సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

ఎండాకాలం వచ్చేసింది. పరీక్షలు అయిపోయి స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చే టైం ఇది. ఇలా నేను ఆలోచిస్తుంటే మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎలా ఉండేవో కొన్ని గుర్తుకొచ్చాయి. ఏది ఏమైనా అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. స్కూల్లో చదువుకునే టైములో సమ్మర్ హాలిడేస్ అంటే మీకు కూడా చాలా అనుభవాలు ఉండే ఉంటాయిగా.. మరెందుకు ఆలస్యం.. ఆ అందమైన జ్ఞాపకాల్లోకి వెళ్దాం రండి.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

సంవత్సరమంతా క్లాసులు, టీచర్ల పాఠాలు, ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకోవడం ఆడుకోవడం.. అన్నీ మంచి అనుభవాలే. ఎక్కడా కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే, ఎప్పుడు ఎవరూ కూడా చదువుని మా బుర్రలకు అవసరానికి మించి రుద్దలేదు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది మరి. ఏడాదంతా చదివాక ఎగ్జామ్స్ రాసి.. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే అదొక ఆనందం.. తెగ ఎంజాయ్ చేయొచ్చని. మరి ఇప్పటి పిల్లలకు అంత ఛాన్స్ ఎక్కడిది? ఒక క్లాస్ అయిపోయింది అనుకునే లోపే, తర్వాత చేరబోయే క్లాసుకు సంబంధించి సమ్మర్ హాలిడేస్‌లోనే ప్లాన్స్ చేసేస్తున్నారు. పిల్లలకు రెస్ట్ అనేదే లేకుండా ట్యూషన్స్, హోమ్ వర్క్ అని ముందుగానే పాఠాలు మొదలెట్టేస్తున్నారు.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

సమ్మర్ హాలిడేస్ అంటేనే.. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లడం. హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయని తెలియగానే ప్లాన్ చేసుకునేవాళ్లం. అమ్మ వాళ్లు కొన్నిసార్లు వద్దులే అన్నా కూడా పట్టుబట్టి మరీ వెళ్లిపోయేవాళ్లం. పైగా అక్కడ మనమే కింగ్‌. ఇంట్లో దొరకని ఒక రకమైన ఫ్రీడమ్ అక్కడ ప్రేమతో పాటు బోనస్‌గా దొరికేది. రాత్రయితే ఆరుబయట మంచం మీద కూర్చుని, చల్లగాలిని ఆస్వాదిస్తూ అమ్మమ్మ స్వయంగా తన చేత్తో కలిపి తినిపించే ఆ అన్నం ముద్ద రుచి మర్చిపోగలమా? వాళ్ల మనసు నిండా మన మీద ఉన్న ప్రేమంతా ఆ చేతి రుచిలోనే తెలిసేది. మరి ఇప్పటి పిల్లలు సమ్మర్ హాలిడేస్‌లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తున్నారా అసలు? నాకు డౌటే.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

హాలిడేస్ అంటేనే ఆటలు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని, బయట తిరగొద్దని అమ్మ చెప్పినా మనం వింటేగా. ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్లి రోజంతా ఆడుకునేవాళ్లం. తిన్నామో లేదో కూడా మనకు పట్టదు. అసలు ఆకలి అని అనిపిస్తే కదా! ఇక సాయంత్రం పూట దగ్గరలో ఉన్న చెరువులో దూకి ఈత కొట్టేవాళ్లం. రోజంతా ఆడి ఆడి అలిసిపోయి ఉంటాం కదా.. ఆ చల్లని చెరువు నీళ్లలో అలా మునిగితే అబ్బా.. ఎంత హాయిగా ఉండేదో ప్రాణానికి. అంతా అయ్యాక లేటుగా ఇంటికి వెళ్లి కాళ్ల నొప్పులని చెప్పామే అనుకో. ఇప్పటిదాకా ఎక్కడ పోయావు, తిండి కూడా తినకుండా అని అమ్మ తిట్లు పైగా. అలిసిపోయి పడుకున్నామని మధ్య రాత్రి నాన్న లేచి మన కాళ్లు నొక్కుతుంటే.. కాళ్లను తాకుతున్న నాన్న చేతి స్పర్శకు సంబరపడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం. ఇప్పటి పిల్లలు కూడా బాగానే ఆటలు ఆడుకుంటున్నారు లెండి.. మొబైల్‌లో.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

ఆవకాయ.. మంచి ఎర్రటి రంగుతో, కారం కారంగా అనిపిస్తూ ఎప్పుడెప్పుడు తినాలా అని నోరు ఊరేది. ముఖ్యంగా ఇది సమ్మర్ సీజన్‌లోనే పెట్టుకుంటాం. ఇక మా చిన్నప్పుడు దీనికి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు. ఇంట్లో ఆవకాయ పెడుతుంటే కాయలు కొట్టడం దగ్గర నుంచి కావాల్సిన పొడులు దంచడం, కలపడం ఇలా రోజంతా అమ్మకు హెల్ప్ చేసేవాళ్లం. వేడి వేడి అన్నంలో కాసింత ఆవకాయ వేసుకుని దానికి అలా అలా నెయ్యి అద్దించి కలుపుకుని తింటే అబ్బా.. అది చెప్తే తెలియదు, మన నాలుక రుచి చూడాల్సిందే. ఏంటీ.. చెప్తుంటే మీకూ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ..! సమ్మర్ హాలిడేస్ టైములో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం ఇది.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

ఇలాంటివి ఎన్నో మరెన్నో.. మనిషి ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా చిన్నప్పటి ఇలాంటి రోజులు మళ్లీ తిరిగి వస్తాయా చెప్పండి. ఇది కదా జీవితానికి కావాల్సింది.. ఇవి కదా మనం చచ్చేదాకా మనతో ఉండేవి. నా ఆర్టికల్ ద్వారా మీరు కూడా కాలంతో పాటు వెనక్కి వెళ్లిపోయారా? ఇలాంటివి మీ జీవితంలోనూ ఎన్నో అనుభవాలు ఉండే ఉంటాయి. నేనేదైనా మర్చిపోయి ఉంటే అవేంటో నాతో పంచుకోండి.

సమ్మర్ హాలిడేస్ - నా జ్ఞాపకాలు

THANK YOU

PC: CH. VAMSHI MOHAN


కామెంట్‌లు