ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు.. అదే ప్రేమ చచ్చిపోవడానికి జీవితం సరిపోదు.. అంత గొప్పదా ప్రేమంటే..? ఏమో రాజారామ్, నజీరా ఖానం ప్రేమకథను చూశాక నాకూ నిజమే అనిపించింది. ఎవరు వీళ్లు అనుకుంటున్నారా? ప్రేమ అనే అందమైన అద్భుతాన్ని మరింత అందంగా చూపించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలోని క్యారక్టర్లు వాళ్లు. అయినా ప్రేమంటే కలిసి ఉండడం కాదు.. దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడమట.. నిజంగా అంత అర్థం చేసుకునేంత ప్రేమ ఈ రోజుల్లో ఉందా?.. కానీ, ఈ సినిమాలో ఉంది. అందుకే ఈ సినిమా అన్నా, అందులో చూపించిన లవ్ ఫీల్ అన్నా నాకు చాలా ఇష్టం. రండి.. ఆ రెండు మనసుల ప్రేమ ఎంత గొప్పదో మనమూ తెలుసుకుందాం.. ఆ ఇద్దరి ప్రేమతో కలిసి మనమూ నడుద్దాం...
'గెలుపుతో ఫ్రెండ్ షిప్ చేయండి.. అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది, ఓటమిని ప్రేమించండి.. ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది' రాజారామ్.. ప్రేమలో ఓడిపోయి పరుగులో గెలిచిన ఈ సినిమా హీరో. కష్టపడి తాను పరుగులో గెలుచుకున్న మెడల్స్, షీల్డులను కూడా గదిలో ఒక పక్కన ఉంచేసి, ఇష్టపడిన మనిషి కొనిచ్చిన బూట్లను మాత్రం కప్బోర్డుపైన అంత ఎత్తులో పెట్టుకుంటాడు.. ప్రేమించిన వ్యక్తి ఇచ్చిన హ్యాంకీని భద్రంగా దాచుకుంటాడు.. అవి మనకు చాలా చిన్న వస్తువులే, కానీ, రాజారామ్‌కు మర్చిపోలేని ప్రేమ తాలూకు జ్ఞాపకాలు. అక్కడే అర్థం చేసుకోవచ్చు.. తన జీవితంలో ప్రేమకి, ప్రేమించిన మనిషికి ఎంత విలువ ఇస్తున్నాడో. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రేమ జ్ఞాపకాలు ఉన్నాయా
అమ్మ పాత ఫోటో చూస్తూ.. ఒకప్పుడు మా అమ్మ ఎంత అందంగా ఉండేదో అని ఎప్పుడైనా అనుకున్నారా? మనల్ని నవమాసాలు కడుపులో మోసి, కని, పెంచి మన కోసం జీవితాన్నే ధారపోసే అమ్మకు తన గురించి తాను పట్టించుకునే అవసరం ఎక్కడ ఉంటుంది. అందుకే మనమైనా పట్టించుకుందాం. రాజారామ్ అమ్మ కూడా అంతే.. బిడ్డ ఆకలి తీరిన దగ్గరి నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందని అంటుంది.. అమ్మ ప్రేమలో ఉండే కమ్మదనం అంటే అది.. హా, అమ్మకు ఏం తెలుసులే, మన అమ్మే కదా ఎక్కడికి పోతుందని చాలా సింపుల్‌గా తీసుకుంటాం ఇంట్లో మనం. కానీ, అమ్మకు చాలా తెలుసు.. తను జీవితాన్ని ఎప్పుడో గెలిచేసింది. నరకం లాంటి పురిటి నొప్పులను కష్టమైనా ఓర్చుకుని నీకు జన్మనిచ్చింది చూశావా.. ఆ రోజే అమ్మ గెలిచేసింది.
నజీరా ఖానం బురఖాలో బంతిపువ్వులా ఉంది.. అంటాడు రాజారామ్. ప్రేమించిన అమ్మాయిని ఏ అబ్బాయైనా అంతకన్నా ముద్దుగా పోల్చుకుంటాడా? మరి నజీరా అంటే ఎందుకు రాజారామ్‌కి అంత ఇష్టం. అందరూ రాజారామ్ పరుగును, అందులో వచ్చిన గెలుపునే చూస్తుంటే.. నజీరా మాత్రం ఆ గెలుపు వెనక తను పడిన కష్టాన్ని చూస్తుంది.. రాజారామ్ కాలికి అయిన గాయాన్ని గమనించి తన హ్యాంకీని ఇచ్చేస్తుంది. బురఖా కప్పిన ఆ కళ్లతోనే జాగ్రత్త అన్నట్లు చెప్తుంది. అంతకన్నా ఏం కావాలి ఒక అబ్బాయికి.. అమ్మ తర్వాత ఇంకో అమ్మాయి తన బాగోగులు చూస్తుందంటే.. ఏ కుర్రాడు ప్రేమలో పడకుండా ఉంటాడు. ఆ రోజు నుంచి తన పాదాలు మాత్రమే కాదు.. రాజారామ్ మనసు కూడా పరిగెట్టడం మొదలెడుతుంది.
రాజారామ్‌కి దగ్గరవ్వాలనే వంకతో సంగీతం నేర్చుకోవాలని వాళ్ల ఇంటికి వచ్చే నజీరా పాత్రలో నిత్యామీనన్‌ని చూశారా? తెల్లని లెహంగా.. దానికి పెద్ద అంచు.. చున్నీని తల మీదుగా కప్పుకుని, కళ్లకు కళ్లజోడుతో.. ఇంట్లోకి అడుగుపెడుతూ ఎడమ కాలు పెట్టబోయి ఆగి కుడి కాలు పెట్టి నడిచి వస్తుంటే.. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మామూలుగానే మనకి నిత్య అంటే ఇష్టంలెండి. ప్రేమించుకునే ఇద్దరు మనుషులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు తెలియకుండానే వారి కళ్లు మాట్లాడేసుకుంటాయి. ఇష్టపడిన మనిషి దగ్గరగా ఉంటే ఆ మనసులు ఈ లోకాన్నే మర్చిపోతాయి. ఇదే కదా ప్రేమ చేసే మాయ. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా?.. హా జస్ట్.. ఏదో తెలుసుకోవాలని అడుగుతున్నాలే.
నజీరా చెప్తుంది.. తను నా వెంటపడాలనిపిస్తుంది.. నా కోసం వెతకాలనిపిస్తుంది.. దాక్కోవాలనిపిస్తుంది.. దొరికిపోవాలనిపిస్తుంది అని. నిజంగానే ప్రేమ అంటే ఇలా పిచ్చిపిచ్చిగా ఉంటుందా అనిపించింది నజీరా మాటలు విన్నాక. ఇన్నాళ్లు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏమైనా ఉందా? నిజమే.. ప్రేమలో ఎవరూ పద్దతిగా పడరు. ఆశలతో, ఆలోచనలతో మొదలయ్యే ప్రేమ జ్ఞాపకాల వరకూ వెళ్తుందంటే ఆ ప్రేమకి ఎంతో మెచ్యూరిటీ ఉందని అర్థం. ఏ మతంలోనైనా ఒకేలా ప్రేమించుకుంటారు.. మరి అలాంటి ప్రేమకు కులం, మతం అనే అడ్డుగోడలు ఎందుకు కడతారు.. నిజంగా అవసరమా?.. ఆలోచించండి.
ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, అండగా నిలబడడం, ఏమీ లేనప్పుడు కూడా పక్కనే ఉండడం, ఏదైనా చేస్తావు, సాధిస్తావు అనే ధైర్యం ఇవ్వడం.. ఇలా అర్థం చేసుకునే మనిషి భాగస్వామిగా దొరికితే ఆ జీవితం చక్కగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం నిరంతరం తపించే మనిషికి ప్రేమిస్తున్న వ్యక్తి అండగా నిలబడితే ఆ పోరాటంలో అలుపు కూడా తెలియదు. రామ్‌కి కూడా నజీరా అంతే.. ముఖ్యంగా తన కళ్లు.. కబుర్లు చెప్తాయ్.. ప్రశ్నలు అడుగుతాయ్.. తిడతాయ్.. కొడతాయ్.. అమ్మో .. గయ్యాళి కళ్లు అని రామ్ ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తుంటే.. నజీరా చాటుగా వింటూ ఆ మాటలకు ముసిముసిగా నవ్వుకోవడం క్యూట్‌గా ఉంటుంది.
కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది.. అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. వాహ్.. ఇంతకన్నా గొప్పగా ప్రేమను వర్ణించగలమా..? బురఖా వేసుకున్న నజీరా కళ్లు నవ్వడం చూశారా? కళ్లు నవ్వడం ఏంటి అంటారా?.. అవును, నేను చూశాను.. ఆ అందమైన కళ్లు రామ్ కోసం వెతుకుతుంటే, రామ్ కోసం బాధ పడుతుంటే, రామ్ కోసం ఏడుస్తుంటే మరింత అందంగా ఉంటాయి. ఇష్టమైన బూట్లను కొనిచ్చి నువ్వు పరిగెత్తు.. నీ వెనక నేనున్నానంటూ ధైర్యం ఇస్తుంది. ఆశయ సాధనకు తోడుగా ఉంటుంది.. జీవితంలో ధైర్యంగా నిలబడడానికి ఒక ప్రేమికుడికి ఇంతకన్నా ఏం కావాలి..?














Abba am rasa ayyaa 😊 appude aepoendha ani pinched rasav inka koncham vunte bagundu ani pinchindh.
రిప్లయితొలగించండిThank you
తొలగించండి