సింగ్ గీతం

Sing Geetham.. సింగ్ గీతం..


వచ్చాడ్రా వీడు.. మేమందరం ఎప్పుడో చూసేశాక ఇన్ని రోజులకు ఈ సినిమా గురించి చెప్పడానికి అని నన్ను తిట్టుకోకండి. మీలో చాలా మంది ఈ సినిమా ఇప్పటికే చూసి ఉంటారు.. నచ్చే ఉంటుంది. నిజానికి నేనే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని చూడడం కాస్త ఆలస్యమైంది. ఇదంతా పక్కనపెడితే.. ఓ మంచి పని గురించి, ఓ మంచి సినిమా గురించి చెప్పడానికి సమయంతో పని లేదన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో మీ ముందుకు ఇలా వచ్చా.. అదే ఆలోచనతో ఇది రాయడం మొదలుపెట్టా.సింగ్ గీతం

మనం ఇప్పుడు ఓ 94 ఏళ్ల యువ దర్శకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి నీకేమైనా తిక్కా..? 94 ఏళ్ల వయస్సు ఉంటే, యువకుడు ఎలా అవుతాడనే కదా మీ సందేహం..? ఆయనకు వయస్సు 94 ఏమో.. కానీ ఆలోచనలు మాత్రం 19 ఏళ్ల దగ్గరే పరిగెడుతున్నాయి. ఆ పేరును పరిచయం చేయడానికి కొత్తగా నేను ఆపసోపాలు పడక్కర్లేదు. పెద్ద పెద్ద మాటలతో పొగడక్కర్లేదు.. ఆయన చేసిన ప్రయోగాలను నేను ఈ రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు.
సింగ్ గీతం
కొందరికి సినిమా తీయాలనేది ఓ 'కల'గా ఉండిపోతుంది.. అదే సింగీతం గారు సినిమా తీస్తే అది 'కళ'గా మారిపోతుంది. సింగీతం గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను నాలోని సినిమా ప్రేమికుడు ఇదివరకు చూసి ఉన్నాడు. ఆయన ఏది చేసినా ప్రయోగమే.. ఏది ముట్టుకున్నా అద్భుతమే. 
సింగ్ గీతం
మనందరిలాగే ఆయనా ఓ మామూలు మనిషే కదా..! కానీ, ఇంత గొప్పగా ఎలా ఆలోచించగలుగుతారు? ఎప్పటికప్పుడు ప్రపంచంతో పరుగులు పెడుతూ ఎవరూ చేయలేని అద్భుతాలను ఎలా చేయగలిగారు? సరేలే ఇదంతా పక్కనపెట్టి.. అసలు 'సింగ్ గీతం' సినిమా గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నావో ముందు చెప్పరా బాబూ అంటారా..? అక్కడికే వస్తున్నా..!
సింగ్ గీతం
'సింగ్ గీతం' సినిమా చాలా బాగుంది.. నాకైతే నచ్చింది. 40 ఏళ్ల ముందే ఈ కథని రాసుకుని, సినిమాగా తీయాలనుకుని, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని ఈ మధ్య సింగీతం గారు చెప్తే మొదట ఆశ్చర్యపోయా. అసలు 2026లో తీస్తేనే ఈ సినిమా ఒక అద్భుతం, ఎవరూ చేయలేని ప్రయోగమని అంటున్నారు. మరి అనుకున్నట్లే 40 ఏళ్ల ముందే తీసి ఉంటే.. అప్పుడు ఏమనాలి..? అద్భుతం అనే మాటకు మరింత అద్భుతమైనది ఏదో వాడాలి. దీన్ని బట్టి సింగీతం గారి ఆలోచనలు కాలానికి అతీతంగా ఉంటాయనేది స్పష్టంగా అర్థమవుతోంది.
సింగ్ గీతం
మరి 'సింగ్ గీతం'లో ఏముంది..?
'సింగ్ గీతం'లో అమ్మతనం ఉంది..
'సింగ్ గీతం'లో ప్రాణం విలువ ఉంది..
'సింగ్ గీతం'లో కనువిప్పు ఉంది..
'సింగ్ గీతం'లో త్యాగం ఉంది.. 
'సింగ్ గీతం'లో కదలిక ఉంది.. 
'సింగ్ గీతం'లో మనిషిని మార్చేంత శక్తి ఉంది..
'సింగ్ గీతం'లో ఓ గొప్ప సందేశం ఉంది..
ఇలా మీరు వెతికి చూస్తే.. ఇంకా చాలా చాలా అద్భుతాలే మీకు దొరుకుతాయి.
సింగ్ గీతం
నేను సాధారణంగా ఏ కొత్త సినిమా గురించి ఇప్పటివరకు రివ్యూ రాయలేదు.. రాయను కూడా. ఎన్నో ఏళ్ల ముందు ఇదివరకే మంచి పేరు తెచ్చుకున్న సినిమాల గురించి నా మాటల్లో, అది నాకెంత ఇష్టమో చెప్పడం తప్ప. కానీ, మొదటిసారి 'సింగ్ గీతం' గురించి ఇలా రాయాలనిపించింది. ఎందుకంటే, సింగీతం గారు నాలో కదలిక తెచ్చారు. 94 ఏళ్ల వయసులో నేనిలాంటి ఓ అద్భుతాన్ని చేశాను.. అది చూశాక కూడా నువ్వు ఏమీ రాయకుండా 30 ఏళ్లలోనే చేతకాని ముసలోడిలాగా ఉండిపోతావా అని ఆయన నావైపు గుర్రుగుర్రుమని చూసినట్లు అనిపించింది.. అందుకే నా వంతుగా ఇలా చెప్పాలనిపించింది.


సింగీతం గారు వయస్సు రీత్యా ఇప్పుడు వీల్‌ఛైర్‌లో ఉండిపోయారేమో.. కానీ, ఆయన మనసు, ఆలోచనలు మాత్రం ఇంకా కుర్రాడిలా పరిగెడుతూనే ఉన్నాయి. సింగీతం గారు ఈ సినిమాతో ఓ మంచి చందమామ కథ చెప్పారు.. దానికి మించి నాతో ఇంకోటి చెప్పారేమో అనిపిస్తుంది.
'నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వయస్సు ఏ మాత్రం అడ్డంకి కాదు.. చేయాలనుకున్నది ఈ రోజే చేసేయ్.. లే.. పరిగెత్తు..' అని.
సింగ్ గీతం


THANK YOU

PC: CH.VAMSI MOHAN


కామెంట్‌లు