ప్రేమ, పెళ్లి విషయాల్లో కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని, ఇక వాళ్లే మన జీవితం అనుకుని అన్నిటికీ సర్దుకుపోయి ఉండేవాళ్లు. ఆ తర్వాత లవ్ మ్యారేజీలు ఎక్కువ అయ్యాయి. సరే పోనీ.. పెళ్లికి ముందే ప్రేమించుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటారు అనుకున్నాం. కానీ, పోను పోను అందులో కూడా ఇంకాస్త ముందుకు వెళ్లిపోయాం. లివింగ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ మొదలైంది. అంటే పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండడం అన్నమాట. పెళ్లి తర్వాత ఏమేం చేస్తారో అవన్నీ పెళ్లికి ముందే ఒకే దగ్గర కలిసి ఉండి చేయడం అన్నమాట.
లివింగ్ రిలేషన్ తప్పు అని నా ఉద్దేశ్యం కాదు.. అలా అని కరెక్ట్ అని కూడా చెప్పలేను. రిలేషన్ ఏదైనా ఇద్దరు పార్టనర్స్ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే అన్నిటి కన్నా ముఖ్యం. సినిమాలా? సోషల్ మీడియా ప్రభావమా? తెలియదు కానీ ఈ లివింగ్ కాన్సెప్ట్ విషయానికి ఇప్పటి యూత్ చాలా తొందరగా కనెక్ట్ అవుతున్నారు. పెళ్లికి ముందే కాబోయే వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం అని వీళ్లు అంటుంటే.. ఏమీ తెలియని వయసులో ఇలాంటి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పెద్దవాళ్లు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు?
పెళ్లికి ముందే ఒక మనిషితో కలిసి ఉండి.. కొన్ని రోజులు పోయాక సెట్ అవట్లేదు అనుకుంటే అంత ఈజీగా విడిపోవడమేనా లివింగ్ అంటే? లేక అన్ని జాగత్తలు తీసుకుని పెద్దవాళ్లు పెళ్లి చేస్తే, కొన్నేళ్లు సంసారం చేశాక గొడవలు రావట్లేదా? మరి అప్పుడు వాళ్లతో విడిపోయి రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టా? నేనేం అంటానంటే.. పెద్దలు చేసిన పెళ్లిలో గొడవలు వచ్చినా.. కనీసం ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి కలిసి ఉండటానికి కనీసం ట్రై చేస్తారు. కానీ, లివింగ్‌లో మాట పడాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతోనే ఉంటారు ఇద్దరు కూడా. వాళ్లు ఇండిపెండెంట్ మెంటాలిటీతో ఉంటారు. సో.. అక్కడ విడిపోవడానికే అవకాశాలు ఎక్కువ.
రిలేషన్‌లో ఉంటున్నారు సరే.. నిజంగా ఒకరికి మరొకరు కావాలని ఎంత మంది ఇష్టంతో ఉంటున్నారు? బతకడానికి ప్రేమ ఒక్కటే కాదు, డబ్బులు కూడా కావాలి. రిలేషన్‌లో ఉన్న ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ లేకపోవచ్చు. సంపాదించలేకపోవచ్చు. అప్పుడు నిజంగా ఏ స్వార్థం లేకుండా పార్ట్‌నర్‌ని ఎంత మంది చూసుకుంటారు? కానీ, పెళ్లిలో ఒక బాధ్యత ఉంటుంది. అన్నీ తామే చూసుకోవాలనే మైండ్ సెట్ మామూలుగానే వచ్చేస్తుంది. ఏది ఏమైనా నిజంగా ఒక మనిషిని ఇష్టపడే దగ్గరే ఇలాంటి లెక్కలు చూసుకోరని నా అభిప్రాయం.
లివింగ్‌లో ఉంటున్నందుకు అందులో ఆ ఇద్దరి ప్రమేయం ఎంత ఉంటుందో.. అంతే బాధ్యత తల్లిదండ్రులది కూడా ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే, ఇప్పటి తల్లిదండ్రులు ఒకప్పటి లాగా లేరు. ఎవరి బిజీ వాళ్లది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? అని ఆలోచించే టైం కూడా కొందరు పేరెంట్స్‌కి లేదు. అదే ఉండి జాగ్రత్త పడితే రేపు వాళ్ల పిల్లలు బాధపడే పరిస్థితులు రావు కదా. దానికి తోడు ఇప్పటి చాలా మంది పేరెంట్స్ మారుతున్న కల్చర్ ఫాలో అవుతున్నారు. అవును, చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించేవాళ్లు కూడా అక్కడక్కడా ఉండే ఉంటారు.
సనాతన ధర్మం ప్రకారం చూస్తే లివింగ్ అనే కాన్సెప్ట్ చాలా తప్పు. ఎందుకంటే.. మంచి, చెడు ఆలోచించి.. పెళ్లి చేసి.. ఆ తర్వాత శారీరకంగా కలవడం వరకు ఒక ప్రాసెస్‌లో జరుగుతుందనేది మనకు తెలిసిందే. మరి అదే లివింగ్‌లో పెళ్లికి ముందే ఒక అబ్బాయి, అమ్మాయి ఫిజికల్‌గా కలవడం ఎంతవరకు కరెక్ట్? అదే జరిగాక గొడవలు ఏమైనా వచ్చి రేపు ఎవరి దారి వాళ్లు చూసుకుంటే ఏంటి పరిస్థితి? అలా అని లివింగ్ అంటే కేవలం ఎంజాయ్‌మెంట్ కోసమే అని నేను అనట్లేదు. వాళ్లు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.. ప్రేమించుకుంటారు.. సర్దుకుపోతారు.. కానీ, పెద్దలు చేసిన పెళ్లిలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ లివింగ్‌లో ఉంటుందంటారా?
సరే.. మొత్తంగా చూసుకుంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వాళ్ల విషయంలో ఆ రిలేషన్ సక్సెస్ కాకపోతే రెండో పెళ్లి చేసుకుంటారు. అది అక్కడితో సర్దుకుంటుందని నమ్ముతున్నా. లివింగ్ రిలేషన్‌లో కూడా కలిసి రాకపోతే రెండో చాయిస్ తీసుకుంటారు. వేరేవాళ్లకు కనెక్ట్ అవుతారు. మరి అది అక్కడితో ఆగుతుంది అంటారా? మీ అభిప్రాయం..?
THANK YOU
PC& CONCEPT: CH.VAMSHI MOHAN
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి