8 వసంతాలు

మీ దృష్టిలో అందం అంటే ఏమిటి..? చూడగానే నచ్చేసేదా..? చూస్తున్నకొద్దీ చూడాలనిపించేదా? ఒక రకంగా మనకు తెలిసినంతవరకు ఇంతే. మరి అసలైన అందం అంటే ఏంటి? గుణం.. అవును ఒక మనిషిలోని గుణం. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి, అందం కాదు.. మదర్ థెరిస్సా అంటే కరుణ, అందం కాదు.. అయాన్ ర్యాండ్ అంటే తత్త్వం, అందం కాదు.. సరస్వతి అంటే విద్య, దుర్గ అంటే ధైర్యం, గౌరీ అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం.. ఏ దేవతనైనా గుణం కోసమే పూజిస్తాం, అందం కోసం కాదు. అందుకే ఆడదాన్ని ఆ అందాన్ని దాటి చూడగలగాలి.. అలా చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనిపిస్తుంది. ఏంటీ.. ఎక్కడో విన్నట్లు ఉన్నాయా ఈ మాటలు. ఏదైనా సినిమాలో లేదా ఈ మధ్య రీల్స్‌లో చూసి ఉన్నారా?.. అవును.. '8 వసంతాలు'.. ఈ అందమైన సినిమాలోవే ఈ అందమైన మాటలు. 8 వసంతాలుమొదలుపెట్టే ముందు ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవాలి.. శుద్ధి అయోధ్య. ఈ పిల్లలో ఏదో కొత్తగా ఉందని అనిపించింది.. చూస్తుంటే ఇంకేదో తెలుసుకోవాలనే ఆసక్తి పుట్టింది. కమర్షియల్ సినిమాలు కుప్పలుతెప్పలుగా వస్తూ.. ఐటెం సాంగ్‌లు, ఎక్స్‌పోజింగ్‌లు చేస్తేనే ఇండస్ట్రీలో గుర్తింపు అనుకుంటున్న ఇప్పటికాలంలో ఇలాంటి ఒక పాత్ర.. అస్సలు ఊహించలేం. మళ్లీ శుద్ధి.. మార్షల్ ఆర్ట్స్‌లో ఎక్స్‌పర్ట్.. నాకు తెలిసి ఒక హీరోయిన్ పాత్రకి ఇలాంటిది ఈ మధ్య ఎప్పుడూ పెట్టలేదు. మొబైల్ వాడదు, సోషల్ మీడియాలో ఉండదు.. తనను కలవాలి, మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా ఎదురుచూడాల్సిందే. మొత్తంగా శుద్ధి ఆడపిల్లల్లోనే ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు. పైగా తన మనసులోని లోతైన భావాలను అక్షరాలుగా మార్చే ఓ మంచి రచయిత.. అందుకేనేమో నాకు ఇంకొంచెం ఎక్కువ నచ్చేసింది.8 వసంతాలుఆడవాళ్లంటే సాధారణంగానే ఓ చులకన భావన మనలో ఉంటుంది.. వాళ్లు మెంటల్లీ, ఫిజికల్లీ వీక్ అని ఒక ముద్ర వేసుకుని ఉండిపోతాం. కానీ, శుద్ధిని చూశాక ఆ భావన తప్పని అనిపిస్తుంది. తనను తక్కువ చేసి మాట్లాడిన అబ్బాయిని టైక్వాండోలో ఓడించి, తనను తాను నిరూపించుకునే సీన్ సినిమా మొదట్లోనే ఉంటుంది. అంతా అయిపోయి, ఆ అబ్బాయి ఓటమిని ఒప్పుకుని, నొప్పితో తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు శుద్ధి అంతకు ముందు తీసేసి మెడ దగ్గర అంటించుకున్న బొట్టుబిళ్లని మళ్లీ తన నుదుటన పెట్టుకుంటుంది. ముడివేసి బిగించిన జుట్టుని విడదీసి సూటిగా, కళ్లల్లో ధైర్యం నింపుకుని చూస్తుంది ఆ ఓడిపోయిన అబ్బాయి వంక. అంటే నిన్ను ఓడించింది, నువ్వు తక్కువ చేసి మాట్లాడిన ఒక ఆడపిల్ల అని అలా చెప్పకనే చెప్తుంది. Simple and Indepth Detailing కదా..!8 వసంతాలుఒక రచయిత అన్నీ ఊహించే రాయరు.. కొన్ని అనుభవించి రాస్తారు. ఒక అక్షరం బయటికి వచ్చిందంటే.. దాని వెనుక తన ఆలోచనతో పాటు అనుభవం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. చూడడానికి అది ఎదుటివాళ్లకు మామూలుగానే కనిపించినా.. ఒక అక్షరం పుట్టడం వెనుక, అది అర్థవంతంగా మారడం వెనుక రచయిత కష్టం దాగి ఉంటుంది. అది ఒక రచయితకి మాత్రమే అర్థమవుతుంది. శుద్ధికి కూడా అంతే.. నాన్నని కోల్పోయిన బాధ, తనని తాను నిరూపించుకోవాలనుకునే మనస్తత్వం, తనలోని ఆలోచనలు ఇవన్నీ కలిపి చిన్న వయసులోనే తన నుంచి లోతైన భావాలతో పుస్తకాలు రాసేంత అనుభవాన్నిచ్చాయి.8 వసంతాలుకష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా ఆ అందం వెనుక ఉన్న కళ, కసి, కష్టం, కన్నీళ్లు కనిపించవని ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది.. నిజమేనేమో మరి.. ఇలాంటి ఆలోచింపజేసే, ఆకట్టుకునే మాటలు ఈ సినిమాలో ఎన్నో మరెన్నో ఉంటాయి. అవి నా చెవులతో కాదు, మనసుతో విన్నాను.. ఆ మాటలకు స్పందించి కళ్లల్లోంచి కన్నీరు ఉబికి వచ్చినప్పుడే ఆ విషయం నాకూ అర్థమైంది. పుస్తకం పూర్తి చేసిన పాఠకుడి గుండెలో గుప్పెడు ఆశ నింపకపోతే రచయిత చేతిలో అక్షరం ఉండి ఎందుకండీ?8 వసంతాలుఎవరైనా నచ్చిన పనే చేయాలి.. వచ్చిన పనే చేయాలి. చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవుతావు, లాయర్ అవుతావు అంటూ పిల్లల మీద తమ అభిప్రాయాలు రుద్దే తల్లిదండ్రులే ఎక్కువ మన దేశంలో. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అని తక్కువ చేసి మాట్లాడేవాళ్లే మన చుట్టూ. అందరూ తలరాతలు బ్రహ్మ రాస్తాడంటారు, కానీ మన దేశంలో తల్లిదండ్రులు రాస్తారు. అవును ఒప్పుకుంటా.. కన్నవాళ్ల సుఖాలే కాదు, కలలు కూడా పంచుకోవాలి. కానీ, ప్రతిదానికీ ఓ హద్దు ఉంటుంది. నువ్వు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలని భయపెట్టే ప్రతి తల్లిదండ్రికి నేను ఒక్కటే చెప్పగలను.. ప్రతి మనిషిలో ఓ టాలెంట్ ఉంటుంది.. ఇష్టంగా చేయాలని అనుకునే ఓ పని ఉంటుంది. వాటికి విలువ ఇచ్చి భయంతో కాకుండా నమ్మకంతో పెంచితే మీ పిల్లల నుంచి మీరు అద్భుతాలు చూస్తారు. అందుకు సరైన ఉదాహరణే మన శుద్ధి అయోధ్య.8 వసంతాలు8 వసంతాలు'విధాత తలపున..' ఈ సినిమాలో ఈ పాట గురించి ప్రస్తావన తెచ్చినందుకు సంతోషంగా అనిపించింది. సిరివెన్నెల గారి అద్భుతమైన పాటకి ఈ సినిమాలో ఇంత ప్రాధాన్యం ఇవ్వడం బాగా అనిపించింది. అందుకే మొదట్లో చెప్పినట్లు.. ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు నన్ను ఈ సినిమాకి చాలా దగ్గర చేశాయి. ఇంతకుముందు నా బ్లాగ్‌లో సిరివెన్నెల గారి ఆర్టికల్‌లో ఈ పాట గురించి రాసుకున్నాను కూడా. సిరివెన్నెల గారి ఆర్టికల్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.8 వసంతాలు'విధాత తలపున..' పాట అర్థం కోసం సహాయం చేయాలని శుద్ధిని హీరో పాత్ర వరుణ్ అడిగినప్పుడు ఇలాంటి Ego, Arrogance ఉన్నవాడికి ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తుంది. ఎప్పుడైతే తన ఆరోగ్యం బాగాలేకున్నా తనని డ్రాప్ చేయడానికి కష్టమైనా వచ్చాడని తెలుసుకుంటుందో.. వరుణ్ మనసు మంచిదని అర్థం చేసుకుంటుంది.. ఆ పాట అర్థం చెప్పడానికి ఒప్పుకుంటుంది. అంటే ఆ పాటకి ఉన్న విలువ అలాంటిది. ఆ పాట పాడాలన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఒక అర్హత ఉండాలని ఈ సన్నివేశంతో చూపించినట్లుగా అనిపించింది. పాట అర్థాన్ని పేపర్ మీద రాసి శుద్ధి పంపించినప్పుడు.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వరుణ్ మంచం మీద వాలిపోతాడు. అప్పుడు అతని పక్కనే వయోలిన్, చిన్న టేప్ రికార్డర్, గీతాంజలి సినిమా పాటల క్యాసెట్, హెడ్ ఫోన్స్.. ఇవన్నీ చూపిస్తారు. ఎందుకో చూడగానే అది నా మనసుకు చాలా నచ్చింది. That's a Beautiful shot I Felt.8 వసంతాలుతల్లీతండ్రీ తర్వాత మన జీవితంలో ముఖ్యమైన గురువుని మనం ఎంతవరకూ గౌరవిస్తున్నాం. గురువుల మీద జోకులు, సెటైర్లు వేసే ఈ రోజుల్లో విద్య నేర్పిన గురువు రుణం తీర్చుకునేవాళ్లు నిజంగా ఎంత మంది ఉన్నారు మనలో? చనిపోయినవాళ్లకు కర్మ చేయడానికి ఆడవాళ్లు పనికిరారు అనే సందర్భం ఒకటి వస్తుంది. అప్పుడు శుద్ధి ఇలా అంటుంది.. పేగు పంచి ప్రాణం పోయగలిగిన ఆడవాళ్లం.. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా..? అని. నిజమే కదా. ఈ ఆచార, వ్యవహారాలన్నీ మనం మధ్యలో కల్పించుకున్నవి. చావు అంటే మనిషి జీవితంలో అంతిమ ప్రయాణం. కుళ్లు, కుతంత్రాలు, స్వార్థం వీటన్నిటినీ వదిలేసిన స్వచ్ఛమైన దేహం అది. ఆ దేహానికి చివరి సంస్కారం జరిపించడానికి ఆడ, మగ అనే బేధంతో పనేముంది..?8 వసంతాలుఒకవైపు ఆశయం, మరోవైపు ప్రేమ.. రెండింట్లో ఏది ముఖ్యమో కొన్నిసార్లు తేల్చుకోలేం. ఆ సమయంలో మనల్ని ఇష్టపడే వాళ్ల ప్రేమ, మన కోసం వాళ్లు చేసిన త్యాగాలు ఏవీ గుర్తుకు రావు. మనసు ఆ సమయంలో కఠినంగా మారిపోతుంది. అప్పుడు ముందున్న ఆశయం తప్ప వాళ్లపై ప్రేమ, ఇష్టమైనవారితో కలిసి ఉండాలనే ఆరాటం ఏవీ ఉండవు. అందుకే తెలియకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించివాళ్లను దూరం చేసుకుంటారు. అప్పుడు ప్రేమించిన ప్రతి ఒక్కరూ చేసే పని ఒక్కటే.. నువ్వు అంటే అంత ఇష్టం, ఇంత ఇష్టం అని తమను తాము నిరూపించుకోవాలని చూస్తారు, కానీ, అవేవీ వాళ్ల మనసుకు పట్టవు, ఎందుకంటే, వాళ్లు అప్పటికే డిసైడ్ అయిపోయి ఉంటారు. అందుకే సర్దిచెప్పడం మానేసి ఓపికగా ఉండి చూడు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలా తమ ఇష్టానికి వదిలేసి వెళ్లిపోయే వాళ్లకు ఒక్క మాట చెప్పాలని ఉంది.. బ్రేకప్ చేసే హక్కు ఖచ్చితంగా నీకు ఉంటుంది.. కాదనట్లేదు.. కానీ, అది సరైన పద్దతిలో చేయండి.8 వసంతాలుశుద్ధిని కూడా ఇలాగే వద్దనుకుని వరుణ్ వదిలేసి వెళ్తున్న సన్నివేశం నిజంగా గుండెల్ని పిండేసింది. వర్షం.. ఆ వర్షంలో తడుస్తూ బాధ, ఇష్టం కలిగిన చూపుతో నిలబడిన శుద్ధి.. ఆ సమయంలో అందంగా కనిపించింది. ఇష్టమైన మనిషి చాలా రోజులు దూరంగా ఉండిపోయినప్పుడు తనని ముట్టుకోవాలని, తాకాలని ఉండే ఆ తహతహ.. కారులో ఉన్న వరుణ్‌ని శుద్ధి కౌగిలించుకున్నప్పుడే అర్థమైంది. శుద్ధితో మాట్లాడాలని వరుణ్ కారు దిగే ముందు గొడుగు పట్టుకునే దిగుతాడు. ఎదురుగా వర్షంలో తడుస్తూ నిలబడిన శుద్ధిని చూసి తన గొడుగు కూడా మూసేసి తానూ తడుస్తాడు. తను ఎందుకు దూరం అవుతున్నాడో చెప్పాల్సిదంతా చెప్పేశాక మళ్లీ గొడుగు విప్పి పట్టుకుని తాను తడవకుండా వెళ్లిపోబోతుంటాడు. అంటే మనసులో తనంటే ఇష్టం ఉన్నా, పరిస్థితులను బట్టి వరుణ్ అలా ప్రవర్తిస్తున్నాడని చూపించినట్లు అనిపించింది అక్కడ.8 వసంతాలుప్రేమించి, వదిలేసి వెళ్లేవారందరూ చెప్పేది ఒక్కటే.. జీవితంలో ఏదో పోగొట్టుకున్నానని, అంతా నీవల్లే అని. మనం వాళ్లని అడగం వెంటపడమని, మనం వాళ్లకు అడగం ప్రేమించమని. ఉన్నంతవరకూ బానే ఉంటారు.. కానీ, వదిలేసి వెళ్లేటప్పుడు మాత్రం చివరికి తప్పంతా మనదే అంటారు. నిజానికి ఎవ్వరి వల్ల ఎవరూ ఏమీ అయిపోరు. ఏదో దాస్తూ బయటికి నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి, చెడ్డవాళ్లను చేసేసి వదిలించుకుంటారు. మనస్ఫూర్తిగా ప్రేమించినవాళ్లకు అలాంటి సమయంలో అరవాలనిపిస్తుంది.. ఏడవాలనిపిస్తుంది.. గట్టిగా పట్టుకుని ఎందుకిలా చేశావని నిలదీయాలనిపిస్తుంది.. గుండెల్లో ఏదో అయిపోతున్నట్టు నొప్పిగా అనిపిస్తుంది. ఎవరి తుఫాన్లు వాళ్లకుంటాయ్ లోపల.. కొందరు బయటపడతారు, కొందరు పడరు.. అంతే తేడా. ప్రేమించేవాళ్లతో దగ్గరయ్యేప్పుడే కాదు.. దూరమయ్యేప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయడమే నిజమైన క్యారెక్టర్. ఇలా వరుణ్ ముందు నిలబడి శుద్ధి చెప్తున్న మాటలు.. ఎందుకో నా మనసులో నుంచే వచ్చినట్లుగా అనిపించాయి. చివరలో ఒక మాట అంటుంది.. నేనొక్కసారి వద్దు అనుకుంటే, నేను కాదు.. నా ఒంటి మీద కప్పుకున్న బట్ట కూడా గాలికి నీ వైపు రాదు.. రానివ్వను.. Wah kya Dailouge Hai, Kya Scene Hai..!8 వసంతాలుప్రేమకు నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు. స్వచ్ఛమైన మనసుతో నిజాయితీగా ఉంటే చాలు.. ఆ ప్రేమే నీకు అన్నీ ఇస్తుంది. కొన్ని సార్లు బాధ పెడుతుంది కూడా. కానీ, ఒక మనిషి మన జీవితం నుంచి దూరమయ్యారంటే ఏడుపు వస్తుంది, కాదనను.. కానీ, నిన్ను నిన్నుగా ఇష్టపడే మనిషి ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉంటారు. అందుకే అంటారేమో.. మనం ప్రేమించేవాళ్ల కన్నా, మనల్ని ప్రేమించేవాళ్లతోనే ఉండడం మంచిదని. మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి.. మరి ఆడదాని ప్రేమకు ఏమున్నాయి..? మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప..!8 వసంతాలుఅలా శుద్ధి స్వచ్ఛమైన మనసుకు దేవుడు సంజయ్ అనే మరో ప్రేమ రూపాన్ని బదులుగా ఇచ్చాడు. సంజయ్ పాత్ర ఉన్నంతసేపు శుద్ధిని అతను ఎంతగా ఇష్టపడ్డాడో, ఎంతలా అనుసరించాడో తెలుసుకున్నప్పుడు నిజంగా ప్రేమ మీద మళ్లీ నమ్మకం ఏర్పడింది. సంజయ్ కూడా తనలాగే ఒక రచయిత అని తెలుసుకుని, ముందు తన రచనల మీద ప్రేమ పెంచుకుంటుంది, ఆపై అతనికి తనంటే ముందు నుంచి ఇష్టమని తెలుసుకుని కాదనలేకపోతుంది. అందుకే ప్రేమంటే కలిసుండడం మాత్రమే కాదు.. ప్రేమ వాళ్లని ఎంతలా మార్చిందో తెలియజేయడం. ప్రేమంటే చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం.. ఆ ప్రయాణమే ఈ '8 వసంతాలు'....8 వసంతాలుఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ సినిమాలో దేని గురించీ వదలలేను, దేని గురించీ మాట్లాడకుండా ఉండలేను. ప్రతి సన్నివేశం.. ప్రతి మాట.. నన్ను ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. మంచి కథ, అద్భుతమైన నటన అనే పదాలకు ప్రాధాన్యత తగ్గిపోతున్న ఇప్పటి కాలంలో, అర్థవంతమైన సినిమాలు రావడం ఆగిపోతున్న సమయంలో ఇంత మంచి సినిమాని చూసినందుకు మనసుకు చాలా హాయిగా తోచింది. ఇలాంటి అందమైన కథని రాసుకుని, డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నర్సెట్టి గారికి, ప్రేక్షకుల ముందుకు తెచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకి ఈ సందర్భంలో థాంక్స్ చెప్పకుండా ఉండలేను. ఇది చూస్తున్నంతసేపు సినిమాలా కాదు.. ఒక పుస్తకం చదివినట్లుగా అనిపించింది.8 వసంతాలుLast But Not The Least.. కింద పడి, వర్షపు నీటిలో తడిసిపోయిన గులాబీ పువ్వు నుంచి ఒక రేకు విడిపోవడం.. ప్రేమ మన నుంచి దూరం కావడాన్ని ఈ విధంగా చూపించడం అద్భుతం అనిపించింది.. అవును.. మీకూ ఓ ప్రశ్న.. ప్రేమ నీ నుంచి వెళ్లిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా..?8 వసంతాలు


THANK YOU


PC: CH.VAMSI MOHAN












కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి