'కళాతపస్వి' పుస్తక ప్రయాణం (Part 2)

మీరు ఒకవేళ 'కళాతపస్వి' పుస్తక ప్రయాణం (Part 1) చదవకపోతే.. ముందు అది చదివి తర్వాత ఈ ఆర్టికల్ చదవండి. అందుకు సంబంధించిన లింక్ కింద ఇస్తున్నాను.. 👇

https://therakeshblogs.blogspot.com/2025/11/blog-post.html


'కళాతపస్వి' పుస్తక ప్రయాణం

PART-2:

తెల్లని చొక్కా, పంచెతో నుదుటిపై అడ్డ నామాలతో తేజస్సు ఉట్టిపడుతూ నా ముందు నిలబడిన తనికెళ్ల భరణి గారు అలా అడిగేసరికి నేను చెప్పాలనుకున్న ఆ నాలుగు మాటలు కూడా నోట్లోనే ఆగిపోయాయి. కానీ ఏదోలా తడబడుతూ..'సార్.. విశ్వనాథ్ గారి సినిమాల మీద రాసే పుస్తకానికి ముందుమాట ఇస్తానన్నారు..' అని అనగానే..'అవునా.. నువ్వు నాకు PDF పంపించావా?.. ఎప్పుడు పంపించావు?' అని ప్రశ్నించారు.. 'అవును సార్.. పంపించి కూడా రెండు నెలలు అయింది.. ఒక్కసారి మీరు చూస్తే..' అని అంటుండగానే..'సరే.. రేపు నువ్వు మరొక్కసారి నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి గుర్తు చెయ్యి' అని అంటున్న మాటలు పూర్తి కాకుండానే చకచకా కారువైపు కదిలిపోయారు. ఎందుకో నా మనసు ఊరుకోక 'సార్.. అది కాదండీ..' అని నేనింకా ఏదో చెప్పబోతుంటే పక్కనే ఉన్న అసిస్టెంట్ నావైపు చూసి ఇంకేం మాట్లాడొద్దు అన్నట్లు సైగ చేశారు. భరణి గారు ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ కోసం హరిహర కళాభవన్ వెళ్తున్నారు. ఆయన కారు అలా ముందుకు కదిలిపోగానే అసిస్టెంట్.. 'మీ పని గురించి నేను ఫ్రీ టైమ్‌లో సార్‌తో మాట్లాడి చూస్తాలే.. నాకు అప్పగించేశారుగా ఇక మీరు నిశ్చింతగా వెళ్లండి' అనడంతో అక్కడి నుంచి తిరిగి వచ్చేశా.

అనుకున్నది కావాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాలన్న మాట.. సరే అలాగే కానిద్దాం.. ఈ లోపు జరగాల్సిన మిగతా పనులు చూడాలి. ఈ మధ్యలో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన గిరీష్ ప్రదాన్ గారు(సప్తపది), మంజునాథ్ నాయకర్ గారు(స్వాతికిరణం), పార్థసారథి నేమాని గారు(గాయకుడు), వంశీ చాగంటి గారు(హ్యాపీడేస్)లతో విశ్వనాథ్ గారి సినిమాలపై తెస్తున్న నా పుస్తకానికి ఎంత తోడుగా నిలవగలరో ప్రయత్నిస్తున్నా. ఏది ఏమైనా, ఎవరిని కదిలించినా ముందుగా విశ్వనాథ్ గారి గురించి నేను చేస్తున్న ఆ ప్రయత్నానికి సంతోషపడి ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించడం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దసరా లోపు నా పుస్తకం బయటికి రావాలని.. మీ అందరినీ చేరాలని టార్గెట్ పెట్టుకున్నా.'కళాతపస్వి' పుస్తక ప్రయాణంహైదరాబాద్‌లో ఉన్న మంచి ప్రెస్ ఏది అని చాలా మంది సలహాలు తీసుకున్నా.. ఇక ప్రింటింగ్‌కి వెళ్లిపోవాలి.. దాని కన్నా ముందు మనం రాసుకున్న కంటెంట్‌కి DTP చేయించాలి. ఇన్ని రోజులు రాసుకున్నదంతా ఒక ఎత్తు అయితే.. ఇది మరో ఎత్తు. పుస్తకం అందంగా కనిపించాలన్నా.. అందులో అక్షరాల వరుస అద్భుతం అనిపించాలన్నా.. చదవడానికి ఆసక్తి పుట్టాలన్నా.. దాన్ని తీర్చిదిద్దే పని ఇప్పుడు మొదలుపెడుతున్నాం. తీరిగ్గా కూర్చుని మనకు కావాల్సినంత సమయమిచ్చి దగ్గరుండి మన అవసరానికి తగ్గట్టు చేసే DTP సెంటర్‌లను వెతుక్కుంటూ.. చివరికి ఒక దగ్గర స్థిరపడ్డా. ఎందుకంటే ఇది మనకు మొదటి ప్రయత్నం.. రాతలో ఏమైనా దోషాలు వచ్చాయా.. రాసుకున్నది ఏదైనా అటుఇటుగా అయిందా.. ఎలా కనిపిస్తే బాగుంటుంది.. ఎలాంటి FONT వాడాలి.. ఇలా ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి చేసుకున్నా. వెంకట సుబ్బయ్య గారు.. DTP విషయంలో నాకు పూర్తి సహకారం అందించి, నేను కావాలని అనుకున్నట్లుగా చేసి ఇచ్చి ఈ రోజు పుస్తకం అందంగా కనిపించడానికి తోడుగా నిలిచారు.

సరస్వతీ దేవి కటాక్షం బోలెడంత ఉంది.. కానీ, పుస్తకం బయటికి రావాలంటే లక్ష్మీ కటాక్షం కూడా కావాలి. సరిగ్గా అనుకున్న సమయానికి అవసరానికి డబ్బులు సరిపోలేదు.. ఏం చేసేది ఇప్పుడు..? అంతా పూర్తయిందని సంతోషపడుతున్న చివరి క్షణంలో కట్టడానికి కావాల్సినంత లేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు నాకున్న దారులన్నీ వెతికా.. ప్రెస్‌లో ఇవ్వాల్సిన మొత్తం ఎంతో లెక్క వేసుకున్నా.. ముందు ఎంత కట్టగలం.. తర్వాత ఎంత కట్టగలం.. ఇలా నా ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకున్నా.. మనకు రావాల్సిన దగ్గర డబ్బుల కోసం ప్రయత్నించా.. ఏది ఏమైనా ఎక్కడా తగ్గలేదు.. అనుకున్నది చేయాలి.. ఇదొక్కటే నా మనసులో ఉంది అప్పుడు.

ఇంతలో భరణి గారి దగ్గర నుంచి వాట్సాప్‌లో ఓ PDF వచ్చింది.. తెరిచి చూస్తే.. విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ నన్ను, నా రచనను మెచ్చుకుంటూ ఆయన పంపించిన 'ముందుమాట'. ఆ రోజు అది చూడగానే మనసు ఎంత ఆనందపడిందో అసలు. 'గురువు గారు.. చాలా సంతోషం..🙏' అని ఆయనకు వెంటనే ఒక రిప్లై పెట్టేసి ఇక జరగాల్సిన తర్వాతి పని గురించి ఆలోచనల్లో పడిపోయా. DTP సెంటర్‌లో పని మొదలుపెట్టా. పక్కనే కూర్చుని ఎలా కావాలి.. ఎలా ఉండాలని అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా.. ఇంతలో కూర్పుగా ఒదుగుతున్న అక్షరాలు మరింత అందంగా ఆ పేజీల్లో అమరుతూ.. నన్ను చూస్తూ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఏమని అడిగితే.. మా స్థానానికి స్థాయిని పెంచినందుకు మాకెంతో సంతోషంగా ఉందని అవి చెప్తుంటే.. మీరు ఇలాంటి ఓ గొప్ప విషయం కోసం ఉపయోగపడినప్పుడే మీ స్థాయి పెరిగిపోయింది.. ఆ గొప్పతనం నాది కాదు, మీ ఆకారం ద్వారా పది మందికి పరిచయం కాబోతున్న విశ్వనాథ్ గారి కళాఖండాలది ఆ గొప్పతనం అని చెప్పి వాటి భుజం తట్టగానే.. కాలర్ ఎగరేసుకుంటూ.. మళ్లీ పుస్తకంలో కలుద్దామే అని నాకు టాటా చెప్పుకున్నాయి.

కర్షక్ ప్రింటింగ్ ప్రెస్.. హైదరాబాద్‌లోనే పెద్ద పేరున్న ప్రెస్. నా మొదటి పుస్తకం ఎలా అచ్చు అవుతుందో చూడాలనే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది కదా.. అందుకే ఒకరోజు చూడడానికి వస్తానని ప్రెస్ వాళ్లని పర్మిషన్ అడిగి వెళ్లడం జరిగింది. అప్పటివరకు ల్యాప్‌టాప్‌లో మాత్రమే కనిపించిన నా అక్షరాలు, నేను రాసుకున్న విషయం మొదటిసారి పేజీల రూపంలో అక్కడ కనబడుతోంది.. నా కల నెరవేరే క్షణాలకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. నా జీవితంలో పుస్తకం రాస్తానని పెద్దగా ఎప్పుడూ ఆలోచించని నాకు.. నేను పడిన కష్టానికి, నా స్నేహితుడు వంశీ అందించిన సహకారానికి ప్రతిఫలం ఆ రోజు ఆ ప్రెస్‌లో కనబడింది. నా జీవిత ప్రయాణంలో మొదటి మలుపు ఆ రోజు ప్రింటింగ్ మిషన్‌లో పేజీలతో పాటు ముందుకు కదులుతున్నట్లు అనిపించింది. దాంతో పాటు ఇదంతా నాలోనే దాచుకుని, సంవత్సరం పాటు ఎవరికీ చెప్పకుండా చేసుకున్న ఈ పని మరికొన్ని రోజుల్లోనే నా కుటుంబం, సన్నిహితులందరితో పంచుకుంటానన్న సంతోషం మరోవైపు. అవసరమైన కంటెంట్ రాసుకున్న దగ్గరి నుంచి.. ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్లడం వరకు చేసిన ఏడాది ప్రయాణంలో నేను, నా స్నేహితుడు వంశీ.. విశ్వనాథ్ గారి గురించి, ఆయన సినిమాల గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నామో లెక్కే లేదు. నిజంగా విశ్వనాథ్ గారు ఉండి ఉంటే మేం అలా పదేపదే తలుచుకున్నందుకు ఆయనకు ఎన్నిసార్లు పొలమారి ఉండేదో..! 
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
సరిగ్గా 4 రోజుల తర్వాత మళ్లీ అదే ప్రెస్ ముందర నిలబడి ఉన్నా.. కాసేపటి తర్వాత ప్రెస్‌లో పని చేసే ఓ మనిషి తెచ్చి ఇచ్చిన అపురూపాన్ని పసిపాపాయిలా చేతిలోకి అందుకున్నా.. నేను మనసు పెట్టి రాసిన పుస్తకం నా చేతిలోకి మొదటిసారి వచ్చిన ఆ క్షణాలు నా గుండె వేగం పెరిగి, కళ్లల్లో నీళ్లు పుట్టుకొచ్చాయి. ఒక్కసారిగా చేతిలోని పుస్తకాన్ని తనివితీరా చూసుకుంటూ గుండెలకు అదుముకున్నా. 'కళాతపస్వి' అనే పేరు.. దాని కింద గురువు గారు విశ్వనాథ్ గారి ముఖచిత్రం.. ఆ పక్కనే రాకేశ్ బొద్దుల అనే ఆరు అక్షరాలు. ఇది చాలు కదా.. కవర్ పేజీపై ఆయన ఫోటో పక్కనే నా పేరు చూసుకున్నా.. పేరు మాత్రమే కాదు, సాక్షాత్తూ ఆయనే ఆ రోజు నా పక్కన నిలబడి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించినట్లు అనిపించింది.

గుండెల్లో కొలువైన ఈ దేవుడిని చూసుకున్నా.. ఇక నా గుండెల గుడిలో కొలువైన ఆ దేవుడిని దర్శించుకోవాలి. అనుకున్నదే ఆలస్యం భద్రాచలం ప్రయాణమయ్యా. మార్కెట్‌లోకి వెళ్లే ముందు మొదటి పుస్తకాన్ని నా రామయ్యకి సమర్పించాలని కోరిక. ప్రధానాలయంలో అర్చక స్వామి ఒకరు అప్పటికే నా శ్రేయోభిలాషులు కావడంతో వాళ్ల సాయం తీసుకున్నా. చతుర్భుజాలలో ధనుర్భాణాలు, శంఖుచక్రాలు ధరించి, సీతా లక్ష్మణ సమేతుడై కొలువుదీరిన నా కొండంత దేవుడిని ఆ రోజు మరింత చేరువలో దర్శించుకున్నా. నేను ఇష్టంగా రాసుకున్న పుస్తకం ఆ రోజు రామచంద్రుడి పాదాల చెంత ఓ ఐదు నిమిషాల పాటు ఉండడం, పూజలు అందుకోవడం చూశాక నా విజయానికి తొలి మెట్టు అక్కడే పడిందేమో అన్నంత సంబరపడిపోయాను.. భావోద్వేగంతో కన్నార్పకుండా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శిస్తూ మైమరచిపోయాను. భద్రాచల రామ గోవింద.. గోవిందా...🙏🚩
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
ఈలోగా దీపావళి వచ్చేసింది.. నా జీవితంలో కూడా ఈ ఏడాది వెలుగులు మరింత ప్రకాశవంతంగా వచ్చినట్లు అనిపించింది. పండుగ కోసమని ఇంటికి వెళ్లిన నేను.. నాతో పాటు ఓ పుస్తకాన్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లా. దీపావళి లక్ష్మీపూజల మరుసటి రోజు అమ్మానాన్నలను పిలిచి నా ఎదురుగా కూర్చోబెట్టుకున్నా. నా చేతిలో ఉన్న పుస్తకాన్ని వాళ్ల చేతికి అందిస్తూ మొదటిసారి విషయం బయటపెట్టా.  నేను చెప్పింది విని మొదట అయోమయంగా చూసినవాళ్లు ఆ తర్వాత తేరుకుని.. నేను చేసిన పనిని గుర్తించి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఆ రోజు అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం చూశా. అమ్మ నా వైపు చూస్తూ కురిపించిన ప్రేమను ఒడిసి పట్టుకున్నా. ఒక్కో పేజీ తిప్పుతూ నాన్న ముఖంలో కనిపించిన సంతోషాన్ని ఆస్వాదించా.. మధ్యమధ్యలో పాటలు పాడుతూ ఆయన ఆ క్షణాలను అనుభూతి చెందడాన్ని నా మనసులో పదిలంగా దాచుకున్నా. తిరుగు ప్రయాణంలో చెల్లి దగ్గరికి కూడా వెళ్లి ఇదే విషయాన్ని తన ముందు ఉంచగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోవడం గమనించా.. నన్ను హత్తుకుని కళ్ల నీళ్లు పెట్టుకుంటూ చెల్లి చూపించిన అనురాగాన్ని అందంగా అందుకున్నా. నిజంగా మనసు నిండిపోయింది.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
అనుకున్నదంతా అనుకున్నట్లు పూర్తయింది.. ఇక పుస్తకం లాంఛ్ జరగాలి.. ఇంకెవరో ఎందుకు..? మళ్లీ భరణి గారే ఆలోచనల్లోకి వచ్చారు. ఆ పెద్దాయన సినిమాలపై రాసిన నా పుస్తకం ఈ పెద్దాయన చేతుల మీదుగానే బయటికి వెళ్తే పరిపూర్ణం అవుతుందని భావించా. మళ్లీ భరణి గారిని సంప్రదించా.. ఈ సారి ఆయన మరింత బిజీ అయిపోయారు. అసిస్టెంట్ వద్ద కనుక్కుంటే ఓవైపు పుస్తక రచన, నటన.. మరోవైపు సినిమా డైరెక్షన్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నారని విషయం చెప్పారు. సరే కొన్ని రోజులు ఆగి చూద్దాం.. ఇన్ని నెలలు ఆగినవాళ్లం.. ఇంకొన్ని రోజులు ఎదురుచూడలేమా అనిపించింది. కానీ మరోవైపు, లాంఛింగ్ ఆలస్యం అయిపోతుందేమో.. అప్పటికే పుస్తకంతో వస్తున్నానని అందరితో చెప్పేసుకున్నాం.. పుస్తకం తొందరగా వచ్చేస్తే చదవాలని అనుకునేవాళ్లను ఎందుకు ఎదురుచూసేలా చేయడం.. అని కూడా అనిపించి మళ్లీ రఘు గారిని సంప్రదించా.

పుస్తకం లాంఛింగ్ రోజు.. ఊహించని విధంగా విశ్వనాథ్ గారి చిన్నబ్బాయి నుంచి ఫోన్ కాల్.. 'మీకు కుదిరితే ఇంటికి రావొచ్చు.. వచ్చి నాన్నగారి ఫోటో ముందు పుస్తకం ఉంచి మీ నివేదన అందించొచ్చు' అని అవతలి వైపు నుంచి మాటలు. అంతకన్నా ఇంకేం కావాలి.. లాంఛింగ్ కదా అని హడావిడిలో ఉండిపోయిన నాకు ఎందుకో విశ్వనాథ్ గారే స్వయంగా కబురు చేసినట్లు అనిపించింది. నువ్వు రాసుకున్నదంతా నా ఆస్తి కదా, అది ముందుగా నాకివ్వకుండా ఎలా ఉంటావని పిలిచినట్లు అనిపించింది. 2019లో ఆ మహానుభావుడిని కళ్లారా చూసిన నాకు.. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ ఇంటికి వెళ్లే అవకాశం దానంతట అదే వచ్చింది. ఆలయం లాంటి ఆ ఇంట్లోకి ఎంతో భావోద్వేగంతో అడుగుపెట్టాను.. దేవుడి లాంటి ఆయన ఫోటోకి మనసారా నమస్కరించాను.. నా పుస్తకాన్నే పూలమాలలా పరిచి ఆయన పాదాల వద్ద ఉంచాను.. నా పుస్తకం ఎక్కడికి చేరాలో అక్కడికి సరిగ్గా చేరిపోయింది. నా పుస్తకానికి  అసలైన గౌరవం దక్కిందని భావిస్తూ ఆ ఆలయం గడప దాటి అడుగు బయటపెట్టాను.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
నా పుస్తకానికి కావాల్సిన చాలా విషయాలు పంచుకుని, అప్పటి షూటింగ్‌లకు సంబంధించిన అపురూపమైన ఫోటోలను కూడా ఏ స్వార్థం లేకుండా అందజేసిన రఘు గారి లాంటి లెజెండరీ చేతుల మీదుగా మొత్తానికి నా పుస్తకం విడుదలకు నోచుకుంది. 50 ఏళ్ల అనుభవంలో ఎన్నో చూసి, ఎంతో సాధించిన ఆ మహానుభావుడు నా జీవితంలో మొట్టమొదటిసారిగా రాసుకున్న పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం నిజంగా నా అదృష్టం. ఏం చేశానని అంత నమ్మారో.. ఏం సాధించానని అంత ప్రోత్సహించారో నాకు తెలియదు కానీ రఘు గారు చూపించిన ఆదరణ నాకు దక్కిన భాగ్యం.
'కళాతపస్వి' పుస్తక ప్రయాణం
ఇక అంతకు ముందు వరకు నావి అనుకున్న నా అక్షరాలు.. ఆ రోజు నుంచి మీవైపోయాయి. మీ చేతిలోని పుస్తకంలో ఒదిగిపోయి మీతో దోబూచులాడుతూ, మీకు ఎన్నో కబుర్లు చెబుతున్నాయి. నా మనసులో, నా బుర్రలో పుట్టిన ఆలోచనలకు ప్రతిరూపమైన ఆ అక్షరాలు విశ్వనాథ్ గారి గొప్ప గొప్ప కళాఖండాలను మీకు వివరించే సాధనాలయ్యాయి. అవి చదివి, సంతృప్తి చెంది, మీ ముఖంలో వచ్చే ఓ చిరునవ్వు, బాగుందని మీ మనసులో పుట్టే ఓ ఆలోచనే నా అక్షరానికి మీరిచ్చే అసలైన బహుమానం.. మీ నుంచి నా అక్షరానికి దక్కే అసలైన గౌరవం.

ఇదండీ నా పుస్తక ప్రయాణం.. ఏడాదికిపైగా నేను పడిన శ్రమ. ఇంతటితో చెప్పడం ముగించేయాలా.. ఏమో నా మనసు ఊరుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారిని, విశ్వనాథ్ గారి సినిమాలను విపరీతంగా అభిమానించాను.. ఆ కళాఖండాల గొప్పతనాన్ని ఏ స్వార్థం లేకుండా పది మందికి చెప్పాలని ప్రయత్నించాను. ఏ రోజైతే పుస్తకం కోసం పనులు మొదలుపెట్టానో ఆ రోజు నుంచి కలిసిన ప్రతి ఒక్కరూ నన్ను గౌరవంగా పలకరించడం మొదలుపెట్టారు.. నేను చేస్తున్న పనిని గుర్తించి మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు.. పెద్ద పెద్దవాళ్లు సైతం నన్ను గొప్పగా చూడడం మొదలుపెట్టారు. నేను విశ్వనాథ్ గారికి నా అభిమానాన్ని మాత్రమే ఇచ్చాను.. కానీ ఆయన నాకు ఎన్నో ఇచ్చారు.. నా పక్కనే ఉండి నన్ను ముందుకు నడిపించారు.. నన్ను ఎంతో ఎత్తులో నిలబెట్టారు. పుస్తకం కోసం చేసిన ప్రయాణంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించి, ఇది నా వల్ల అవుతుందా అని భయపడిన ప్రతిసారి నన్ను నమ్మి, చేయగలనని నా వెన్నుతట్టిన స్నేహితుడు వంశీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పగలను..? నన్ను ఎవరూ గుర్తించని సమయంలో, అందరి కన్నా ముందుగా అసలు నేను రాయగలనని నమ్మి ధైర్యం చెప్పిన నా ఆప్తురాలు సింధుకి ఎలా ధన్యవాదాలు తెలుపగలను..? ఈ పుస్తకానికి ప్రోత్సాహం కావాలని సినీ పెద్దలను కలిసే అవకాశం ఇప్పించిన మరో స్నేహితుడు వనరాజ్‌కి ఎంతని రుణపడి ఉండగలను..? పుస్తకం రాసిన విషయం చెప్పగానే కొడుకు ఏదో గొప్ప పని చేశాడని పొంగిపోయి నన్ను అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన అమ్మానాన్నల ప్రేమకు ఎలా వెల కట్టగలను..? పుస్తకంపై నా పేరును చూడగానే మా అన్నయ్య ప్రయోజకుడు అయిపోతున్నాడని పట్టలేని సంతోషంతో నా చెల్లెలు పెట్టిన కంటతడికి ఎలా లెక్క ముట్టజెప్పగలను..? నేనేమీ చేయలేదు.. ఇంకా నేనేదీ సాధించలేదు.. ఇది నా తొలి మెట్టు మాత్రమే....!


THANK YOU 

PC: CH.VAMSI MOHAN


'కళాతపస్వి' పుస్తక ప్రయాణం



FOR KALATHAPASWI BOOK PURCHASE:

CONTACT: 82477 65506, 8179075376(Whatsapp Also)
Mail: boddularakesh@gmail.com
or Comment here in blog also

కామెంట్‌లు