'కళాతపస్వి' పుస్తక ప్రయాణం (Part 1)

 అక్షరాలు ఎప్పుడైనా మీతో మాట్లాడాయా..? నాతో మాట్లాడాయి.. నేను రాసుకున్న అక్షరాలు నాతోనే మాట్లాడుతూ మాకు ఒక గౌరవం కల్పించమని అడిగాయి. నేను చెప్పాను వాటితో.. మీరు ఇంతకన్నా అందంగా కనిపించాలంటే ఒక అర్థవంతమైన రూపం కావాలని.. మీ స్థాయిని పెంచే ఆకారం ఇవ్వాలని.. మిమ్మల్ని తమ చేతి వేళ్లతో తడుముతూ మళ్లీ మళ్లీ చదువుకునేవాళ్ల ముఖంలో సంతృప్తి నింపాలని.. అప్పుడే కదా మీకు ఒక విలువ అని చెప్తే.. అవి కూడా నిజమే కదా అని తలూపి.. ఇంతకీ మమ్మల్ని ఎలా పరిచయం చేద్దామనుకుంటున్నావని నన్ను ఎదురుప్రశ్నలు వేశాయి. అప్పుడు చెప్పాను. ఇంకేదో ఎందుకు..? విశ్వనాథ్ గారి సినిమాల గురించి, ఆ కళాఖండాల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్తానని అనేసరికి.. మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా తెల్లని పేజీల వైపు పరుగులు పెడుతూ.. అందులో వాటి స్థానం ఎక్కడుందో వెతుక్కుని, తిష్ట వేసుకుని కూర్చుని, ఇప్పుడు అందంగా ఉన్నామా అని నాతో అంటూ మురిసిపోయాయి. నేను వాటిని చూసి ముసిముసిగా నవ్వేసరికి, ఇంతకీ మా అక్షర కుటుంబానికి ఏం పేరు పెడుతున్నావని ఆసక్తిగా అడిగాయి.. అప్పుడు చెప్పాను.. 'కళాతపస్వి'.'కళాతపస్వి' పుస్తక ప్రయాణంపుస్తకం.. నేను రాసిన నా పుస్తకం.. దానిపై ఇంటి పేరుతో సహా నా పేరు.. లోపల అమ్మానాన్నల ఫోటో.. అది అలా చూసుకోవాలనేది ఎన్నో రోజుల నా కల.. కానీ, ఆ కల నెరవేరడం అంత తేలికగా జరగలేదు.. బుర్రలో ఎన్నో ఆలోచనలు.. లోలోపల ఎంతో ఆరాటం.. నిద్ర పోని రాత్రులు.. అనుకున్నది అనుకున్నట్లు రాసేంతవరకు ఊరుకోలేదు నా మనసు. అలా పుస్తకం కోసం ఓ సంవత్సరంపైగా నేను చేసిన ప్రయాణాన్ని, ఆ అనుభవాలను మీతో చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే.. ఇది నాకు ప్రత్యేకం.. ఇదే నా మొదటి పుస్తకం.. మర్చిపోలేని జ్ఞాపకం.

చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలను తెగ ఇష్టపడి చూసిన నాకు.. అవి అర్థం చేసుకునే జ్ఞానం ఎంతో కొంత ఉందని అనిపించేది. అందుకే సమయం దొరికినప్పుడల్లా ఆ సినిమాలపై చిన్న చిన్న ఆర్టికల్స్ రాసుకుంటూ బ్లాగ్‌లో పెట్టుకుని అంతటితో సరిపెట్టుకునేవాడిని. అలా కొంతకాలం తర్వాత నా బ్లాగ్‌లో ప్రతి ఆర్టికల్ చదివి, నన్ను ఎంతగానే ప్రోత్సహించే నా స్నేహితుడు వంశీమోహన్ ఒకరోజు నాతో ఇలా అన్నాడు.. విశ్వనాథ్ గారి సినిమాలపై నీకున్న అభిమానాన్ని బాగా రాస్తున్నావ్, అయితే ఎందుకు నువ్వు రాసేది ఇంకాస్త లోతుగా వివరించి అదంతా పుస్తకంలాగా తీసుకురాకూడదని అనిపిస్తుందని తనకు వచ్చిన ఆలోచన నాతో చెప్పాడు. అవును కదా.. ఎందుకు రాయకూడదు.. మనం రాసే విషయం మీద అవగాహన ఉందని తెలిశాక ఎందుకు ఇంకా ఇక్కడే ఆగిపోవాలి. అనుకున్నదే తడవుగా రాయడం మొదలుపెట్టా. అంత గొప్ప సినిమాలు కదా..! ప్రపంచం మెచ్చిన దర్శక మహానుభావుడు కదా..! అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కళాఖండాలు కదా..! అందుకే ఎక్కడా తగ్గకూడదు, బాగా వివరించాలి.. చదివేవాళ్లకు నేను రాసింది బాగా అర్థం కావాలనేది నా తపన. అలా రోజంతా అవే ఆలోచనలతో రాసుకుంటూ వెళ్తున్న నన్ను ఒక ఊహించని పరిస్థితి నిలిపివేసింది. అప్పటిదాకా వాడుతున్న ల్యాప్‌టాప్‌ని నేను పని చేస్తున్న ఆఫీస్‌కి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడెలా..? నేను రాసుకోవడానికి ఉన్న ఒక్క ఆధారం నాకు దూరమైంది. పేపర్ మీద పెన్ను పెట్టి చాలా కాలమైంది.. ఇప్పట్లో అది మళ్లీ జరగని పని. ఇక నాకు అప్పుడు ఉన్న ఒకే ఒక దారి.. సొంతంగా ఇంకో ల్యాప్‌టాప్‌ కొనుక్కోవడం.

అనుకున్నట్లే వెళ్లి ల్యాప్‌టాప్‌ కొనేశా.. ఇక మళ్లీ నా పనిలో నేను పడిపోయా.. ఎంతో ఇష్టపడి పదేపదే చూసి ప్రేమ పెంచేసుకున్న ఆ సినిమాల మీద నా అభిప్రాయం.. ఒక ప్రేక్షకుడిగా నాకేం అర్థమైంది.. ఎందుకు అవి అంత గొప్పగా సినీ చరిత్రలో నిలిచిపోయాయని నాకు తెలిసింది వివరిస్తూ ఒక్కో అక్షరం రాస్తుంటే ఏదో తెలియని అనుభూతి. అనుభూతి అనే కన్నా గౌరవం అంటే సరిగ్గా ఉంటుందేమో..! మరి నేనేంటి.. నాలాంటి ఓ అల్పజ్ఞాని సినీ ప్రపంచాన్ని శాసించిన ఆ కళాఖండాల గురించి వివరించడమేంటి? పైగా అవి మనసు పెట్టి తెరపై చిత్రీకరించిన విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభను నేను కొత్తగా చెప్పడమేంటి? అసలు ఆయన గురించి చెప్పడానికి నేనెవరిని..? ఆయన విద్వత్తు ముందు నేనెంత..? హనుమంతుడి ముందు కుప్పిగంతులే..! అసలు ఇలాంటి ప్రయత్నం చేయాలన్న ఆలోచన రావడమే నాకు ఓ హోదా.. ఓ మర్యాద.. ఓ గౌరవం. ఆ హోదా ఇచ్చింది కూడా ఖచ్చితంగా విశ్వనాథ్ గారు, ఆయన సినిమాలే.'కళాతపస్వి' పుస్తక ప్రయాణంఅంతా బాగానే ఉందనుకుంటుంటే.. మళ్లీ ఇంకో అడ్డంకి.. నేను వాడుతున్న ఆ కొత్త ల్యాప్‌టాప్‌లో ఎందుకో నెట్ సరిగా ఉండట్లేదు.. ఎన్నిసార్లు CONNECT చేస్తున్నా రాసేటప్పుడు దానంతట అదే DISCONNECT అవుతోంది. రాస్తుంటే అక్షరాలు పడట్లేదు. ఎందుకు ఇలా అవుతుందో.. అసలు ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాలేదు, ఎప్పుడూ ఇలాంటిది ఎక్కడా చూడలేదు కూడా. చేసేదేముంది.. నా ల్యాప్‌టాప్‌కి కాళ్లొచ్చి రిపేర్ షాపుకి వెళ్లిపోయింది. మళ్లీ కాస్త గ్యాప్.. ఇది చాలదన్నట్లు మరోవైపు రోజూ ఉండే నా ఆఫీస్ పనులు.. రిపేర్ చేసి మళ్లీ ల్యాప్‌టాప్‌ నాకు తిరిగి అప్పజెప్పడానికి చాలా టైమ్ పడుతుందన్నారు. అవునా..? మరి నా అక్షరాలు ఏం కావాలి..? ఇలా అయితే ఎప్పుడు పూర్తి చేస్తాను..? మళ్లీ టెన్షన్ మొదలైంది. కొన్ని రోజులు ఎదురుచూశా.. అలా ఖాళీగా ఉండిపోయి ఆలోచనలో పడిపోయిన నన్ను.. ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే నా అక్షరాలు.. బిక్కమొహం పెట్టేసి నా వైపు కొంచెం కోపంగా కూడా చూస్తూ అలిగి బుంగమూతి పెట్టుకున్నాయి. విషయం ఏంటి.. ఇప్పుడు మీకేమైందని అడిగితే.. 'ఎందుకు ఖాళీగా ఉన్నావు.. మమ్మల్ని ఇంకెప్పుడు పూర్తి చేస్తావు.. అంతా బాగానే జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఇదేంటి..?' అని నన్ను నిలదీస్తున్నాయి. 'అదేం లేదు.. కొన్ని రోజులు ఓపిక పట్టండి.. నేనేదో ఒక దారి చూస్తా.. మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తా' అని సముదాయిస్తూ వాటి బుగ్గలు పట్టుకుని ఆడించాను. 'హా.. ఇక చాల్లే.. దీనికేం తక్కువ లేదు, ముందు జరగాల్సిన పని చూడు' అని మళ్లీ గుర్తు చేశాయి.

అందుకే ఈ ప్రయాణం ఆగకూడదు.. ఎలాగైనా మళ్లీ రాయడం మొదలుపెట్టాలి. వెంటనే ల్యాప్‌టాప్‌ రిపేర్‌కి ఇచ్చిన షాపుకి వెళ్లిపోయా.. ఇలా కొంచెం అర్జెంటు పని పెట్టుకున్నానని నా అవసరం చెప్పుకున్నా. దాంతో వాళ్లు అర్థం చేసుకుని అప్పటికప్పుడు వేరే చిన్న ల్యాప్‌టాప్‌ ఇచ్చి వాడుకోమన్నారు. ఇది చాలు.. ఇక మళ్లీ నా అక్షరాలను కూర్చడం మొదలుపెట్టా. ఇక్కడ మాత్రం నాకు ఒకటి బాగా అర్థమైంది.. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఏవేవో అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. అయ్యో ఇలా జరిగిందేంటని నిరుత్సాహపడిపోకుండా వేరే దారి ఉందేమో వెతుక్కోవాలి.. కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు. అప్పుడే కదా.. అసలు నువ్వేం చేయగలవనేది నీకు తెలిసేది.. పది మందికి తెలిసేలా నిరూపించుకునేది.

రోజులు గడిచిపోతున్నాయ్.. పుస్తకం కోసం నేను ముందుగా అనుకున్నదంతా రాసుకుంటూ, మరోవైపు ఆఫీసుకి వెళ్లి వస్తూ అలా సాగిపోతుంది నా ప్రయాణం. రాసుకున్నది కొన్నిసార్లు నాకు నేనే చదువుకుంటే, అరే ఇది చాలా బాగా వచ్చిందే అని సంతృప్తి కలిగేది.. ఇంకొన్నిసార్లు మరొకటి చదివితే ఇది కొంచెం మారిస్తే బాగుంటుందేమో అనిపించేది. అలా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్నిసార్లు రాసుకున్నా, ఏం మార్చుకున్నా మొత్తానికి నా కంటెంట్.. నా పుస్తకం చదివేవాళ్లకు నచ్చాలనేదే నా తాపత్రయం. అయితే.. మనం రాసేది నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు విశ్వనాథ్ గారి సినిమాల మీద. ఆయన లేకపోయినా ఆయన కళాఖండాల్లో బతికే ఉన్నారు.. అందుకే ముందు వాళ్ల ఇంటికి వెళ్లి మనం చేస్తున్న ప్రయత్నాన్ని చెప్పి, అనుమతి తీసుకోవాలి. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ విశ్వనాథ్ గారి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లా. చాలా రోజులు కావడంతో అడ్రెస్ సరిగా గుర్తు పట్టలేకపోయా. ఎక్కడో సందుల్లో నుంచి.. కాలనీలు దాటుకుంటూ.. ఇదేనేమో ఇలాగే వెళ్లాలేమో అని ఒక్కో దారిని గుర్తు చేసుకుంటూ ముందుకు కదిలా.

ఆరేళ్ల ముందు విశ్వనాథ్ గారి ఇంటికి ఓ అభిమానిలా వచ్చినప్పటి జ్ఞాపకాలు.. ఆ మధురానుభూతులు మళ్లీ బుర్రలో పరిగెడుతున్నాయి. ఈ రోజు ఆయన ఉండి ఉంటే ఇంకా బాగుండేదేమో కదా అని మనసులో కొన్ని వేల సార్లు అనుకుంటూ అలా నడుస్తూ.. గుడిలో దేవుడు పలకనంత మాత్రాన అక్కడ ఆయన లేనట్లు కాదు కదా.. ఇదీ అంతే అనుకుంటూ మొత్తానికి ఓ ఇంటి దగ్గర ఆగగానే నా కళ్లు జిగేలుమన్నాయి. ఇదే.. ఖచ్చితంగా ఇదే. ఎవరో వచ్చారని తెలుసుకుని విశ్వనాథ్ గారి చిన్నబ్బాయి మొదటి అంతస్తు నుంచి కిందికి దిగి రాగానే.. ఆయనతో నా విషయమంతా చెప్పుకున్నా. అది విన్న ఆయన ముందుగా చాలా సంతోషపడి, మీరు నాన్నగారి సినిమాల మీద పుస్తకం రాయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు.. చాలా మంచి విషయం అని చాలాసేపు మాతో మాట్లాడి పుస్తకానికి అనుమతి ఇచ్చారు.. ఇంకేం దేవుడి వరంతో పాటు ఇప్పుడు పూజారి కూడా కరుణించాడు.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
ఏడాది తర్వాత రాయడం పూర్తయింది.. ఇక తర్వాత చేయాల్సిన పనులు మొదలుపెట్టాలి. అయితే రాసింది అలా పట్టుకుని ప్రింటింగ్‌కు వెళ్లిపోతే ఏం బాగుంటుంది..! మనం రాసుకున్న పుస్తకానికి ఏదో ఓ ప్రోత్సాహం కావాలి.. సరైన ఆశీర్వాదం కావాలి. అందుకే కష్టమైనా కొందరు సినిమా పెద్దలను కలిస్తే బాగుంటుందేమోనని అప్పుడే అనిపించింది. సినిమా రంగంలో ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేవాళ్ల వివరాలు.. వాళ్లు ఎక్కడుంటారు.. వెళ్తే మనకు కలవడానికి అవకాశమిస్తారా.. మన పుస్తకం మరింత ముందుకు వెళ్లడానికి సహకారం అందిస్తారా.. ఇలా రోజంతా ఇవే ఆలోచనలు. అదిగో అక్కడ మొదలైంది నా ప్రయాణంలో మరో మలుపు.

సినిమాటోగ్రాఫర్ MV రఘు గారు.. అప్పటివరకు కేవలం ఆయన పేరు వినడమే తప్ప, ఎలా ఉంటారో ముఖ పరిచయం లేదు. పైగా చాలా ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారట.. వయసులో కూడా చాలా పెద్దాయనట.. మరి మనలాంటి వాళ్లు వెళ్తే అసలు కలవడానికి అవకాశమిస్తారా?.. మన ప్రయత్నానికి తోడుగా నిలుస్తారా?.. ఏమో చూద్దాం. అప్పుడే గూగుల్ తల్లికి అడిగా.. సితార, స్వాతిముత్యం, సిరివెన్నెల, అన్వేషణ, కళ్లు.. ఈ సినిమా పేర్లన్నీ ఆయన వికీపీడియాలో కనిపిస్తున్నాయ్.. ఏంటీ చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ సినిమాలన్నిటికీ కెమెరామెన్ రఘు గారేనా..? ఇంకేం.. అంత అనుభవమున్న వ్యక్తిని కలవడం కన్నా కావాల్సిందేముంది? అంతకన్నా అదృష్టం ఏముంటుంది..? మొత్తానికి నా ఫ్రెండ్ వనరాజ్(గుర్తు పెట్టుకోండి.. ఫ్యూచర్ గ్రేట్ డైరెక్టర్) సాయం చేయడంతో రఘు గారు నడుపుతున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వరకు వెళ్లే అవకాశం దొరికింది. ఆయన లోపల పనిలో బిజీగా ఉన్నారు. కాసేపు వెయిట్ చేయాలి. అలా ఎదురుచూస్తూ ఉన్నంతసేపు మనసులో ఒకటే ఫీలింగ్.. మొదటిసారి ఓ పెద్దాయన దగ్గరికి వెళ్తున్నాం.. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలనే బెరుకు కాస్తా ఉంటూ ఆలోచిస్తుండగా లోపలి నుంచి పిలుపు వచ్చింది.

లోపలికి అడుగుపెడుతూనే ముందుగా నమస్కారం పెట్టాను.. ఆయన కూర్చోండి అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. ఇక నేను చెప్పడం మొదలుపెట్టా. "సార్.. నేను చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారికి చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమాలన్నీ వదిలిపెట్టకుండా మళ్లీ మళ్లీ చూస్తూ పెరిగా. ఊహ తెలిశాక ఎంతో కొంత నాకంటూ రాసుకునే జ్ఞానం అబ్బింది. అలా వచ్చిన ఆలోచనలతో విశ్వనాథ్ గారి అభిమానిగా, సినిమాలను ప్రేమించే మనిషిగా నేనెలాంటి అనుభూతి పొందానో, ఆ కళాఖండాలను చూస్తూ ఎలా ప్రభావితమయ్యానో ఓ ప్రేక్షకుడిగా రాసుకుని, దాన్ని ఒక పుస్తకంలా తెస్తున్నా.. దానికి మీరేమైనా సాయం చేయగలరా" అంటూ తడబడుతున్న మాటలను పరుగులు పెట్టించా. ఇదంతా వింటున్న ఆయన్ను నేను గమనించింది ఏంటంటే.. విశ్వనాథ్ గారు అనే పేరు వినబడిన దగ్గర మాత్రం రఘు గారి ముఖం వెలిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఇలా చెప్తున్నారు.. "నాకు కూడా ఈ 50 ఏళ్ల అనుభవంలో విశ్వనాథ్ గారితో రెండు సినిమాలకు పని చేసే అవకాశం దొరికింది. ఆయనలాంటి దర్శకుడు అంతకు ముందు లేరు, ఇకపై రారు.. ఆయనకున్న విజన్ అలాంటిది మరి" అని రఘు గారు గొప్పగా చెప్పడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా మీకు నేను సాయం చేస్తానని మాట కూడా ఇచ్చారు. ఆయన ఆ మాట అన్నాక నాకు కావాల్సిందేముంది.. అంత అనుభవం ఉన్న మనిషి నన్ను నమ్మి, విశ్వనాథ్ గారి మీద అభిమానంతో ఒప్పుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
చెప్పినట్లుగానే ఒకరోజు ఆయన ఇంటికి పిలిచి, పక్కనే కూర్చోబెట్టుకుని, నాకేం కావాలో చెప్తూ ఓ 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయి తన అనుభవాలను, ఆనాటి జ్ఞాపకాలను ఎన్నో ఎన్నెన్నో నా ముందు ఉంచారు. అప్పుడు నిజంగా నేను అనుభూతి చెందింది ఏంటో తెలుసా.. ఈ రోజు రఘు గారు నాకు వివరిస్తున్న సన్నివేశాలు, వాటి వెనకాల అనుభవాలు ఒకప్పుడు షూటింగ్ సమయంలో విశ్వనాథ్ గారితో కూడా ఇలాగే చర్చించి ఉంటారు కదా.. అప్పట్లో విశ్వనాథ్ గారితో ఎన్నో ఏళ్లు కలిసి పని చేసి, దీన్ని ఎలా చేస్తే తెరపై బాగుంటుందని మాట్లాడుకున్న మాటలు.. ఆ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలను ఇప్పుడు నాతో పంచుకుంటున్నారు. అంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుందని అనిపించిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'సిరివెన్నెల', 'స్వాతిముత్యం' సినిమాల్లోని కొన్ని సన్నివేశాల వెనుక అనుభవాలను ఆయన అలా చెప్తూ వెళ్తుంటే.. మాస్టారి దగ్గర పాఠాలు వింటున్న విద్యార్థిలా మైమరచిపోయి తెలియకుండానే నా కళ్లు చెమర్చాయి.

ఇక ఇప్పుడు ఓ మహా నట శిఖరాన్ని మనం కలవబోతున్నాం. తోట రాముడు.. గిట్ల డిసైడ్ జేసినవా.. రేపే మా చెల్లికి పెళ్లి, జరగాలి మళ్లీ మళ్లీ (ఏంటి వాహ్‌వా వాహ్‌వా అనట్లేదే మీరు..?).. ఇవన్నీ వింటుంటే ఎవరైనా గుర్తొస్తున్నారా..? అవును.. ఒకప్పటి 'యమలీల' నుంచి మొన్న మొన్నటి 'అతడు', 'హరిహర వీరమల్లు' వరకు ఏ పాత్ర అయినా.. ఎలాంటి పాత్రనైనా తన సొంతం చేసుకుని, ప్రతి పాత్రలో తనకంటూ ఓ వైవిధ్యాన్ని కనబరుస్తూ మనమంతా మెచ్చిన తెలుగు చిత్రసీమ ఆభరణం మన భరణి గారు.. తనికెళ్ల భరణి గారు. ఆయన్ని చూడడమే నాలాంటి సినిమా పిచ్చోడికి ఎంతో ఆనందం.. అలాంటిది ఆయన్ని కలవడమా..? అంతకన్నా ఏం కావాలి.. అనుకుని ప్రయత్నిస్తుండగా మొత్తానికి ఆయన నెంబర్ దొరికింది, కానీ చేస్తే ఎలా ఉంటుందోననే భయంతో చాలా రోజుల వరకు ఎలాంటి మెసేజ్, కాల్ చేయలేదు. కానీ, మన పని జరగాలంటే చేసి తీరాలి.

అలా కొన్ని రోజుల తర్వాత ఓ రోజు పొద్దున్నే ఆఫీసుకు వెళ్తూ మెట్రో ఎక్కిన నేను.. 'సర్.. నేను మీ అభిమానుల్లో ఒకడిని, ఒక బుక్ విషయమై మీ సాయం కోసం చేశాను' అని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేశా. ఆయనలాంటి బిజీ యాక్టర్ నా మెసేజ్‌కి రిప్లై ఇచ్చినప్పుడు చూద్దాంలే అని అంతటితో వదిలేశాను. కానీ, విచిత్రంగా ఐదు నిమిషాలకే రిప్లై వచ్చింది. 'నేను అమెరికాలో ఉన్నాను.. విషయమేంటో చెప్పండి.. దాన్ని బట్టి చెప్తాను' అని ఓ ఆరు సెకండ్ల వాయిస్ మెసేజ్ అది కూడా. అంత పొద్దున్నే.. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. ఎంతో ప్రశాంతమైన మనసుతో వెళ్తున్న నాకు ఆ గొంతు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఎన్నో సినిమాల్లో, ఎన్నోసార్లు విని బాగా అలవాటు పడిన ఆ గొంతు.. ఆ రోజు నా కోసం మాట్లాడింది.. ఆ క్షణం నేను ఎంత ఆనందపడిపోయానో, ఎంతలా సంబరపడిపోయానో మీ ఊహకే వదిలేస్తున్నా..!

భరణి గారికి ఉండే బిజీలో అప్పుడప్పుడూ వాట్సాప్‌లో రెస్పాండ్ అవుతూనే ఉన్నారు.. కలుద్దాం అంటున్నారు.. కానీ ఎప్పుడు..? నా పుస్తకం కోసం పెట్టుకున్న పని ఇంకొంచెం తొందరగా అయితే బాగుండుననే ఆరాటం నాది. ఇంతలో ఆయన నుంచి వాట్సాప్‌లో 'తనికెళ్ల భరణి నాటకోత్సవాలు' పేరుతో ఓ ఫోటో వచ్చింది. భరణి గారు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రవీంద్రభారతిలో సన్మానం అంట. వెళ్తే చాలా బాగుంటుంది. ఆయన్ని నేరుగా చూడొచ్చు.. వీలైతే కలవచ్చు కూడా. కానీ, ఆయనకు సన్మానం అంటే పెద్ద పెద్దవాళ్లంతా వస్తారేమో.. నేరుగా కలిసే అవకాశం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. సరే అనుమానాలు ఎందుకు..? ముందైతే వెళ్లి చూద్దాం అనుకుని ఆ రోజు ప్రోగ్రామ్ కోసం రవీంద్రభారతి చేరుకున్నా.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. లోపల ఆడియన్స్ చాలా మందే వచ్చి కూర్చున్నారు. స్టేజ్ మీద భరణి గారితో పాటు సినిమాకు సంబంధించిన కొంత మంది కూర్చుని ఉన్నారు. అందులో కొందరు మనకు బాగా తెలిసినవాళ్లే. ఒక్కొక్కరు మాట్లాడుతూ సినిమాల ద్వారా, రచనల ద్వారా భరణి గారు సాధించిన గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అలా కాసేపటి తర్వాత అందరూ స్టేజ్ నుంచి కిందికి దిగారు.. తర్వాత నాటికలు వేస్తారట. అయితే అలా భరణి గారు స్టేజ్ దిగి ముందు సీట్లలో కూర్చోవడానికి వస్తుండగానే, వెనకాల ఎక్కడో కూర్చున్న నా కాళ్లు ఆగలేదు ఇక.. అప్పటికే కొందరు భరణి గారిని పలకరిస్తూ ఫోటోలు దిగుతున్నారు. నేను వాళ్ల మధ్యలో నుంచి వెళ్లి ఆయన దగ్గర కొద్దిగా ముందుకు వంగి..'సర్.. విశ్వనాథ్ గారి పుస్తకం కోసమని నేను మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాను.. ప్రోగ్రామ్ అయ్యాక మీకు సమయముంటే మరోసారి కలుస్తానండీ' అని అనగానే ఆయనకు అది ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ, హా.. అని తలూపారు. దాంతో నేను మళ్లీ వెళ్లి నా సీటులో కూర్చోవడానికి వెనక్కి వచ్చేశా.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
ప్రోగ్రామ్ మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చారు.. వచ్చిన గెస్టులతో సహా భరణి గారు కూడా స్టేజ్‌కి పక్కనే ఉన్న ఓ గదిలోకి వెళ్లిపోయారు. ఇక ఇదే మంచి సమయం.. వెళ్లి ఆయన్ని కలిసి ఓసారి మాట్లాడాలి. అంతలోనే చాలా మంది లేచి భరణి గారిని కలుద్దామని నాలాగే క్యూలు కట్టారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి వెళ్లడానికి చాలా మందే ప్రయత్నిస్తున్నారు నాతో పాటు. పైగా బయట సెక్యూరిటీ కూడా. వాళ్లతో 'ఒక్కసారి పంపించండి అన్నా లోపలికి.. సార్‌తో ఓ చిన్న విషయం మాట్లాడి వెంటనే వచ్చేస్తా.. ఎక్కువ సమయం తీసుకోను' అని బతిమిలాడా. సరే కాస్త అలా పక్కన ఉండు, లోపలికి వెళ్లాక సార్ మూడ్ ఎలా ఉందో చూసి మాట్లాడు.. అని నాకు అవకాశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాలో నేనే ప్రిపేర్ అవుతున్నా ఆ గ్యాప్‌లో. ఇంతలో నన్ను లోపలికి వెళ్లమని సైగ చేయగానే.. కొంచెం భయంభయంగా ముందుకు కదిలా. లోపలికి నడుస్తున్న ఆ ఒక్క నిమిషంలో నేను చిన్నప్పటి నుంచి భరణి గారిని సినిమాల్లో చూసిన ఏవేవో పాత్రలు నా మైండ్‌లోకి వచ్చేస్తున్నాయి.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారు లోపల ఆయనతో పాటు. ఓ సోఫాలో కూర్చున్న ఆయనకు దగ్గరగా వెళ్లి.. కొంచెం ముందుకు వంగి మళ్లీ నేనొచ్చిన సంగతి చెప్పాను. నా పుస్తకానికి మీరు ముందుమాట రాసి ఇస్తే చాలా సంతోషిస్తా సార్ అని అంటున్న నా మాటలు తడబడుతూ ఏదో రకంగా నా నోటి నుంచి వణుకుతూ బయటికి వచ్చేశాయి. అది విని ఆయన 'అవునా.. ఈ రెండు రోజులు కష్టం కదా, ప్రోగ్రామ్స్ ఉన్నాయి' అనగానే పర్లేదు సార్.. నేను వెయిట్ చేస్తానని చెప్పి, ఒక్క ఫోటో సార్ మీతో అని అడిగా. దానికి ఆయన తలూపగానే అదే సోఫాలో పక్కనే కూర్చోగానే నా భుజంపై చేయి వేశారు. ఆహా.. ఆ స్పర్శతో నేను సోఫాలో కాదు, గాలిలో తేలుతున్నానేమో ఆ క్షణంలో...
(అప్పటి ఫోటో మీరు కింద చూడవచ్చు 👇)
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
రోజులు గడుస్తున్నాయి.. పుస్తకం పనుల్లో బిజీ అయిపోతున్నా.. ఏమేం కావాలి.. ఈ రోజు ఏంటి, రేపు ఏం చేయాలని నా పనుల్లో నేనున్నా. ఇంతలో భరణి గారి దగ్గరి నుంచి మళ్లీ రెస్పాన్స్ లేదు.. మళ్లీ మళ్లీ మెసేజ్ లేదా కాల్ చేద్దామంటే పెద్దవాళ్లు.. ఏమనుకుంటారో, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని భయం. అలా రెండు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి.. భరణి గారు మాత్రం నన్ను కరుణించడం లేదు. ఆయన ముందుమాట ఇచ్చి తనికెళ్ల భరణి అనే పేరుని నా పుస్తకంలో చూసుకుంటే అదొక సంతృప్తి నాకు.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. అలా నా పుస్తకానికి గౌరవం పెంచుకోవాలని ఆరాటపడుతున్నా. ఇక ఏదైతే అది.. ఇంటివరకు వెళ్లిపోతా అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నా. అలా ఒకరోజు అడ్రెస్ వెతుక్కుంటూ బయలుదేరా.. అంత తొందరగా దొరకలేదు.. చాలా సేపు తిరిగా.. ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ ఇంకెక్కడికో వెళ్లిపోతున్నా.. అలా ఆ రోజు సాయంత్రం కాళ్లరిగేలా తిరిగి తిరిగి.. దాదాపు రెండు గంటల అలసట తర్వాత ఎట్టకేలకు ఇల్లు దొరికింది. ముందు కనుక్కుందాం ఇల్లు ఖచ్చితంగా అదేనా.. కాదా..! ఇంటి బయట నుంచి చూస్తే పెద్ద హడావిడిగా లేదు. మనలాంటి మధ్యతరగతి వాళ్ల ఇంటిలాగే అనిపించింది. ఎంతైనా గొప్పవాళ్లులే.. ఎంత పేరున్నా, ఎంత సంపాదించుకున్నా సాదాసీదాగా బతుకుతారు.. ఆడంబరాలకు అస్సలు వెళ్లరు.. జేబులో వెయ్యి రూపాయలు ఉంటే నేనే మహారాజుని అనుకుంటూ దర్జాగా ఖర్చు పెట్టేస్తాం.. అలాంటి మనం ఇలాంటివాళ్లను చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు అనిపించింది. గేటు దగ్గరగా వెళ్లి తలను, కాళ్లను కాస్త పైకి లేపి లోపలికి చూశా.. ఎవరో ఒక అబ్బాయి.. అక్కడ కూర్చుని ఉన్నాడు.. నాకంటే వయసులో చిన్నవాడే.. పిలిచా.. ఇదేనా భరణి గారి ఇల్లు అని అడిగా.. అవునండీ.. మీరెవరు, అపాయింట్‌మెంట్ ఉందా అని అడిగాడు. లేదు.. కానీ సార్‌ని కలవాలి, చిన్న పని.. అని చెప్పగానే.. రేపు సాయంత్రం 5 తర్వాత ఫ్రీ అవుతారు, వీలైతే అప్పుడు రండి అని సమాధానమిచ్చాడు. దాంతో ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చేశా.

