బతుకమ్మ.. నా లాంటి తెలంగాణ బిడ్డలకు ఈ పండగ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందంగా పేర్చిన రంగురంగుల పూలు.. పట్టుచీరలు, పట్టు పరికిణీలు కట్టుకున్న అమ్మాయిలు.. అంతా చుట్టూ చేరి పాడే పాటలు.. లయబద్దంగా చప్పట్లు కొడుతున్నప్పుడు శబ్దం చేసే చేతి గాజులు.. ఇదంతా దూరం నుంచే గమనించే అబ్బాయిల కొంటె చూపులు.. సంబరం అంటే ఇది కదా మరి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రకృతి పండగే 'బతుకమ్మ'.నా చిన్నప్పుడు చూసేవాడిని. స్కూల్ అయిపోయాక సాయంత్రం పూట ఆడపిల్లలంతా ఒక దగ్గర చేరి రోజుకో బతుకమ్మ పేరుతో ఆడి పాడేవారు. మేమైతే మా పల్లెటూరి భాషలో బొడ్డెమ్మ అని పిలిచేవాళ్లం. ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ అన్నమాట. బొడ్డెమ్మ ఆడాలనే ఆరాటం.. ఆడుతున్నప్పుడు పొందే ఆనందం.. అది ఒక్క తెలంగాణలో పుట్టి పెరిగిన ఆడబిడ్డలకే తెలుసు. మరి అసలు బతుకమ్మ అంటే ఏంటి?.. అసలు ఎలా మొదలైంది?.. చిన్నప్పటి చూస్తున్నాం మరి ఎందుకు ఆడుతారో మనకైనా తెలియాలి కదా. పదండి.. తెలంగాణ గడ్డ మీద ఊపిరి పోసుకున్న మన ఇంటి ఆడబిడ్డ బతుకమ్మ కథని తెలుసుకుని పది మందికి చెబుదాం.దొరలు, నవాబుల పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు పరిస్థితి ఘోరంగా ఉండేది. పెత్తందార్ల అరాచకాలతో నలిగిపోయిన ఎంతో మంది మహిళలు, వారి ఆకృత్యాలను తట్టుకోలేక ఎందరో అక్కాచెల్లెళ్లు ఈ గడ్డ మీద ప్రాణాలు వదిలారు. రజాకార్ల దుర్మార్గపు పాలనలో అయితే.. అడ్డొచ్చిన మగవాళ్లను దారుణంగా చంపి, వారి శవాల చుట్టూ ఆడవాళ్లతో నగ్నంగా బతుకమ్మ ఆడించిన దౌర్భాగ్యపు గతం మనది. అలా చనిపోయిన ఆడబిడ్డలను తలుచుకుంటూ, ప్రకృతికి ప్రతిరూపమైన అందమైన పువ్వుల్లో వారిని చూసుకంటూ బొడ్డెమ్మగా పేర్చి బతుకవమ్మా.. బతుకమ్మా.. అని పాడడం మొదలుపెట్టారు. ఆ ఘోరాలు, అరాచకాలే 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..' లాంటి ఎన్నో పాటల్లో మనకు కథలు కథలుగా వినిపిస్తాయి.బతుకమ్మ వెనక మరో కథ కూడా ఉంది. చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ధర్మాంగద యుద్ధంలో తన వంద మంది కొడుకులను పోగొట్టుకున్నాడట. అలా ఆ రాజు, అతని భార్య వారికి ఎలాగైనా ఇంకో బిడ్డ కావాలని లక్ష్మీదేవిని పూజించారట. ఎన్నో పూజలు, వ్రతాల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టిందట. కానీ, ఆ పాప కూడా ఎన్నో ప్రమాదాలను దాటుకుని పుట్టడంతో అందరూ ఆమెను దీవిస్తూ బతుకవమ్మా అని ఆశీర్వదించారట. అలా కూడా బతుకమ్మ పేరుతో ఆడపడుచులు పండగగా చేసుకోవడం మొదలుపెట్టారని మరో కథనం.బతుకమ్మ వెనక వేములవాడ చరిత్ర ఉందని మీకు తెలుసా? సత్యాస్రాయ అనే ఓ రాజు క్రీ.శ 997లో తెలంగాణ ప్రాంతాన్ని పాలించేవాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉందని తెలుసు కదా. అయితే.. చోళ రాజైన రాజేంద్ర చోళుడు ఈ సత్యాస్రాయపై యుద్ధం చేసి గెలిచి, ఆ విజయానికి గుర్తుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రి రాజరాజ చోళుడుకి బహుమతిగా ఇచ్చాడు. క్రీ.శ 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయం అనే ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించి తన కొడుకు ఇచ్చిన ఆ శివలింగాన్ని రాజరాజ చోళుడు అక్కడ ప్రతిష్టించాడు. అంటే ప్రస్తుతం బృహదీశ్వరాలయంలో మనం మొక్కతున్న శివలింగం వేములవాడ నుంచి తీసుకెళ్లిందే అన్నమాట. అందుకే వేములవాడలోని శివలింగానికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య కొంచెం పోలిక ఉంటుంది. వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరుకు తరలించడం తెలంగాణ ప్రజల మనసును కలిచివేసింది. అందుకే తమ బాధను తెలియజేస్తూ ఒక పెద్ద శివలింగంలాగా పూలను పేర్చి బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది అలా కొనసాగుతూ వస్తుంది.ఇప్పుడంటే చాలా మారింది కానీ, ఒకప్పుడు ఖచ్చితంగా పూలతోనే బొడ్డెమ్మ తయారుచేసేవారు. ఊరికి దూరంగా తోటలు, పొలాలకు వెళ్లి రకరకాల పూలను తెంపుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. ఒక్కో రంగు పూలను ఒక్కో వరుసలో వచ్చేలా ఎత్తుగా పేరిస్తే చూడటానికి ఎంత అందంగా ఉండేదో. ఆ పేర్చిన బొడ్డెమ్మ మీద పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. గౌరమ్మ అంటే పార్వతీదేవికి ప్రతిరూపం. అలా దేవతలా పేర్చిన బతుకమ్మ చుట్టూ అక్కాచెల్లెళ్లంతా చేరి పాటలు పాడుతూ ఆడతారు. ఆ తర్వాత ఆ బొడ్డెమ్మను దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేస్తారు.ఇవన్నీ నా బాల్యంలోని మర్చిపోలేని జ్ఞాపకాలు. బతుకమ్మ పండగ వచ్చిన ప్రతిసారి చిన్నప్పటి నా విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. బతుకమ్మ ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక ఎమోషన్. బతుకమ్మ అంటే మరెంటో కాదు.. మన ఇంటి ఆడబిడ్డ. ఇంట్లో తల్లిని, చెల్లిని ఎలా అయితే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని మన సొంతవాళ్లుగా అనుకుంటామో.. మన ఇంటి ఆడబిడ్డ బతుకమ్మను కూడా పండగలా చేసుకుంటూ గుండెల్లో పెట్టుకుని ఒక గురుతులా కాపాడుకుందాం.
THANK YOU
PC BY: CH.VAMSI MOHAN
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి