విశ్వనాథుడి 'సిరివెన్నెల'

సిరివెన్నెల..

ఈ పేరు చూడగానే అబ్బే.. ఇదేదో పాత కాలం సినిమా కదా..! ఈ ఆర్టికల్ మనమేం చదువుతామని వెనక్కి వెళ్లిపోకండి. మీ కోసమే.. ఈ జనరేషన్ వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఇది రాసింది. ఎందుకు అంటారా..? ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పటి సినిమాలు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. ఒకసారి 1986లో వచ్చిన 'సిరివెన్నెల' మూవీ చూడండి. అంత గొప్పగా ఏం ఉందో తెలుసుకుంటారు. ఇప్పుడు కనపడని ఎన్నో రకాల ప్రయోగాలు ఈ సినిమాలో ఎంత గొప్పగా చూపించారో తెలుసుకుంటారు.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

మామూలుగా సినిమాలో హీరో, హీరోయిన్ ఉంటారు.. ఏదో ఓ సందర్భంలో కలుస్తారు.. పరిచయం పెరుగుతుంది.. ప్రేమ.. గొడవలు.. పెళ్లి.. ది ఎండ్ .. ఇదే కదా అన్ని సినిమాల్లో. కానీ 'సిరివెన్నెల' సినిమాలో అది జరగడం ఎంత కష్టమో తెలుసా..? హీరో పండిట్ హరిప్రసాద్(సర్వదమన్ బెనర్జీ) గుడ్డివాడు, హీరోయిన్ సుభాషిణి(సుహాసిని) మూగ అమ్మాయి. ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా..? ఒక్కసారి ఆలోచించండి. హరి చూడలేడు.. సుభాషిణి నోరు తెరిచి చెప్పలేదు.. సైగలు చేస్తే హరికి కనపడదు. అదిగో అక్కడే ఈ చిత్ర దర్శకులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు పెద్ద సాహసం చేశారు. కన్వర్జేషన్ కష్టం అనుకున్న ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది..? కథని ఎలా నడిపిస్తారు? ఎన్నో రకాల భావాలు వ్యక్తపరిస్తే తప్ప కనిపించని ప్రేమ, అభిమానం అనేవి ఇలాంటి రెండు పాత్రల మధ్య ఎలా సాధ్యం..?

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

మామూలుగా విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లలో పెద్ద హడావిడి ఉండదు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లైఫ్ జర్నీ.. ట్రైన్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. రైలులో ప్రయాణిస్తున్న సుభాషిణి పేపర్ చదువుతూ ఒక యాడ్ చూస్తుంది. ఆ యాడ్‌లో ఒకరు ఫ్లూట్ వాయిస్తున్న ఫోటో ఉంటుంది. తల ఎత్తి చూస్తే ఆ యాడ్‌లో ఉన్న మనిషి తన కళ్ల ముందే కూర్చుని తనతో పాటు జర్నీ చేస్తుంటాడు. అతను ఓ గొప్ప విద్వాంసుడని తెలుసుకుంటుంది. ఆటోగ్రాఫ్ కోసం మాటలు రాని సుభాషిణి తన కోరికని పేపర్‌పై రాసి అతను కూర్చున్న పక్కన సీటుపై ఉంచుతుంది. అది చూడలేని హరి మామూలుగా అలా ఉండిపోతాడు. తను 'చూడలేడు' అని తెలియని ఆ అమ్మాయి పట్టించుకోవడం లేదని అనుకుంటుంది. మొత్తానికి విషయం తెలుసుకున్న సుభాషిణి అన్నయ్య తన చెల్లెలి తరఫున ఆటోగ్రాఫ్ అడుగుతాడు. తన సిస్టర్ 'మాట్లాడలేదు' అని చెప్తాడు. అయ్యో పాపం అనుకుని హరి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో తను 'చూడలేడు' అని సుభాషిణి తెలుసుకుంటుంది. అంతకు ముందు తన గురించి తప్పుగా అనుకున్నందుకు మనసులో గిల్టీగా ఫీల్ అవుతుంది. మొదటి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి గౌరవ భావం ఏర్పడుతుంది.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ సీన్ సినిమా చరిత్రలోనే ఎక్కడా వచ్చి ఉండదు. తను చేసే జాబ్ కి అడ్డంగా ఉన్నాడని శుభలేఖ సుధాకర్ ఒక పోటీకి హరిని రెచ్చగొడతాడు. ఆ పోటీ ఏంటంటే.. కాలుతున్న మంట పైకి, కిందికి లేస్తుంటే దానికి అనుగుణంగా మ్యూజిక్ వాయించాలి. అవతలి మనిషికి తేలికే.. మరి హరి ఎలా చూస్తాడు? ఎలా మంటకి తగ్గట్లుగా ఫ్లూట్ వాయిస్తాడు? ఇక్కడే ఆ కళాతపస్వి మ్యాజిక్ చేశారు. చూడలేని హీరో హరి మంటకి దగ్గరగా నిలబడతాడు. తన ఒంటికి తగులుతున్న వేడి తీవ్రత బట్టి ఫ్లూట్ వాయిస్తాడు. ఓ కళాకారుడు మనసు పెడితే ఏమైనా చేయగలడని నిరూపించారు ఈ సీన్‌తో విశ్వనాథ్ గారు.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

మూవీలో 'ఈ గాలి.. ఈ నేల..' పాట అందరికీ తెలుసు కదా. పాట చివరలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సంఘటన ఉంటుంది. తన్మయత్వంతో హరి ఫ్లూట్ వాయిస్తుంటే సుభాషిణి తన మనసులో భావాలను పేపర్‌పై రాస్తుంది. మరి తను 'మాట్లాడలేదు'.. ఎలా తన ఫీలింగ్స్ చెప్తుంది? ఇదే.. వేరే సినిమాలో అయితే పాట వరకు హీరోయిన్ డ్రీమ్‌లో పాడుతున్నట్లు చూపించేవారు.. మరి విశ్వనాథ్ గారు ఏం చేశారు? సుభాషిణి రాసిన అక్షరాలు పైనుండి కురుస్తున్న వర్షానికి కరిగి చుక్కలుగా ఫ్లూట్ నుండి వచ్చేలా చేశారు. అప్పుడు వెనక నుండి అమ్మాయి పాడుతున్నట్లుగా వాయిస్ వస్తుంది. ఎక్కడా సినిమాటిక్‌గా అనిపించకుండా గొప్పగా చిత్రీకరించారు ఈ సీన్.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

కళ్లు లేని హరికి తన స్పర్శతో ప్రకృతి అందాలు చూపిస్తుంది జ్యోతిర్మయి అనే పాత్ర. హరిని తాకుతూ సూర్యోదయం, మబ్బులు, హరివిల్లు, మంచు బిందువులు, ఎండలో వర్షం.. ఇవన్నీ ఎలా ఉంటాయో అనుభూతి కలిగిస్తుంది. తను ఇచ్చే ప్రోత్సాహం, సహాయంతో హరి సంగీతంలో మరింత పేరు తెచ్చుకుంటాడు. ఒక కళ్లు లేని వాడికి స్పర్శతో అన్ని అనుభూతులు కలిగిస్తూ మనసుతో ప్రకృతి అందాలు చూపొచ్చని ఎలా ఊహించి ఉంటారో కదా విశ్వనాథ్ గారు. అదే విధంగా క్లైమాక్స్‌లో జ్యోతి చనిపోతుంది. హరికి తెలిస్తే భరించలేడని తనకి తెలియనివ్వకుండా విషయం దాస్తారు. కానీ ''మనసుతో నాకు ప్రకృతి అందాలు చూసే శక్తి ఇచ్చిన జ్యోతి.. ఆ ప్రకృతిలో కలిసి పోయినప్పుడు నా మనసు తెలుసుకోలేదా'' అని హరితో చెప్పించి వారి మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి అర్థం చెప్పారు. ఇక అక్కడితో కథ ముగుస్తుంది.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

ఇలాంటి మరెన్నో అద్భుతమైన సన్నివేశాలు ఈ సినిమాలో మనం చూడొచ్చు. 'సిరివెన్నెల' మూవీ ఇంత అందంగా రూపు దిద్దుకోవడానికి ఎంతో మంది మహానుభావులు కృషి చేశారు. దర్శకుడిగా కళాతపస్వి విశ్వనాథ్ గారు ఒక శిఖరం అయితే.. మూవీలో అన్ని పాటలు రాసిన సీతారామశాస్త్రి గారు మరో ఎత్తు. ఇదే ఆయన మొదటి సినిమా. తర్వాత ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కే.వీ.మహదేవన్ గారు సంగీతం అందించారు. ఈ సినిమా మొత్తం మనం వినే ఫ్లూట్ మ్యూజిక్ ప్రముఖ విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసియా గారు వాయించారు. డ్రమ్మర్ శివమణి డ్రమ్స్ వాయించడంతో పాటు సినిమాలో చిన్న రోల్ చేశారు. హీరో, హీరోయిన్ సర్వదమన్ బెనర్జీ, సుహాసినితో పాటు మీనా గారు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పారు. ఎన్నో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇంతటి అందమైన దృశ్యకావ్యాన్ని మనకు అందించిన కళాతపస్వి కే.విశ్వనాథ్ గారికి మనసారా కృతజ్ఞతలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను... ధన్యవాదాలు.

విశ్వనాథుడి 'సిరివెన్నెల'

PC: Ch. Vamshi mohan 


కామెంట్‌లు