God of music.. 'Ilayaraja'

God of Music.. 'Ilayaraja'
అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు.. టీవీలో 'గీతాంజలి' సినిమా వస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ కదా.. అలా చూస్తూ ఉన్నా. సినిమాలో 'ఓం నమః నయన శృతులకు..' అనే పాట వస్తుంది అప్పుడే. వింటుంటే ఎందుకో కొత్తగా అనిపించింది. పాట కూడా మెలోడియస్‌గా, మంచి సాహిత్యంతో, బ్యాక్‌గ్రౌండ్‌ అంతా ఒకే బీట్‌తో అలా హాయిగా వెళ్తోంది. పాటలో ఏదో ఫ్రెష్‌నెస్.. అబ్బా ఎంత బాగుంది ఈ మ్యూజిక్ అని మొదటిసారి అనిపించింది. అసలు కొంచెం కూడా సంగీతజ్ఞానం లేని నాలాంటి మామూలు ప్రేక్షకుడికి ఏదో తెలుసుకున్నా అనే ఫీలింగ్. ఏంటి ఇలా కూడా మ్యూజిక్ చేస్తారా? చాలా కొత్తగా ఉందే..! ఎన్నో పాటలు విన్న నాకు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ అనిపించలేదు. విన్న చాలాసేపటి వరకు ఆ పాట ఇచ్చిన మూడ్‌లోనే ఉండిపోయా. ఆ రోజే ఒక పేరు తెలుసుకున్నా. అది ఆ పాటకి మ్యూజిక్ చేసిన సంగీత దర్శకుడి పేరు.. అదే 'ఇళయరాజా'.
God of Music.. 'Ilayaraja'
ఒక్క ఆ పాటకే కాదు.. అలా చిన్నప్పటి నుంచి చాలా పాటలు విన్న నాలోని సంగీత అభిమాని చాలా సార్లు ఇదే అనుభూతిని పొందాడు. అప్పటికే కొన్నేళ్ల నుంచి నేను విని ఇష్టపడిన పాటలన్నీ ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినవే అని తర్వాత తెలుసుకున్నా. అంటే ఆయనంటూ ఒకరు ఉన్నారని గుర్తించక ముందే ఆయన చేసిన పాటలు ఎప్పటి నుంచో వింటున్నాను.. ఇష్టపడుతున్నాను అన్నమాట. ఇళయరాజా గారి గురించి తెలియక ముందే ఆయన చేసిన సంగీతం నన్ను ఎప్పుడో కదిలించింది. అప్పుడే అర్థమైంది.. నేను రాజా గారికి ఫ్యాన్ అని.
God of Music.. 'Ilayaraja'
అప్పటివరకు మ్యూజిక్ వింటే టైంపాస్ అవుతుందని అని మాత్రమే తెలుసు. కానీ, మ్యూజిక్ డల్‌గా ఉన్న మనిషి మూడ్ మారుస్తుంది. బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది. ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనే ఆశ పుట్టిస్తుంది. ఇవన్నీ ఇళయరాజా గారి పాటలు వింటే నేను పొందే ఫీలింగ్స్. అందుకే రాజా గారి సంగీతం అంటే ఇష్టపడే చాలా మంది అభిమానులు ఆయన్ని దేవుడు అని పిలుచుకుంటారు. అలా ఎందుకు అంటారో నా మాటల్లో చెప్తా.. ఒక మనిషి చేయలేనివి, సాధ్యం కావు అనుకున్నవి చేసి చూపించేవారిని దేవుడు అనే అనాలి కదా మరి. రాజా గారి సంగీతం మనుషులు చేస్తే పుట్టేది కాదు.. అది భగవంతుడు సృష్టించే అద్భుతం.
God of Music.. 'Ilayaraja'
పోయిన సంవత్సరం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా గారి కన్సర్ట్ పెడితే నేనూ వెళ్లా. ఆ దేవుడిని ప్రత్యక్షంగా చూడటానికి, ఆయన సంగీతాన్ని వినడానికి, ఆయన పాడుతుంటే చప్పట్లు కొట్టడానికి నాలాగే చాలా మంది అభిమానులు వచ్చారు. ఆ స్టేడియమే ఒక గుడిగా.. ఆ స్టేజ్‌నే గర్భగుడిగా.. అక్కడికి వచ్చిన అభిమానులే భక్తులుగా.. కదిలివచ్చిన దేవుడు ఇళయరాజా గారిని దర్శించుకున్నానన్న ఆనందం మాటల్లో చెప్పగలనా? దూరం నుంచి ఆయన్ని చూస్తూ.. చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోల్లో విన్న పాటలు అక్కడ లైవ్‌గా వింటూ కోట్లాది మంది అభిమానుల్లో ఒకడిగా ఎంత సంతోషపడ్డానో తెలియాలంటే మీరు కూడా నాలాంటి మరొక ఇళయరాజా ఫ్యాన్ అయ్యి ఉండాలి. 
God of Music.. 'Ilayaraja'
'సాగర సంగమం' అనుకుంటా.. విశ్వనాథ్ గారి సినిమా అని ఎంతో ఇష్టంగా చూసే నేను, అందులో ఉన్న ఇళయరాజా గారి సంగీతం వింటూ మైమరిచిపోయేవాడిని. ముఖ్యంగా ఆ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ప్రతి సీన్‌కి ప్రాణం పోస్తుంది. సినిమా చివరలో 'వేదం అణువణువున నాదం..' విన్నప్పుడల్లా అక్కడ కమల్ హాసన్ స్టేజ్‌పై డాన్స్ చేస్తుంటే, ఆ పాట వింటున్న నా మనసు లోలోపల డాన్స్ చేస్తూనే ఉంటుంది. వచ్చే ఒక్కో బీట్ నరనరాల్లో వైబ్రేషన్ ఇస్తుంది. సాగర సంగమం మ్యూజిక్ వింటుంటే ఎందుకో ఎమోషనల్ అయిపోయి కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఇదేనా రాజా గారి సంగీతం ఇచ్చే అనుభూతి అంటే..?
God of Music.. 'Ilayaraja'
వంశీ గారి 'అన్వేషణ' మూవీ ఎన్నిసార్లు చూసినా థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది. ఆ సస్పెన్స్‌ స్టోరీకి రాజా గారి మ్యూజిక్ ప్రాణం పోసిందనే చెప్పాలి. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఒక్కటి చాలు, చూస్తున్న మనకు చెమటలు పట్టించేస్తుంది. ముఖ్యంగా కొన్ని పాటల్లో పక్షుల కిలకిలలు, ఆ వాతావరణం ఎంత న్యాచురల్‌గా ఉంటుందంటే.. ఆ పక్షుల అరుపులను లైవ్‌గా రికార్డు చేశారని ఎవరో చెప్తే విన్నా, కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు మరి. ఇక 'రుద్రవీణ' మూవీ మ్యూజిక్ గురించి సింపుల్‌గా చెప్పేస్తే సరిపోతుందా? ఆ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్.. మరీ ముఖ్యంగా 'నేను సైతం..', 'లలిత ప్రియ కమలం..' పాటలు మొదటిసారిగా విన్నాక అనిపించింది.. ఇలాంటివి రాజా గారు తప్ప ఇంకెవరూ చేయలేరని.
God of Music.. 'Ilayaraja'
ఇలా చెప్పుకుంటూ పోతే 'అభినందన, 'ప్రేమ', 'శివ', 'మహర్షి', 'స్వాతిముత్యం', 'స్వర్ణకమలం' నుంచి.. మొన్నటి 'రంగమార్తాండ' వరకు ఇలా ఏ సినిమా ఆల్బమ్ గురించి అని చెప్పను. అలా ఒక్కో సినిమా పాటలు, ఆ మ్యూజిక్ నాలో తెచ్చిన మార్పు, పొందిన సంతోషం చెప్పుకుంటూ పోతే నా మాటలు ఈ ఆర్టికల్‌కి కూడా సరిపోవు. దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం.. కానీ ఆ దైవత్వాన్ని ఇళయరాజా గారి మ్యూజిక్‌లో నేను చూశాను. ఆ దేవుడు చేసిన పాటల అద్భుతాలను విని భక్తితో మొక్కగలను తప్ప.. ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకెక్కడిది?.. అంతటి సంగీత మహర్షి గురించి చెప్పడానికి కోట్లాది అభిమానుల్లో నేను ఒక మామూలు భక్తుడిని. ఈ ప్రపంచానికి ఇళయరాజా అనేవాడు ఒక్కడే.. అలాంటి సంగీతం ఒక్కటే.. కానీ, అది విని తరించడానికి ఈ జీవితం ఒక్కటే సరిపోదు.. ఇంకో జన్మ కూడా ఉంటే ఎంత బాగుండు..!
God of Music.. 'Ilayaraja'

THANK YOU

PC: VAMSI MOHAN

కామెంట్‌లు

  1. ఔను.. ఒక్క జన్మ సరిపోదు.
    ఇళయరాజా సంగీతం ఒక ఔషధం... మరొక అమృతం.

    మీ భావాలను చక్కగా వ్యక్తం చేశారు. .. అభినందనలు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి