సాగర సంగమం.. NO END FOR ANY ART

ఒక సక్సెస్ స్టోరీని ఎవరైనా సినిమా తీస్తారు.. తీస్తే ఎవరైనా చూస్తారు.. హీరోని గొప్పగా చూపించేసి, హీరో ఏదైనా చేయగలడని ఎలివేషన్ ఇస్తే విజిల్స్ వేస్తూ మళ్లీ మళ్లీ చూస్తారు. మరి ఒక ఫెయిల్యూర్ స్టోరీని సినిమాగా ఎవరు తీస్తారు.. అంత ధైర్యం చేసి తీస్తే ఎవరైనా చూస్తారా..? జీవితంలో ఓడిపోయిన ఒక మనిషి కథ చెప్తా అంటే ఎవరు వింటారు..? అదిగో ఈ ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోయా. ఇన్నేళ్లుగా ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నా.. అభిమానిని అవుతూనే ఉన్నా. ఒక చక్కని కథని చెప్పడానికి అందులో బలం ఉంటే చాలు.. అది అనుకున్నట్లుగా తెర మీద చూపించగలిగే సత్తా ఉన్న దర్శకుడు ఉంటే చాలు.. దాన్ని నమ్మి డబ్బులు ఖర్చు పెట్టే ధైర్యం ఉన్న నిర్మాత ఉంటే చాలు. మాసిన గడ్డం, పాత చొక్కా, భుజానికి సంచి, అందులో మందుసీసా... చూడగానే వీడేంటి ఇలా ఉన్నాడని అనిపించే ఒక పాత్రలో హీరోని చూపించే ధైర్యం ఇప్పుడు ఏ దర్శకుడికి ఉందని? ఒక్క విశ్వనాథ్ గారికి తప్ప.. అలాంటి పాత్రలో నటించే సత్తా ఎవరికి ఉందని? ఒక్క కమల్ హాసన్‌కి తప్ప..! అదే ఈ 'సాగర సంగమం'.సాగర సంగమం.. NO END FOR ANY ARTసినిమా మొదట్లోనే ఒక రిక్షావాడు బాలు(కమల్ హాసన్) మీదికి చెప్పులు విసురుతాడు. ఒక మహానటుడికి అలాంటి ఇంట్రడక్షన్ ఎవరైనా పెడతారా అసలు..? అసలు ఏ కమర్షియల్ హీరో ఒప్పుకుంటాడని? ఇళయరాజా గారి అమోఘమైన సంగీతానికి జానకమ్మ అద్భుతమైన గొంతు కలుపుతుంటే స్టేజీపై శైలజ నృత్య ప్రదర్శన మొదలవుతుంది. తన అలంకరణ మీద, ప్రేక్షకులు కొట్టే చప్పట్ల మీద తప్ప చేసే నాట్యంపై శ్రద్ధ లేని శైలజ ప్రవర్తన పట్ల నిరుత్సాహపడిపోతాడు బాలు. 'నాట్యశాస్త్రానికే తీరని కళంకం' అని పేపర్‌లో పెద్ద హెడ్ లైన్‌తో ఆర్టికల్ కూడా వేస్తాడు. అలా రాసినందుకు క్షమాపణ చెప్పాలని పిలిపించినప్పుడు బాలు.. శాస్త్రీయ నృత్యం అందులోని సంప్రదాయాల గురించి చెప్తూ డాన్స్ చేసి చూపించే సీన్ అద్భుతం కదూ!సాగర సంగమం.. NO END FOR ANY ARTఫుల్లుగా తాగేసి ఒకవైపు విపరీతంగా దగ్గుతూనే.. మరోవైపు పాటకు తగ్గట్లుగా భంగిమలు ప్రదర్శిస్తూ నృత్యం చేసే కమల్‌లో ఒక సంపూర్ణ కళాకారుడిని చూస్తాం అక్కడ. ఇది భరతనాట్యం, ఇది కథాకళి, ఇది కథక్ అని బాలు వివరించి చూపిస్తుంటే, ఇళయరాజా గారి పాట టేప్ రికార్డర్‌లో మళ్లీ మళ్లీ ప్లే అవుతుంటే.. గుండెల్లో ఆ సంగీతానికి స్థానం పదిలం చేసుకుంటాం. అన్ని రకాల డాన్సులు చేసి, ఇది కదా నువ్వు మనసు పెట్టి చేయాల్సిన నృత్యం అని శైలజకి చూపిస్తున్నప్పుడు బాలు కాలు తగిలి పైకి ఎగిరే టీ గ్లాసుల ప్లేటు చేసే చప్పుడు కూడా ఆ సీన్‌కి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.సాగర సంగమం.. NO END FOR ANY ARTబాలుకి రఘులాంటి గొప్ప స్నేహితుడు.. అలాంటివాడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఎవరికీ దొరకడేమో. రోజూ తాగేసి ఇంటికి వచ్చినా, ఎన్ని గొడవలు చేసినా, తప్పతాగి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా అన్నీ భరించి స్నేహం అనే ఒక్క బంధం కోసం బాలు చేయిని చివరి వరకూ వదలని మనుషుల్లో దేవుడు రఘు. స్నేహితుడిని మంచి స్థాయిలో చూడాలని కోరుకునే రఘు లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. బాలు నాట్యం నేర్చుకోవాలనుకునే మొదటి రోజుల్లో గురువుగారిని కలుద్దామని వెళ్లినప్పుడు కూడా తోడుగా వెళ్తాడు. అందరూ అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కింద మోకాళ్ల మీద కూర్చున్న బాలు.. గజ్జెలు కట్టుకుని తాళానికి తగ్గట్లుగా కదులుతున్న వారి పాదాల వంక అపురూపంగా చూడడం శాస్త్రీయ నృత్యంపై బాలుకి ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. ఆ షాట్ నిజంగా అద్భుతం.సాగర సంగమం.. NO END FOR ANY ARTసినిమాలో అవకాశం.. కావాల్సినంత డబ్బు.. కానీ, అక్కడ మనసు పెట్టి చేసే డాన్స్ కన్నా, కుప్పిగంతులే కావాలి ఆ సినిమా వాళ్లకి. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకుని.. ఆ కళనే తన శ్వాసగా ఊపిరి తీసుకుంటున్న బాలు.. ఆ కుప్పిగంతులకు మనసు ఒప్పుకోక చెట్టు చాటుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే ఆ కళపై తనకు ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. నిజమైన కళాకారుడు ఎప్పుడూ తన కళనే నమ్ముకుంటాడు తప్ప.. డబ్బు అన్ని సమయాల్లో జీవితానికి సంతృప్తిని ఇవ్వదు. ఆ కళ తనలో ఉన్నన్ని రోజులు ఆ కళాకారుడు ఖచ్చితంగా ధనవంతుడే.. వేరే ఐశ్వర్యం అక్కర్లేదు. అలాంటి వారిలో బాలు ఒకడు.సాగర సంగమం.. NO END FOR ANY ARTఫోటోగ్రాఫర్ కుర్రాడితో బాలు గుడిలో ఫోటోలు తీయించుకునే సీన్ గుర్తుందా? స్టడీ.. భంగిమ.. అంటూ వచ్చీరాని పనితనంతో చుక్కలు చూపిస్తుంటే.. అది కూడా తెలియదు నీ బొంద అని కుర్రాడు ముద్దుముద్దుగా పలుకుతుంటే, ఒక్క ఫోటో కూడా సరిగా తీయడం లేదని బాలు తంటాలు పడే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఏదైనా భంగిమ పెడతాను.. అప్పుడు ఫోటో తీయు అని బాలు చెప్తుంటే.. అదేదో త్వరగా పెట్టు బాబు ఆకలేస్తుందని అమాయకంగా అడిగే ఆ పిల్లాడి చిలిపి అల్లరి మనకు బాగానే ఉన్నా.. బాలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చి వీళ్లు పడుతున్న పాట్లను చూసి నవ్వుకుంటుంది మాధవి(జయప్రద). పసుపు పచ్చ రంగు చీర, దానికి బంగారు వర్ణంలో పెద్ద అంచు, నుదుటన పెద్ద బొట్టు, తలలో మల్లెపూలతో గుడిలో దేవతలా ఉంటుంది. స్తంభాల చాటున వీళ్లకు కనపడకుండా నిలబడి.. చేతిలో కెమెరాతో బాలు ఒక్కో భంగిమని క్లిక్‌మనిపిస్తున్నప్పుడు జయప్రద గారు ఎంత అందంగా కనిపిస్తారో మన రెండు కళ్లతో కాదు.. మనసు పెట్టి చూడాల్సిందే.సాగర సంగమం.. NO END FOR ANY ARTఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. బాలు అంటే కూడా కన్నతల్లికి విపరీతమైన వాత్సల్యం. కొడుకు ఎదుగుతుంటే చూసి సంతోషపడాలని.. గొప్ప డాన్సర్‌గా చూడాలని ఆ పిచ్చితల్లి కలలు కంటుంది. ఒకవైపు వంట పనులు చేస్తూనే.. మరోవైపు కొడుకు చేతిలో చెంచాలు పట్టుకుని క్లాసికల్ డాన్స్ చేస్తుంటే ముసిముసిగా నవ్వుకుంటూ పుత్రోత్సాహంతో మురిసిపోతుంది. కాయకష్టం చేసి సంపాదించిన ఆ కొంచెం డబ్బును కూడా కొంగుకు ముడి వేసుకుని కొడుకు కోసం దాచిపెడుతుంది. అమ్మ తన కోసం కనే కలలను ఎప్పటికైనా నిజం చేయాలని, అమ్మ కళ్లల్లో ఆనందం చూడాలనేది బాలు తాపత్రయం. ఆ తల్లి ఆశకు తోడు మాధవి అండ దొరుకుతుంది బాలుకి. మనలో కళ ఉండడం ముఖ్యం కాదు. అది తెలుసుకుని వెన్నుతట్టి ప్రోత్సహించని మనుషులు లేనప్పుడు, ప్రతిభను గుర్తించి చప్పట్లు కొట్టనప్పుడు ఎంత ఉన్నా, ఏమున్నా ఆ కళకు అర్థం లేదు.సాగర సంగమం.. NO END FOR ANY ARTఆలిండియా మ్యూజిక్ & డాన్స్ ఫెస్టివల్‌కి చాలా గొప్ప గొప్ప కళాకారులు వస్తారు, అంత మంది పెద్దవాళ్ల ముందు పెర్ఫార్మ్ చేయాలంటే మనలాంటి వాళ్లకు రాసి పెట్టి ఉండాలండీ అని బాలు తనకు లేని అదృష్టాన్ని గురించి నిట్టూర్చేస్తాడు. ఈ సారి నా దగ్గర కొన్ని పాసులు ఉన్నాయి, మీరు వెల్దురు లెండి అని పాంప్లెట్ అందించి బాలు పక్కకు చేరి తన మోకాళ్లపై చేతుల్ని బిగించి కూర్చుంటుంది మాధవి. ఆహా.. ఈయన ఎంత గొప్ప డాన్సరో తెలుసా..? ఆవిడ ఎలాంటి డాన్సరో తెలుసా అని గొప్పగా చెప్పేస్తూ తిప్పుతున్న పేజీల మధ్యలో CLASSICAL DANCE RECITAL by Sri.BALAKRISHNA అన్న పేరు, పక్కనే నృత్య భంగిమలో నిల్చున్న తన ఫోటో చూడగానే ఆశ్చర్యంతో ఆగిపోతాడు బాలు. పక్క నుంచే అన్నీ గమనిస్తూ 'ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే..' అని చూపించగానే మాటలు పెగలక మాధవి చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేస్తాడు. అనుకోని అదృష్టానికి మొహంలో నవ్వు తెచ్చుకుంటూ, మరోవైపు కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ గర్వంతో తలపైకెత్తి చూస్తాడు బాలు. ఏదైనా గొప్పగా సాధించినప్పుడు పట్టరాని ఆనందంతో ఏడ్చేస్తామని, అది మిస్ ఇండియా పోటీలాంటి వాటిల్లో చూస్తుంటామని, ఇక్కడ కూడా అదే చేయాలని విశ్వనాథ్ గారికి అనిపించిందట. అలా అనిపించిన మరుక్షణమే కమల్.. LAUGH అని విశ్వనాథ్ గారు అరవడం, అది విని షాట్ మధ్యలోనే ఉన్న కమల్ అప్పటికప్పుడు గ్రహించి కట్ చెప్పకుండా ఏడుస్తూనే మళ్లీ గట్టిగా నవ్వేయడం చకచకా జరిగిపోయాయట. ఒక అద్భుతమైన సీన్‌లో అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్ చేసిన విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభకు, అది విని గ్రహించి వెంటనే ఎక్స్‌ప్రెషన్స్ మార్చి నటించిన కమల్ నటనా కౌశలానికి మనం ఎన్ని చప్పట్లు కొడితే సరిపోతుంది?సాగర సంగమం.. NO END FOR ANY ARTఇక ఆలిండియా మ్యూజిక్ & డాన్స్ ఫెస్టివల్‌లో పెర్ఫార్మ్ చేయాల్సిన ఆ రోజు రానే వచ్చేస్తుంది. అమ్మను ఎదురుగా కూర్చోపెట్టుకుని స్టేజీపై డాన్స్ చేయాలని కొండంత ఆశతో సిద్ధమవుతుంటాడు బాలు. కానీ, ఆ అదృష్టం అందుకునేలోపే తల్లి చావుబతుకుల మధ్య మంచం పడుతుంది. అమ్మను అలా చూసి కంటతడి పెడుతూనే పాంప్లెట్‌లో తన ఫోటోను చూపిస్తూ 'ఇది నేను.. బాలకృష్ణ..' అని పెగలని గొంతులో చెప్తాడు. కాలికి గజ్జె కట్టుకుని ఫెస్టివల్‌లో చేయాల్సిన డాన్స్‌ని అక్కడే అమ్మ ముందు నివేదనగా చేసి చూపిస్తాడు. గుండె బద్దలవుతుండగా.. ఊపిరి బిగబట్టుకుని.. ఎదురుగా కొడుకు చేసే తాండవాన్ని చివరి చూపుగా చూస్తుంది ఆ తల్లి. ప్రాణం వదిలిన కన్నతల్లిని నీళ్లు నిండిన కళ్లతో చూడలేక, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంటే మువ్వలు కూడా బాధతో చిన్నగా సవ్వడి చేస్తుంటాయి. ఆ వెనకే వస్తున్న ఇళయరాజా గారి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ మన మనసుల్ని పిండేస్తుంది. తల్లి తన కోసం కొంగుకు ముడివేసి దాచిన డబ్బును చూసి మరింత కుమిలి కుమిలి ఏడుస్తుంటే చూస్తున్న ప్రేక్షకుడి హృదయం కరగకుండా ఉంటుందా? చివరి శ్వాస వరకు తన కోసమే బతికిన అమ్మ ప్రేమకు బానిసగా కాళ్ల మీద పడి ఏడుస్తుంటే.. పక్కనే ఒక ఖాళీ పళ్లెంని చూపిస్తారు. అది అలా ఎందుకు పెట్టారో, దాని అర్ధమేంటో.. నాలాంటి అల్పజ్ఞానికి అర్థం కాలేదు విశ్వనాథ్ గారు..!సాగర సంగమం.. NO END FOR ANY ARTసముద్రంలో ముందుకు, వెనక్కి లయబద్ధంగా కదులుతున్న అలలు చూసే మనకు ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ, లోపల ఉండే అలజడిని హోరు రూపంలో బయటికి తెచ్చేవరకూ మనకు తెలియదు. మనిషి కూడా అంతేనేమో..! జీవితంలో కష్టాలను కడుపులోనే ఉంచుకుని, పైకి నవ్వుతూ ఈ సమాజంలో ఒకడిగా నిలబడే ప్రయత్నం చేస్తాడు. సముద్రం లోతు ఎంత ఉందో మనం ఎప్పటికీ చూడలేం, కానీ, మనిషి లోతును కన్నీళ్లు తుడిచి వెంట ఉంటే సన్నిహితులు మాత్రమే చూడగలరు. తల్లిని కోల్పోయి ఒంటరైన బాలు మనసుకు ఆలంబనగా మాధవి వెంటే ఉంటుంది.. శ్రేయోభిలాషిగా పక్కనే ఉండి కాపాడుతుంది. ఎలాంటి సంబంధం లేని ఒక మనిషి మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయందించి నడిపిస్తుంటే.. ఆ మనిషి జీవితాంతం తోడుగా ఉంటే బాగుండు అని మనసు కోరుకోవడం సహజం. అందుకే తన జీవితంలో ఒక వెలుగుగా వచ్చి దారి చూపిస్తున్న మాధవిని పెళ్లి చేసుకోవాలని బాలు మనసు కోరుకుంటుంది. అదే మాట చెప్పాలని మాధవికి ఫోన్ చేస్తాడు.. 'ఎప్పుడూ నా పక్కనే ఉంటారా?.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను' అని గంపెండత ఆశతో అడిగి ఎదురుచూస్తుంటే అటు నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. కళ్లతో మాత్రం అవునని చెప్తూ.. హఠాత్తుగా అలా అడగ్గానే ఏం చెప్పాలో తెలియక స్పందించలేని ఒక ఆడపిల్ల మనసు మాధవి రూపంలో అందంగా కనబడుతుంది.సాగర సంగమం.. NO END FOR ANY ARTముఖ్యంగా ఈ సన్నివేశాన్ని విశ్వనాథ్ గారు ఎంత అద్భుతంగా తెర మీద చూపించారో నా మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మౌనమే సమాధానమైన మాధవి తన చీర కొంగును భుజం మీదికి అంటున్నప్పుడు కొంగుతో పాటు చేతికి ఒక గులాబీ వస్తుంది. అందివచ్చిన అవకాశానికి ఎలా స్పందించాలో తెలియక, చేతికి వచ్చిన గులాబీని అపురూపంగా తాకుతుంది. ఆ వెనకే సుతిమెత్తంగా వినబడుతున్న ఇళయరాజా గారి సంగీతం గిలిగింతలు పెడుతుంది. చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసి కాలింగ్ బెల్ కొడుతుంటే.. వెనకే కుండీలో ఉన్న గులాబీ మొక్క ముళ్లు బాలుని గుచ్చుకుని నేనున్నానంటూ గుర్తు చేస్తుంది. తలుపు తీసి ఎదురుగా ప్రత్యక్షమైన బాలుని చూసి ఒక్క క్షణం ఆగిపోయిన మాధవికి అదే గులాబీని మొక్క నుంచి తుంచి చేతికి అందిస్తాడు. అప్పటివరకు వారి మధ్య ఉన్న స్నేహం అనే బంధం ఒక మెట్టు పైకెక్కి పెళ్లి ప్రస్తావన దగ్గర ఆగిపోయిన నుంచి మాధవిలో తెలియని ఒక బెరుకు మొదలవుతుంది. ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ చూసే కళ్లు, వణుకుతున్న పెదవులు బాలుకి ఏదో చెప్పాలని పరితపిస్తాయి. ఏమరుపాటులో కింద పడిపోయిన గులాబీని పైకి తీసి మళ్లీ మాధవికి అందిస్తాడు. ఇలా పెళ్లి అనే విషయం బాలు, మాధవిల మధ్య వచ్చిన తర్వాత పదేపదే గులాబీని రిఫరెన్స్‌గా చాలా బాగా వాడారు అనిపించింది. సాగర సంగమం.. NO END FOR ANY ART'పలికే పెదవి వణికింది ఎందుకో.. వణికే పెదవి వెనకాల ఏమిటో..  కన్నె ఈడు ఉలుకులు.. కంటిపాప కబురులు' వారిద్దరి మధ్య దోబూచులాడుతూ మౌనంగానే కోటి భావాలను వ్యక్తపరుస్తాయి. కానీ, ఆ మౌనాన్ని బద్దలు చేస్తూ అప్పుడే బాలుకి తెలుస్తుంది మాధవికి అప్పటికే పెళ్లయిపోయిందని.. పెళ్లయిన మూడో రోజే ఆస్తి గొడవల వల్ల విడిపోయారని. ఇలా కొన్ని రోజుల తర్వాత ఇలా బాలుకి దగ్గరయిందని. జీవితాంతం తోడుగా ఉంటుందనుకుని ఆశపడి గుండెల్లో గుడి కట్టుకున్న దేవత అప్పటికే వేరొకరి సొంతమని తెలుసుకున్నాక.. బాలు మనసు బాధతో మూగబోతుంది. తన పరిస్థితికి ఎవరిని నిందించాలో తెలియక సముద్రం ఒడ్డున తాండవం చేస్తుంటే.. బాలు జీవితాన్ని ఒంటరి చేయకుండా తనకు తోడుగా మిగిలింది ఈ నాట్యం ఒక్కటే అని అర్థమయ్యేలా చూపించారు. మాధవి జీవితంలో నుంచి వెళ్లిపోయిన తన భర్త తిరిగి వస్తాడు. దీంతో ఆ దంపతులు ఇద్దరినీ మళ్లీ ఒక్కటి చేయాలని, వాళ్ల కాపురం నూరేళ్లు పండితే కళ్లారా చూడాలని కోరుకుని బాలు వారిని ఒప్పిస్తాడు. తన జీవితంలోకి వస్తాడనుకున్న బాలు అక్కడితోనే వాళ్ల బంధానికి ముగింపు చెప్పడంతో.. అప్పటివరకు తన జడలో ఉన్న గులాబీని తీసి కింద పెట్టేస్తుంది మాధవి. ఈ చిన్న రిఫరెన్స్‌ని ఇంత బాగా సన్నివేశానికి అద్ది, మాటల్లో చెప్పలేని భావాలను అద్భుతమైన రీతిలో ఒక గులాబీ పువ్వు ద్వారా చూపించిన విశ్వనాథ్ గారూ.. మీ కళాత్మకతకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం..?సాగర సంగమం.. NO END FOR ANY ART'మీ పక్కన నాక్కూడా కొంచెం చోటు ఇవ్వండి..' అని గతంలో మాధవితో పలికిన మాటలను గుర్తు చేసుకుంటూ.. తన గుర్తుగా ఆ దంపతులను ఒక ఫోటో తీసుకుంటాడు. తన సంసారాన్ని మళ్లీ చక్కదిద్దిన శ్రేయోభిలాషిని చూస్తూ మాధవి గౌరవంగా రెండు చేతులు జోడించి కళ్లతోనే కృతజ్ఞత తెలుపుతుంది. జన్మనిచ్చిన తల్లి దూరమైంది.. తోడుగా నిలిచిన శ్రేయోభిలాషి వేరొకరి సొంతమైంది.. ప్రాణం పెట్టి చేసే నాట్యం పది మంది మెప్పు పొందలేక అంతలోనే ఆగిపోయింది. జీవితంలో తనకంటూ ఇంక ఏం మిగిలిందని ఓడిపోయి, అలసిపోయి తాగుడుకు బానిసై బాలు బతుకును నెట్టుకొస్తుంటాడు. ఏళ్లు గడుస్తాయి. ఆ నటరాజుకు నివేదనగా అంకితం చేయాల్సిన నాట్యాన్ని కుప్పిగంతులు వేసి కించపరిచిందని తన కూతురు శైలజ గురించి పేపర్లో రాసింది ఈ బాలునే అని తెలుసుకుంటుంది మాధవి. ఒకప్పటి శ్రేయోభిలాషి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. అందరూ దూరమయ్యాక, తాగుడుకు బానిసై చావు బతుకుల మధ్య కాలం గడుపుతున్న బాలుని వెళ్లి కలవాలనుకుంటుంది. కానీ, తన కాపురం నూరేళ్లు కలకాలం పచ్చగా ఉండాలని ఆశపడ్డ బాలు ఎదుటికి.. నుదుటిపై బొట్టు లేకుండా విధవరాలిగా వెళ్లలేక సతమతమైపోతుంది. కూతురు శైలజని.. బాలుకి శిష్యురాలిని చేసి నాట్యంలో ఓనమాలు దిద్దించాలని, ఇలా అయినా బాలు ఆరోగ్యాన్ని దగ్గర నుంచి చూసుకోవచ్చని ఆశ పడుతుంది మాధవి. మనం కోరుకున్న కొందరు వ్యక్తులు మన జీవితంలో ఎప్పటికీ ఉండలేకపోవచ్చు.. కానీ, వారి మీద ఉన్న అభిమానం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాళ్లు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా వాళ్ల ఆనందం కోసం మన మనసు ఆరాటపడుతుంది. అది మాటల్లో చెప్పలేని పవిత్రమైన బంధం.. దానికి ఏ పేరూ పెట్టలేం.సాగర సంగమం.. NO END FOR ANY ARTతాగినవాడు అబద్దం చెప్పడు అంటారు.. మామూలుగా మంచి మాటలు చెప్తే ఎవరైనా వింటారా? అందుకేనేమో 'తకిట తధిమి తందానా..' అని బాలు పాత్ర ద్వారా పాడిస్తూ, డాన్స్ చేయిస్తూ తాగుబోతు వేదాలు వల్లించినట్లు చూపించారు. 'నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన.. ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన' అని వేటూరి గారు తన కలంతో మనిషి జీవితానికి ఒక్క పాటతో అర్థం చెప్పారు. తప్పతాగి తూలుతూ బావి మీద నిలబడి బాలు ప్రమాదకరంగా డాన్స్ చేస్తుంటే.. ఎదుటపడలేక చాటు నుంచే చూస్తూ కంటతడి పెడుతుంది మాధవి. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని భయపడి స్వయంగా వెళ్లి బాలుని ఆపాలి అనుకుంటుంది. కానీ, ఎలా..? విధవరాలిగా తనను ఇలా చూస్తే బాలు తట్టుకోగలడా..? తట్టుకుని బతకగలడా..? అందుకే విధి లేని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి పరుగెత్తుకెళ్లి వేడుకుంటుంది. చేసేదేం లేక అక్కడ ఉన్న కుంకుమని తీసుకుని నుదుటన అద్దుకుని తన శ్రేయోభిలాషి కోసం వైధవ్యాన్ని కూడా పక్కనపెట్టేస్తుంది. తూలి పడిపోతున్న బాలుకి చేయందించి మొదటిసారిగా ఎదురుపడుతుంది. చాలా ఏళ్ల తర్వాత మాధవిని అక్కడ చూసేసరికి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు అభిమానం నిండిన చూపుతో బాలు ఆగిపోతాడు. మాధవి నుదుటన వర్షపు నీటికి చెరిగిపోతున్న బొట్టును కాపాడాలని చేయి అడ్డు పెడతాడు. ఆహా.. ఎంత చక్కని సన్నివేశం. నటించడం మర్చిపోయి ఆ పాత్రల్లో జీవిస్తున్న కళాకారులు, వెనక రాజా గారి ఆరార్ వింటుంటే.. మనసు చలించి విశ్వనాథ్ గారి స్టైల్ ఆఫ్ మార్క్ టేకింగ్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.సాగర సంగమం.. NO END FOR ANY ARTవెన్నంటే ఉండి ముందుకు నడిపించిన శ్రేయోభిలాషి మళ్లీ దేవతలా ఎదురుపడడం, శైలజ తన కూతురే అని చెప్పడం, ఒకప్పుడు శైలజ నాట్యాన్ని అవహేళన చేసినందుకు సిగ్గుపడి క్షమాపణ అడుగుతానని బాలు ఒప్పుకోవడం, ఇక నుంచి తాగుడు పూర్తిగా మానేసి శైలజని ఎలాగైనా గొప్ప నృత్యకారిణిగా తీర్చిదిద్దుతానని మాట ఇవ్వడం.. బాగా ఆకలితో ఉన్న కళాకారులు తమ పాత్రల్లో జీవించి చూసే ప్రేక్షకుడికి కడుపు నింపినట్లు పోటీ పడి నటించారు ఆ ఇద్దరూ. కింద పడి చిదిమిపోయిన మువ్వలను మాధవి ఏరుతూ కళ్లకు అద్దుకుని బాలు చేతికి అందిస్తుంది. బాలు కూడా సాయంగా ఏరి, తనలాగే దండం పెట్టుకుని నటరాజ స్వామి విగ్రహం ముందు ఉంచడం చూస్తే ఎందుకో సింబాలిక్‌గా పెట్టారు అనిపిస్తుంది నాకు. చెల్లాచెదురైన మువ్వల లాగే శైలజలో పట్టుతప్పిన నాట్యకళకు కూడా మెరుగులు దిద్దే బాధ్యతను మాధవి బాలుకి అప్పగిస్తున్నట్లుగా ఉంటుంది ఆ సీన్. సాగర సంగమం.. NO END FOR ANY ARTతాగుడుకు బానిసై అన్నేళ్లు తనలోని నాట్యకళను పక్కన పెట్టేసిన బాలు.. ఇప్పుడే మళ్లీ మాధవి రాకతో మనిషిలా మారతాడు. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. భర్తను పోగొట్టుకుని, ఆ బాధను దిగమింగుకోలేక, తనతో చెప్పుకోలేక మాధవి క్షోభ పడుతుందని తెలుసుకుంటాడు. ఏ ఆశతో అయితే ఇన్నేళ్లు తను ఊపిరి బిగబట్టి రోజులు గడుపుతున్నాడో.. అదే దూరమైందని తెలిశాక తట్టుకోలేకపోతాడు. నిండుగా కట్టుబొట్టుతో పార్వతిదేవిలా కళకళలాడిన మాధవి ముఖం.. బొట్టు లేకుండా కళ తప్పడం చూడలేకపోతాడు. తనలో ఉన్న కళ తనతోనే చచ్చిపోకుండా శైలజ రూపంలో మళ్లీ బతికించుకోవాలని తాపత్రయపడతాడు. బాలు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌లో శైలజ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయించి తనలోని ఆత్మను బతికించుకోవాలని ఆరాటపడతాడు.సాగర సంగమం.. NO END FOR ANY ARTఫంక్షన్ మొదలవుతుంది. గొప్ప మనసుతో హాస్పిటల్ కోసం విరాళం అందించిన మాధవి.. అసలు తన లక్ష్యం ఏంటో, బాలుకు తనకు మధ్య ఉన్న పవిత్రమైన బంధం ఏంటో స్టేజ్‌పై నిలబడి అందరితో పంచుకుంటుంది. ఇదంతా లోపలి నుంచి వింటున్న శైలజ అంతకుముందు తన తప్పుడు ప్రవర్తనకి కంటతడి పెడుతూ తన తర్వాతి కర్తవ్యమేంటో తెలుసుకుంటుంది. ఒక మనిషిలో కళ అనేది ఊరికే పుట్టదు.. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే తప్ప ఒక కళాకారుడిగా పుట్టలేం. అదే సమయంలో ఆ కళని గుర్తించి వెంట ఉండి ముందుకు నడిపించే ఒక చేయి కావాలి. ఆ తోడు, ఆ ధైర్యమే మాధవి లాంటి దేవత. శరీరం సహకరించకపోయినా వీల్ చైర్‌లో స్టేజ్‌పైకి వచ్చి.. మాధవి చెప్పిన బాలు తనే అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అలా చెప్పగానే ప్రేక్షకుల నుంచి వచ్చిన చప్పట్ల హోరుకి పరవశించిపోతాడు. ఒక కళాకారుడిగా ఏ రోజు కూడా అలా చప్పట్లు కొట్టించుకునే అవకాశం దక్కని బాలు.. ఆ సమయంలో దొరికిన అభిమానానికి, వారి అభినందనలకి పొంగిపోతాడు. కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ చేతులు పైపైకి అంటూ ఇంకా ఇంకా కావాలన్నట్లుగా మురిసిపోతాడు. మాటల్లో చెప్పలేని ఆ అపురూపమైన భావనను మనం ఊహించలేం.. ఒక నిజమైన కళాకారుడు మాత్రమే పొందగలిగే అద్భుతమైన ఆనందం అది. ముఖ్యంగా ఈ సీన్‌లో కమల్ హాసన్, జయప్రద గార్ల నటనను చూస్తే కన్నీళ్లు పెడుతూ చేయెత్తి మొక్కని ప్రేక్షకుడు ఉండడేమో..!సాగర సంగమం.. NO END FOR ANY ART'సాగర సంగమమే ఒక యోగం..' అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు గొంతెత్తి హృద్యంగా పాడుతుంటే, అప్పుడే స్టేజ్‌పైకి వచ్చేసి శరీరంలోని అణువణువూ స్పందించేలా శైలజ నృత్యం చేస్తుంది. 'మాతృదేవోభవ.. పితృదేవోభవ, ఆచార్యదేవోభవ..' అంటూ తనలోని నటరాజు గర్వించేలా మనసు పెట్టి నాట్యం చేస్తుంది. ఏదైతే చూడాలని తపన పడ్డాడో అది జరిగిందని, తన వారసురాలిగా శైలజని తీర్చిదిద్ది రుణం తీర్చుకున్నానని గర్వంతో మాధవి వంక చూస్తాడు బాలు. తనలోని కళకు చావు లేకుండా ఇంకొకరి రూపంలో మళ్లీ జీవం పోసుకుందని సంతృప్తి పడుతూ.. స్నేహితుడు రఘు చేయిని ఆసరాగా చేసుకుని తల ఆనించి ఊపిరి వదిలేస్తాడు. "జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః..  నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం" అనే శ్లోకం వెనక వస్తుండగా.. బాలు చనిపోయాడని గ్రహించిన మాధవి, రఘు వీల్ చైర్‌ని అక్కడి నుంచి కదిలిస్తారు.సాగర సంగమం.. NO END FOR ANY ARTవీల్ చైర్ మెల్లగా కదులుతుంటే.. మరోవైపు ఇళయరాజా గారి సంగీతం మనసుని తడిమేస్తుంటే.. ఆ కదులుతున్న చక్రాల వెనక భాగంలో లయబద్ధంగా ఆడుతున్న శైలజ పాదాలు.. అబ్బా.. ఎంత మనసు పెట్టి తీసి ఉంటారు నిజంగా. అప్పటికే బరువెక్కిన గుండెతో చూస్తున్న ప్రేక్షకుడు ఆ సన్నివేశాన్ని, ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ హృదయంలో విశ్వనాథ్ గారికి గుడి కట్టేసుకుంటాడు. చిమ్మచీకటిలో వీల్ చైర్‌లో కదలకుండా పడి ఉన్న స్నేహితుడిని తీసుకుని బయలుదేరుతున్న రఘుని చూసి వర్షం కూడా ఏడుస్తూ కురిసేస్తుంటుంది. తమ శరీరాలు వేరేమో కానీ, మనసులు ఒక్కటే అన్నట్లు వర్షం నుంచి స్నేహితుడిని తడవకుండా తన చేతులు అడ్డుపెట్టి బాలుని అదుముకుంటాడు రఘు. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి.. ఆ ఇద్దరికీ గొడుగు పడుతూ ముందుకు కదులుతుంటే 'NO END FOR ANY ART' అని సినిమా అంతటితో ముగుస్తుంది. నిజమే.. కళకు, కళాకారులకు అంతం లేదు. శాస్త్రీయ కళలని, సంప్రదాయాలని కాపాడాలనుకునే విశ్వనాథ్ గారి లాంటి మహానుభావులు ఉన్నంతవరకు కళకు చావు లేదు. సాగర సంగమం.. NO END FOR ANY ARTరవీంద్ర భారతిలో జరుగుతున్న శైలజ నృత్య ప్రదర్శనకు.. రిక్షావాడు రిక్షాలో కూర్చుని ఉంటే వెనక నుంచి బాలు తోసుకుంటూ రావడం మనం సినిమా మొదట్లో చూస్తాం. సినిమా చివరికి వచ్చేసరికి వీల్ చైర్‌లో శవంలా పడి ఉన్న బాలుని తోసుకుంటూ వెళ్తారు రఘు, మాధవి. మొదటి సన్నివేశం ఉదయం పూట చూపిస్తే.. చివరి సన్నివేశం రాత్రి వేళ చూపించారు. అంటే బాలు పాత్రని మొదట్లో ఎంటర్ అయ్యేలా చూపించి, చివరలో వదిలి వెళ్లిపోతున్నట్లు తీశారు. ఇలాంటి చిన్న చిన్న విశ్లేషణలు కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కళాత్మకంగా తీర్చిదిద్దడం ఆ కళాతపస్వికే చెల్లింది. విశ్వనాథ్ గారూ.. మీరు ఎంత ప్రాణం పెట్టి తీశారో నాకు తెలియదు కానీ, చూసిన మొదటిసారి నుంచే నా ఆరోప్రాణంగా మారింది ఈ సినిమా. ఓ గొప్ప కళాఖండంగా తరతరాలు గుర్తుండిపోయేలా మీరు తీసిన 'సాగర సంగమం' సినిమా.. చూసిన ప్రతిసారి తెలియకుండానే నా కళ్లు ఏడ్చేస్తాయి. మీ దర్శకత్వ ప్రతిభను పొగిడే అర్హత గానీ, వయసు గానీ లేని ఈ మామూలు అభిమాని.. మాటల్లో బాగుందని చెప్తే తక్కువే అవుతుందని ఇలా నా కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతున్నాడు.సాగర సంగమం.. NO END FOR ANY ART


THANK YOU 

PC BY: CH. VAMSI MOHAN


కామెంట్‌లు