వచ్చిన చిన్న కష్టానికే అయ్యో దేవుడా అని తెగ బాధ పడిపోతుంటాం.. జీవితమే వ్యర్థం అన్నట్లు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటాం. అసలు కష్టం, బాధ, నొప్పి అనేవి ఎలా ఉంటాయో నిజంగా మనలో ఎవరికైనా తెలుసా..? ఇంతకు మించిన వేదన మరొకటి ఉండదని నిజంగా అనిపించేది ఎప్పుడో తెలుసా..? అది తెలియాలంటే ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు.. నీ ఇంట్లో నీ కళ్ల ముందే ఓ దేవత తిరుగుతూ ఉంటుంది.. తనని అడుగు చెప్తుంది.. బతికున్నప్పుడే నరకం అంటే ఎలా ఉంటుందో.. ప్రాణం పోతున్నట్లు ఎప్పుడు అనిపిస్తుందో..!
ఒక్క క్షణం.. ఒక్క క్షణం..
గరిమల నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం.. ఒక్క క్షణం..
అవును.. నీ పుట్టుకే అమ్మకు భరించలేని కష్టం. అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి ఈ భూమి మీద నువ్వు అడుగుపెడుతున్న సమయంలో పైన చెప్పినవన్నీ అమ్మ అనుభవిస్తుంది. అది ఎలా ఉంటుందో తెలియని నాకు ఆ అనుభవానికి అక్షర రూపం ఓ పాటలో కనిపించింది. 'ఒక్క క్షణం..' ఈ పాట వింటున్న ప్రతిసారి అమ్మ బిడ్డను కనేటప్పుడు పొందే కష్టానికి, కలిగే నొప్పికి జీవితాంతం మనం క్షమాపణ చెప్పినా సరిపోదనిపించింది. బహుశా తల్లిని మహా వృక్షంగా భావించాడేమో ఈ పాట రాసిన కవి వేటూరి గారు.. అందుకే పుట్టే బిడ్డను ముద్దుల మొలక అని వర్ణించారు.. ఎంత గొప్ప ఊహ అసలు.
అమ్మ కడుపు చల్లగా.. అయ్యకలలు పండగా..
ఇమ్మనరే.. ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము
ఈ లాలికి స్వరము ఇహము పరము
కొన్ని పాటలు వింటే ఆనందం పొందుతాం.. కొన్ని వింటూ అలా మైమరిచిపోతుంటాం.. కొన్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదని అంటుంటాం.. కానీ, ఈ పాట వింటున్నప్పుడు విన్నట్లు కాదు.. అప్పుడే పుడుతున్నట్లు అనిపించింది. ఈ ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది. నా కోసం పడిన పురిటి వేదనకు సాక్ష్యంగా పసిపాపనై పాకుతూ అమ్మ నొప్పిని నా బోసినవ్వులతో మాయం చేయాలని అనిపించింది. అదేంటో మరి.. అప్పటివరకూ అంత నరకం అనుభవించి, భరించలేని బాధ పొంది.. నేను బయటికి వచ్చిన మరుక్షణమే నొప్పంతా మర్చిపోయి.. నన్ను తన పొత్తిళ్లలో అదుముకుని, నా చిన్ని చిటికెన వేలును తాకుతూ.. నన్ను మురిపెంగా చూస్తూ నవ్వేసింది నా పిచ్చితల్లి. ఇదేనా మాతృత్వపు మధురిమ అంటే.. అందుకే నా అమ్మ కడుపు చల్లగుండ..
కౌసల్యకు తప్పని అమ్మ వేదన.. మన రామ కీర్తన
రామం దశరథ రామం దనుజ విరామం ధరణిజ సోమం
దేవకికే తప్పని చెరసాల వేదన.. నవ రసాల నర్తన
నంద నందనం భక్త చందనం గోపికా గోవందనం
భగవంతుడైన శ్రీ రామచంద్రుడిని కన్న కౌసల్యా దేవికే తప్పలేదు అమ్మ వేదన.. ఇక మానవ మాత్రులం మనమెంత..? కొడుకు అడవులకు వెళుతున్నాడని ఆ రోజు ఆ తల్లి పడిన వేదనే.. ఇప్పటికీ మనం నిత్యం స్మరించుకునే రామ కీర్తన అయిందని చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న రామచంద్రుడిని ఆ రోజు అడవులకు పంపేది లేదని ఆ తల్లి మొండిపట్టు పట్టి ఉంటే ఈ రోజు అసలు మనకు రామాయణం అంటూ ఉండి ఉండేదా..? దేవకికే తప్పని చెరసాల వేదన.. కొడుకును కన్న మరుక్షణం ఆ తల్లి కన్నప్రేమకు దూరమైంది.. కానీ, తన వేదన శ్రీ కృష్ణ పరమాత్ముడి రూపంలో లోక కళ్యాణానికి మార్గం వెతికింది.. ప్రపంచానికి జగద్గురువును పరిచయం చేసింది. ఈ ఇద్దరు తల్లులు పడిన వేదన ధర్మ సంస్థాపనకు దారి చూపింది.
తూరుపు తల్లికి తప్పదు.. ఉదయ వేదన
మేఘాలకు తప్పదు.. మెరుపు వేదన
తెలతెలవారుతుండగా ఆకాశం వంక చూడండి.. ఎర్రటి రక్తంతో సూర్యుడిని ప్రసవించినట్లుగా ఆకాశం పడిన ఉదయ వేదన మన కళ్లకు కనిపిస్తుంది. అలా తూరుపు తల్లికి ప్రతిరోజూ పురిటి వేదనే.. ఆ వేదనే మనకు మరో కొత్త రోజును పరిచయం చేసి మన మనుగడకు కారణమవుతుంది.. లేదంటే అంతా చీకటే. మేఘాలకు తప్పదు మెరుపు వేదన.. వర్షం పడే ముందు గట్టిగా ఉరుములు, మెరుపులు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు కదా.. మేఘం కురిసే ముందు తన వేదనని మెరుపు రూపంలో ప్రసవిస్తే తప్ప ఆ చినుకు నేల రాలదు.. నీకు రేపనేది ఉండదు.
కల్లోలపు కడలి మీద తాను తేలగా.. వటపత్రశాయిగా..
తొమ్మిది మాసాల యోగి కెవ్వుకెవ్వున తొలి కేక పెట్టగా..
కృష్ణ పరమాత్మ అవతరించగానే తండ్రి వసుదేవుడు బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఒక తట్టలో ఉంచుకుని సముద్రం దాటుకుంటూ వెళ్లాడట. వటపత్రశాయిగా తట్టలో శయనిస్తున్న ఆ దేవదేవుడికి ఏ అడ్డూ ఉండకూడదని కల్లోలమై ఎగిసిపడుతున్న సముద్రమే స్వయంగా దారి చూపిందట. పైనుంచి బోరున కురుస్తున్న వర్షానికి ముద్దుగారే ఆ బాలుడు తడవకూడదని ఆదిశేషుడు పడగ ఎత్తి రక్షణనిచ్చాడట. మరి భగవంతుడు ఈ భూమి మీద పుట్టాలంటే అంత సామాన్యంగా జరిగే పనా చెప్పండి..? అందుకే వేటూరి గారు ఇక్కడ శిశువు జన్మించింది అనలేదు.. తొమ్మిది మాసాల యోగి అని రాశారు. దేవకీ మాత గర్భం నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వస్తానా అని శీర్షాసనం వేసుకుని కూర్చున్నాడేమో ఆ కృష్ణ పరమాత్మ. అలా ఊహించి తొమ్మిది మాసాల యోగి అని వేటూరి గారు రాశారని చదివాక ఒళ్లు పులకరించిపోయింది.
అంతగా అయితే.. ఒక్కసారి 'స్వరాభిషేకం' సినిమాలోని 'ఒక్క క్షణం..' అనే ఈ పాట వినండి.. పాట విన్నాక మరోసారి ఇది చదవండి. అంత గొప్పగా ఏముందో మీరే స్వయంగా తెలుసుకుంటారు.. చెవులతో మీరు పాటను వింటున్నా.. కళ్ల ముందు మాత్రం మీకు జన్మనిచ్చిన కన్నతల్లే కదలాడుతుంది. నిన్ను కనేటప్పుడు తను పడిన వేదన.. నిన్ను కన్నాక తను అనుభవించిన మాతృత్వపు మధురిమ తెలిసొచ్చి నువ్వు ఈ భూమ్మీద పుట్టినందుకు అసలైన అర్థాన్ని వెతుక్కుంటావు.
ఒక తల్లి పురిటి వేదన గురించి వర్ణించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఇంత గొప్పగా రాయాలనిపించిన వేటూరి గారు.. సినిమాలో అసలు ఇలాంటి సందర్భం ఉండాలని సృష్టించిన విశ్వనాథ్ గారు 'అమ్మ' అనే పదానికి ఇంత గొప్పగా పట్టాభిషేకం చేశారా అని 'స్వరాభిషేకం' సినిమాలోని ఈ పాటతో నిరూపించారు.
THANK YOU
PC: CH.VAMSI MOHAN
ఆహా!!అమ్మ కడుపు చల్లన..నాన్న కలలు పండగ...ఆ రెండు మాటల్లోనే అటు తల్లితండ్రుల ఆనందం...ఇటు పుట్టిన బిడ్డ బాధ్యత రెండూ పలికించినట్టు ఉంది కదా అన్నా...ఇప్పటి వరకు ఈ పాట వినలేదు....మి blog చదివిన తర్వాత ఈ పాట విన్నా...అద్బుతం కదూ...ఈ మంచి పాటను మాకు తెలిసేలా చేసినందుకు🙏🙏🙏
రిప్లయితొలగించండిThank you
తొలగించండిThank you
రిప్లయితొలగించండి