శ్రీరామ జయ రామ జయజయ రామ
రామయ్య వచ్చేశాడు.. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను పుట్టిన నేలకే తిరిగి వచ్చేశాడు.. బుడిబుడి అడుగులు వేసుకుంటూ, ఐదేళ్ల వయసున్న బాల రాముడిలా అయోధ్య మందిరంలో ఆటలు ఆడేందుకు, దోబూచులాడేందుకు తిరిగొచ్చాడు. 'రామా' అని భక్తితో పిలిచే కోట్లాది హిందువుల కోసం చేతిలో విల్లుతో, మోముపై చిరునవ్వుతో పసిబాలుడై నవ్వుతూ ఎదురుచూస్తున్నాడు.
తండ్రి మాట దాటని, తల్లిని దైవంగా భావించే కొడుకులా.. తమ్ముళ్లని ప్రేమించే అన్నగా.. భార్యకి మంచి భర్తగా.. ప్రజలకు అసలైన పాలకుడిగా.. మాట ఇచ్చి తప్పని స్నేహితుడిగా రాముడు ఒక సంపూర్ణ రూపం. భగవంతుడు మనిషి రూపంలో ఈ భూమిపైకి వచ్చిన అవతారమే శ్రీరాముడి పుట్టుక. మనిషిగా బతికాడు.. మనిషిలా బాధలు అనుభవించాడు.. మనిషి ఎలా బతకాలో చూపించి మహనీయుడు అయ్యాడు. ఆ రామచంద్రుడిని మనం ఒకటే కోరుకుందాం. రామయ్యా.. నీలో ఉన్న సద్గుణాలలో కొన్నైనా మా మనుషులు పాటిస్తే చాలు. అప్పుడు ప్రతి ఇల్లు నీ మందిరంలా అందంగా ఉంటుంది.. ప్రతి ఊరు ఒక అయోధ్యలా మారుతుంది.
నీ భవ్య మందిరం కోసం సాగిన 500 ఏళ్ల ధర్మయుద్ధంలో నేల రాలిన ప్రతి రక్తపు బిందువు.. ఒక్కో పువ్వుగా మారి ఇప్పుడు నీ మెడలో హారంగా మారింది రామయ్యా..! అయోధ్య మందిరంలో కొలువుదీరిన నీ దివ్య మంగళ రూపం కళ్లారా దర్శించాను స్వామీ.. ఎంత ముద్దుగా ఉన్నావో అసలు.. మనోహరమైన నీ విగ్రహం చూస్తుంటే స్నేహితుడినై నిన్ను హత్తుకోవాలనుంది.. పసిపాపలా నీ పాల బుగ్గలను ముద్దాడాలని ఉంది.. భక్తుడినై నీ పాదాలకు మొక్కాలనుంది.. నువ్వు చూపిన బాటలో నడవాలనుంది.. నువ్వే నాకు దిక్కని చెప్పాలనుంది.
ఎందుకంటే, నువ్వు నా రాముడివి..
నా రామ చక్కని తండ్రివి..
జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి