దేవుడు అంటే ఎవరు..?

దేవుడు అంటే ఎవరు..? ఈ ప్రశ్న మీకెప్పుడైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది.. అంతుచిక్కని ఈ ప్రశ్నకు సమాధానం మనలో ఎవరూ చెప్పలేం. దేవుడు కదా మనకేం తెలుసని గుడ్డిగా మొక్కేవాళ్లు కొందరు, చిన్నప్పటి నుంచి ఇంట్లోవాళ్ల ద్వారా చూసి అలవాటైపోయిందని మొక్కుతున్నవాళ్లు మరికొందరు, దేవుడనేవాడిని గుర్తించకపోతే మన కష్టాలు ఎలా పోతాయిరా అని మొక్కేవాళ్లు ఇంకొందరు, ఏదోలే దేవుడు కదా మొక్కకపోతే ఎలా అని సమాధానం చెప్పేవాళ్లు ఇంకా కొందరు.. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు, ఎవరికి తెలిసినంతలో వాళ్లు, ఎలా తోచినట్లు వాళ్లు ఏళ్లుగా దేవుడిని మొక్కుతూనే ఉన్నారు. మరి మీ ఉద్దేశ్యంలో దేవుడు అంటే ఏంటి? ఎప్పుడైనా మీకు మంచి జరిగి, అనుకున్నది నెరవేరి దేవుడంటే ఇది అని గుర్తించేలా ఏదైనా అనుభవం ఎదురైందా? అలాంటివి ఉంటే నాతో పంచుకోండి...

దేవుడు అంటే ఎవరు..?

చాలా మంది అడుగుతారు.. ఏంట్రా, ఎప్పుడు టైమ్ దొరికినా గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతావు, అయినా ఈ వయసు నుంచే నీకు ఈ చాదస్తం ఏంటి అని..! నిజంగా దేవుడిని మొక్కడానికి వయసుతో సంబంధం ఉంటుందా? ఒక వయసు వచ్చాకే దేవుడిని మొక్కాలని ఏమైనా పరిమితులు ఉంటాయా? అది మన ఆలోచనల బట్టి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి మన జీవితానికి అలవాటుగా మారిపోతుంది. నా వరకూ అయితే.. ఏదైనా దూరప్రాంతంలో ఉన్న గుడికి వెళ్తున్నానంటే.. అక్కడికి ఎలా వెళ్తున్నా, అలా వెళ్లే క్రమంలో నాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, పైగా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి కొత్త కొత్త రుచులు చూడొచ్చు, ఆ కొత్త ప్రదేశంలో ఇంకా కొత్తగా ఏం తెలుసుకోవచ్చు అనేవి పరిశీలిస్తుంటా. అందులో భాగంగానే అక్కడ ఉన్న గుడికి వెళ్లి దేవుడిని మనసారా దర్శించుకోవడం కూడా. సో.. నేను చెప్పేది ఏంటంటే.. ఈ అనుభవాల అన్నింటి కోసం నా యాత్ర ఉంటుంది తప్ప.. నేనేదో మహా భక్తుడిని అయిపోయానని కాదు.దేవుడు అంటే ఎవరు..?దేవుడి ముందు కళ్లు మూసుకుని కూర్చున్నావంటే నీకు పెద్ద పెద్ద శ్లోకాలు, మంత్రాలు రానక్కర్లేదు.. వేదాలు చదివి ఉండాల్సిన పని లేదు.. మనసారా కొలిస్తే చాలు.. ఎలా మొక్కినా ఆ దేవుడికి నువ్వు చెప్పేది అర్థమైపోతుంది. ఏ స్వార్థం లేకుండా నిర్మలమైన మనసుతో ఆ దేవుడిని మొక్కడమే ఆయనకు కూడా కావాల్సింది.. అదేంటి, మనం మొక్కేదే ఆ దేవుడు మన కష్టాలన్నీ పోగొట్టాలని కదా అంటావా? అలా మొక్కితేనే అన్నీ జరిగిపోతాయంటే పనులు మానేసి పూజలే చేస్తూ కూర్చుంటావుగా.. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఉంచాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఎప్పుడైనా భరించలేని కష్టం వస్తే నేను నీకింత చేశాను.. కానీ, నన్ను ఇలా ఏడిపిస్తున్నావని దేవుడిని తిట్టేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు.. అదే సంతోషంగా ఉంచితే అంతా దేవుడి దయ అనేవాళ్లూ ఉంటారు. కర్మఫలితం అనేది ఒకటి ఉంటుంది.. దాన్ని బట్టే అన్నీ జరిగిపోతుంటాయి. అందుకే కష్టం వస్తే దేవుడిని నిందించడం మాని, ఎలాంటి పరిస్థితినైనా పూర్తి మనసుతో స్వీకరించడానికి ప్రయత్నించు. 

దేవుడు అంటే ఎవరు..?

ఇదంతా పక్కన పెడితే.. చాలా మందికి భగవద్గీత అంటే మాములుగా తెలిసే ఉంటుంది. అది ఏ సందర్భాల్లో చూస్తుంటాం ఎక్కువగా. ఇప్పుడైతే మనిషి చనిపోతే పక్కనే కూర్చుని చదవడమో, మారిన కాలాన్ని బట్టి మైక్ సెట్ పెట్టి వినిపించడమో చేస్తున్నారు. అంటే మనం పుట్టి, పెరిగి, కుటుంబాన్ని పెంచుకుని, ఇంత సంపాదించి చివరికి నువ్వు పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లట్లేదనే ఉద్దేశంతో భగవద్గీత వినిపిస్తుంటారు. మనిషి పోయాడన్న బాధలో ఏడుస్తున్న మనకు, ఆ గీతా సారాంశం వినడం మంచిదే.. కానీ, పోయిన మనిషి దగ్గర అది పెడితే ఎవరికి లాభం? పోయాక ఎంత మొత్తుకున్నా వినే పరిస్థితి ఎలాగో ఉండదు కదా. అందుకే నా దృష్టిలో భగవద్గీత అనేది మనిషి పోయాక వినిపించేది కాదు.. బతికున్నప్పుడే చదివేది.. మరో పది మందితో చదివించేది. చదివి అందులోని నీతిని, జీవిత సత్యాలను తెలుసుకోవడం లాంటిది, మనిషిగా మనం ఈ భూమి మీదికి ఎందుకు వచ్చామో, ఈ పుట్టుక ఎందుకో గుర్తించడం లాంటిది. సింపుల్‌గా చెప్పాలంటే.. భగవద్గీత అంటే అదేదో మన వయసుకు సంబంధం లేని అర్థం కాని పరమార్థం కాదు.. ఇంట్లో దేవుడి గదిలో దుమ్ము పట్టేసిన ఓ పాత పుస్తకం కాదు.. మనిషిగా నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఉపయోగపడే ఓ మార్గదర్శి. 

దేవుడు అంటే ఎవరు..?

అలా అని దేవుడిని మొక్కు.. రోజూ పూజలు చేయు.. నీకు అంతా మంచే జరుగుతుంది.. దేవుడిని మొక్కకపోతే నీ జీవితం వ్యర్థం అని నేను చెప్పట్లేదు. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మరేదో ఉందని గుర్తించడమే దేవుడంటే. దేవుడు ఇలా ఉండేవాడు అని ఎవరూ చూడలేదు.. మనకు పురాణాలు, ఇతిహాసాల ద్వారా, పెద్దలు చెప్పిన మాటల ద్వారా దేవుడంటే ఇలా ఉంటాడేమో అని ఒక రూపం కల్పించుకున్నాం అంతే.. పేర్లు పెట్టుకుని పిలుచుకుంటున్నాం అంతే. రోజూ లాగా బద్దకంగా కాకుండా ఒకరోజు పొద్దున్నే లేచి, శుభ్రంగా స్నానం చేసి, దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కి నువ్వు నమ్మే రీతిలో నీ నుదుటన బొట్టు పెట్టుకుని చూడు.. నీకు నువ్వే తెలియని కొత్త అనుభూతి పొందుతావు.. మనసెందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్లు గుర్తిస్తావు.. ఆ రోజంతా నువ్వు పొందే పాజిటివ్ వైబ్స్, థింకింగ్‌తో చేసే పనిని మరింత శ్రద్దగా చేస్తావు.. రోజూలాగా కాకుండా ఆ రోజును మరింత కొత్తగా చూస్తావు.
దేవుడు అంటే ఎవరు..?
దీని వెనుక ఓ కారణముంది. సాధారణంగా దేవాలయాలను ఎప్పుడూ సానుకూల శక్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కడతారు.. ఆ ప్రదేశంలో భూ అయస్కాంత శక్తి ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి విస్తరించి ఉంటుంది. మరోవైపు, దేవతా విగ్రహాన్ని ఆలయ హృదయాంతరంలో ప్రతిష్టిస్తారు. ఆ స్థానాన్ని మూలస్థానం లేదా గర్భాలయం అంటారు. ఆ ప్రదేశంలో భూమి యొక్క అయస్కాంత తరంగాల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ కారణం వల్లనే గుడికి వెళ్లినప్పుడు నీకు తెలియకుండానే ఒక కొత్త అనుభూతిని చెందుతావు. సాధారణంగా రెండు కనుబొమ్మల మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పీనియల్ గ్రంథి నుదురు మధ్యలో ఉంటుంది. ఆ చోట బొట్టు పెట్టుకుంటే ఆ గ్రంథి వేగంగా పని చేసి మనలో ఏకాగ్రతను పెంచి మెదడును చురుగ్గా పని చేసేలా చేస్తుంది. ఇదే విధంగా దీపం వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం.. ఇలా చేసే ప్రతి పని వెనుక ఓ కారణం ఉంటుంది. అందుకే గుడికి వెళ్లేది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే తప్ప.. మన సమస్యలన్నీ దేవుడి తల మీద రుద్దడానికి కాదు. 
దేవుడు అంటే ఎవరు..?
దేవుడు నాకు ఇది కావాలని ఏదీ అడగడు.. ఎందుకంటే అన్నీ ఆయనే ఇస్తాడు కాబట్టి. అందుకే నువ్వు దేవుడికి ఇద్దామని అనుకునే ఓ పండు, ప్రసాదం లాంటిది బయట ఆకలితో ఉన్నవాడికి ఇచ్చి చూడు.. అప్పుడు తాను చేయాల్సిన పని నువ్వే చేశావంటూ ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. కొందరు అంటూ ఉంటారు.. దేవుడి గుడికి వెళ్లి ఎందుకు అంత ఖర్చు చేస్తారు.. ఆ ప్రాణం లేని రాయి మీద పాలు పోసి ఎందుకు వృథా చేస్తారు అని? పురాతన కాలంలో చాలా విగ్రహాలు రాతితో చేయబడి ఉండేవి. ఆలయం లోపల ఉండే పొడి వాతావరణం వల్ల ఆ విగ్రహానికి పగుళ్లు రావచ్చు. పాలలోని కాల్షియం రాతి విగ్రహాన్ని చెక్కుచెదరకుండా ఉంచే గుణం ఉంటుంది. అందుకే విగ్రహాల మీద పాలు పొసే ఆచారం వచ్చింది. ఇంకా కొందరు అంటారు.. ఉత్సవాలు, పండుగలు అని చెప్పి లక్షలకు లక్షలు ఖర్చు చేస్తారు.. ఏ అలా చేయకుండా దేవుడు ఒప్పుకోడా? దేనికి అని? కానీ, ఊళ్లో జరిగే ఒక చిన్న జాతర లేదా ఉత్సవాల వల్ల ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుంది. గుడిలో పూజారి దగ్గరి నుంచి గుడి బయట కొట్టు పెట్టుకున్నవాళ్ల వరకు ఆ సమయంలో ఆదాయం వస్తుంది. దేవుడు పేరు చెప్పుకుని ఆ పండగల సమయంలో వచ్చిన డబ్బుతో కొన్ని రోజులైనా వాళ్లు సంతోషంగా బతుకుతారు. ఇది మాత్రం మనం గుర్తించం.
దేవుడు అంటే ఎవరు..?
దేవుడంటే మనకు తెలియని, అర్థం కాని ఓ శక్తి కాదు.. దేవుడంటే గుడ్డిగా మొక్కే రాయి కాదు.. దేవుడంటే కష్టాలు వచ్చినప్పుడే గుర్తు చేసుకునే అవసరం కాదు.. దేవుడంటే నాలుగు గోడల మధ్య గుడిలో బంధించే రూపం కాదు.. దేవుడంటే ఓ నమ్మకం.. నువ్వు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. అందుకే నమ్మి చూడు.. అప్పుడు నిన్ను నువ్వే ఖచ్చితంగా నమ్మడం మొదలుపెడతావు. 
దేవుడు అంటే ఎవరు..?



THANK YOU

PC: CH.VAMSI MOHAN





కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి