'మిథునం'.. అమ్మానాన్నల కథ

మనిషిగా పుట్టడం తేలికే.. కానీ, మనిషిలా బతకడమే కష్టం. వినడానికి ఇది మామూలుగా ఉన్నా, ఈ చిన్న మాట వెనక చాలా అర్థం దాగి ఉంది. ఈ మాట విన్న మొదటిసారి ఎందుకో బాగా ఆలోచనలో పడ్డాను.. అందుకే మరింత తెలుసుకోవాలని ఈ సినిమా మొత్తం చూశాను.. బాగా నచ్చడంతో ఈ రోజు ఇలా మీ ముందుకు తెస్తున్నాను. 'మిథునం'.. ఇప్పటివాళ్లకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు, తెలిసినా చూడాలని అనిపించకపోవచ్చు. చూసే ఓపిక కూడా ఉండకపోవచ్చు. హా.. ఇలాంటి సినిమాలు నీలాంటి పిచ్చోడు తప్ప ఇంకెవరు చూస్తారని కూడా నా గురించి అనుకోవచ్చు.. కానీ, ఒక్కసారి మనసు పెట్టి చూడండి.. అప్పుడు మీరే ఇది ఇంత బాగుందని నాతో తప్పక చెప్పి తీరుతారు. ఇది ఇద్దరు భార్యాభర్తల జీవిత కథ.. వయసు మీద పడిన ఆలుమగల మధ్య అల్లుకున్న అనుబంధాల కథ.. తోడునీడలా కలిసున్న ఇద్దరు దంపతుల కథ.. మన అమ్మానాన్నల కథ.. అప్పదాసు, బుచ్చిలక్ష్మిల ప్రేమకథ....'మిథునం'.. అమ్మానాన్నల కథఅప్పదాసుకి బుచ్చి అంటే ఎంత ఇష్టమో అసలు మాటల్లో చెప్పలేమండీ.. ఒక్క క్షణం కూడా బుచ్చిని విడిచి ఉండలేడు, ఎప్పుడూ బుచ్చి కొంగునే అంటిపెట్టుకుని తిరుగుతుంటాడు. మరి బుచ్చికి ఏమైనా తక్కువా? భర్త చేసే అల్లరి చేష్టలను భరించలేక విసుక్కుంటుందే కానీ, ఆ విసుగులో కూడా ఎంత ప్రేమో.. మగడంటే ఎంత అనురాగమో తనకి. తలంటు పోస్తుంది.. కమ్మగా వండి పెడుతుంది.. ప్రేమ చూపిస్తుంది.. గారాలు పోతుంది. మొత్తంగా అప్పదాసులో సగభాగం బుచ్చి.. బుచ్చిలో సగభాగం అప్పదాసు. ఆ మాటకొస్తే వారి శరీరాలే వేరు కానీ, మనసులు ఒకటే.. రండి, ఆ ఇద్దరి స్వచ్ఛమైన మనసులను చదివేద్దాం.. అమ్మానాన్నలు ప్రేమించుకుంటుంటే, దెబ్బలాడుకుంటుంటే, ఒకరి తోడు కోసం మరొకరు ఆరాటపడిపోతుంటే ఆ ముచ్చటను పక్కనే ఉండి ముచ్చటగా మనమూ చూసేద్దాం..'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథఅప్పదాసు భోజన ప్రియుడు. ఒక్కో వంటకం గురించి నోరారా వివరిస్తూ ఆ తాలింపులు, చిటపటల గురించి చెప్తూ ఉంటే వింటున్న మీకు కూడా నోరూరకుండా ఉంటుందా చెప్పండి? అది ఎంతలా అంటే.. ఆవకాయ, గోంగూరల మీద పాట కూడా పాడేస్తుంటాడు. వినాయక పూజ చేస్తూ పత్రి గురించి మానేసి కరివేపాకు ఘుమఘుమల గురించి వర్ణించేస్తుంటాడు. ఇక కాఫీ మీద ఉన్న ఇష్టంతో పదప్రయోగాలు కూడా చేసేస్తుంటాడు. అప్పదాసుకు ఉన్న తిండి యావను ఏళ్లుగా భరిస్తూ బుచ్చి పైపైకి కసురుకుంటుందే కానీ.. లోలోపల మాత్రం ఎంతో ఇష్టంతో అన్నీ కమ్మగా వండి పెడుతుంది. తింటున్నంతసేపు పక్కనే కూర్చుని విసనకర్ర విసురుతూ పతిసేవ చేసుకుంటుంది. కడుపు కాస్త మాడితే రెండు ముద్దలు ఎక్కువ తింటారని బుచ్చి చెప్పే ఆ మాటలో భర్తపై ఎంత ప్రేమో చూడండి.. పసిపాపడిలాంటి అప్పదాసుకి బుచ్చి ప్రేమగా బువ్వ పెట్టే అమ్మే అనుకోండి ఆ సమయంలో.'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథకొబ్బరి కోరుతున్నప్పుడు పక్కనే ఉంటే అస్సలు మిగల్చడని, అప్పదాసుని అటకెక్కించేస్తుంది. కిందికి దిగడానికి అవకాశం లేకుండా నిచ్చెన తీసేస్తుంది. మన్ను తింటున్నాడని చిన్నికృష్ణుడిని రోకలి బండకు బంధించేసిన యశోదమ్మ కూడా ఇలాగే ఉండేదేమో బహుశా..!ఇక అప్పదాసు కోపాన్ని పట్టగలమా..? పైన అటకపై ఆ పెద్దమనిషి చిర్రుబుర్రులాడుతుంటే.. కింద నింపాదిగా కొబ్బరి తురుముతూ బుచ్చి తనకేం పట్టనట్లు తన పనేదో తాను చేసుకుంటుంది. ఊరగా ఊరగా ఊరగాయ.. కోరగా కోరగా కొబ్బరి.. అప్పటికీ అంత కోపంలో కూడా కొబ్బరిని బాగా మెదగనివ్వవే.. నువ్వుపప్పులు వేయవే.. దోరగా వేగనీ.. పెళ్లాన్ని కసురుకుంటూ చిన్నపిల్లాడిలా మారాం చేస్తూ కూడా ఆ పచ్చడి కమ్మగా చేస్తుందో లేదోననే బెంగే అప్పదాసుకి. మొత్తానికి ఆ పచ్చడిని రుచి చూశాక నీ చేతిలో ఏదో మహత్యం ఉందే అని పెళ్లాన్ని మెచ్చుకోకుండా ఉండలేడు. మరి ఎంతైనా అమ్మ చేతి వంటకు వంకలు పెట్టగలమా చెప్పండి.'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథఅమ్మానాన్నలు భార్యాభర్తలుగా ఒక్కటైన ఆ పెళ్లి తంతును, ఆ పాతకాలపు రోజులను చాలా ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటుంటే ఎంత మురిపెంగా ఉంటుందో ఆలోచించండి. ఇది నువ్వు కాపురానికి వస్తూ కట్టుకున్న చీర అని చెప్తూ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటున్న మొగుడి మాటలకు.. సిగ్గు పడుతూ తన మొహాన్ని దాచుకుంటున్న బుచ్చి అమ్మలా ఎంత అందంగా ఉంటుందో అప్పుడు. ఇది చిన్నాడికి భోగి పళ్లు పోసినప్పుడు నువ్వు కట్టుకున్నావని చేతుల్లో అపురూపంగా పట్టుకున్న ఆ తెల్ల చీరని ఇద్దరూ చూసుకుంటూ మురిసిపోతుంటే అది మనసుని ఎంతలా తడిమేస్తుందో.. ఎప్పుడో చాన్నాళ్ల కిందటి విషయాలన్నీ అప్పదాసు అంత బాగా గుర్తు పెట్టుకుని మరీ చెప్తుంటే బుచ్చి ముసిముసిగా నవ్వుతూ సంబరపడిపోతూ.. ఈ మనిషికి ఇవన్నీ ఇంతలా ఎలా గుర్తున్నాయని ఆశ్చర్యపోతుంది. మరి ఏమనుకున్నావ్.. అందరూ వేరు అప్పదాసు వేరు....'మిథునం'.. అమ్మానాన్నల కథఓ అర్ధరాత్రి పూట నిద్ర పట్టక అప్పదాసు మంచం మీది నుంచే ఇలా అడుగుతాడు..'బుచ్చి.. నీ కన్నా నేను ముందు వెళ్లిపోయాననుకో, ఎలా ఉంటుందంటావ్?' అని.. అంతకన్నా అదృష్టమా అని బుచ్చి సమాధానం. 'ఓసి నీ దుంపతెగ.. ఎప్పుడు పోతానా అని గోతికాడి నక్కలా ఎదురుచూస్తున్నావన్న మాట.. పోనీ నా కన్నా ముందు నువ్వే పోయవనుకో..' అని మళ్లీ అప్పదాసు ప్రశ్న. భర్త పక్కనే పడుకుని కళ్లు మూసుకునే ఇవన్నీ వింటూ ముక్తసరిగా సమాధానమిస్తున్న బుచ్చి.. అయినా ఆపకుండా మాట్లాడుతూనే ఉన్న అప్పదాసు. 'ఇద్దరినీ కలిపి తీసుకెళ్లే మార్గం లేదే!..' అప్పదాసు మరో ఆలోచన.. 'లేకే.. ఉంది ఇటు చూడు..' అంటున్న అప్పదాసు వరుసపెట్టిన మాటలకు మత్తు కళ్లతోనే లేచి కూర్చుంటుంది బుచ్చి. చూస్తే తన కొంగును చేతికి కట్టేసుకుని చూపిస్తుంటాడు అప్పదాసు. ఇప్పుడు వాడు విడివిడిగా ఎలా తీసుకెళ్తాడో నేనూ చూస్తా అని గోముగా పలుకుతాడు. అప్పదాసు చేసిన ఆ పిచ్చి పనికి కళ్ల నిండా నీళ్లు తిప్పుకుంటూ 'పిచ్చి మనిషి..' అని బుచ్చి అంటుంటే.. 'ఊహూ బుచ్చి మనిషిని..' అని భార్య గుండెల మీద తల వాలుస్తూ అంటాడు అప్పదాసు. ఇదంతా చూస్తుంటే మన మనసు కూడా ఒక్కసారిగా జివ్వుమనక మానదంటే నమ్మండి. దాంపత్యం అంటే ఇంతే కదా.. ఒకటిగా ముడి వేసుకున్న రెండు  శరీరాలు, రెండు మనసులు.'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథదొంగ బెల్లం, దొంగ ముద్దు.. ఎంత రుచిగా ఉంటాయో అది అనుభవించినవారికే తెలుస్తుంది. ఇంటెడు చాకిరీ చేసి కాస్త మధ్యాహ్నం పూట నడుం వాలుద్దామని బుచ్చి సేదతీరుతుంటే.. పిల్లిలా దొంగతనానికి పూనుకుంటాడు అప్పదాసు. వంటింట్లో అంతపైన అందకుండా పెట్టేసిన బెల్లం దొంగింలించి తినాలని నానా తంటాలు పడిపోతాడు. చడీచప్పుడు లేకుండా చేద్దామనుకున్న అప్పదాసు చేతి వేలికి గాయం చేసుకుంటాడు. ఎర్రగా రక్తం కారిపోతున్న వేలిని చూసి గాబరపడి వచ్చేసిన బుచ్చి.. వెంటనే పసుపు అందుకుని ఆ గాయానికి అద్దుతుంది. తెల్లని బట్టను వేలికి చుట్టి కాలి మీద కూడా వేసుకున్నారా అని బాధతో అడుగుతుంది. భర్తలో చిన్నపిల్లాడి చేష్టలు చూస్తూ ఈ బెల్లం కోసమేనా, అడిగితే ఇచ్చేదాన్ని కదా అంటూ అప్పదాసు చేతిలో ఇంత ముక్క పెట్టేస్తుంది. దొంగ బెల్లం, దొంగ ముద్దు.. అవి అనుభవిస్తే కానీ తెలియవంటాడు అప్పదాసు. చేతిలో పడిన బెల్లం ముక్కను అపురూపంగా చూస్తూ దానికి ముద్దు పెడతాడు. 'ముద్దు బెల్లానికి.. పెళ్లానికి కాదు..' అంటుంటే భర్త మాటలకు మురిపెంగా సిగ్గు లేని జన్మ అని బుచ్చి అంటుంటే.. ఆ ఆలుమగల చిలిపి సరసాలు చూసి నీ మొహంలో ఓ కొంటె నవ్వు  పుట్టేస్తుంది. 'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథభార్యాభర్త, ఆలుమగడు, మొగుడుపెళ్లాం.. అన్నీ చెరిసగమే కదా. ఒకసారి మెడలో ముడి పడిపోయాక, చిటికెన వేళ్లు పెనవేసుకున్నాక ఇక అవి రెండు శరీరాలు కాదు, ఒకటే అని భావించాలి. పెళ్లాం చీరని ఉతికేస్తున్న అప్పదాసును చూసి.. మీరు నా చీర ఉతకడమేంటి? ఆపేయండి అంటున్న బుచ్చితో ఇలా అంటాడు. ఏ.. నువ్వు నా పంచె ఉతికితే లేనిది, నేను నీ చీర ఉతికితే తప్పా? అని. నిజమే కదా, భార్యాభర్తల్లో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని ఏముంది..? భార్యే అన్ని పనులు చేయాలనీ, మొగుడికి సేవలు చేయాలనీ, ఆ మొగుడు దర్జాగా కూర్చుని అన్ని సపర్యలు చేయించుకోవాలని ఎక్కడుంది..? మామిడికాయలు కోస్తూ బుచ్చి పడిపోయినప్పుడు కాలికి నూనె మర్దన చేస్తూ కాసేపు ఓర్చుకోవే అంటూ భార్యకు సపర్యలు చేసే అప్పదాసు ప్రేమను మనం వెల కట్టగలమా? దాంపత్యమన్నాక ఒకరికి ఒకరు తోడుగా, అండగా కలిసి ఉండడమే కదా. అదిగో చూడండి.. ఆ సీతాకోకచిలుక ఎంత అందంగా ఉందో అని దూరంగా రెక్కలాడిస్తున్న దాన్ని చూపిస్తున్న బుచ్చి, పెళ్లాం భుజం మీద చేయి వేసి నవ్వుతూ ఆవైపు చూస్తున్న అప్పదాసు.. బంగారు జింకని కోరిన సీతమ్మవారికి అది తెచ్చిస్తానని మాట ఇస్తున్న రామచంద్రుడిలా కనిపిస్తాడు నాకైతే.'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథఆరుబయట గవ్వలాటతో కాలక్షేపం చేస్తూ.. పంటి కింద వేసుకోవడానికి చెకోడీలు పక్కనే ఉంచుకుని పచ్చని చెట్ల మధ్య అమ్మానాన్నలు  ఆడుకుంటుంటే చూసే మన దిష్టి తగిలేయదూ. అయితే అప్పదాసు కాస్త చిలిపి కదా.. పెళ్లాన్ని మాటల్లో పెడదామని, అదిగో చూడు.. ఎర్రని ముక్కుతో రామచిలుక మామిడి పిందె ఎంత చక్కగా తింటుందో అని దృష్టి మరల్చి ఇటు పావులు కదిపేస్తుంటాడు. గమనించిన బుచ్చి.. అయ్యో దేవుడా, నా పావు కదిపేశాడు.. తొండి.. ఈ ఆట నేనొప్పుకోను, ఒరేయ్ మాయల ఫకీరు ఆడదానికి అన్యాయం చేశావంటే నరకానికి పోతావని అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు.. అమ్మ అలక ఇంత అపురూపంగా ఉంటుందా అనిపిస్తుంటుంది అక్కడ చూస్తూ ఉంటే.. 'మిథునం'.. అమ్మానాన్నల కథఎందుకొచ్చిన సంసారం.. ఎందుకొచ్చిన ఈ తంటాలు.. ఆ ద్రాక్షారామం సంబంధం చేసుకున్నా అయిపోయేది, నా బతుకు బాగుపడి ఉండేదేమో అని బుచ్చి చిరాకు పడిపోతుంటే, పెళ్లాం మాటలకు అప్పదాసు బుంగమూతి పెట్టేస్తాడు. తన పెళ్లానికి తనే అందరి కన్నా గొప్పగా కనబడాలని ఏ భర్తకు ఉండదు చెప్పండి.  బుచ్చి అలా పదేపదే ద్రాక్షారామం సంబంధం గురించి గుర్తు చేస్తుంటే అప్పదాసుకి ఎంత కడుపు మంటో. అనుకుంటే మాత్రం అయిపోతుందా ఏంటి.. ఎవరికి ఎవరిని ముడి వేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ద్రాక్షారామం సంబంధం లేదు.. వల్లకాడు లేదు.. ఊరికే మిమ్మల్ని ఉడికించడానికి అని బుచ్చి అసలు నిజం చెప్పేస్తుంటే.. అప్పుడు అప్పదాసు కళ్లల్లో ఆనందం చూడాలి. తన సగభాగమైన బుచ్చి జీవితంలో తనకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదని.. తనకు దొరికినట్లుగా తోడునీడ ఆ భగవంతుడికి కూడా దొరికి ఉండదని  ఆనందపడిపోయే పిచ్చిమారాజు మా అప్పదాసు. అందుకే ఆ ఆనందం తన నుంచి దూరం కాకూడదని, ఆ ఆనందాన్ని తనతో పాటే శాశ్వతం చేసుకోవాలని, ఆ ఆనందంలోనే కన్నుమూయాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అలా పడుకున్నవాడు తెల్లారేసరికి ఇక ఎంత లేపినా లేవలేదు.'మిథునం'.. అమ్మానాన్నల కథ'ఆట గదా జననాలు.. ఆట గదా మరణాలు.. మధ్యలో ప్రణయాలు ఆట నీకు..' ఏదో బతికేస్తున్నాం.. గొప్పగా బతికేస్తున్నాం.. ఎంతో సంపాదిస్తున్నాం.. బంధాలు పెంచేసుకుంటున్నాం అని మురిసిపోతుంటావు కదా. నువ్వు పుట్టడం, చావడం ఈ రెండే నిజం.. మధ్యలో జరిగేవన్నీ ఆ పైవాడు ఆడుకునే ఆటలే. ఆట కదరా శివా.. ఆట కద కేశవా.. చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చి భర్తను నిద్ర లేపుదామని వచ్చిన బుచ్చికి అటు నుంచి ఉలుకూపలుకూ ఉండదు. అప్పటిదాకా గుండెల్లో మోస్తున్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్లుగా అప్పదాసు కుర్చీ పక్కనే కూలబడిపోతుంది. నేను ముందు ఎక్కడ రాలిపోతానేమోనని క్షణం క్షణం భయపడుతూ చచ్చేదాన్ని అని కన్నీరు పెడుతూ భగవంతుడితో చెప్పుకుంటుంది. మొగుడి చావు కోరుకునే వెర్రి ముండలు ఉంటారా అనుకోకు.. ఆయనకి చీకటంటే భయం.. ఉరుమంటే భయం.. మెరుపంటే భయం.. ఏ అర్ధరాత్రో ఆకలి అంటూ లేచి కూర్చుంటే ఎవరు చేసి పెడతారు? నువ్వు చేసి పెడతావా దేవుడా..? అందుకే నేను ముందు పోతే ఈయన ఎంత అవస్థలు పడేవాడో అని చావులో కూడా భర్త సుఖాన్నే కోరుకునే బుచ్చి లాంటి మహా పతివ్రతను అమ్మ అని కాకుండా ఇంకే పేరుతో పిలవగలను..?'మిథునం'.. అమ్మానాన్నల కథ'మిథునం'.. అమ్మానాన్నల కథఇంత గొప్ప కథనాన్ని 'మిథునం' అనే నవల ద్వారా శ్రీరమణ గారు మనకు అందిస్తే.. దానికి ఒక దృశ్యరూపకం ఇచ్చి తెరకెక్కించిన ప్రముఖులు తనికెళ్ల భరణి గారికి పాదాభివందనాలు. పెళ్లి, దాంపత్యం, తోడునీడ అనే పదాలకు అర్థం మర్చిపోతున్న ఇప్పటి తరానికి నిజంగా ఈ చిత్రం చాలా అవసరం. అప్పదాసు, బుచ్చి అనే రెండు పాత్రలను తెర మీద భరణి గారు తీర్చిదిద్దిన విధానం నిజంగా అమోఘం. ఇక ఈ రెండు పాత్రల్లో జీవించేసిన బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారి నటన గురించి చెప్పడానికి నా వయసు, అనుభవం ఏ మాత్రం సరిపోవు. ఏ సన్నివేశంలోనూ ఆ ఇద్దరు నటీనటులు ఎక్కడా నాకు కనిపించలేదు.. అప్పదాసు, బుచ్చిలక్ష్మి మాత్రమే కనిపించారు. అంతలా మైమరిచిపోయేలా ఆ పాత్రల్లో ఆ ఇద్దరు పరకాయ ప్రవేశం చేశారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతః

🙏🙏🙏🙏🙏


THANK YOU

PC: CH.VAMSI MOHAN

కామెంట్‌లు