జానకమ్మ.. 💗
మీ గొంతుని అమితంగా ఇష్టపడిన ఓ మామూలు అభిమాని, పాట అంటే ఇలాగే పాడాలేమో అని మీ ద్వారా తెలుసుకున్న ఓ సంగీతపు పిచ్చోడు రాస్తున్న లేఖ ఇది..
ఇందాకే ఓ వార్త చూశా, విన్నా. అది నిజమని నమ్మడానికి నాకూ కాస్త సమయం పట్టిన మాట వాస్తవమే. మీ గొంతు మూగబోయిందా? సంగీత ప్రపంచం చీకటయ్యిందా? సప్త స్వరాలు అనాథలు అయిపోయాయా? ఇక జానకమ్మను మేం చూడలేమా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో..
కానీ, ఆ వెంటనే తేరుకున్నా. ఎందుకంటే, మీరు వదిలిపెట్టి వెళ్లిన అపార సంపదలాంటి వేల పాటలు ఉన్నప్పుడు మేం అనాథలు ఎలా అవుతాం. మీరు పలికిన ఒక్కో స్వరం రోజూ మా చెవులను తడిమి తడిమి మమ్మల్ని పలకరిస్తుంటే మీ గొంతు మూగబోయిందని ఎలా అనగలం? సరిగమలు కూడా తమ నివాసం జానకమ్మ గొంతే అని విర్రవీగుతుంటే ఆ రాగాల్లో మిమ్మల్ని చూసుకోకుండా ఎలా ఉండగలం? ఇంకెందుకు మాకు బాధ..? ఏం కోల్పోయామని మాకు దుఃఖం?.. ఏం జరిగిందని మనసుకు ఇంత క్షోభ?
సంగీత సరస్వతి ఈ భూమిపై జన్మించి, కొన్నేళ్లు సప్త స్వరాలు పలికించి అవతారం చాలించారంతే..!
అమ్మా..
'మౌనరాగం' సినిమాలో ఇళయరాజా గారు మీతో పాడించారు కదా..! 'చిన్ని చిన్ని కోయిలలే..' పాట నేనైతే ఎక్కువగా తమిళంలోనే విన్నా. అందులో మొదటి చరణంలో 'మల్లిగై సూడి కొండెన్..' దగ్గర ఆ మల్లిగై అనే పదాన్ని మీ అంత అందంగా ఇప్పటివరకూ ఎవరూ పలకడం నేను వినలేదు.
'గీతాంజలి' సినిమాలో 'ఓం నమః నయన..' పాటలో కదా.. తేనెపట్టు లాంటి మీ గొంతు విని నేను పరవశించిపోయింది..! రాజా గారి సంగీతం ఇంత బాగుంటుందా అని తెలుసుకుంది అప్పుడే.. మీ గొంతును ఇష్టపడడం మొదలుపెట్టింది అప్పుడే.
'శంకరాభరణం'లో పెళ్లి చూపులు సన్నివేశం. 'సామజవరగమనా..' ఈ పాట గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నాకు..? కాబోయే వాడితో ఊహల్లో విహరిస్తూ అక్కడున్న అమ్మాయి వీణ పట్టుకుని పాడుతుంది. ఆ చివరలో మాత్రం బాగా లీనమైపోయినట్లు ఓ రాగం పలుకుతారు.. ఆ గొంతులో ఎంత మత్తు అసలు..?
'సప్తపది' సినిమా కోసం మీరు ఏకంగా మాయ చేశారు. 'అన్నీ నీవనుచు అంతరంగమున..' అంటూ మరుగేలరా పాట పాడినా, గోవుల్లు తెల్లన అంటూ పసిపాప గొంతును వినిపించినా ఆ ఘనత మీకే దక్కింది.. ఆ పాటలు విని తరించే భాగ్యం మాకే దక్కింది.
'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాలో 'తొలిసారి మిమ్మల్ని..' పాట ఎన్నిసార్లు వింటానో లెక్కే లేదు. యవ్వనంలో ఉన్న ఓ అమ్మాయి ప్రియుడి కోసం పాడుకునే ఆ పాటలో ప్రతి మాట, ప్రతి స్వరం అంత అనుభవించి ఎలా పడిగలిగారా అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే.
'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో 'ప్రియతమా నను పలకరించు..' పాటలో ఆ రెండో చరణం తర్వాత ఓసారి 'ప్రియతమా..' అంటారు మీరు. పాటంతా నాకు తెలియదు కానీ, ఆ ఒక్క దగ్గర మాత్రం మళ్లీ మళ్లీ వింటాను. అబ్బా.. గుండె పట్టేస్తుంది అనుకోండి అది ఎన్ని సార్లు విన్నా.
'సఖి' సినిమాలో 'సెప్టెంబర్ మాసం..' పాట మాంచి హుషారుగా ఉంటుంది. పైగా అది బీచ్ సాంగ్.. తీరా లెక్కలు వేసుకుంటే తేలింది ఏంటంటే.. ఆ పాట పాడే సమయానికి మీ వయసు 62. అమ్మో.. పడుచు పిల్ల పాడినంత హుషారెక్కడిది ఆ గొంతులో.
ఇలా చెప్పుకుంటే పోతే.. ఎన్నని.. ఇంకెన్నని.. నేను చెప్పలేను. చెప్పాలంటే మా జీవితం సరిపోదు.. వినకుండా మా జీవితం గడవదు. వింటాం. వింటూనే ఉంటాం. మీరు మా పక్కనే ఉన్నట్లు, మా చెవుల్లో పాడుతున్నట్లు, సంగీత సరస్వతిలా మా గుండెల్లో నిలిచిపోయినట్లు మీ గొంతును వింటూనే ఉంటాం.. పదిలం చేసుకుంటాం. మీరు మాకు అప్పగించిన ఈ సంపద భద్రంగా దాచుకుంటామని మీకు మాట ఇస్తున్నా..
అదేంటి, నేను వెళ్లిపోయినా ఇంత ధైర్యంగా ఉన్నావేంట్రా అని నన్ను అడుగుతారేమో..! ఎంత దాచుకుందామనుకున్నా గుండెల్లో ఏదో తెలియని నొప్పి. ఎప్పుడూ మీరే మా కోసం పాట పాడతారు.. కానీ, ఈ సందర్భంలో నాకు మీ కోసం పాడాలనుంది..
విడలేక నిన్నూ..
విడిపోయి వున్నా..
కలిసే లేనా నీ శ్వాసలోన..
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా..
నువ్వే లేక వసివాడానమ్మా.. 😞😞
THANK YOU
PC: CH.VAMSI MOHAN


సంగీత సరస్వతికి అశ్రు నివాళి...
రిప్లయితొలగించండి🙏🙏
తొలగించండిగాన కోకిల ఎస్. జానకి గారు కన్నుమూయడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. దశాబ్దాల పాటు తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన ఆమె, భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆ దిగ్గజ గాయనిని స్మరించుకుందాం.
రిప్లయితొలగించండి🙏🙏
తొలగించండి