నేను చూసిన అందమైన ప్రేమకావ్యం.. 'గీతాంజలి'

'గీతాంజలి' సినిమా చూశారా?.. చూసే ఉంటారు లెండి. చూడడమే కాదు.. ఇది మా ఫేవరెట్ మూవీ అని కూడా చెప్తారు చాలా మంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అంటారు కొందరు. ఇది కదా లవ్ స్టోరీ అని మరి కొందరు పొగుడుతారు. అబ్బా ఏం ఫీల్ ఉంది మావా ఈ సినిమాలో అంటారు ఇంకొందరు. మరి ఏముందని..? ఇందులో అంత గొప్పగా చెప్పుకోవడానికి? ఏముందని..? టీవీలో వచ్చినప్పుడు మళ్లీ మళ్లీ చూడడానికి..? అదే మనం ఈ రోజు మాట్లాడుకుందాం. దాని కన్నా ముందు ఈ సినిమాని ఇంత అద్భుతంగా, మనందరికీ నచ్చే ఓ ప్రేమకావ్యంలా తీర్చిదిద్దిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారిని తలచుకోకపోతే ఎలా? అంతేకాదు.. ఇందులో ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసేలా తన సంగీతంతో మ్యాజిక్ చేసిన గురువు ఇళయరాజా గారిని మరీమరీ గుర్తు చేసుకోవాల్సిందే.. అన్నట్లు.. ఈ సినిమా మీకు కూడా ఇష్టమైతే.. మరి ఎందుకు ఇష్టమో, ఎందుకు అంతగా నచ్చిందో నాతో చెప్పాలి.. సరేనా..!గీతాంజలిహీరోకి క్యాన్సర్.. అది కూడా సినిమా మొదట్లోనే చెప్పేస్తారు. అయ్యో.. హీరో కొన్ని రోజుల్లోనే చనిపోతాడా?.. ఎవడు చూస్తాడురా బాబు ఇలాంటి కాన్సెప్ట్. మాకు హీరో అంటే హ్యాండ్‌సమ్‌గా ఉండాలి.. బాగా ఫైట్లు చేయాలి.. బాగా డాన్స్ చేయాలి.. హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలి.. అలా ఉండాలి గానీ, ఏదో రోగం ఉందని చూపించి హీరో అంటారు ఏంటి.. కష్టమే..! పోనీ ఇదేదో కొత్తగా ఉంది అనుకుందాం. కాసేపటికి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. తర్వాత మెల్లగా ఆమెకి కూడా క్యాన్సర్ అని.. కొన్నిరోజుల్లోనే చనిపోతుందని చెప్తారు. సరిపోయిందిపో.. ఇక ఏముందని చూడటానికి ఈ సినిమాలో. అసలు సినిమాలో హీరో చచ్చిపోతాడు అంటేనే మా తెలుగు ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు. హీరో ఎప్పుడూ హీరోలాగే ఉండాలి. ఈ మణిరత్నంకి నిజంగానే పిచ్చి అనుకుంటా.. ఇలాంటి సినిమా తీశాడు. కానీ, చావులో కూడా ప్రేమ ఉంటుందని.. అది ఇంత అందంగా ఉంటుందని మణిరత్నం గారు తీసేవరకు నాకు కూడా తెలియదు.గీతాంజలిఉరకలెత్తే యవ్వనంతో భవిష్యత్తుపై కోటి ఆశలతో 'జగడ జగడ జగడం చేసేస్తాం..  రగడ రగడ రగడం దున్నేస్తాం.. మరల మరల జననం రానీరా మరల మరల మరణం' అంటూ రేపటి గురించి పాడుకుంటున్న ప్రకాష్.. అనుకోకుండా ఒక ప్రమాదానికి గురవుతాడు. ఆ సమయంలోనే తనకు క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పేస్తారు. అంత చిన్న వయసులోనే తన జీవితాన్ని గురించి చేదు నిజం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తనని చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్‌తో 'నన్ను పెళ్లి చేసుకుంటారా..?' అని ప్రకాష్ అడగడం.. ఆ మాటకు వెనక్కి తిరిగి చూసి డాక్టర్ నవ్వే ఆ చిన్న నవ్వు.. ఆ వెంటనే వెనకాల రాజా గారి మ్యూజిక్.. ఆహా ఎంత మంచి ఫీల్ తెప్పిస్తుందో..!గీతాంజలిముగింపుకు వస్తున్న ఒక మనిషి జీవితంలో ప్రేమ అనే ఒక ఆశను, కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని అనుకోవడమే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. నేను కొన్ని రోజుల్లోనే చనిపోతున్నాను అని తెలుసుకోవడం కన్నా ఒక మనిషికి పెద్ద నరకం ఇంకేముంటుంది చెప్పండి? జీవితంపై పెట్టుకున్న ఆశలను, పెంచుకున్న కోరికలను, సొంతవాళ్ల ప్రేమను దూరం చేసుకోవాలంటే ఆ గుండెకు ఎంత ధైర్యం కావాలి? మసకబారుతున్న జీవితాన్ని ప్రతిబింబించేలా ఇందులో ప్రతి షాట్‌ని డార్క్ మోడ్‌లో చూపిస్తారు. స్క్రీన్ మొత్తం చీకటిగా చూపిస్తున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా చూసే ప్రేక్షకుడికి మాత్రం కొత్త అనుభూతిని కల్పించిన పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీకి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా ఊటీ అందాలు, ఆ పొగ మంచు చీకట్లను కెమెరాతో అందంగా క్యాప్చర్ చేసిన విధానం అత్యద్భుతం అనే చెప్పాలి.గీతాంజలిఅలా ఆశలు కోల్పోయి మోడువారిన ప్రకాష్ జీవితంలోకి, ఎండిపోతున్న చెట్టుని మళ్లీ చిగురింపచేయడానికేమో అన్నట్లు తొలకరి జల్లులో ఆనందంగా గంతులేస్తూ ఆడుతున్న గీతాంజలి ప్రవేశిస్తుంది. వర్షంలో నిలువెల్లా తడుస్తూ ప్రకృతి అందాలను తనివితీరా అనుభవిస్తూ 'జల్లంత కవ్వింత కావాలివే..' అంటూ వచ్చే ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన సుందరం మాస్టర్‌ని కూడా ఒక చిన్న షాట్‌లో మనం చూడొచ్చు. గీతాంజలి అల్లరి పిల్ల.. తనకి రేపు గురించి బెంగ లేదు.. ఈ రోజు మాత్రమే ముఖ్యం అనుకునే ఆడపిల్ల. ఇంటికి లేటుగా వచ్చానని నాన్న తిడతాడని అమాయకత్వం ప్రదర్శిస్తూ, దొంగతనంగా భోజనం తీసుకెళ్లి దొరికిపోయిన గీతాంజలి చిలిపితనానికి ఇంటివాళ్లే కాదు.. చూసే ప్రేక్షకుడు కూడా ప్రేమలో పడిపోతాడు. గీతాంజలి పెద్ద కళ్లు, అల్లరితనం, పెద్దగా ఆడంబరం లేని తన బాడీ లాంగ్వేజ్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయ్. ముఖ్యంగా అప్పట్లో గీతాంజలి డ్రెస్సులకు తెగ డిమాండ్ ఉండేదట. ఈ సినిమాలో హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్‌కి అంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో ఈ సినిమా ఇష్టపడేవాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.గీతాంజలిమార్కెట్లో ఓ కుర్రాడిని చూసి గీతాంజలి ఎక్కడికైనా లేచిపోదామా అని అడగడం.. తర్వాత బామ్మ దగ్గర మాత్రం ఆ కుర్రాడిని చెడామడా తిట్టేశానని అబద్దం చెప్పడం.. స్మశానంలో దెయ్యాల వేషాలతో ఆ కుర్రాడిని భయపెట్టి ఆట పట్టించడం ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి. గీతాంజలి అందరిలాంటి ఆడపిల్ల మాత్రం కాదు.. తన చిలిపి అల్లరిని చూసి ఇష్టం పెంచుకోకుండా ఎవరూ ఉండలేరు.. అలాగే ప్రకాష్ కూడా.గీతాంజలిఓ కుర్రాడు గడ్డం పెంచుకుని, శాలువా కప్పుకుని చుక్కలు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడని హాస్పిటల్లో బామ్మతో గీతాంజలి చెప్తుంటే.. సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రకాష్ వస్తాడు. ప్రకాష్‌ని చూసిన గాబరాలో పూలను అడ్డంగా పెట్టుకుని తన పెద్ద పెద్ద కళ్లు మాత్రమే కనిపించేలా మొహాన్ని దాచుకోవడం.. ప్రకాష్ మరింత దగ్గరికి వచ్చి గీతాంజలి బుగ్గ మీద ముద్దు పెట్టడం.. అనుకోని ఆ తొలి స్పర్శకు తన పెద్ద కళ్లను మరింత పెద్దవి చేయడం.. పక్కనేమో బామ్మ కస్సుమంటూ చూడడం.. ఆ వెనకే ఇళయరాజా గారి ట్యూన్.. మొత్తంగా ఎంత బాగుంటుందో ఆ సీన్. గీతాంజలితెల్ల రంగు చుడీదార్ వేసుకున్న ఒక చిలిపి అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి.. మంచులో తిరుగుతూ కళ్లల్లో ఏ జీవం లేని ఒక కుర్రాడు అలా వెళ్తూ ఉంటే ఆపి.. ఆయాసంతో ఊపిరి తీసుకుంటూ I LOVE YOU అని చెబితే ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది ఆ అనుభవం. లేచిపోదాం రమ్మన్నాడు అని ప్రకాష్ గురించి అబద్దం చెప్తే.. బామ్మ వచ్చి అందరి ముందు చీవాట్లు పెట్టడం.. ఆ గొడవ వెనక గీతాంజలి చిలిపి అల్లరి ఉందని తెలిశాక ప్రకాష్ మరింత ఇష్టం పెంచేసుకుంటాడు. అందుకే లేచిపోదాం అన్నావ్ కదా అని గీతాంజలిని నిజంగానే ఎత్తుకుపోయి దూరంగా వదిలేస్తాడు. 'నన్ను వదిలేసి వెళ్లిపోకు.. నువ్వు నాశనం అయిపోవాలి' అని ఆ మంచు కొండల్లో గీతాంజలి గట్టిగట్టిగా అరవడం భలే సరదాగా ఉంటాయి ఆ సీన్స్ అన్ని. అన్నట్లు అప్పట్లో 'లేచిపోదామా' అనే ఈ లైన్ ఈ సినిమాతో యూత్‌కి బాగా కనెక్ట్ అయిందని విన్నాను.గీతాంజలిరాత్రయినా గీతాంజలి తిరిగి ఇంటికి రాలేదని తెలిసి ప్రకాష్ కంగారు పడుతూ వెతుక్కుంటూ వెళ్లి తీసుకురాగానే..  దానికి ప్రాణాలు తీసే రోగం.. నేడో రేపో అంటూ రోజులు లెక్క పెట్టుకుంటుందని గీతాంజలి గురించి అసలు నిజం చెప్పేస్తుంది బామ్మ. ఊహించని ఆ మాటలకు షాక్‌లో ఉండిపోయి.. ఎక్కువ రోజులు బతకనని తెలిసి కూడా గీతాంజలి ఇలా ఎలా చలాకీగా ఉండగలిగిందని ఆశ్చర్యపోతాడు. ఇది నిజమేనా అని నిలదీయగానే.. ప్రకాష్ కళ్లల్లోకే చూస్తూ నాలుక బయటపెట్టి మెడను వెనక్కి వాల్చేసి కన్ను కొట్టే గీతాంజలి ఎక్స్‌ప్రెషన్ అసలు ఎలా మర్చిపోగలం.గీతాంజలిమెల్లిగా ఆ పాత్రలతో చూసే ప్రేక్షకుడిని మమేకం చేసి ప్రేమలో పడేసేలా చేశారు నిజంగా మణిరత్నం గారు. మద్రాసులో ఏదో పెళ్లిలో చూసిన హీరోయిన్ గిరిజను గీతాంజలి పాత్రకు ఎంపిక చేసుకున్నారట మణిరత్నం గారు. ఎలా దొరికిందో.. ఎలా సాధ్యపడిందో కానీ.. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం మనం ఈ రోజుకీ. తనకు వచ్చిన రోగం గురించి పూర్తి అవగాహన ఉండి, తాను ఎందుకు చనిపోతున్నానో కూడా తెలుసుకున్న ఒక ఆడపిల్ల సున్నితమైన మనసుని అర్థం చేసుకునేంత ఆలోచన నిజంగా మనకు ఉంటుందా? ఇక్కడ అందరూ చచ్చిపోతారు.. కాకపోతే నేను ఒక రెండు రోజులు ముందు చచ్చిపోతాను.. నాకు రేపు గురించి బెంగ లేదు, ఈ రోజే నాకు ముఖ్యం అని చాలా తేలిగ్గా నిజాన్ని ఒప్పుకోగలిగే ధైర్యం రావాలంటే దాని వెనక ఎంత మానసిక క్షోభ దాగి ఉంటుందో కదా! అలా గీతాంజలి మాటలు విన్నాక మనకు కూడా ఒక స్పందించే హృదయం ఉందని.. అది కన్నీరు కారుస్తుందని తెలుసుకుంటాం.గీతాంజలిఒక భయంకరమైన నిజం తెలిసి కూడా తట్టుకుని.. రాబోయే రేపటి గురించి ఆలోచించి బాధ పడుతూ ప్రస్తుతం బాగున్న సమయాన్ని వృథా చేయకూడదని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని గీతాంజలి జీవితం ద్వారా తెలుసుకుంటాడు ప్రకాష్. చావు అనే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి తనలాగే గీతాంజలి కూడా ఉందని అనుకుంటాడు. ఆ క్షణం నుంచి మళ్లీ పుడతాడు.. కొత్తగా బతుకుతాడు.. ఆశలు పోయిన జీవితంలోకి గీతాంజలి వచ్చాక.. మళ్లీ పుడుతున్నట్లుగా ప్రకాష్ ప్రపంచాన్ని కొత్తగా చూస్తాడు. గీతాంజలితో ప్రేమలో పడతాడు. అంత నచ్చానా.. ఎంత నచ్చానో చెప్పు అని అడగ్గానే ప్రకాష్‌ని గీతాంజలి నీళ్లలోకి తోసేయడం.. తడిసిన బట్టలతో చర్చిలోకి వచ్చి గీతాంజలిని ప్రకాష్ ఏడిపించడం.. I LOVE YOU అని చెప్పమని సతాయించడం.. ప్రకాష్ అల్లరిని భరించలేని గీతాంజలి చిరాకుతో కళ్లు పెద్దవి చేసి I LOVE YOU చెప్పడం.. ముఖ్యంగా ఆ సమయంలో గీతాంజలి ఎక్స్‌ప్రెషన్, వెనక రాజాగారి ఫ్లూట్ మ్యూజిక్ మనసుని పిండేయవూ..!గీతాంజలిఅన్నిటి కన్నా ముఖ్యంగా ఈ సన్నివేశాల్లో నాగార్జున గారిలోని ఒక రొమాంటిక్ ఫెలో బయటికి వచ్చి మనల్ని కట్టిపడేస్తాడు.. ఇప్పుడు కాదు, అప్పుడే మన్మధుడిలా అనిపించేలా నటించారు. బామ్మ దగ్గర ఈ ప్రేమ సంగతి ఎక్కడ తెలిసిపోతుందోనని కంగారు పడుతూ గీతాంజలి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు.. నూనె గిన్నెని కింద పడేయడం.. జుట్టు అలా వెనక్కి వెళ్లిపోవడం.. పసుపు ఉంచిన పాత్ర ఎగిరిపడడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక్కో షాట్‌తో మణిరత్నం గారు అద్భుతాన్ని సృష్టించారనే చెప్పాలి. మార్కెట్లో బామ్మ ముందు గీతాంజలిని ప్రకాష్ బుక్ చేయడం, హాస్పిటల్‌కి వెళ్లి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని గీతాంజలిని సతాయించడం.. ఫోన్ చేసి మరీ ముసలోళ్లని చూసి భయపడొద్దు అని చెప్పడం.. మొత్తంగా తెలియకుండానే ఆ రెండు పాత్రల మధ్య రొమాన్స్‌ని భలే అందంగా చూపించారు. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావ్ అని ఇంటికి వచ్చి మరీ నిలదీస్తే పదేపదే ప్రకాష్ I LOVE YOU చెప్పడం చూసి కళ్లు పెద్దవి చేసి చూస్తూ నిలబడిపోయే గీతాంజలి ఎంత అందంగా కనిపిస్తుందో వేరే చెప్పాలా?గీతాంజలి'ఓం నమః నయన శృతులకు..' అనే పాట వస్తుంటే ఇద్దరి పెదాలు ఒకటై.. ఆ రెండు మనసులు ఏకమై.. చుట్టూ కెమెరా తిరిగినట్లు చూపించడం ఒక పాటని కొత్త రీతిలో డిజైన్ చేశారు అనిపిస్తుంది. నిజంగా ఆ పాత్రల్లో ఈ ఇద్దరూ ప్రాణం పెట్టి నటించారేమో కదా.. వయసులో ఉండి భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్న యువకుడి ప్రాణం ఒకవైపు, లోకం పోకడ కూడా తెలియని కల్లాకపటం లేని ఒక పసి మనసు ప్రాణం మరోవైపు.. తొందర్లోనే పోయే ఈ రెండు ప్రాణాలను ఒక్కటి చేసిన దేవుడి సృష్టిని మణిరత్నం గారు తన దర్శకత్వ ప్రతిభతో మర్చిపోలేని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు.గీతాంజలిఎందుకు చావాలి..? పుట్టాక చచ్చే తీరాలా..? నాకు చావు వద్దు.. నేను నీతోనే ఉండాలి.. అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమించిన వాడిని ప్రశ్నించే గీతాంజలి ప్రశ్నలకు కనీసం మన దగ్గరైనా సమాధానం ఉందంటారా? లేదు కదా..! వర్షం పడుతుండగా.. రైల్వే ప్లాట్‌ఫాం మీద ఎదురుగా నిలబడిన గీతాంజలి.. నువ్వు తొందర్లోనే చచ్చిపోతావు అని నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రకాష్‌ని నిలదీసే సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం కదా! అందరూ చచ్చిపోతారు.. కాకపోతే నేను రెండు రోజులు ముందు చచ్చిపోతానని గీతాంజలి ఒకప్పుడు చెప్పిన మాటలనే ప్రకాష్ తిరిగి అప్పజెప్పినప్పుడు.. తనదాకా వచ్చిన చావు భయం గురించి ఎప్పుడూ ఆలోచించని ఒక ఆడపిల్ల మనసు ప్రేమించిన వాడి ప్రాణం గురించి మాత్రం ఆరాటపడడం.. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం అని పదేపదే చెప్తూ అక్కడి నుంచి పరిగెత్తడం.. మొత్తంగా ఈ సన్నివేశం చూశాక దర్శకుడిగా మణిరత్నం గారి ప్రతిభ, ప్రాణం పెట్టి నటించిన ఆ ఇద్దరి నటన, ఆ సన్నివేశానికి మరింత బలం తెచ్చిన ఇళయరాజా గారి మ్యూజిక్.. చూసి తరించని ప్రేక్షకులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటారంటారా?గీతాంజలిఒక ప్రాణం నిలబడాలని మనస్ఫూర్తిగా వేడుకునే మనసు వెనక స్వచ్ఛమైన కోరిక తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఒడిలో వాలిన పసిపాపను ఓదారుస్తూ.. 'నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా.. నీ సవ్వడె సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరికా..' అనే సంకల్పం ముందు విధి కూడా తల వంచాలని మనం కూడా గట్టిగా కోరుకోవాలి అనిపించేంత హృద్యంగా ఉంటుంది ఆ పాట. 'ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్లిపో..' అనే వేటూరి గారి పదాలను పలికే బాలు గారి గాత్రానికి మనసు కరిగి కన్ను కన్నీరు కార్చకుండా ఉండగలదా? గుప్పెడంత గుండె.. అది ఆగితే పోయే ప్రాణం.. అది నిలబడాలని ఆరాటపడే రెండు పసి హృదయాలు విడిపోవాలని ఎవరైనా కోరుకుంటామా చెప్పండి?గీతాంజలిరెండు మనసులను విడగొట్టి.. నిండు ప్రాణాలను బలి చేసి.. జీవితమంత ఆశలను మధ్యలోనే తుంచేసే అంతటి శక్తి.. పిడికెడంత ఉండే గుండె సవ్వడికి ఉంటుందని నిర్ణయించిన విధి రాతను చూసి ఏమనుకోవాలో నాకైతే తెలియడం లేదు. ప్రాణంగా ప్రేమించిన గీతాంజలి ప్రాణం పోవడం చూడలేని ప్రకాష్ ఇక అక్కడ ఉండకూడదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. తనని ప్రాణంగా ప్రేమించిన మనసు దూరంగా వెళ్లిపోతుందని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గీతాంజలి గుండెకి తెలిసిందో ఏమో.. ఊపిరికి ఊపిరిని జత చేస్తూ కళ్లు తెరిచీ తెరవగానే తనని ప్రకాష్ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది. దగ్గరైన వారి మనసులను.. మనుషులుగా దూరమవుతున్న ఆ ఇద్దరూ మరొక్కసారి కలిస్తే చూడాలని కోరుకుంటూ ప్రతి ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి మరీ చూస్తూ ఉంటాడు. ప్రకృతి కూడా ఆవేశపడుతున్నట్లు హోరున గాలి వీస్తుండగా.. తను ప్రేమించిన మనసుని చేరుకోవాలని వచ్చిన గీతాంజలి.. బెడ్ మీద నుంచే తన చేయిని చాచి అందుకో అన్నట్లుగా చూపిస్తుంది. పోతున్న ప్రాణం తిరిగి తన దగ్గరికి వచ్చిందేమో అన్నట్లుగా ప్రకాష్ పరిగెడుతూ వచ్చి తన చేతితో గీతాంజలి చేయిని అందుకుని ఆ రెండు గుండెలు ఒక్కటే అన్నట్లుగా పిడికిలి బిగిస్తాడు. గుండెల్లో ఉండే ప్రాణం కాదు.. ఒకరిపై ఒకరికి కళ్లల్లో పెంచుకున్న ప్రేమే సాక్ష్యంగా గీతాంజలి 'లేచిపోదామా' అని సన్నగా పలకగానే ఇద్దరి పెదాలపై చిరునవ్వు పుడుతుంది. నవ్వుతున్న ఆ రెండు పెదాలు కలిసి ముద్దు రూపంలో ఒక్కటై ఊపిరి ఇచ్చుకుంటుంటే ప్రాణం ఎక్కడికి పోతుంది?గీతాంజలివాళ్లిద్దరూ కలిసి ఉండాలనే ఆ సంకల్పం చాలదా వాళ్లు ఎప్పటికీ ఒక్కటై ఉంటారని. 'ఇంకెన్నాళ్లు బతుకుతారో తెలియదు! కానీ బతికినన్నాళ్లు సంతోషంగా ఉంటారు' అని చివరలో వేసే ట్యాగ్ లైన్ చూసి అప్పటిదాకా గుండె బరువు ఎక్కిన ప్రేక్షకుడు కళ్లలోని తడిని తుడుచుకుంటూ మొహంపై చిన్న చిరునవ్వుతో అందమైన ప్రేమ కావ్యాన్ని చదివాననే గర్వంతో రెండు చేతులతో చప్పట్లు కొట్టకుండా ఉండలేడు.గీతాంజలి


THANK YOU

PC: CH.VAMSI MOHAN  




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి