అదిగదిగో భద్రగిరి...

చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాల ద్వారా, చూసిన సినిమాల ద్వారా రామాయణం గురించి తెలుసుకున్నాను. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా ఆ పురాణ గాథ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. అలా అలా నా జీవితంలో నాకు తెలియకుండానే శ్రీ రాముడు ఒక భాగమయ్యాడు. అది ఎంతలా అంటే.. ఇప్పటికీ రోజుకి ఒక్కసారైనా రామ నామం తలవకుండా గడిపింది లేదు. సుందర రాముడి విగ్రహాన్ని చూసినా, మనసులో తలచుకున్నా తెలియని ఒక వైబ్రేషన్ నాలో. కొన్నిసార్లు ఉద్వేగంతో కన్నీళ్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా జీవితంలో అంత ముఖ్యమైన నా రామయ్య గురించి మీతో ఈ రామనవమి సందర్భంగా పంచుకుంటాను.

అదిగదిగో భద్రగిరి...

ఎక్కడో చిన్న ఊళ్లో పుట్టిన నాకు.. చిన్నప్పుడు టీవీలో, పేపర్లలో భద్రాచలం ఆలయం గురించి, అక్కడ రామ నవమి రోజు జరిగే కళ్యాణం గురించి చూస్తుంటే చాలా ఆసక్తి అనిపించేది. కానీ, అది మనం వెళ్లలేనంత దూరం అని ఆ వయసులో అనుకుని ఊరుకునేవాడిని. పెరిగి పెద్దయ్యాక నా కోరిక తీర్చుకున్నాను. ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ముందుగా అక్కడి పుణ్య గోదావరిలో స్నానం చేసి, ఎదురుగా ఉన్న ఆలయానికి వెళ్లి ఆ రాములవారిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు గడిపితే ఏదో తెలియని అనుభూతి.

అదిగదిగో భద్రగిరి...

భద్రాచల రాముడి రూపం ప్రత్యేకం. ఎక్కడా లేని విధంగా నాలుగు చేతులతో శంకు చక్రాలు, ధనుస్సు పట్టుకుని.. తొడ మీద సీతమ్మ తల్లి కూర్చుని ఉంటే పక్కన తమ్ముడు లక్ష్మణుడితో దర్శనమిస్తాడు మనకు. భద్రుడు అనే భక్తుడు తనకు స్వామి దర్శనం కావాలని తపస్సు చేశాడట. అతని కోరిక తీర్చడానికి రామావతారం విడిచిపెట్టే సమయంలో విష్ణుమూర్తి రూపంతో అలాగే మర్చిపోయి తన నాలుగు చేతులతో దర్శనమిచ్చాడట. అందుకే ఇక్కడి రాముడిని 'వైకుంఠ రాముడు' అని పిలుస్తారట. ఇక ఆ తర్వాత కంచర్ల గోపన్న రాముడికి ఆలయం కట్టించి రామదాసుగా పేరు తెచ్చుకున్న సంగతి మీకు తెలిసిందే కదా.

అదిగదిగో భద్రగిరి...

ఆలయం కట్టాడు సరే.. కానీ గర్భగుడి గోపురంపై పెట్టడానికి సరిపోయేది లేదని చాలా బాధ పడ్డాడట రామదాసు. అతని బాధను చూడలేక స్వయంగా ఆ రామచంద్ర ప్రభువే కలలో కనిపించి గోదావరి దగ్గరికి వెళ్లి చూడమని.. గోపురంపై పెట్టడానికి నీకు కావాల్సింది దొరుకుతుందని చెప్పాడట. తర్వాత రోజు తెల్లవారాక అదే విధంగా చూస్తే గోదావరిలో తేలుతూ ఓ సుదర్శన చక్రం కొట్టుకు వచ్చిందట. అదే ఇప్పుడు భద్రాచల ఆలయ శిఖరంపై మనం దర్శిస్తున్న చక్రం. అక్కడ ప్రతిష్టించిన సుదర్శన చక్రం సామాన్య మనుషులు ఎవరూ తయారు చేసింది కాదని.. సాక్షాత్తూ ఆ భగవంతుడే ఇచ్చాడని చెబుతారు.

అదిగదిగో భద్రగిరి...

ఇక రామ నవమి రోజు భద్రాచలంలో జరిగే కళ్యాణ ఘట్టం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కుల-మత బేధాలు లేకుండా, పేద-ధనిక తేడా ఉండకూడదని భక్తుల కోసం స్వయంగా స్వామివారే ఆలయం దాటి కదిలి వచ్చి కళ్యాణం జరిపించుకుంటారని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆరుబయట కళ్యాణం చేస్తారు. అందంగా అలంకరించిన మండపంలో పురోహితులు వేదమంత్రాలు చదువుతూ రామచంద్రుడి గొప్పతనం వివరిస్తున్న వేళ.. అది వింటూ భక్తులందరూ రామ రామ అని తలుచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్న వేళ.. సిగ్గు పడుతూ కూర్చుని ఓర కంట తన స్వామినే మైమరచిపోయి చూస్తున్న సీతమ్మ తల్లి మెడలో తాళి కట్టి సీతారాముడు అవుతాడు నా ప్రభువు. ఆహా ఆ దృశ్యం చూశాక.. ఇది చాలు కదా జీవితానికి అని అనిపించక మానదు.

అదిగదిగో భద్రగిరి...

సీతమ్మవారి మెడలో కట్టే తాళికి మూడు సూత్రాలు ఉంటాయి. ఒకటి దశరథ మహారాజు తరపు నుంచి, మరొకటి జనకుడి తరపు నుంచి అయితే.. మూడోవది భక్త రామదాసు చేయించిన సూత్రం అని చెబుతారు. ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వాడే తలంబ్రాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులు వడ్ల గింజలను గోటితో ఒలిచి తయారుచేసే తలంబ్రాలు అవి. ఇక ప్రసాదంగా ఇచ్చే వడపప్పు, పానకం రుచి ఎలా మర్చిపోగలను. అలాగే భద్రాచలం దగ్గర్లోనే పర్ణశాల అనే ప్రాంతం ఉంటుంది. వనవాసం సమయంలో సీతారాములు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని చెబుతారు.

అదిగదిగో భద్రగిరి...

ఎప్పుడు వెళ్లి దర్శించుకున్నా, ఎన్నిసార్లు చూసినా నా జీవితంలో తనివితీరని అనుభవాలు ఉన్నాయి భద్రాచలంతో. ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు ఓర్చుకుని ఆలయం కట్టించిన రామదాసు.. రాముడిని గుడిలో పెట్టుకున్నాడు. నేను అంత గొప్ప పని చేయలేకపోయినా నా రాముడిని గుండెల్లో పెట్టుకున్నాను. రాముడిని ఎందుకు ఇష్టపడుతున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు. అది అనుభవిస్తే తప్ప అర్థం చేసుకోలేని అద్భుతమైన భావన. నిస్వార్థమైన భక్తితో మొక్కే ప్రతి ఒక్కరూ ఆ రాముడికి దాసులే అయితే.. నేనూ ఒక రామదాసునే.

అదిగదిగో భద్రగిరి...

తెల్లవారితే శ్రీ రామ నవమి.. ఎప్పటిలాగే రాములవారి కళ్యాణం కళ్లారా చూడటానికి ఈ సారి కూడా భద్రాచలం వెళ్తున్నా.. అదిగో బస్సు వచ్చే టైం కూడా అయింది.. ఇక ఉంటానే మరి..! 


జై శ్రీరామ్... జై జై శ్రీరామ్..!!! 

అదిగదిగో భద్రగిరి...
అదిగదిగో భద్రగిరి...

THANK YOU 

PC: CH. VAMSHI MOHAN 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి