'కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం'.. ఈ ఒక్క లైన్ చాలేమో 'సీతారామం' గురించి చెప్పడానికి. మామూలుగానే రాముడంటే అమితంగా ఇష్టపడే నాకు.. ఈ కథ, ఆ పేరు దానికి దగ్గరగానే ఉండడంతో తెలియకుండానే సినిమాపై ఇష్టం పెరిగేలా చేసింది. నెలకు 600 రూపాయలు సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన ఓ మహారాణి కథ ఇది. ఓ ఉత్తరం చుట్టూ కథని మొదలుపెట్టడం, అది 20 ఏళ్లుగా చేరాల్సిన చోటు కోసం ఎదురుచూస్తుందని, అదే సీతా, రామ్‌లను కలుపుతుందని చూపించడం కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో చూపించిన ఈ ఉత్తరాన్ని రామాయణంలో రాముడు సీత కోసం తన గుర్తుగా పంపించే ఉంగరంగా అనుకోవచ్చా?కళ్యాణం తర్వాత ఆ సీతారాములు వనవాసం చేశారు.. కానీ ఇక్కడ బోర్డర్లో దేశసేవకే అంకితమైన సైనికుడు రామ్ వనవాసంలో ఉన్నప్పుడు సీత పరిచయం అవుతుంది. అది కూడా ఒక ఉత్తరం ద్వారా. ఎవరూ లేని అనాథ రామ్‌కు నేనున్నానంటూ ఎంతో మంది మేము నీ కుటుంబం అంటూ ఉత్తరాలు రాస్తుంటే.. అందులో ఒక ఉత్తరం మాత్రం 'ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మీ' అని రావడం ఆశ పుట్టిస్తుంది.ఉత్తరంలో సీత.. 'ఏమయ్యా రామయ్య.. ఎప్పుడు వస్తున్నావ్? ఇంటికి వచ్చేటప్పుడు సీతాకోకచిలుకలు తీసుకురా.. నిన్న కలలోకి వచ్చావు.. ఆ కలలో 60 ఏళ్లయినా నా చుట్టూనే సీతా సీతా అంటూ తిరుగుతున్నావు' అని ఊహల్లో అల్లిన కథలను ఉత్తరంగా రాయడం ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఇస్తుంది. భార్య అంటూ ఉత్తరాలు రాసే ఆ సీత ఎవరా అని ఆలోచిస్తూ.. రామ్‌తో పాటు మనమూ వెతికేస్తాం సినిమా చూస్తూనే. ట్రైన్లో సీతని మొదటిసారి రామ్ కలిసే సీన్ అయితే.. ఒకరినొకరు చూసుకునే ఆ క్షణంలో ఒక టన్నెల్ వచ్చినట్లు చూపించి మొత్తం చీకటి చేసేస్తారు. ఆ ఒక్క క్షణం చూసే ప్రేక్షకులు కూడా ఊపిరి తీసుకోవడం ఆపేస్తారు.. నిజమా?.. కదా..?సీత ఇంటికి వచ్చి బెట్టు చేస్తూ మాట్లాడుతున్నప్పుడు రామ్ తనకు తెలియకుండా ఫోటో తీయడం.. మ్యాజిక్ షోకి వచ్చి సీత కోసం సీతాకోకచిలుకలు పట్టుకురావడం.. సీత గొడుగు పట్టుకుని వర్షంలో నడుస్తుంటే రామ్ వెంటే వస్తూ అడ్రెస్ అడగడం.. ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టిందే కాకుండా, దారి ఖర్చులు ఇస్తానని సీత రామ్‌తో అంటే ఉడుక్కోవడం.. బయటికి చెప్పలేకపోయినా ఒకరి కళ్లల్లో ఒకరిపై కనిపించే అపారమైన ప్రేమ ఇవన్నీ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. 'ఏమే సీతా..' అని సొంత పెళ్లాన్ని పిలిచినట్లు పిలవగానే వెనక్కి తిరిగి కస్సుమంటూ చూసి కనుబొమ్మలు ఎగరేసే సీత చూపులు మన గుండెలకు గుచ్చుకోకుండా ఉంటాయా?కాశ్మీర్లో మంచుకొండల మధ్య చుట్టూ కురుక్షేత్రం జరుగుతున్నట్లు ఉగ్రవాదులు ఎగబడుతున్న సమయంలో.. ప్రాణాలతో బయట పడతానో లేదో అనే భయంతో పరుగులు తీస్తున్న సీత మొదటిసారిగా రామ్‌ని చూస్తుంది. ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడాలనే ఉద్దేశ్యంతో తన మొహాన్ని కూడా సరిగా చూడని రామ్.. భార్య అని అబద్దం చెప్పి సీత చేయి పట్టుకుంటాడు. మంటల నడుమ యుద్ధపు వెలుగుల్లో నడుస్తూ తనకు అండగా నిలబడిన రామ్‌నే చూస్తూ సీతా స్వయంవరం జరిగినట్లు నిశ్చయించుకుంటుంది. ఆ రోజే ఈ సీతారాములు ఒక్కటయ్యారు. స్వయంవరం అంటే మన పురాణాల ప్రకారం.. ఒక అమ్మాయి స్వయంగా అబ్బాయిలో గుణాలు మెచ్చి వివాహం చేసుకునే పద్దతి ఉండేది. అందుకే తనను కాపాడిన రామ్‌ని సీత ఎంచుకున్నట్లు చూపించారు. అలాంటి ఒక భయంకరమైన యుద్ధపు వాతావరణంలో మొదటి చూపులోనే ప్రేమ పుట్టేలా చూపించడం కన్నా అద్భుతం ఈ సినిమాలో ఇంకోటి లేదు.దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యే సైనికుడి పాత్రలో ధర్మం కోసం నిలబడిన రాముడిలాగా రామ్ ఉంటే, అన్ని సుఖాలు వదులుకుని భర్త వెంట అడవులకు వెళ్లిన సీతమ్మలాగా.. ఇక్కడ ఆస్తిపాస్తులా, ప్రేమా అనే సమస్య వచ్చినప్పుడు రామ్ మాత్రమే కావాలని సీత అన్నీ వదులుకుంటుంది. ఎవరూ లేని రామ్‌కి ఉత్తరాలు రాసి చెల్లెగా మారిన ఒక అమ్మాయి పాత్ర ఈ సినిమాలో వ్యభిచారం చేస్తుంటుంది. రామ్ చొరవతో ఆ నరకం నుంచి బయటపడిన అమ్మాయిని, రాముడి పాదం తాకి ఆడదానిలా మారిన అహల్యగా అనుకోవచ్చా?రామ్ సైనికుడిగా దేశ రక్షణలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు. అక్కడి నుంచి బయటపడే సమయంలో ఒక చిన్న పాప ఏడుపు విని అక్కడే ఆగిపోతాడు. కాపాడదామని వెళ్లి మళ్లీ శత్రువుల చేతికి చిక్కుతాడు. అప్పుడే రామ్, సీతల మధ్య దూరం పెరుగుతుంది సినిమాలో. ఇక్కడ ఆ పాపని రామాయణంలో మాయలేడి అని అనుకోవచ్చా? ఆ లేడి కోసం వెళ్లే కదా రాముడు సీతమ్మకి దూరమైంది. ఇలా ఈ సినిమాలో ఇవే కాకుండా ఇంకా కొన్ని పాత్రలు రామాయణానికి దగ్గరగా రాశారు అనిపించింది నాకు.'దిగులుగా మిథిలలోనే ఉన్నా.. కదిలిరా నీలిమేఘశ్యామా..' అని పాడుతూ రాముడి రాక కోసం సీత నృత్యం చేస్తుంటే.. నీ ఇబ్బందేంటో చెప్పు అని రామ్ అడిగిన వెంటనే రంగులు ఉన్న పళ్లెంని కాలితో తన్నేసి ఏమీ చెప్పకుండా సీత పరుగెత్తడం ఓ కావ్యంలా మలిచారు. అంతస్తును విడిచి, మహారాణి హోదా వదిలి ఓ మామూలు సైనికుడి ప్రేమ కోసం వచ్చేస్తుంది. తాను ప్రిన్సెస్ కాదని, దాని కన్నా లెఫ్టినెంట్ రామ్ భార్యగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. దేశద్రోహి అని రామ్ మీద పడిన నిందను సీత మోయడం చూశాక.. నిజంగా సీతమ్మ తల్లి లాంటి పవిత్రమైన మనసుందని అనిపిస్తుంది.తాను అనాథను కాదని, తన కోసం కూడా చచ్చేదాకా ఎదురుచూసేవాళ్లు ఉన్నారని రామ్ చెప్పే మాటల్లో సీత మీద అపారమైన ప్రేమ కనిపిస్తుంది. శత్రువుల దగ్గర బందీగా ఉండి, చస్తానో బతుకుతానో తెలియని భయంలో ఉన్నా కూడా ఒక పాప ఏడుపు విని ఆగిపోయి ధర్మం కోసం నిలబడిన రాముడి గొప్పతనం తెలుస్తుంది. ఉత్తరంతో మొదలైన వారి ప్రేమకథ.. తాను దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నానని చెప్తూ సీత కోసం రామ్ రాసే మరో ఉత్తరంతో ముగుస్తుంది. కన్నీళ్లు తుడుచుకోమ్మని రామ్ రాసిన ఉత్తరం.. సీత కన్నీటి బొట్ల తడితో తడిచిపోతుంది. రామ్‌ని తిరిగి రమ్మనే సీత పిలుపు మన హృదయాల్ని కదిలిస్తుంది. కలిసి బతికే అవకాశం లేదని తెలిసి కూడా మనసుల్లో గూడు కట్టుకున్న వారి ప్రేమతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించే అపురూపం ఈ 'సీతారామం'.
THANK YOU
PC: CH.VAMSI MOHAN
Matalaki andani varnana
రిప్లయితొలగించండిThank you so much
తొలగించండినిజంగా అన్నా చాలా ఏడుపోస్తుతుంది నాకూ చాలా ఇష్టం ఆ సినిమా అంటే.....
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు అన్నా ❤️🤎
Thank You
తొలగించండిఏంటండీ బాబు ఇంత బాగా విశ్లేషించారు .. ఈ సినిమా నేను 20సార్లు చూసి ఉంటాను. చదువుతుంటే చూస్తున్నట్టే ఉంది. చాలా బాగా రాశారు. ....................
రిప్లయితొలగించండిజ్యోత్స్నా
Thank you so much andi Jyothsna garu
తొలగించండి