భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల.. ఇలా చెప్తుంటే లంగావోణీ కట్టుకున్న అందమైన ఆడపిల్ల ఎవరైనా గుర్తొచ్చారా?.. ఇంకెవరు మా భానునే గుర్తు రావాలి. రండి.. మీక్కూడా మా భానుని పరిచయం చేస్తా.. ఆలోపు మేమిద్దరం కాసేపు మాట్లాడుకుంటాం.. మధ్యలో దూరి డిస్టర్బ్ చేయకండే.హేయ్ భాను.. నువ్వు నాకు చాలా చాలా నచ్చేసినవ్ తెలుసా?.. ఏదో పల్లెటూరి పిల్లవు కదా, నీకేం తెలియదు, అమాయకంగా ఉంటావనుకున్నా కానీ, బాడ్కావ్ బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడతా అని బెదిరించినవ్ చూడు.. అర్థమైంది.. నీ అమాయకత్వం ఎలాంటిదో అప్పుడే అర్థమైంది.. మనలో మన మాట.. అలా నువ్వు ఇచ్చిన వార్నింగ్‌కి ఆ రోజు నుంచే కొంచెం భయం కూడా స్టార్ట్ అయింది నువ్వంటే. అయినా గట్లనే ఉండాలే మల్ల తెలంగాణ పిల్ల అంటే.. బరాబర్ ఉన్నవ్.. గట్టిగా ఇచ్చి పడేసినవ్.. మాట కఠువు కానీ, మనసు మంచిదే భాను నీది...
అక్కని పెళ్లిచూపులు చూసేందుకు ఆ పిల్లగాడు వస్తే, అట్లా చాటు నుంచి కిటికీలోంచి చూసి వాళ్ల మాటలు వినడం కరెక్టేనా భాను..? తింగరిపిల్ల.. అయినా అక్క మంచి కోసమే కదా పర్లేదులే.. అంతా అయ్యాక ఏం చెప్తాడో అని అందరూ ఎదురుచూస్తుంటే.. మా తమ్ముడు వచ్చి చూసి ఓకే చేస్తాడని ఆ పిల్లగాడు మెల్లగా చెప్పగానే చిరాకు పడిపోయినవ్.. నిజమే ఎందుకు రాదు చిరాకు.. మరి ఆడపిల్ల పెళ్లిచూపులంటే ఎన్ని ఉంటయ్, వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినంక ఏమంటడో నిద్ర పట్టదు.. పాపం ఆ వరుణ్ దగ్గర కూడా ఎందుకట్ల బెట్టు చేసినవ్, షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ పేరు చెప్పినా తిరిగి సమాధానం చెప్పలేదు.. నీకు బాగా పొగరు అనుకుంటారు భాను అలా చేస్తే.. కానీ, అందరికీ అర్థం కాదు కదా, అది ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం అని.. ఎప్పుడెవరొచ్చి ఏమవుతుందో అని అక్క గురించి, నీ కుటుంబం గురించి నువ్వు పడిన బెంగ అని... కానీ, నేను అర్థం చేసుకున్నాలే భానూ..!
అమెరికా నుంచి దిగొచ్చిన ఆ వరుణ్‌కి మన ఊరి వాతావరణం ఏం తెలుస్తది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్లు పోవాలే గానీ.. అతనే కారు డ్రైవ్ చేస్తానన్నా నువ్వు అస్సలు పట్టించుకోలే. రోడ్లు మంచిగ లేవని వరుణ్ గొణుక్కుంటుంటే, ఈ రోడ్లు మావి, మేమేసుకున్నాం.. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం.. నీకేమన్నా సంబంధముందా? గప్‌చుప్ కూసో అని గట్టిగా అలా చెప్తే ఆ పిల్లగాడు బెదిరిపోడా.. పైగా మా అక్క గురించి ఏమనొద్దు, బంగారం అన్నావ్ చూడు.. నచ్చేసినవ్ భాను.. అక్కంటే ఎంత ప్రేమ నీకు.. కానీ మనకులాగే వాళ్ల అన్నంటే వాళ్లకూ ఇష్టమనేది ఉంటుంది.. ఆలోచించాలి నువ్వే, తొందరపడకూడదు అట్లా. ముందు అరిచేస్తవ్, తర్వాత ఆలోచిస్తవ్.. ఇదే నీతో తలనొప్పి.. ఇదే మాట ఏదో నీ మంచికి చెప్తే పుక్కట్ల నేనేం తీసుకోను, జ్ఞానమిస్తున్నవ్ కదా అంటావు.. ఉఫ్.. నీతో మాట్లాడడం కొంచెం కష్టమే భానూ..!
ఉసిరికాయ తొక్కు తినకుండా వెళ్లిపోయిందనుకే అంత ఎగరాలా నువ్వు.. పిచ్చిపిల్ల.. కానీ, అక్కతో ఒక మాట చెప్పినవ్ కదా అప్పుడు.. అక్కడ మళ్లీ నచ్చేసినవ్.. నాన్నకి నచ్చిండు, పెళ్లికి లేట్ అయితుంది, ఎప్పటికైనా చేసుకునేడిదే.. ఇట్ల కాకుండా నిజంగా నచ్చితేనే చెప్పమని అక్క పక్కన ధైర్యంగా నిలబడినవ్.. అచ్చం నాన్న కూడా నీలాగే అడిగిండు అక్కని. పెళ్లి విషయంలో ఆడపిల్ల ఇష్టాయిష్టాలను నిజంగా ఎంత మంది అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పట్లో.. అడగాలి కదా మరి.. ఆడపిల్లకి కూడా ఇష్టాలుంటాయ్.. అయినా పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు పోవాలే అందరినీ వదిలేసి అని కూడా అన్నావ్ ఇంకోసారి.. నిజమే.. చదువుకున్నదానివి కదా ఆ మాత్రం తెలిసే ఉంటుంది నీకు. ఒక ఆడపిల్లవి అయ్యుండి, అదీ పల్లెటూరి వాతావరణంలో పెరిగి అలా మాట్లాడినావంటే నీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.. నీ మీద నీకు నమ్మకం ఎక్కువ.. అదే నాకు నచ్చింది భానూ..!
అల్లరితనం ఉండాలే కానీ, ఇంటికి గెస్ట్లుగా వచ్చినవాళ్లని మరీ అలా ఏడిపించాల్నా? వరుణ్ని పొద్దున్నే లేవమన్నావ్, చన్నీళ్ల స్నానం చేయమన్నావ్, మళ్లీ స్నానం చేస్తుంటే దూరం నుంచి ఫోటోలు కూడా తీసినవ్.. పాపం ఆ అమెరికా పిల్లగాడు బల్లులకే భయపడుతుండు అసలే. పైగా నువ్వు కూడా ఏడిపించినవ్ పిల్లగాడిని. నీ ఆకతాయి పనులకు హద్దూపద్దూ ఉండొద్దా చెప్పు.. కానీ, ఎంత బాగున్నవ్ భాను అప్పుడు ఆ హాఫ్ శారీలో.. ఎంత మంచిగ రెడీ అయినవో అసలు.. చెవులకు పెద్ద పెద్ద కమ్మలు, పొడవుగా వదులైన జుట్టుతో ఆ డ్రెస్‌ని బొంగరంలా తిప్పుతూ పరిగెడుతుంటే చూడడానికి రెండు కళ్లూ చాల్లేదంటే నమ్ము. వరుణ్ని ఆటపట్టిస్తూ పాపం ఎంతలా పరిగెత్తించినవ్, ఫోటోలు తీసిందే కాకుండా, A సర్టిఫికెట్వి మస్తున్నయ్ అంటవా.. సిగ్గు లేదు భాను నీకు.. హహ్హ.. ఊరికే అన్నాలే. ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా అని వరుణ్ ఆశ్చర్యపోతే.. అమ్మాయిలు కాదు, అమ్మాయి.. భానుమతి.. ఒక్కటే పీస్ అన్నవ్ చూడు.. నిజంగా నువ్వు ఒక్కటే పీస్.. నీలా ఎవరూ ఉండలేరు.. నీలా ఎవరూ అంత అట్రాక్ట్ చేయలేరు.. నీలో ఏదో మ్యాజిక్ ఉంది భానూ..!
నీకు ఊరంటే ఇష్టం.. నీ వాళ్లంటే ఇష్టం.. నీ చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడితే ఇష్టం.. డాన్స్ చేయడమంటే మరింత ఇష్టం.. ఎన్ని మంచి లక్షణాలో నీలో.. పైగా పొలం పని చేస్తావ్.. ట్రాక్టర్ నడుపుతావ్.. ఇలా ఒక్కటేమిటి.. నీకు రాని పనంటూ లేదేమో.. నువ్వు నాన్నకి కూతురివి కాదు, కొడుకు లెక్క. అమ్మాయంటే నీలా ఉండాలే భానూ.. ప్రతి అమ్మాయి నీలాగే ధైర్యంగా అనుకున్నది చేయాలి.. ఎగ్జామ్‌కి వరుణ్ హెల్ప్ చేస్తానంటే ఆ ధ్యాసలో పడి నాన్నకు మందులు ఇవ్వడం కూడా మర్చిపోయినవ్.. ఆ తర్వాత బాధ పడుతూ నాన్నకు సారీ చెప్పినవనుకో, అది వేరే విషయం. ఇది మనకు అవ్వదు భానూ.. అమెరికా పోవడమంటే అస్సలే అవ్వదు.. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా ఆ వరుణ్ని ధమాక్లో నుంచి తీసేస్తానన్నావ్ ఏమైంది నీ మొండిపట్టు.. ఇంకో అమ్మాయి ఎవరో వరుణ్‌తో క్లోజ్‌గా ఉంటే చూసి తట్టుకోలేకపోయినవ్.. కళ్లతో చూసేదంతా నిజం కాదు భానూ.. ఎంతైనా ఆడపిల్లవి కదా.. ఆ మాత్రం అసూయ ఉంటదిలే. పైగా ఇష్టమైన మనిషితో వేరేవాళ్లు చనువుగా ఉంటే చూసి భరించలేం.. అనుకుంటాం గానీ, మనిషి మీద నిజంగా ఇష్టముంటే అలాగే ఉంటది.. నీది వరుణ్ మీద నిజమైన ప్రేమ.. కానీ, అది నువ్వు ఒప్పుకోవు.. ఒప్పుకోవడానికి నీకు బెట్టు.
పెళ్లి చేసుకుని ఇంటిని, కన్నవాళ్లని, తోడబుట్టినవాళ్లని వదిలి వెళ్లిపోవడమనేది ఎంత కష్టమో ఓ ఆడపిల్లకే బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, కన్నప్రేమ వీటన్నిటికీ దూరంగా పోయి తాళి కట్టినవాడిని మనస్ఫూర్తిగా నమ్మి ఇక ఇదే నా జీవితమని ఆడపిల్ల సర్దుకోవడంలో ఉన్న ఓర్పు ఇక ఎందులోనూ లేదేమో. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నప్పుడు ఎంత ఏడ్చినవ్ నువ్వు.. కళ్లన్నీ ఎర్రబడేలా.. ఏ ఆడపిల్లకైనా తప్పని పరిస్థితి. అందుకే నీకు ఇవన్నీ నచ్చదు.. నాన్న పక్కనే ఉంటానంటవ్ ఎప్పుడూ. రాజకుమారుడు రెక్కల గుర్రం మీదొచ్చి రాజకుమారిని తీసుకుపోతాడు గానీ అదే కోటలో ఉండిపోడు.. నువ్వు అవునన్నా కాదన్నా అదే నిజం. ఇదే విషయం నీకు అర్థమయ్యేలా చెప్దామంటే కథలు చెప్పకు అంటావ్.. ఎట్లా భాను నీతో.. నీ మొండిపట్టుతో ఒక్కోసారి నీకు తెలియకుండా చిన్నపిల్లలా మారాం చేస్తవ్.. ఆ మారామే నీలోని పసితనం.. ఓ ఆడపిల్ల స్వచ్ఛమైన మనసుకు ప్రతిరూపం.. అందుకే బెట్టు చేసినా, మాట వినకపోయినా నువ్వంటే ఎందుకో నాకు కోపం రాదు భానూ..!
మనిషిని ఇష్టపడడం.. ఆ మనిషి మనకు దూరమవుతున్నాడని తెలిసినప్పుడు బాధ పడిపోవడం ఈ మనసుకు బాగా అలవాటు. మనసు మన మాట వినదు కదా.. కానీ, నిజమేంటో తెలుసుకోకుండా చూసిన రెండు సార్లకు, విన్న నాలుగు మాటలకు అపార్థం చేసుకుంటే ఎలా.. మనిషికి కాస్త సమయం ఇవ్వాలి.. మనిషి మనసేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.. అది తెలియదు మనకి.. ఊరికే కంగారు పడిపోతవ్.. నీ మనసును బాధ పెట్టుకుంటవ్.. మళ్లీ ఆ రోజు కూడా ట్రైన్లో ఎంత ఏడ్చినవ్.. వరుణ్ విషయంలో లేనిపోని అపార్థాలు చేసుకుని, ఇక వరుణ్ మీద ఇష్టం చంపేసుకుంటానని ఒంటరిగా తెగ బాధ పడిపోయినవ్.. నాన్న అక్కడికి వచ్చి దగ్గరికి తీసుకోగానే ఇక ఎక్కడికీ వెళ్లనని నాన్నతో చెప్తూ ఆప్యాయంగా చూసినవ్ చూడు.. అప్పుడు నీ కళ్లల్లోకి చూశా నేను.. అప్పుడే అర్థమైంది గుండెల్లో ఎంత ఆవేదన దాచుకున్నావో.. ఒక మనిషిని నిస్వార్థంగా, నిజాయితీగా ఇష్టపడినప్పుడే అలాంటి ఫీలింగ్స్ పుడతాయి.. అంతలా బాధ పడిపోతాం.. నీది నిజమైన ప్రేమ అని ఆ రోజు నాకు మరోసారి అర్థమైంది భానూ..!
ఒకటే ఏంటంటే.. నీలో నచ్చనిది.. నువ్వు నీ వైపు నుంచే ఆలోచిస్తవ్.. నీదే కరెక్ట్ అనుకుంటవ్.. ఆ ప్రవర్తనతో ఎదుటివాళ్లను కూడా బాధ పెడతవ్.. కానీ, అటువైపు ఏం జరుగుతుందో.. అసలు ఏం ఆలోచిస్తున్నాడో.. నీ గురించి అసలు అతని అభిప్రాయం ఏంటో నిజంగా ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసినవా.. బెట్టు చేయడంలో మాత్రం ముందుంటావ్.. ఒక్కోసారి అవసరానికి తగ్గట్లు కొన్నిసార్లు తగ్గినా తప్పు లేదు భానూ.. అరె.. కోపముంటే నువ్వు అనుకునేదే నిజమైపోతుందా? ఒక మనిషి.. అందులోనూ నువ్వు బాగా ఇష్టపడిన మనిషే నీతో మాట్లాడాలని, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు అర్థం కాదు నీకు.. ఎందుకంత పట్టుదల.. ఎందుకంత మొండితనం.. మొదట్లో అనుకున్నా మా భానుకి ఆత్మవిశ్వాసం ఎక్కువ.. ఏం చేసినా కరెక్ట్ అని నేను కూడా. కానీ, కొన్నిసార్లు ఆ ఆత్మవిశ్వాసం హద్దులు దాటి నిన్ను నువ్వే మోసం చేసుకునేలా చేస్తుంది.. అది మాత్రం నువ్వు ఆలోచించవు. దానివల్ల నీకు కావాల్సిన వాళ్లని దూరం పెడుతున్నవ్.. మాట్లాడుకుంటే పోయేదాన్ని పట్టుకుని అంతలా లాగుతావ్.. నచ్చలేదు భాను ఇక్కడ మాత్రం నువ్వు.. పైగా చెప్పు ఫోటో పంపిస్తావా.. ఏం చేసుకుంటడు అది పెట్టుకుని వరుణ్ అయినా.. నచ్చలేదు.. ఇదైతే అస్సలు నచ్చలేదు.. మొండిఘటం..!
ఆ పొట్టి పొట్టి డ్రెస్సులేంటి.. అసలెప్పుడైనా వేసుకున్నవా అట్లా.. ముందెప్పుడైనా నిన్ను అలా చూసినామా.. బాన్సువాడలో ఎట్ల ఉండేదానివి.. మా భాను బంగారం అనుకునేలా.. అలాగే ఉండాలి కదా మరి.. ఎవరి ముందో బెట్టు చేయాలని, ఎవరి మీదనో పంతం తీర్చుకోవాలని, ఏది తప్పో ఏది కాదో ఆలోచించకుండా అలా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే.. వరుణ్ కాబట్టి చూసి తిట్టేసి ఊరుకున్నాడేమో.. నేనైతే చెంప పగలగొట్టేవాడిని.. నిన్ను అలా ఎప్పుడూ చూడాలని అనుకోలేదు భానూ.. నువ్వు ఆ లంగావోణీలోనే బాగుంటావ్.. మా భానుని అలాగే చూస్తూ వచ్చాం.. అదే నీకు అందం కూడా.. అది అర్థం చేసుకోకుండా ఇలా చేయడం ఏ మాత్రం నచ్చలేదు భానూ..!
కళ్ల ముందే మనిషి కనబడుతున్నా ఒక్కసారైనా మనసు పెట్టి పలకరించాలని అనిపించలేదా.. మాట్లాడాలని అనిపించలేదా.. సరే.. వరుణ్‌కి అంటే తెలియదు.. నీ బుద్ధి ఏమైంది..? అతను ఫారిన్లో పెరిగిన అబ్బాయి.. కొన్ని మన పద్ధతులు తెలియవు.. ఆడపిల్లతో ఎలా ఉండాలో అస్సలు తెలియదేమో.. అదైనా గమనించి నువ్వే సర్దుకుపోవాలి గానీ, ఏంటీ బెట్టు.. ఏం సాధించినవ్ దానివల్ల. ఒక్కసారైనా అటువైపు పరిస్థితులను కూడా చూడాలి కదా.. కనీసం ఆలోచించాలి కదా.. ఆలోచించే ప్రయత్నమైనా చేయాలిగా.. పాపం వరుణ్ ఎంత తపనపడిపోయాడు తెలుసా నీ కోసం? తిండి లేదు, నిద్ర లేదు.. నీ గురించే అంతా.. వరుణ్ చాలా మంచోడు.. పైగా ఎంత మంది అమ్మాయిలు అతని వెంటపడతారు తెలుసా? గిన్నిస్ బుక్ వాళ్లకు చెప్పుకో అంటావా.. మ్యాగీ చేసినంత ఈజీగా వేరేవాళ్లను సెట్ చేసుకుంటా అంటావా.. ఈ మాటలకేం తక్కువ లేదు.. ఈ ఆటిట్యూడ్ అయితే కావాల్సినంత ఉంది. వరుణ్ మీద బెట్టుతో ఆ పిల్లగాడు ఎవరితోనో సెల్ఫీ దిగి మరీ పెట్టినవ్ గదా.. ఎప్పుడూ నాన్న పక్కనే ఉంటా అంటావ్.. మరి ఇంటి పక్కనే సంబంధం కదా అని అడిగితే మళ్లీ నచ్చలేదు అన్నావ్.. ఎందుకన్నావ్.. మనసులో వరుణ్ ఉన్నాడనే కదా. నీకు లోపల ఒకటి.. బయటికి చేసేది ఒకటి.. అది చూసినప్పుడే మనిషివి మంచిదానివే కానీ, మొండితనం ఎక్కువని అర్థమైంది.. నువ్వూ కొంచెం తగ్గాలి భానూ..!
నువ్వెప్పుడూ అంటుంటవ్ కదా.. గట్టిగా అనుకో అయితదిలే అని. అనుకున్నావేమో చాలా సార్లు అలా.. కానీ, అనుకున్నవి అన్నీ కరెక్ట్ కాదు, కొన్నిసార్లు తప్పులు కూడా కావొచ్చు.. నీ మనసు కోరుకునేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి.. పంతంతో చేసే పనిలో సంతోషం ఉండదు.. ఏదైనా ఇష్టపడి చేయాలి.. అనుమానాలు ఉంటే తేల్చుకోవాలి.. నిజమేంటో తెలుసుకోవాలి.. అచ్చం వరుణ్ నీతో చెప్పినట్లుగా.. అది ఇష్టపడిన మనిషి దగ్గర మనం తీసుకునే చొరవ మాత్రమే.. అంతమాత్రాన నువ్వు అక్కడ తగ్గినట్టు కాదు భాను.. మరి అదేం లేనప్పుడు ఆ రోజు ఇండియా వెళ్లిపోతూ ఎయిర్‌పోర్ట్‌లో వెనక్కి వచ్చి మరీ వరుణ్ని ఎందుకు హగ్ చేసుకున్నట్లు?.. లోపల అంత ఇష్టం పెట్టుకుని బయటికి మాత్రం లేనిపోని భయాలతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు భానూ. నీ మనసులో ఉన్న అభిప్రాయాలను చెప్పి, ఎదుటి మనిషి అభిప్రాయాలకు విలువ ఇచ్చినప్పుడే అసలు నీకేం కావాలో.. ఏం అవసరమో ఎదుటివాళ్లకు కూడా తెలుస్తుంది.. వరుణ్ అంటే ఇష్టం లేదంటే సరే.. వరుణ్ని కాదని వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటానన్నా సరే.. ఎందుకంటే అది నీ ఛాయిస్.. నువ్వు హ్యాపీగా ఉంటావన్న నమ్మకం.. అదే నువ్వు హ్యాపీగా లేవంటే తట్టుకోలేను భానూ..!
అంతా సద్దుమణిగి వరుణ్ నీ మెడలో తాళి కడుతున్న సమయంలో కూడా ఒక్కసారి తల పైకెత్తి అతనిని చూస్తావు.. ఎందుకనీ..? ఒక ఆడపిల్లగా మీరు పడే భయాలు అంత తేలిగ్గా మిమ్మల్ని వదిలివెళ్లవా..? నిన్ను ఇష్టపడుతున్న మనిషి నిన్ను సొంతం చేసుకునే ఆ సమయంలో కూడా మీ బెరుకు ఉంటూనే ఉంటుందా? అనుమానాలు వదిలేసి నమ్మడం మొదలుపెట్టు భానూ.. నీ జీవితం బాగుంటుంది. అర్థమైందా ఇక ఉంటా మల్ల.. ఇవండీ, ఇవే మా భానుకి చెప్పాలనుకున్న నా మాటలు. మీకు కూడా చెప్తున్నా ఇప్పుడు వినండి.. నిజమే మొదట్లో ఏవేవో అనుకుంటాం.. కానీ, ఓ ఆడపిల్ల ప్రపంచంలో అద్భుతాలు ఎక్కడ అవుతాయి ?.. ఒకచోట పుడతారు, పెరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, ఇంకెక్కడికో వెళ్లిపోతారు.. ఎవరైనా అంతేకదా.. ప్రతి ఆడపిల్ల జీవితమూ అంతేకదా.. అంతటి ఓర్పు కలిగి ఉండి, ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడతారు. ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా మన పక్కన నిలబడి తోడుగా ఉండే భాను లాంటి ఎంతో మంది ఆడపిల్లలకు నా మనసు ఫిదా.....!
THANK YOU
PC: CH.VAMSI MOHAN
Super 😍
రిప్లయితొలగించండిThanks
తొలగించండిWow.. feel good
రిప్లయితొలగించండిThanks
తొలగించండిఅన్న నువ్ రాసింది గనుక భాను చూస్తే ఖచ్చితంగా నీకు పడిపోతది అన్నా.. చాలా బాగా అర్థం చేసుకున్నావ్. ఇది చదివాక నీకొచ్చే అమ్మాయి కూడా బాగా ఆలోచిస్తది. నీ లాంటి మంచి అబ్బాయితో తను ఎలా నడుచుకోవాలా , ఎలా ఉంటే నీకు నచ్చుతుందో తెలియక ఎంత సతమతమవుతదో.. పాపం..
రిప్లయితొలగించండిఅయ్యో పాపం.. anyways thanks for comment
తొలగించండిWow 💓 Nice 🙂
రిప్లయితొలగించండిThanks
తొలగించండిHello andi...
రిప్లయితొలగించండిNenu e cinema chusa but appudu naku ardham kaledu edi chaduvaka aa cenima enta Bagunda ani ...
Chala bagundi 🥰
Thank you
తొలగించండి