వేగంగా పరిగెడుతున్న కాలంతో పాటు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకుడు సినిమా చూసే దృష్టి, విధానం మారాయి. రానూ రానూ టెక్నాలజీ పెరిగిపోయి కథ, కథనాలకు ప్రాధాన్యం తగ్గింది. అదే విధంగా సంగీతం, పాటలు మొదలైన విషయాల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. పాటల్లో సాహిత్యానికి విలువ లేకుండా పోయింది. కమ్మని తెలుగు పాట విని ఎన్నో రోజులు అయింది కదా.. అప్పుడప్పుడూ మంచి పాటలు వస్తూనే ఉన్నా.. అవి వేళ్ల మీద లెక్క పెట్టుకునేలా మారింది ఇప్పుడు పరిస్థితి. ఒక పాటకి వినసొంపైన సంగీతంతో పాటు అర్థవంతమైన సాహిత్యం కూడా ఎంతో ముఖ్యం. అప్పుడే అది మంచి పాటగా.. పది కాలాల పాటు పాడుకునేలా ఉంటుంది. అలాంటి పాటలు రాసే రచయితలు, కవులు ఈ మధ్య చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అలా గొప్ప పాటల రచయితల వరుసలో మనకు బాగా తెలిసిన సరస్వతీ పుత్రుడు వేటూరి సుందరరామ్మూర్తి గారు.
అమ్మ పాడే లాలి పాటైనా.. ప్రేమికులు పాడుకునే ప్రేమ పాటైనా.. పెళ్లి పాటైనా.. జీవిత పరమార్థం తెలిపే పాటైనా.. ఐటెం సాంగ్ అయినా.. సంప్రదాయ కవిత్వం అయినా.. జానపదమైనా.. అవి వేటూరి గారి కలం నుండి వచ్చినప్పుడు మరింత అందంగా, అద్భుతంగా ఉంటాయి. ఏ పాట విన్నా.. అందులో ఏ ఒక్క పదం కూడా అనవసరంగా కల్పించి రాసినట్లు ఉండవు. అక్షరం కోసం మరో అక్షరం పుట్టిందేమో అన్నంతలా ఇమిడిపోతాయి ఆ పాటల్లో పదాలు. మామూలుగా కనిపించే ఆ పదాల వెనక ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఒక పాటలో ప్రాసలు వచ్చేలా రాయడం, అల్లికలు, పదవిన్యాసాలు చేయడంలో వేటూరి గారిని కొట్టేవారు లేరేమో అని నా అభిప్రాయం.
1. ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా..
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది..
అవతరించారా.. విని తరించరా..
'శంకరాభరణం' సినిమాలోని ఈ ఒక్క పాట చాలు.. వేటూరి గారి పాటల పదును తెలియడానికి. ఒకవైపు శివుడిని స్తుతిస్తూనే.. మరోవైపు 'అవతరించరా.. విని తరించరా..' అని రాయడం అద్భుతం అసలు. ఆ దేవుడిని అవతరించమని ఓ మామూలు మనిషి అడగడం ఏంటి..? మన పాట విని దేవుడు తరించడం ఏంటి? కానీ ఈ పాటలో అలా అడిగి సాహసం చేశారు వేటూరి గారు.
2. తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..?
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా..?
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
'గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన' పాటతో మనుషుల్లో కులం, మతం అనే తేడాలు అవసరం లేదని, ఎవరెలా ఉన్నా మనమంతా ఒక్కటే అని సహజంగా మనం మాట్లాడుకునే పదాలతోనే చెప్పారు. తన శరీరం మొత్తం గాయాలు ఉన్న పిల్లనగ్రోవి కూడా తాకితే మంచి స్వరాలు అందిస్తుందని ఎంత గొప్పగా ఊహించారో కదా..!
3. కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి..
మీ కండలు పెంచినది ఈ గుండెలతో కాదా..
మర్మస్థానం కాదది.. మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
జన్మనిచ్చిన తల్లి గురించి ఇంత కన్నా గొప్పగా ఏముంటుంది రాయడానికి. యాంత్రిక జీవనంలో కన్నవాళ్లను మర్చిపోతున్న ఇప్పటి తరానికి ఈ పాట ఒక పాఠం.. గుణపాఠం. అమ్మతనంలో ఎంత గొప్పదనం ఉంటుందో.. ఆడవాళ్ల శరీరం గురించి తప్పుగా ఆలోచించే ఎవరికైనా మీ పుట్టుక కూడా అక్కడి నుంచే మొదలైందని సూటిగా చెప్పారు.
4. కనులు కలపవాయే.. మనసు తెలుపవాయే..
పెదవి కదపవాయే మాటవరసకి..
కలికి చిలకనాయే.. కలత నిదురలాయే..
మరవలేక నిన్నే మదన పడితినే..
ఒక పెళ్లీడుకి వచ్చిన అమ్మాయి.. కాబోయే వాడి గురించి ఇలా పాడుకుంటుంది అని వేటూరి గారికి ఎలా తెలిసి ఉంటుంది. మామూలు పదాలతోనే, వింటే ఈజీగా అర్థమయిపోయేలా ఎంతో చక్కగా రాశారు కదా.. ఒక అమ్మాయి మనసులో ఉండే భావాలను ప్రతి పదంలో చక్కగా ఆవిష్కరించారు.
5. ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే..
ఇది చాలా మందికి తెలిసిన పాట.. చాలా పెద్ద హిట్. కానీ మొదటిసారి విన్నవాళ్లు ఎవరైనా అర్థం కాక, ఇంకొకసారి వినాల్సిందే. అలాంటి పదాలు వాడారు మరి ఈ పాటలో వేటూరి గారు. తెలుగుని ఇలా.. ఇన్ని రకాలుగా వాడొచ్చు అని కూడా మనం ఊహించలేం. బహుశా వేటూరి గారు రాయడం వల్లే తెలుగులో ఇలాంటి పదాలు కూడా ఉన్నాయి అని మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది.
6. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ.. తోడు లేడులే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో.. చీకటాయెలే..!
వేటూరి గారి గురించి మాట్లాడుతూ ఈ పాటని గుర్తు చేసుకోకుండా ఉండగలమా..? తెలుగు సినిమా పాటని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ప్రస్థానం ఇది. జీవితంలోని ఒడిదుడుకులను గుర్తు చేస్తూ ఈ పాటతో ప్రతి ఒక్కరిని ఏడిపించారు. అందంగా రాసిన ఆ పదాల వెనక మనసులో గూడు కట్టుకున్న బాధని స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలోని 'వేణువై వచ్చాను భువనానికి..' పాట కూడా ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిందే.
7. పచ్చందనమే పచ్చదనమే.. తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే..
ఈ పాటని ఈ రెండు వాక్యాలతో పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే పాటలో ఎక్కడ వెతికినా రంగులే కనిపిస్తాయి. ప్రకృతిలో రంగులను ఆయన అక్షరాలతో మాల కట్టి చూపించారు. ఒక్కో వర్ణం గురించి వేటూరి గారు చేసిన వర్ణన పాటకే అందం తెచ్చింది.
8. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
తెలుసా.. మనసా నీకిది తెలిసీ అలుసా..
తెలిసీ తెలియని ఆశల వయసే వరసా..
మామూలుగా మంచి మాటలు చెప్తే ఎవరు వింటారండీ! తాగినవాడు అబద్దం చెప్పడు అంటారు. అందుకేనేమో ఈ పాటలో ఇలాంటి మాటలు విని జీవితం గురించి ఎంత బాగా చెప్పాడు అనుకున్నాం. నిజంగా ఇలాంటి సన్నివేశంలో ఇలా ఓ పాట కావాలని దర్శకుడు అడిగినప్పుడు వేటూరి గారు ఏం ఆలోచించారో మనకు తెలియదు కానీ.. ఓ తాగుబోతు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో అదే 'సాగర సంగమం'లో వేటూరి గారు రాసిన ఈ పాట.
9. నేడేరా నీకు నేస్తమూ రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా రానే రాదు
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే..
ఏదైనా కష్టం వచ్చి కుంగిపోతే ఈ పాట వినండి చాలు. నిన్నటి గురించి ఆలోచించి సమయం వృథా చేయకుండా ఈ రోజు ముఖ్యమని, రేపు అనేది అసలు ఉంటుందో లేదో .. జీవితంతో ఆటాడుకోమని వేటూరి గారు ధైర్యం చెప్పారు. ఇది చెప్పడానికి పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరం లేదు, ఈ రెండు వాక్యాల్లోనే అర్థమయ్యేలా చెప్పి స్ఫూర్తి కలిగించారు.
10. ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే..
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే..
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో..
ఈ పాట ఎప్పుడు విన్నా... తెలుగు ఇంత అందంగా ఉంటుందా అని అనిపించక మానదు. రామాయణం గురించి చెప్పాల్సి వస్తే రాముడినే గొప్పగా చెప్తాం. సీతమ్మ స్వయంవరంలో శివుడి విల్లు విరిచిన రాముడిని బలవంతుడు, ధీరుడు అని రామాయణంలో చదువుకున్నాం. కానీ.. అంతటి రాముడు సీత జడని ఎత్తగలడా.. అని రాయడం నిజంగా వేటూరి గారికే చెల్లింది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో, మరెన్నో వేటూరి గారి పాటలు.. అన్నీ అద్భుతాలే. ఆయన పాటలతో మనకు జీవిత పాఠాలు నేర్పారు, చిలిపి పలుకులు నేర్పారు, ప్రణయ ప్రయాణాలు సాగించారు. వేటూరి గారికి తెలుగు భాషపై ఎంత అభిమానం, గౌరవం అంటే.. 'మాతృదేవోభవ' సినిమా కోసం ఆయన రాసిన 'రాలిపోయే పువ్వా..' పాటకి జాతీయ అవార్డు వచ్చింది. కానీ తెలుగు భాషకి ప్రాచీన హోదా ఇవ్వనందుకు ఆ జాతీయ అవార్డును తిరస్కరించారు వేటూరి గారు. తెలుగు సినిమా పాటల్లో తెలుగుతనం తగ్గిన ఈ రోజుల్లో ఆయన మన మధ్య లేకపోవడం ఎవరూ ఎప్పటికీ తీర్చలేని లోటు. తెలుగు బతికున్నంత కాలం వేటూరి గారు, ఆయన పాట ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ప్రతి తెలుగు అక్షరంలోనూ వేటూరి గారు జీవం పోసుకుని మనకు కనిపిస్తూనే ఉంటారు. ఏది ఏమైనా వేటూరి గారు.. మీరు లేకపోవడంతో తెలుగు తల్లి మూగబోయింది.. వాడేవారు లేక తెలుగు అక్షరాలు మిగిలిపోతున్నాయి.. ఒంటరైపోయాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి