'రామ చక్కని సీతకి..'

'గోదావరి' సినిమా అంటే నాకు ఎంత ఇష్టమో.. అందులో ఉన్న ఒక పాట అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఆ పాట వింటున్న ప్రతిసారి ఆ సంగీతం ఎంత బాగుంది అనిపిస్తుందో.. అంతకన్నా ఎక్కువగా ఆ పాట సాహిత్యం మరింత బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అయితే.. ఈ సందర్భంలో ముందుగా ఆ పాటను అంత అద్భుతంగా రాసిన సరస్వతీ పుత్రులు వేటూరి సుందరరామ్మూర్తి గారిని మనం తప్పక గుర్తు చేసుకోవాలి. ఆ పాటే.. 'రామ చక్కని సీతకి..'.
'రామ చక్కని సీతకి..'

హీరోయిన్ సీతకి రామ్ అంటే చాలా ఇష్టం.. కాకపోతే అది బయటకు చెప్పలేని బెట్టుతనం కాస్త. రామ్‌కి కూడా సీత అంటే అభిమానమే. పైగా సీతకి రామ్ మీద ఎక్కడ లేని నమ్మకం. అది చూపించీ చూపించనట్లుగా సీత పెంకితనం అడ్డు వస్తుంటే.. ఈ పిల్లాడు అసలు అర్థం చేసుకోడే అని చిర్రుబుర్రులాడుతున్న సందర్భంలో ఈ పాట వస్తుంది సినిమాలో. గలగల పారే గోదారి నీటిని చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బోటు.. ఆ పాపికొండల పరిసరాలు.. చల్లగా తగిలే గాలి.. ఓ వైపు రోట్లో రుబ్బుతున్న గోరింటాకు.. మధ్యలో సీతారాముల విగ్రహాలు.. మరోవైపు బామ్మచేత గోరింటాకు పెట్టించుకుంటున్న సీత.. ఆ గోరింటాకు ఎలా పండిందో రామ్‌కి చూపించాలనే సీత ఆరాటం.. ఇవి చాలదా ఆ పాట ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి.
'రామ చక్కని సీతకి..'

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట.. రామచక్కని సీతకి

సీతమ్మ అంటేనే చక్కని తల్లి.. మరి ఆ తల్లి గుణాన్ని పోల్చాలంటే మామూలు మాటలు ఎలా సరిపోతాయి? అందుకే రాములవారిని కీర్తిస్తూ పోల్చడం కన్నా గొప్పగా ఏముంటుందని అనుకున్నారేమో ఇక్కడ వేటూరి గారు. ఆ చక్కదనానికి కొలమానం రాముడే కాబట్టి ఆయన్ని జోడించారు. అందుకే రామచక్కని సీత అన్నారు. రాముడంటి చక్కనైన సీతమ్మ.. మరి అంత చక్కని చుక్కకి మొగుడు అంటే.. రామచంద్రుడు కాక ఇంకెవరు సరితూగగలరు!
'రామ చక్కని సీతకి..'

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టేవేళలో
రామచక్కని సీతకి

లంకకు వారధి కట్టే సమయంలో ఉడత సాయం చేసిందని.. ఆ చిన్ని ప్రాణి చేసిన సాయానికి ప్రతిఫలంగా రాముడు దాని వీపు నిమిరాడని, అందుకే ఉడత వీపుపై ఇప్పటికీ గీతలు కనిపిస్తాయని మనకు తెలుసు కదా. ప్రాణం చిన్నదే, కానీ అది చేసిన సాయం గొప్పది. అందుకే పుడమి అల్లుడైన రామచంద్రుడు ఆ అల్పప్రాణిపై అలా దయ చూపించాడు. సీతా స్వయంవరంలో ఒంటి చేత్తో శివధనుస్సును ఎత్తిన ఆ రాముడే.. మరి సీతమ్మ తల్లి మెడలో తాళి కట్టేటప్పుడు తన జడను ఎత్తగలడా? అదేంటీ.. క్షత్రియుడు, పరాక్రమవంతుడు, అయోధ్యకు యువరాజు అయిన రాముడు సీత జడను ఎత్తలేకపోవడం ఏంటి అని సందేహం మనకు రావొచ్చు. ఇక్కడ జడను ఎత్తడం అంటే తన బలం గురించి మాట్లాడడం కాదు.. సాధారణంగానే రెండు చేతులతో తాళిని పట్టుకుని కట్టేటప్పుడు జడను ఎత్తడానికి ఇంకొకరి సాయం కావాల్సిందే కదా. ఇదిలా ఉంటే, సినిమాలో సీత పాత్రకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆ ఆత్మాభిమానానికి గౌరవం ఇచ్చి ఒక ఆడపిల్ల ముందు తాను తగ్గి ఉండడం ఇక్కడ కుదురుతుందా అనే అర్థంలో కూడా వాడి ఉండొచ్చు. 
'రామ చక్కని సీతకి..'

ఎర్ర జాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి

ఎర్ర జాబిలి.. అసలు ఈ పదం వాడడంలోనే చాలా అందం ఉంది. మనం గోరింటాకు పెట్టుకుంటే చేతిలో గుండ్రంగా పెట్టుకుంటాం కదా.. ఆ గుండ్రని ఆకారాన్ని ఇక్కడ వేటూరి గారు చందమామతో పోల్చారు. అది కూడా ఎర్రని రంగులో పండింది అని. అందుకే ఎర్ర జాబిలి. ఆ చేతి మీద పెట్టిన గోరింటాకు గిల్లి మరీ అడిగిందట రాముడు ఎక్కడా అని. చూడలేదని పెదవులు, చెప్పలేమని కనులు చెపితే నల్లపూసైనాడు దేవుడు అనుకున్నాయట. నల్లపూస అనే పదం ఎందుకు వాడతారు అంటే.. భారతీయ స్త్రీలు మెడలో ధరించే మంగళసూత్రంలో నల్లగా ఉండే పూసలు ధరించడం మనకు తెలిసిందే. ఆ పూసలు చాలా చిన్నగా, పైగా నల్లగా ఉంటాయి. అవి ఎక్కడైనా అనుకోకుండా పారేసుకుంటే మనం వెతుక్కోలేం. పైగా వెతికినా దొరకవు కూడా. అందుకే ఎవరినైనా చాలా రోజుల తర్వాత చూస్తే 'ఏంట్రా బొత్తిగా నల్లపూసై పోయావు' అంటారు. మరి రాముడు ఎక్కడా కనిపించడం లేదని నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు అని వాడారు. 
'రామ చక్కని సీతకి..'

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామచక్కని సీతకి

నా రాముడు ఎక్కడ అని చుక్కని అడిగా, దిక్కుని అడిగా అయినా ఎవరూ చెప్పలేదు. అలాగే చెమ్మగిల్లిన చూపునడిగా.. అంటే రాముడి కోసం ఎదురుచూసి చూసీ కళ్లు ఏడుస్తున్నాయి. ఆ ఏడుస్తున్న కళ్లలో నీటి తెరలు అడ్డుగా వచ్చాయట. మనం ఏడుస్తున్నప్పుడు నీళ్లు నిండిన కళ్లతో ఎదురుగా ఏదీ చూడలేం. అందుకే ఆ నీళ్లు నిండిన కళ్లతో చూడలేకపోతున్నాను, మనసుతో చూసుకో నీ రాముడు ఎక్కడున్నాడో అని ఇక్కడ అర్థం. అయినా మనసుతో ఎలా చూడగలం.. అద్భుతమైన భావన కదా. తెలుగు నిజంగా ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉంటాయి ఈ వ్యాక్యాలు.. అందులో వాడిన పదాలు. ఒక్కో పదం ఇంకో పదం కోసం పుట్టిందేమో అన్నంత చక్కగా అమర్చారు ఈ పాటలో వేటూరి గారు. సినిమాలో సీత, రామ్ పాత్రలను పురాణంలో సీతారాములతో పోలుస్తూ.. సినిమాలో వచ్చే ఆ సందర్భాన్ని రామాయణంలోని ఒక చక్కని ఘట్టంలా భలే ఊహించి రాశారు.
'రామ చక్కని సీతకి..'

ఏది ఏమైనా వేటూరి గారు.. మీ ఊహా రచనకు జోహార్లు.. ఈ పాటలో అమర్చిన అందమైన పదాలకు, మీ పాదాలకు నా నమస్సులు.
'రామ చక్కని సీతకి..'


THANK YOU

PC & SUPPORT BY: CH.VAMSI MOHAN

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి