రజాకార్

బానిస బతుకుల నుంచి విముక్తి కోసం పోరాటం అది.. అధికారం ఉందనే అహంకారంతో పాలించిన దుర్మార్గుల కాలం అది.. తల దించి సలాం కొట్టిన అమాయకపు ప్రజల వేదన అది.. ఒంటిపై కారిన నెత్తుటి గాయాల మరకలు అవి.. ఆడబిడ్డల మానాన్ని అంగట్లో వెల కట్టిన దారుణం అది.. చరిత్ర ఎన్నటికీ మరిచిపోలేని మారణహోమం అది. ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు కార్చే ఆ గాథ.. అదే రజాకార్ వ్యవస్థ. అసలు ఎవరు ఈ రజాకార్లు? అసలేం జరిగింది? ఎందుకు తెలంగాణ చరిత్రలో అది చీకటి కోణంగా నిలిచిపోయిందనే విషయాలు మనం మాట్లాడుకుందాం.

రజాకార్

భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది కానీ అప్పటికి హైదరాబాద్ సంస్థానానికి ఇంకా రాలేదు. నిజాం ప్రభువుల దుర్మారపు పాలనలో ఇంకా అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ముఖ్యంగా హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బందీలుగా బతికారు. తెలంగాణలోని 9 జిల్లాలు, కర్ణాటకకు చెందిన 3 జిల్లాలు, మహారాష్ట్రకు చెందిన 5 జిల్లాలు.. ఇవన్నీ కలిపి అప్పట్లో హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఇది అప్పటికి ఇంకా భారతదేశంలో విలీనం కాలేదు. ఈ సంస్థానానికి 1911 నుంచి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలకుడిగా ఉండేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి లాంటివి నిజాం కట్టించాడని గొప్పగా చెప్పుకోవడం తప్ప అతను చేసిన దుర్మార్గాలు చాలా మందికి తెలియదు. నిజాం అహంకారానికి బలయిన మన తెలంగాణ బిడ్డలు ఎందరో.. మరెందరో.. వారి కన్నీటి కథే ఈ నా ఆర్టికల్.

రజాకార్

రజాకార్లు అంటే స్వయం సేవకులు అని అర్థం. అంటే నిజాం పాలనకు మద్దతుగా ఉంటూ, ఎవరైనా ఎదిరిస్తే వాళ్లను అడ్డుకునేందుకు పని చేసే సైన్యం అన్నమాట ఈ రజాకార్లు అంటే. వీరికి సయ్యద్ ఖాసీం రజ్వీ అనే ఒక మతోన్మాది నాయకుడిగా ఉండేవాడు. ఖాసీం రజ్వీ చేయని దుర్మార్గం లేదు. అప్పట్లో ఈ ప్రాంతంలోని హిందువులు పూజలు చేసుకోవాలన్నా, బహిరంగంగా హోమాలు చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదంటే ఎలాంటి బానిస బతుకు బతికామో అర్థం చేసుకోవచ్చు. హిందుత్వం అనేదే లేకుండా చేసి మొత్తంగా ఇస్లాంని వ్యాపింపచేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో మంది హిందువులను బలవంతంగా మతం మార్పించేవారట. దీనికి ఎవరైనా ఒప్పుకోకపోతే చిత్రహింసలు పెట్టి చంపేవారట. అలా దాదాపు 12,000 మంది దళితుల మత మార్పిడి జరిగిందని ఒక అంచనా.

రజాకార్

తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ప్రముఖుడు దొడ్డి కొమురయ్య పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన తమ్ముడిని కూడా చిత్రహింసలు పెట్టి ఖాదర్ వలీ పేరుతో ముస్లిం మతంలోకి మారేలా చేశారు. కొందరు హిందువులు కూడా ఇలా మత మార్పిడికి ఎందుకు ఒప్పుకునేవారు అంటే.. ముస్లింగా మారిన తర్వాత వాళ్లను ఇలా చిత్రహింసలు పెట్టడం, పన్ను కట్టించడం లాంటివి ఆపేసేవారు. గౌరవంగా చూసేవారట. అందుకే ఇష్టం లేకపోయినా చాలా మంది హిందువులు ముస్లిం మతంలోకి మారేవారు. అదే విధంగా ప్రజలు తెలుగు కాకుండా ఉర్దూ భాషలోనే మాట్లాడాలని రజాకార్లు హెచ్చరించేవారట. స్కూళ్లలో కూడా పిల్లలు తెలుగు చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదట. ఇవన్నీ నిజాం ప్రభువు ఆదేశాలతో ఖాసీం రజ్వీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు.

రజాకార్

అలాంటి భయంకరమైన, చరిత్ర మర్చిపోయిన ఒక దారుణ సంఘటన గురించి తెలుసుకుందాం. అప్పుడే గుడివాడ దాటిన ఓ రైలులో ప్రయాణిస్తున్న కొందరు నిజాం పాలన గురించి, రజాకార్ల దారుణాల గురించి మాట్లాడుకుంటున్నారట. ఇంతలో అదే బోగీలో ఉన్న మహిళ.. పైకి లేచి తన బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చుందట. పైగా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నిలబడిందట. ఇది చూసిన అక్కడ ఉన్నవాళ్లలో ఒక ముసలాయన..'ఇదేంటమ్మా అలా చేస్తున్నావు? పైగా ఆడపిల్లవి. తప్పు కదా?' అని ప్రశ్నించాడట. దానికి ఆ మహిళ కోపంగా.. 'ఏ నోటితో అంటున్నారు ఈ మాట. నేను ఆడదాన్ని. నిజాం కిరాతకులు నన్ను ఇలాగే నగ్నంగా వారం రోజులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు చేశారు. ఆ రోజే నా ఆడతనం పోయింది.. ఈ రోజు కొత్తగా పోయింది ఏమీ లేదు. ఇక్కడ మీరు కూర్చుని ఆ నిజాం గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను కాదు సిగ్గు పడాల్సింది.. మీరు.' అని అందట. ఆ తర్వాత తన శరీరం మీద ఉన్న గాయాలను అక్కడ ప్రతి ప్రయాణికుడికి చూపించిందంట. ఈ సంఘటన గురించి 1948లో కృష్ణా పత్రికలో ప్రచురించబడింది.

రజాకార్

నిజాం పాలనకు వ్యతిరేకంగా మెల్లిగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర వనిత చాకలి ఐలమ్మ. ఈ పోరాటంలో భాగంగా నిజాంకు ఎవరైతే వ్యతిరేకంగా పని చేస్తారో వాళ్లను గుర్తించి ఎక్కడికక్కడ పట్టుకుని ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు దారుణంగా చంపేసేవారు. ఇంట్లోకి చొరబడి ఆస్తులు దోచుకోవడం, భార్యల ముందే భర్తల గొంతులు కోయడం, భర్తల ముందే భార్యను అత్యాచారం చేయడం లాంటివి జరిగాయట. చాయ్ పెట్టి ఇవ్వాలని అడగడం.. పాలు లేవని అంటే ఇంట్లోని ఆడవాళ్ల చనుబాలతో చాయ్ పెట్టివ్వాలని హింసించడం.. అది చూసి కుమిలిపోతున్న అమాయకులను చూసి వెకిలిగా నవ్వడం.. ఇలాంటి చెప్పలేనన్ని ఎన్నో ఘోరాలు చేశారట.

రజాకార్

రజాకార్ల అరాచకాల విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలోని బైరాన్‌పల్లి ఊరు గురించి. ఈ గ్రామ ప్రజలకు రజాకార్లపై తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. రజాకార్లకు ఎదురు తిరిగారనే కోపంతో ఈ ఊరివాళ్లను దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపేశారట. వరుసగా నిలబెట్టి మరీ కాల్చి చంపారట. ఊళ్లోని ఆడబిడ్డల బట్టలు విప్పి నగ్నంగా ఆ శవాల చుట్టూ తిప్పుతూ బతుకమ్మ ఆడించిన దౌర్భాగ్యపు చరిత్ర రజాకార్లది. కాదు.. కూడదు అంటే ప్రాణాలు కూడా తీసేవారట. ఆడదానికి అసలైన అందం అమ్మతనం.. అలాంటి ఎందరో తల్లులు తమ మానాన్ని పణంగా పెట్టి, ప్రాణత్యాగాలు చేసిన భూమి ఇది. ఇవన్నీ వింటుంటేనే మన ఒళ్లు జలదరిస్తుంది కదా! మరి అవి అనుభవించిన తెలంగాణ బిడ్డలు ఎంత నరకం చూసి ఉంటారో ఆలోచించండి. ముఖ్యంగా ఆడబిడ్డల మాన, ప్రాణాలతో ఆడుకున్న ఆ నిజాం దొర పుట్టుక ఎంత నీచమైనదో మీరే ఊహించండి. ఇలాంటి ఎన్నో ఘోరాలను కళ్లారా చూస్తూ, బాధలు అనుభవిస్తూ.. భయం చీకట్లో బతుకు వెల్లదీసిన చరిత్ర మన తెలంగాణ బిడ్డలది.

రజాకార్

ఐదుగురు బ్రాహ్మణులను నిర్దాక్షిణ్యంగా చెట్టుకు వేలాడదీసి చంపిన ఘోరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొడకండ్ల గ్రామం దగ్గర్లో శ్రాద్ధకర్మలో భాగంగా భోజనం చేసి వస్తున్న ఏడుగురు బ్రాహ్మణులకు దారిలో రజాకార్లు ఎదురయ్యారట. పట్టుకుందామని ప్రయత్నించగా అందులో ఇద్దరు బ్రాహ్మణులు ఎలాగోలా పారిపోయారట. మిగిలిన ఐదుగురిని అక్కడ ఉన్న చింత చెట్టుకు వేలాడదీసి కింద మంట పెట్టారట. అలాగే వేలాడుతూ ఆ మంటల్లో కాలి మాడిపోయారు వాళ్లు. మిగతా హిందువులకు అది చూసి భయం పుట్టాలని ఆ శవాలను అలాగే చెట్టుకు ఉంచేసి వెళ్లిపోయారట రజాకార్లు. ఆ బ్రాహ్మణుల నడుములకు ఉన్న వెండి మొలతాడులు మంటల్లో కాలి వంకర్లు పోయాయట. వేదశాస్త్రాలు చదువుకుని, ఒంటిపై జంధ్యం వేసుకుని, నుదుటిపై బొట్టు పెట్టుకోవడమే వాళ్లు చేసిన పాపమా? వాళ్లేమి తప్పు చేశారని..? నల్లగా మసిబారి వేలాడుతున్న వారి శవాల గురించి ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదూ..!

రజాకార్

1947లో ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందంలో జాతీయ జెండా ఎగురవేయాలని చూసిన పరకాల అనే ఊరివాళ్లను దారుణంగా చంపేశారు. స్త్రీలు, ముసలివాళ్లు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రాణాలు తీసిన రాక్షసులు ఈ రజాకార్లు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న హిందువులే కాదు.. అందులో కొందరు ముస్లింలు కూడా నిజాం దుర్మార్గానికి ఎదురునిలిచిన వారిలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు షోయబుల్లా ఖాన్. ఇమ్రోజ్ అనే పత్రికను స్థాపించి షోయబుల్లా ఖాన్ నిజాం పాలనకు వ్యతిరేకంగా, హిందువుల హక్కుల గురించి ఆ పత్రికలో ప్రచురించేలా చూసేవారు. ఈ విధంగా చేస్తున్నాడనే కక్షతో నిజాం ఆదేశాలతో ఒకరోజు రాత్రి రజాకార్లు షోయబుల్లా ఖాన్ కోసం ఎదురుచూసి నడిరోడ్డుపైనే అతనిని కత్తులతో పొడిచి చంపేశారు. 

రజాకార్

నిజాం పాలనకు ఎదురు నిలిచి పోరాడిన 16 ఏళ్ల పిల్లవాడు వావిలాల రామచంద్రరావు గురించి తెలుసా. 1937లో ప్రజలు ఎవరూ కూడా వందేమాతరం అని అనకూడదని నిజాం ప్రభుత్వం కండీషన్ పెట్టింది. కానీ, 16 ఏళ్ల వావిలాల నడిరోడ్డులో నిల్చుని గట్టిగా వందేమాతరం అని అరిచాడట. దీంతో వావిలాలను బంధించి వందేమాతరం అన్న ప్రతిసారి ఒక లాఠీ దెబ్బ కొట్టారు. అయినా వెనక్కి తగ్గకుండా వందేమాతరం అని అంటూనే ఉన్నాడట. అలా 24 దెబ్బలు తిన్నాక స్పృహ కోల్పోయాడట. తర్వాత చిన్న పిల్లాడు అని అక్కడితో విడిచిపెట్టి పంపించేశారట. అప్పటి నుంచి అతనిని వందేమాతరం రామచంద్రరావు అని పిలవడం మొదలుపెట్టారు.

రజాకార్

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రాణాలు.. రజాకార్లు అనే పేరు వింటేనే గజగజ వణికిపోయే ఎంతో మంది పెద్దవాళ్లు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ మీ చుట్టూ ఉండే ఉంటారు. మీ ఇంట్లో తాతని కానీ, బామ్మని కానీ అడిగి చూడండి. రజాకార్ల దారుణాలు ఎంత ఘోరంగా ఉండేవో కళ్లకు కట్టినట్లు చెప్తారు. ఎప్పుడో జరిగిపోయింది కదా ఇదంతా.. ఇప్పుడు బాగానే ఉన్నాం. గతాన్ని తవ్వుకోవడం అవసరమా అని ప్రశ్నించేవాళ్లు కూడా ఇక్కడ చాలా మందే ఉన్నారు. కానీ, ఇవి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా నవ్వుతున్నావంటే.. ఆ నవ్వు వెనక తెలంగాణ గడ్డ చూసిన దారుణాలు, అవమానపడిన ఎందరో ఆడబిడ్డలు, చిందించిన రక్తపు బొట్టులు, కాలిన మాంసపు ముద్దలు, అర్పించిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి.

రజాకార్

ఇక 1948లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ‘ఆపరేషన్ పోలో’ అనే సైనిక చర్య ద్వారా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ రజాకార్ల పీడ విరగడ కావడంలో పటేల్ పాత్ర ఎంతో ఉంది. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం దాదాపు ఖాయమైన సమయంలో ఇంకా ఇక్కడే ఉంటే ప్రజలు తనని కొట్టి చంపేస్తారని రజ్వీకి అర్థమైంది. తర్వాత నిజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఆ వెంటనే దారుస్సలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైనికులు రజ్వీని అరెస్టు చేశారు. 1950లో అతడికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఇంతటితో ఆ అరాచకాలకు ఒక ముగింపు దొరికింది. ఇన్ని ఘోరాలు చేసి ఇంత మంది తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకున్న దుర్మార్గుడు రజ్వీని ఏడేళ్ల జైలు శిక్షతో వదిలివేయడం ఎంతవరకు కరెక్ట్..? ఆలోచించండి.

జైహింద్

రజాకార్

చదివినందుకు ధన్యవాదాలు. మీకు నా ఆర్టికల్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. ప్రతి తెలంగాణ బిడ్డకు ఇది చేరేలా షేర్ చేయండి.

THANKYOU 

PC: CH. VAMSHI MOHAN 


కామెంట్‌లు