ప్రాణం పోతున్న ఆ చివరి క్షణం...

 

ప్రాణం పోతున్న ఆ చివరి క్షణం...

అది ఒక పేరున్న పెద్ద హాస్పిటల్.. చాలా ఎత్తైన బిల్డింగ్.. లోపల రకరకాల వైద్యానికి సంబంధించిన ఎన్నెన్నో వార్డులు.. తెల్లని కోటు, మెడలో స్టెతస్కోప్ వేసుకుని పరుగులు పెడుతున్న డాక్టర్లు.. తెల్లని దుప్పటి పరిచిన బెడ్లపై పడుకుని ఉన్న పేషెంట్లు.. వాళ్లను పరామర్శించడానికి వచ్చిన బంధువులు.. అలాంటి గందరగోళ వాతావరణంతో ఆ హాస్పిటల్ ఎంతో సందడిగా కనిపిస్తోంది. ప్రతి పేషెంట్ బెడ్ పక్కనే ఏవేవో మెషీన్లు, వాటికి పెట్టిన పెద్ద పెద్ద వైర్లు.. ఆ మెషిన్లలో అడ్డదిడ్డంగా కదులుతున్న గీతలు.. మరోవైపు ముక్కుకు తెలుస్తున్న మందుల వాసన. ఇదంతా అక్కడ అనుభూతి చెందుతున్న నాకు.. నేను వచ్చిన పనేంటో గుర్తుకొచ్చి ముందుకు కదిలాను.

ఎంక్వయిరీ సెంటర్‌లో పేరు, వివరాలు చెప్పి నాకు సంబంధించినవాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుని ఒక్కో గది చూస్తూ ముందుకు వెళ్తున్నా. వరుసగా చాలా వార్డులు ఉన్నాయి.. అన్నిట్లోనూ ఏదో ఓ అనారోగ్యంతో అక్కడ చేరినవాళ్లు, పక్కనే వాళ్లకు సంబంధించిన మనుషులు వాళ్లను కనిపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అదంతా చూస్తుంటేనే కొంచెం భయంభయంగా, ఆందోళనగా అనిపించింది ఎందుకో నా మనసుకి. అంత మందిలో నాకు కావాల్సినవాళ్లను చేరుకునేసరికి వాళ్లనే చూస్తూ ఒక్క క్షణం అలా కాసేపు ఆగిపోయా. 

నాకు కొంచెం దూరంలో హాస్పిటల్ బెడ్‌పై ఓ పదహారేళ్ల పిల్లాడు కదలకుండా పడుకుని ఉన్నాడు. చేతికి గుచ్చిన సెలైన్ సూదులు, బ్యాండేజ్‌లతో వాడిని ఆ స్థితిలో చూసేసరికి అప్పటివరకు ఉన్న ఆందోళన ఇంకాస్త ఎక్కువైంది. ఆ పక్కనే మంచానికి ఆనుకుని ఉన్న  కుర్చీలో తల్లి కూర్చుని ఉంది. తలను పక్కకు వాల్చి.. చీర కొంగుని ఆ తలపై నుంచి నిండుగా కప్పుకుని.. ముఖంలో బెరుకుతనంతో.. శరీరంలో నీరసంతో.. మంచం మీద అచేతనంగా కోమాలో ఉన్న తన కన్నబిడ్డనే చూస్తూ ఉండిపోయింది. చుట్టూ ఏం జరుగుతున్నా.. ఎవరు పక్క నుంచి వెళ్తున్నా.. చివరికి నేను ఆ దగ్గరలోనే ఉన్నా కూడా చూసే పరిస్థితిలో ఆ తల్లి లేదు. చెంపల మీద మసకగా కనిపిస్తున్న కన్నీటి చారలు ఇంకా మాసిపోలేదు. ఎంత ఏడ్చిందో పాపం ఆ పిచ్చితల్లి.. ఎన్ని రోజుల నుంచి అలా ఏడుస్తూ ఎదురుచూస్తుందో.. ఎప్పుడెప్పుడు ఆ బిడ్డ లేస్తాడా.. ఒక్కసారైనా అమ్మ అని పిలుస్తాడా అని ఆశతో క్షణక్షణం చచ్చి బతుకుతోంది.

అప్పటికే నా గుండె బరువెక్కి, మనసుని బాధ ఆవహిస్తుంటే.. ముందుకు పడని అడుగులను బలవంతంగా కదిలిస్తూ తప్పదన్నట్లుగా వేసి.. ఆ తల్లికి దగ్గరగా చేరి భుజం మీద చేయి వేశా. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినదానిలా తేరుకుని, తల తిప్పి నా వైపు చూసింది. చూసీచూడగానే అప్పటికే కళ్లల్లో నిండుకుని ఉన్న నీళ్లు ధారలుగా రెండు వైపుల నుంచి కిందికి జారాయి. కుర్చీలో నుంచి కష్టంగా లేచి, అమాంతం నన్ను హత్తుకుని పొంగుకొస్తున్న ఏడుపును ఆపకుండా బయటపెట్టేసింది. మారాం చేస్తున్న పసిపాపాయిలా ఆ అమ్మ మనసు.. తనకు తన బిడ్డ కావాలని, వాడి ఆరోగ్యం బాగవ్వాలని.. ఏదోటి చేయమంటూ నాకు మొర పెట్టుకుంటోంది. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తోంది.. గుక్క పట్టిన ఏడుపుతో మాట పెగలకపోయినా వాడు ఈ సమయానికి ఇది చేసేవాడు.. అది చేసేవాడు.. అలా ఉండేవాడు అని ఏదేదో చెప్తూనే ఉంది. అలా హత్తుకునే ఉండిపోయిన నాకు.. ఆ పిచ్చి మనసు ఎంత విలవిలాడిపోతుందో వేగంగా కొట్టుకుంటున్న ఆ తల్లి గుండె చెప్తూనే ఉంది.

ప్రాణంగా అనుకున్న మనిషి చావు బతుకుల్లో ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆ రోజు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. అది ఎంతలా అంటే.. ఆ మనిషి గుండె చప్పుడును కొలిచేంత, వదులుతూ పీల్చే శ్వాసను లెక్క పెట్టేంత, తల నుంచి పాదాల వరకు అణువణువును అనుక్షణం కాపాడుకునేంత, మొత్తంగా ఓ కన్నతల్లి అంతులేని ఆవేదనంత. తిండి సహించదు, నిద్ర పట్టదు.. ఏ రాత్రో ఆ బిడ్డ లేచి ఆకలికి అమ్మా అని ఏడుస్తాడేమోనని కంటి మీద కునుకు లేకుండా ఆ తల్లి ఎదురుచూస్తూనే ఉంది. కోమాలో ఉన్న బిడ్డ ఎంత కదిపినా కదలట్లేదు.. ఎన్ని సార్లు పిలిచినా పలకట్లేదు.. శరీరంలో ప్రాణం ఉంది.. కానీ ఆ ప్రాణం బండబారి పోయి ఉంది. ఆ తల్లికి ఆ క్షణం ఒకటే అనిపించింది.. పుట్టినప్పుడు తన చనుబాలు తాగి పొత్తిళ్లల్లో పడుకున్న పసిపాపలాగా, ఈ రోజు కూడా అచ్చం అలాగే ఉలుకూపలుకూ లేకుండా ఇంకా పడుకున్నాడేంటని. ఆమె ఆలోచనలకు అడ్డు పడుతూ అక్కడే ఉన్న మెషిన్ ఏదో చప్పుడు చేస్తుండడంతో అటువైపు చూసి ఇలా అనుకుంది.. ఈ గీతలేనా తన కొడుకు బతుకుని నిర్ణయించేది.. అందులోంచి వస్తున్న అర్థం కాని శబ్దాలేనా తన కొడుకు ఊపిరిని లెక్క గట్టేది..! నిజానికి అది మెషిన్ నుంచి వచ్చే చప్పుడు కాదు.. క్షణం క్షణం ఏమవుతుందోనని కొట్టుకుంటున్న ఆ తల్లి గుండె చప్పుడు.

దీనంగా మొహం పెట్టేసి, అన్ని ఆశలు కోల్పోయి ఉన్న తల్లి పక్కనే కూర్చున్నా. వాడు ఎప్పుడు లేస్తాడురా, నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడురా అని అడుగుతోంది. నిజానికి ఆ తల్లి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఏమీ కాదులే, వాడు కొన్ని రోజుల్లోనే బాగవుతాడు చూడు అని ఏదో ఊరుకోబెట్టడానికి అబద్దాలు చెప్పి తప్పించుకోవడం తప్ప.. నా దగ్గర వేరే దారి లేదు. పీలుస్తున్న ఊపిరిని మాకు సాక్ష్యంగా చూపిస్తూ, ఇంకా ప్రాణంతోనే ఉన్నానని మాకు భరోసా ఇస్తున్న వాడి పక్కనే కూర్చుని నేను, ఆ తల్లి మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో నాకు అన్ని పనులు చేసిపెట్టేవాడురా, ఎప్పుడైనా నాకు బాలేకపోతే అన్నీ దగ్గరికి తెచ్చి ఇచ్చేవాడురా, ఏమైనా కష్టం వస్తే ఎందుకమ్మా నేనున్నాగా అని ధైర్యం చెప్పేవాడురా, నాకు వాడు కొడుకు కాదురా.. తండ్రిలాగా అని నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెబుతున్న ఆ అమ్మ మాటలను నేను శ్రద్ధగా వింటున్నా. కానీ ఇవన్నీ కోమాలో పడుకున్న వాడు వింటున్నాడో లేదో మాకు తెలియదు. ఇంతలో అక్కడ ఉన్న మెషిన్‌లో నెంబర్లు మారిపోతూ చప్పుడు వినబడుతోంది.. పదేపదే గీతలు దారి మార్చుకుంటున్నాయి. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక బిక్కమొహం వేసుకుని చూస్తుండిపోయిన మా ఇద్దరి వైపు ఓ డాక్టర్, నర్సు పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్మల్ని చూస్తూ కాస్త దూరంగా వెళ్లి నిలుచోండని సైగ చేసి వాళ్ల పనిలో వాళ్లు మునిగిపోయారు. అక్కడి నుంచి కదలడం ఏ మాత్రం ఇష్టం లేని ఆ తల్లిని సముదాయిస్తూ, తప్పదు కదా అని గది బయటికి తీసుకెళ్లిపోయా. ఆ అద్దాల తలుపు నుంచి చూస్తే లోపల జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపిస్తోంది.

డాక్టర్.. అక్కడ ఉన్న నర్సులకు ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పింది విని వాళ్లు ఏవో ఇంజెక్షన్లు సిద్ధం చేస్తున్నారు.. మెషిన్‌లో కనిపిస్తున్న నెంబర్లని పేపర్‌పై రాసుకుంటున్నారు.. కాసేపు ఛాతీ మీద గట్టిగట్టిగా కొడుతున్నారు.. ఊపిరి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.. అలా ఓ ఐదు నిమిషాలు గడిచాయి.. బయట ఉన్న మాకు మాత్రం ఆ ఐదు నిముషాలు ఐదు యుగాలుగా తోస్తున్నాయి. అద్దాల తలుపు నుంచి ఆందోళనగా కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్న మావైపు డాక్టర్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన రావడం గమనించి మేము కాస్త దూరంగా జరగగానే.. తలుపు తోసుకుని వచ్చి మా ముందు నిలబడ్డాడు. కాసేపు ఆ తల్లి వైపు తీక్షణంగా చూసి.. 'సారీ అమ్మా.. మీ బాబు చనిపోయాడు' అని చెప్పాడు. అది విన్నాక ఆవిడ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఆ మాటలకు స్పందించడానికి కూడా తనకి ఇష్టం లేదు. వెంటనే నేను.. 'ఇంకొక్కసారి ప్రయత్నించండి డాక్టర్.. ఏమైనా అవకాశం ఉంటే..!' అని గొంతు మూగబోయినవాడిలా అడిగాను. 'లేదండీ.. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం.. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వెళ్లి ఓసారి చూడొచ్చు.. మీరే ఆవిడకి ధైర్యం చెప్పాలి' అని నాకు అప్పగిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అక్కడే ఉన్న కుర్చీలో ముందుగా తనని కూర్చోబెట్టి.. భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేశాను. కాస్త మంచినీళ్లు తాగు అన్నట్లుగా చేతిలో బాటిల్ పెట్టాను. కానీ ఏమీ మాట్లాడట్లేదు.. ఏమీ చెప్పట్లేదు.. కనీసం ఏడవట్లేదు. కాసేపు అంతా నిశ్శబ్దం. నేను మాత్రం మాట్లాడుతూనే ఉన్నా. 'అంతా అయిపోయిందిలే అక్క.. మనకు ఇంతే అని సరిబెట్టుకోవాలి..  ఏం చేస్తాం ఆ దేవుడు ఇంత అన్యాయం చేశాడు.. ధైర్యం కోల్పోకు.. మేమంతా ఉన్నాంగా నీకు.. నా మాటలు వింటున్నావా..' అని తనని కదుపుతూనే ఉన్న నన్ను.. ఒక్కసారిగా గట్టిగా పట్టేసుకుని గుండె పగిలినట్లుగా బోరున ఏడుస్తోంది ఆ తల్లి.. ఏడవనీ.. దాచుకున్న బాధ అంతా బయటికి వెళ్లిపోయేలా తనివితీరా ఏడవనీ.. తన బిడ్డ ఈ లోకంలో లేడు, ఇకపై రాడు కూడా అని ఆ అమ్మ మనసుకు అర్థమయ్యే వరకూ ఏడవనీ.. నేనేమీ ఆపలేదు. ఎంత ఏడుస్తావో అంతా ఏడ్చేసెయ్ అని చూస్తుండిపోయిన నాతో ఒక్కసారి లోపలికి వెళ్లి వాడిని చూద్దాంరా అని అంది.

ఊయలలో నిద్రపోతున్న పసిపాపని తాకుతున్నట్లుగా.. మంచంపై జీవం లేకుండా పడుకున్న తన బిడ్డ ఒళ్లంతా తడుముతోంది ఆ తల్లి. ఇన్నాళ్లూ కళ్లల్లో పెట్టి పెంచుకున్నందుకు ఈ రోజు కళ్లారా మళ్లీ మళ్లీ చూసుకుంటోంది.. చెదురుమదురుగా చిక్కులు పడిన కొడుకు జుట్టును సరిచేసి.. తన రెండు చేతులతో మొహాన్ని మొత్తం తాకి తన తలకు ఆనించుకుని దిష్టి తీసినట్లుగా వేళ్లు విరుచుకుంటోంది. నడుముకి కట్టిన గుడ్డ కాస్త పక్కకి తొలగిందని గమనించి, సరిచేసి కాళ్ల వరకూ కప్పింది. జరిగిన నిజాన్ని అంగీకరించలేని ఆ తల్లి కొడుకుతో.. 'ఏరా నాన్నా.. మన ఇంటికి వెళ్దాంరా.. నేనొక్కదాన్నే వెళ్లలేనురా బెంగగా ఉంటుంది.. ఇంకో రెండు రోజుల్లో సంతోషంగా వెళ్లిపోతాం అనుకున్నా.. ఇలా చేశావేంట్రా..' అని బొటబొటా కళ్ల నుంచి నీరు కారుస్తూ సమాధానం రాని ప్రశ్నలు వేస్తోంది.

ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న నాకు ఆ తల్లిని ఎలా సముదాయించాలో తెలియలేదు. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ క్షణంలో నేను ఏడవలేదు.. మనిషి జీవితం అంటే ఏంటో తెలుసుకున్నా.. అమ్మ ప్రేమ అనే పదానికి అసలైన అర్థం తెలుసుకున్నా.. మొదటిసారి ఆ దేవుడి మీద కోపం తెచ్చుకున్నా.. జాలి, దయ అనేవి కొంచెం కూడా నీకు లేవా అని మనసులోనే తిట్టుకున్నా.. ఎలా ఉంటాయిలే.. మాలాగా ఎవరినైనా పోగొట్టుకుంటే కదా....!


THANK YOU

కామెంట్‌లు

  1. తల్లి హృదయంలోని వేదన, ఆ బిడ్డ పట్ల ఉన్న అమితమైన ప్రేమను మీరు అద్భుతంగా రాశారు. ప్రతి పదం మనసును కదిలించేలా ఉంది. నిజంగా ఇది కేవలం బ్లాగ్ కాదు, జీవితం, ప్రేమ, బాధల అసలు రూపం. 🙏💔

    రిప్లయితొలగించండి
  2. తల్లి ప్రేమ ఎంతో మధురమైనది.... జీవితం ఏది చూపించినా ఉన్న క్షణాల్ని మన అనుకున్న వాళ్లతో ఆస్వాదించగలగాలి.....live in the present moment who knows what future holds for you!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి