఒక్కో సీన్‌కి ఇళయరాజా గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారని చెప్పాలి.
స్వాతిముత్యం
కమల్ నట ప్రస్థానంలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఇదే అంటే ఆశ్చర్యం లేదు. భారతదేశం తరపున ఆస్కార్‌ ఎంట్రీ సంపాదించిన మొదటి తెలుగు చిత్రం ఇది. అమాయకమైన పాత్రలో, ఆ మేనరిజంతో ఈ పాత్రలో జీవించడం కమల్ తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదు. ఒక్కో సీన్‌లో ఆయన తన నటనతో ప్రాణం పెట్టేశారు. ఇక ఇలాంటి ఒక కళాత్మక చిత్రాన్ని అందించిన విశ్వనాథ్ గారి గురించి చెప్పే అర్హత కూడా నాకు లేదు. అవి చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి.. ఇష్టపడడమే తప్ప ఇది లోటు అని నాకు ఏదీ అనిపించదు. సినిమా లోకానికి ఒక్కరే కళాతపస్వి. మీరు అందించిన ఈ 'స్వాతిముత్యం'.. వందేళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా ఒక ఆణిముత్యం.
స్వాతిముత్యం
నాకు ఎంతో ఇష్టమైన 'స్వాతిముత్యం' సినిమా గురించి నేను రాసింది చదివినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను అర్థం చేసుకుని రాసిన ఈ ఆర్టికల్  మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు కూడా ఈ సినిమా నచ్చిందా?.. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఇంకా ఏ ఏ సినిమాలు అంటే మీకు ఇష్టమో నాకు కామెంట్ ద్వారా తెలపండి. 

THANK YOU

PC & Support by: CH. VAMSHI MOHAN


కామెంట్‌లు