మరుసటి రోజు.. సాయంత్రం 4 అయింది.. చకచకా రెడీ అయిపోయి మళ్లీ భరణి గారి ఇంటి దారి పట్టా.. ఈ రోజు ఎలాగైనా పని కానిచ్చుకోవాలి అని మనసులో గట్టిగా అనుకున్నా.. సాయంత్రం 5 గంటలకు అని చెప్తే ఓ అరగంట ముందే అక్కడ ఉన్నా.. ఆయన ఇంటికి కొంచెం దూరంగా ఓ చెట్టు కింద కాసేపు నిలబడి ఎదురుచూస్తున్నా.. గడియారంలో ముల్లు ఏంటి.. ఈ రోజు ఇంత మెల్లగా కదులుతుందని అనిపించింది. మనసులో బెరుకుతో పాటు నా అవసరం తీరాలనే ఆశ.. కలవాలి.. మాట్లాడాలి.. ఇలా అనుకుంటూ ఉండగా మెల్లగా వర్షం మొదలైంది.. ఇదొకటి నా ప్రాణానికి.. ఇలా ఉంటే ఈ రోజు కూడా నా పని అవుతుందా లేదా.. పైకి చూస్తూ ఆ చినుకులతో చెప్పుకున్నా. కాస్త ఆగిపోవమ్మా ప్లీజ్.. నేను కలిసి వెళ్లే ఓ అరగంట వరకు కురవద్దు అని. సరిగ్గా 5 గంటలకు ఒక 5 నిముషాలు ఉండగానే.. భరణి గారి ఇంటి వైపు మెల్లగా నడిచా. భరణి గారు బయటికి వెళ్లడానికి డ్రైవర్ కారుని సిద్ధం చేస్తున్నారు.. అసిస్టెంట్ కూడా అక్కడే ఉన్నారు.. భరణి గారు ఇంకా పైనుంచి కిందికి దిగలేదేమో. ఇంతలో ఆ అసిస్టెంట్ దగ్గర నా అవసరం చెప్పుకున్నా.. సార్ బయటికి వెళ్లాలి, ఇప్పుడు కష్టం.. మీరు రేపు రండి అంటున్నారు ఆయనేమో. అలా కాదన్నయ్యా.. నిన్న కూడా వచ్చా.. ఒక్క 2 నిమిషాలు అంతే.. సార్‌తో మాట్లాడి వెళ్తానని అడగగానే సరే.. కాసేపు వెయిట్ చేయండి చూద్దామని ఆపారు. ఆ సెల్లార్‌లో మెట్ల పక్కనే ఒక మూలకు నేను నిలబడి ఉన్నా.. ఆయన పైనుంచి దిగి కిందికి వస్తే ఆ మెట్ల నుంచే రావాలి. వర్షం ఇంకా చిన్నగా కురుస్తూనే ఉంది. ఆ రోజు ఓవైపు నా పుస్తకం కోసం నేను పడిన ఆశ, భరణి గారి లాంటి నటుడి మీద నాకున్న అభిమానం.. మరోవైపు ఈ వర్షంలో ఎదురుచూపులు.. మొత్తంగా ఇది నాకు జీవితంలో గుర్తుండిపోతుంది అలా.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
భుజానికి బ్యాగుతో.. వర్షానికి కాస్త తడిసిన జుట్టుతో.. చేతిలో ఉన్న మొబైల్‌లో సమయం చూసుకుంటూ.. భరణి గారు వస్తారని ఎదురుచూస్తూ అలా చాలాసేపు నిలబడి ఉన్నా. పైనుంచి ఆయన గొంతు వినబడుతోంది. ఆయనతో పాటే ఉన్న ఎవరితోనో ఏదో విషయం గురించి మాట్లాడుతూ వస్తున్నట్లున్నారు. మెట్ల పైనుంచి అడుగుల శబ్దం కూడా వినబడుతోంది.. మెట్లను ఆనుకుని పక్కనే నిలబడి అలాగే ఉన్నా. మరొక్కసారి భరణి గారిని చూసి మాట్లాడబోతున్నా ఈ రోజు.. ఇది ఆనందమా.. టెన్షనా..? దీనికి ఏ పేరు పెట్టాలి..? ఆయన కింది వరకు వచ్చేశారు.. ఇంతలో నిలువెత్తు విగ్రహం నా పక్కనే నిలబడింది.. అమ్మో.. ఈయనేంటి.. ఈయన్ని చూస్తేనే నోట్లోంచి మాట రావట్లేదు నాకు. చివరి మెట్టు దిగుతూ అక్కడే ఉన్న నా వైపు చూశారు.. నేను ఏమీ మాట్లాడకుండా ముందుగా కాళ్లకు దండం పెట్టా. ఇంతలో ఆయన నన్ను అలాగే చూస్తూ.. "ఎవరూ..? ఏం కావాలి..?" అని గట్టిగా అడిగారు. ఒక్కసారిగా నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఒక్క క్షణం నాకు మాట రాలేదు. ఈయనేంటి.. ఇన్ని రోజులు అడిగాక.. ఇన్ని సార్లు తిరిగాక మళ్లీ ఎవరని అంటారు..??????? 😳😱😮😒😩😵

(మిగతా ప్రయాణం తర్వాతి ఆర్టికల్‌లో...) 


THANK YOU

PC: CH.VAMSI MOHAN




FOR KALATHAPASWI BOOK PURCHASE:

CONTACT: 82477 65506, 8179075376(Whatsapp Also)
Mail: boddularakesh@gmail.com
or Comment here in blog also

కామెంట్‌లు