ఇవన్నీ నేను పుట్టక ముందే జరిగిపోయాయి. నేనేంటి.. నాలాంటి ఎంతో మంది పుట్టారు, పెరిగారు, మీ పాటలకి అభిమానులు అయ్యారు. మరి అదేంటి..? ఇవన్నీ జరిగాక ఎన్నో ఏళ్లకు పుట్టిన నేను.. మీ పాట వినడానికే పుట్టా అన్నట్లు అంతగా ఎలా దగ్గరైపోయాను..? ఆ మాటకి వస్తే మేము దగ్గరవ్వలేదు.. మీ గొంతే అలా మమ్మల్ని కట్టిపడేసింది. మీకు ఉన్న కోటానుకోట్ల సంగీత అభిమానుల్లో నేనూ ఒకడిని బాలూ..!
మీ ఆకారం లాగే మీ పేరు కూడా శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం అని పెద్దగా పెట్టుకున్నా.. సంగీత సామ్రాట్, గాన గంధర్వుడు అని దేశం మొత్తం మిమ్మల్ని మెచ్చుకున్నా.. అవేవీ మాకు పెద్దగా పట్టవు. మాకు మీరు మా బాలూనే. మీ వయసుకి, మీ ప్రతిభకి మిమ్మల్ని అలా పిలవడం క్షమించరాని తప్పు అయినా సరే.. మీరు మమ్మల్ని తిట్టుకున్నా సరే.. మీరు మా 'బాలు'డే. మీ పాటలు వింటూ పెరిగాం. మీరు తెరపై నటించిన పాత్రలను చూసి మీలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాం. మీరు గొంతు అరువిచ్చి డబ్బింగ్ చెప్పిన ఎన్నో పాత్రల్లో కూడా మీరే మాకు కనబడ్డారు. ఇలా ఒక్కటేమిటి..? మీరు 'పాడుతా తీయగా' అంటూ సరిగమలు పలికించిన ఎంతో మంది ఒకప్పటి చిన్నారులు ఈ రోజు మంచి గాయకులుగా ఇండస్ట్రీలో నిలబడి ఇదంతా మీరు పెట్టిన భిక్షే అని సంబరపడుతున్నారు. వీటితో పాటు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా మీ ప్రతిభ గురించి ఏమని చెప్పగలం..? ఎంతని చెప్పగలం..? అంత ధైర్యం మాకు లేదు బాలూ..!
మోసం చేశావు బాలూ.. మమ్మల్ని అందరినీ చాలా మోసం చేశావు..
* నువ్వు ఏ హీరోకి పాడినా, అరే అచ్చం ఆ హీరోనే సొంతంగా పాడుకున్నాడా అని మేము నమ్మేలా బాగానే మోసం చేశావ్..
* ఏ పాత్రలో నటించినా, ఇక ఈ పాత్రలో వేరే వాళ్లను చూడలేమేమో అనుకునేలా మళ్లీ మోసం చేశావ్..
* ఏ నటుడికి డబ్బింగ్ చెప్పినా.. ఎంత అద్భుతంగా ఉంది, ఈ పాత్రకి ఈ గొంతే కరెక్ట్ అనుకునేలా పెద్ద మోసం చేశావ్..
* నీ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి, అవి మళ్లీ మళ్లీ వినేలా పిచ్చోళ్లని చేసి భలే మోసం చేశావ్..
* 'పాడుతా తీయగా' అనే గొప్ప కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేసి.. అంత చిన్నపిల్లలు ఎక్కడ నొచ్చుకుంటారేమో అని సున్నితంగా ఒక్కొక్క అక్షరం, స్వరం విడమర్చి చెప్పి వాళ్ల భవిష్యత్తుకి ఒక దారి చూపించి ఇంత మహా గాయకుడు కల్మషం అనేదే లేకుండా 'బాలు'డిలా ఇలా కూడా ఒదిగి ఉండగలడా అనుకునేలా మమ్మల్ని మళ్లీ మళ్లీ మోసం చేశావ్..
అయినా మాకు నీ చేతిలో మోసపోవడం ఇష్టమేలే..! నువ్వు ఇలా ఎన్నో సార్లు మమ్మల్ని మోసం చేస్తున్నా.. అది తెలిసి కూడా మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నాం..!
నీ ప్రేమకి దాసోహం అవుతూనే ఉన్నాం..!!
నిన్ను తలవకుండా మాకు ఒక్కరోజైనా గడుస్తుందా బాలూ..! వద్దని అనుకున్నా ఏ టీవీలోనో, ఏ సంగీత కార్యక్రమంలోనో, ఏ ఎఫ్ఎంలోనో వినిపించి నేను కూడా ఉన్నా మీ జీవితంలో అని మాకు గుర్తు చేస్తూనే ఉంటావ్. అంతలా మాలో కలిసిపోయావ్ బాలూ... నీ పాట వినకుండా, నీ గొంతు తలవకుండా మాకు పూట గడవదు. నువ్వు మా జీవితాల్లో అంతలా ఇమిడిపోయావ్. మరి ఏంటి బాలూ..! నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావని అందరూ అంటున్నారు.. నీ పాట టీవీలో వచ్చినప్పుడల్లా విని మైమరచిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
నువ్వు ఏ సినిమాలో అయినా కనిపిస్తే, అయ్యో ఇంతటి మనిషి లేకుండా పోయాడే అని గుండె బరువు చేసుకుంటున్నారు.. ఇక నీ స్థానంలో ఎవరూ రాలేరు, నీలాంటి గొప్ప గాయకుడు మళ్లీ పుట్టలేడు అని అంతా చెప్పుకుంటున్నారు.. ఎలా బాలూ..? నీ తర్వాత ఇంకొకరు ఎలా రాగలరు..? అసలు నువ్వంటూ లేకుండా పోతేనే కదా..! అది ఎన్నటికీ జరగని పని. నువ్వెప్పుడూ మా గుండెల్లోనే ఉన్నావుగా బాలూ.. ఉంటావ్ కూడా. మా గుండె కూడా కాలి బూడిద అయ్యేవరకు అందులో ఉన్న నువ్వు నీలాగే ఉండిపోతావు.. నీ స్థానం నీదే.
ఆ రోజు.. నువ్వు మా అందరినీ వదిలేసి వెళ్లిన ఆ రోజు.. నా కళ్లల్లో నాకు తెలియకుండానే నీళ్లు వచ్చేశాయ్. నీకు నాకు ఏం సంబంధం ఉందని బాలూ..? అది మాటల్లో చెప్పలేను. ఈ రోజుకీ నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా కళ్లల్లో వచ్చే కన్నీటి తడే దానికి సాక్ష్యం. బాలూ.. చివరగా ఒక్క మాట. మళ్లీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ 'బాలు'డివై మా కోసం తిరిగి రావా..! సంగీత సామ్రాజ్యం ఒంటరిదై నీ కోసం ఎదురుచూస్తోంది.😓😓😓😓😓😓😓😓
బాలూ గారు.. అంటే మీకు కూడా చాలా ఇష్టమా? అయితే మీకు నచ్చిన పాట లేదా ఏదైనా అనుభవం ఉంటే నాతో పంచుకోండి కామెంట్ ద్వారా..
Thank you
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీవు రాసిన స్టోరీ బాలు సార్ యొక్క మంచితనాన్ని షార్ట్ గా బాగా రాసావు అన్న , బాలు సర్ పాట వినని రోజే లేదు అంతలా సంగీత ప్రియులు ఒక దేవుడిగా ఆరాధిస్తారు . బాలు గారి పాట , మాట , ఆట ఇకపై తన ల ఎవరు చేయరు చేయలేరు ,, మల్లి బాలు సార్ బౌతికంగా వస్తే తప్ప ... సూపర్ అన్న
రిప్లయితొలగించండిబాలు సార్ ని ఇష్టపడేవారిలో ఒక చిన్న అభిమానిని
మీ అంజి
Thank you so much
తొలగించండి