అదిగో అదిగో భద్రగిరి.. అల్లంత దూరంలో పెద్ద పెద్ద చెట్లు, ఎత్తైన భవనాల మధ్య చిన్నగా ఓ గోపురం కనిపిస్తుంది చూడండి.. హా.. అదే రాములవారి ఆలయం.. గంటలు మోగిస్తున్న శబ్దం కూడా దూరంగా వినిపిస్తోంది కదూ. కాసేపట్లో అక్కడికే వెళ్లబోతున్నాం. దాని కన్నా ముందు ఇదిగో.. ఈ పుణ్య గోదావరిలో స్నానం చేయాలి. త్వరగా స్నానాలు ముగించుకుని తయారై అక్కడికి చేరిపోవాలి. 'సీతారాముల కళ్యాణం చూతము రారండి..' అదిగో వింటున్నారా.. గుడి ప్రాంగణంలో ఉంచిన మైకులో నుంచి పాట చెవులకు సన్నగా వినిపిస్తూ పండగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఇంతకీ మీరూ నాతో వస్తున్నారు కదా.. ఇంకెందుకు ఆలస్యం మరి.. తొందరగా సిద్ధం కండి.
మిథిలా నగరం.. జనక మహారాజు తన గారాలపట్టి జానకికి కళ్యాణం జరిపించడానికి నిర్ణయించిన వేదిక. అదిగో మధ్యలో కళ్యాణ మండపం.. ఎంత సర్వాంగ సుందరంగా అలకరించారో చూడండి.. చుట్టూ ప్రాకారాలకు మామిడి తోరణాలు, వాటిని ఆనుకుని మెలికలు తిరిగి ఉన్న పూదండలు.. బంతి, చామంతి, గులాబీలు.. ఒక్కటేమిటి మొత్తం పూలవనమే ఇక్కడ విరిసినట్లుగా ఉంది. మండపం చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలకు ఆనుకుని ఎత్తుగా పాతిన అరటి కొమ్మలు.. ఆ స్తంభాలకు జారవిడిచిన దండలను రంగురంగుల పూలతో ఎంత అందంగా అల్లారో కదా. అలాగే ఇప్పుడు మండపం లోపల పైకప్పును చూడండి.. లేత మామిళ్లు, లేలేత పూతతో కూడిన కొమ్మలతో సాంతం పరిచేశారు. ఇంత అందంగా అలంకరించిన మండపం మధ్యలో రాజసం ఉట్టిపడుతూ ధగధగ మెరుస్తున్న వెండి సింహాసనం.. మొత్తంగా కళ్యాణ మండపం ప్రకృతి సోయగంతో కనులవిందు చేస్తోంది. ఆ సోయగంలో భాగమైన ప్రతి కొమ్మ, ప్రతి ఆకు, ప్రతి పండు, ప్రతి పువ్వు.. రామచంద్రుడి రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అబ్బా.. ఎంత జనం.. మండప ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. కాసేపట్లో జరగబోయే లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందరూ నుదుటన నిలువు నామాలు పెట్టుకుని, పట్టు బట్టలు కట్టుకుని చక్కగా ముస్తాబై, ప్రశాంతమైన మనసుతో అదిగో ఆ మండపంవైపే చూస్తున్నారు. ఏ నోట విన్నా, ఏ భక్తుడిని కదిలించినా జై శ్రీరామ్ అనే నామస్మరణ చేస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. మనమూ వాళ్ల మధ్యలో ఎక్కడో అక్కడ కాస్త చోటు చేసుకుందాం రండి.. హమ్మయ్య.. మొత్తానికి ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడానికి మనకూ కాస్త భాగ్యం దక్కింది. ఇక కళ్యాణ ఘట్టం మొదలవ్వడమే ఆలస్యం.. మండపం దగ్గర పురోహితులు, వారి అనుచరులు మిగతా కార్యక్రమాల సంగతి చూస్తున్నారు. హడావిడిగా ఉంది వాతావరణం అక్కడ. కొందరు పట్టు వస్త్రాలను పళ్లాల్లో తీసుకొచ్చి ఓ పక్కగా సర్దుతుంటే.. మరికొందరు పూలు, పండ్లను తాంబూలాల్లో అమర్చి సిద్ధం చేస్తున్నారు. అదిగో.. ఆ పక్కగా చూడండి.. ముత్యాలతో పేర్చిన సీత, రామ నామాలు కొబ్బరి బొండాల మీద ఎంత అందంగా అద్దారో.. మరోపక్క కొందరు బ్రాహ్మణ యువకులు అక్కడే కింద కూర్చుని శ్రీరామ స్తోత్రాన్ని గుక్క తిప్పుకోకుండా పఠిస్తున్నారు. 'రామ రామ జయ రాజారామా.. రామ రామ జయ సీతారామా'.. హా.. మీరూ అనండి నాతో పాటు.
ఆలయం వైపు నుంచి మెల్లగా సన్నాయి మేళం కదులుతూ వస్తున్నట్టు అలికిడి. తాళాలు, తప్పెట్ల మోతలు, మంగళ వాయిద్యాల సవ్వడి మధ్య ఓ ఊరేగింపు కదిలి వస్తున్నట్లు హడావిడి వాతావరణం. ఆ ఊరేగింపు మండపం వైపు కదిలి ఇంకా దగ్గరగా వస్తూ ఉంటే ఆ శబ్దం మరింత పెరుగుతోంది. ఆ అలజడికి కూర్చున్న భక్తులందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తి ఆసక్తిగా తమ కళ్లను ఇంకా పెద్దవి చేసి చూస్తున్నారు. అదిగో.. మందీమార్బలం వెంట రాగా.. పురోహితులు మంత్రాలు చదువుతూ ముందుకు సాగుతుంటే.. పల్లకీలో ఊరేగుతూ శ్రీరామచంద్ర ప్రభువు వేంచేస్తున్నాడు. పట్టు వస్త్రాలు ధరించి, ధగధగ మెరిసే హారాలు మెడలో వేసుకుని, శిరస్సుపై అలంకరించిన బంగారు కిరీటంతో శోభాయమానంగా.. కుదుపులకు ఊయల ఊగినట్లుగా పల్లకీలో సేద తీరుతూ.. తన కోసం ఎదురుచూస్తున్న భక్త జనులందరినీ చల్లని చూపులతో ఆశీర్వదిస్తూ మండపం వైపు కదులుతున్నాడు. మీరు సరిగా గమనించారో లేదో.. పసిడి బుగ్గపై అందంగా అద్దిన చుక్కతో పాటు మొగ్గలేస్తున్న ఆ సిగ్గును చూడండి.. కళ్యాణం జరిపించుకోబోతున్నానని ఆరాటమో.. సీతమ్మవారిని సొంతం చేసుకునే ఘడియలు దగ్గర పడ్డాయని సంతోషమో.. పెళ్లి కళతో, కళ్లల్లో కొత్త కాంతులతో మెరిసిపోతున్నాడు నా రామచంద్రుడు.
అలంకరించిన ఆ మండపం ఎంత అదృష్టం చేసుకుందో కదా.. చుట్టూ పేర్చిన ఆ పూబంతులు ఎన్ని నోములు నోచుకున్నాయో కదా.. అఖిల భువనాలను తన ఒంటి చేత్తో మోసే ఆ ప్రభువునే మోస్తున్నందుకు ఆ సింహాసనం ఎంత పుణ్యం చేసుకుందో కదా.. పాదాలకు రాసిన ఆ పారాణి ఏ వరాలు అడిగిందో కదా.. ఒంటిని చుట్టుకున్న పీతాంబరాలు తయారయ్యేటప్పుడు ఆ కౌసల్యారాముడి తనువును ఏ రోజుకైనా తాకుతామని అనుకున్నాయో లేదో కదా.. ఆ దివ్య మంగళస్వరూపాన్ని స్పృశించిన ఆభరణాలకు మరింత కాంతి వచ్చి మెరిసిపోతూ ఎలా సిగ్గు పడుతున్నాయో కదా.. ఈ అపురూప ఘట్టాన్ని చూస్తున్న నా కళ్లు ఎంత మురిసిపోతున్నాయో కదా.. ఎలా చెప్పగలను.. ఏమని వర్ణించగలను.. ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి.. ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా?
అయ్యవారు వేంచేశారు.. మరి అమ్మగారెక్కడ..? ఎంతైనా ఆడవారు కదా, అలంకరించుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందిలే. పైగా సుందర రాముడి అందానికి ఏ మాత్రం తగ్గకుండా సిద్ధం కావాలిగా, ఎంత ముస్తాబైనా ఆ నీల మేఘశ్యాముడిని మరిపించడం సాధ్యం కాదని అనుకుందేమో.. అలిగి కూర్చుంది కొత్త పెళ్లి కూతురు. ఇక చాల్లెద్దు అమ్మా.. పసిడి కాంతులతో అలరారుతూ చందమామ వంటి నీ అందానికి తక్కువేమి.. పుత్తడి బొమ్మలా సింగారించుకున్న నీ చీరకట్టుకేమి.. జడలో తురుముకున్న ఆ మల్లెపూల పరిమళమేమి.. వాటిని అంటిపెట్టుకుని వాలిపోయిన ఆ జడకొప్పు వయ్యారమేమి.. అరచేతిని అంటుకున్న ఆ గోరింటాకు ఎర్రదనమేమి.. సుగంధాలు వెదజల్లే నీ బంగారు మేనిని ధరించిన ఆభరణాల సొగసేమి.. తామరాకు వంటి సుతిమెత్తని పాదాలకు అంటిన పారాణిని తడుముతున్న కడియాల సవ్వడేమి.. ఇంతటి లోకోత్తర సౌందర్యాన్ని చూశాక కూడా నీ స్వామి మైమరిచిపోకుండా ఉండగలడా చూద్దాం.
రామయ్యా.. ఇదిగోనయ్యా.. రమణీలలామ నవ లావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా.. రామా కనవేమిరా.. ఓరకంట కొంటెగా చూస్తున్న నీ చూపులకు నవ వధువు సిగ్గుల మొగ్గయిపోతోంది. ఆ బుగ్గల్లో ఉప్పొంగుతున్న లేలేత ఎరుపును చూస్తే తెలియట్లేదా.. పాపం నా తల్లి.. బిడియంతో నీ కళ్లల్లోకి సూటిగా చూడలేక తల దించుకునే ఉండిపోయింది. రోజూ పొద్దున లేచింది మొదలు నీ నామస్మరణే చేస్తా కానీ, ఈ రోజు మాత్రం నేను సీతమ్మ తరఫున వచ్చాను.. మా ఇంటి ఆడబిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాం, ఏ లోటు లేకుండా చూసుకోవాలి మరి.. కాస్త మా అమ్మని దిష్టి పెట్టకుండా ముందు నీ కళ్యాణ క్రతువు జరిపించుకో స్వామీ.. వేదవేదాంగాలను పఠిస్తూ నిన్ను కీర్తిస్తున్న ఆ పురోహితుల మంత్రాలను ఆలకించు స్వామీ.. ఏంటది.. నువ్వు పుట్టగానే అయోధ్య నగరమే పులకించిపోయిందట.. సాక్షాత్తూ పరమాత్ముడే తమ కడుపున జన్మించాడని తండ్రి దశరథుడు, తల్లి కౌసల్య మురిసిపోయారట.. నువ్వు చూపించే అంతులేని వాత్సల్యంతో తోడబుట్టినవారికి ఆదర్శంగా నిలిచావట.. నీ ధీరత్వం, శూరత్వం, వినయం చూసి గురువులే ఉప్పొంగిపోయారట.. నీ పాదస్పర్శ తాకగానే రాతికి ప్రాణం వచ్చి పునీతమైందట.. శివ ధనుస్సుని పెళపెళమని విరిచి క్షత్రియుడివై అచంచల కీర్తిని పొందావట.. ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా పాలిస్తూ రామన్న రాజ్యం అంటే ఏంటో తరతరాలకు గుర్తుండేలా చేసిన మహారాజువట.. ఎన్ని మార్లు విన్నా, ఏ నోట పొగిడినా తనివితీరనిది నీ చరిత, చెరిగిపోనిది నీ ఘనత.
'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా..' అని రామదాసు భక్తితో చేయించిన కలికితురాయిని పురోహితులు చూపిస్తున్నారు.. అందరూ దర్శించి తరించండి.. ఆ కలికితురాయి ధరించిన తర్వాత నీ అందం ఇంకా మెరుగైంది రామా.. ఇక లక్ష్మణస్వామికి చేయించిన ముత్యాల పతకం చూడండి.. ఎంత ముచ్చటగా అమరిందో! సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా... బిడ్డలాంటి రామదాసు ప్రేమతో చేయించిన చింతాకు పతకం వేసుకుని ఎంత మురిసిపోతుందో ఆ తల్లి.. కొడుకు ఇచ్చింది ఏదైనా మరి అమ్మకు విలువైనదే కదా. 'ఆ పతకానికి బట్టే పదివేల వరహాలు రామచంద్రా..' అని ఆనాడే రామదాసు లెక్కలు కూడా అప్పజెప్పేశాడు.. 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు' అని నీ మీద నిందలు కూడా వేశాడు.. అయినా అవి వింటూ కూడా చిరునవ్వుతో అలా చూస్తుండిపోతావేం స్వామీ.. రామా అని భక్తితో కోరితే ఏం అన్నా, ఏమని పిలిచినా, ఎలా కొలిచినా కరిగిపోతావా?
భజంత్రీలు మోగుతున్నాయి.. కళ్యాణ ఘట్టం కనులవిందుగా సాగుతోంది.. కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబైన నిన్ను చూస్తూ భక్తులందరూ మైమరిచిపోతున్నారు.. నీ కరుణ నిండిన చూపులను తమపై కురిపించమని ఆశగా ఎదురుచూస్తున్నారు.. కానీ నీ ధ్యాసంతా ఎక్కడ ఉంటుందో నాకు తెలిసినట్లుగా వాళ్లు తెలుసుకోలేకపోయారు పాపం.. నీ ఎదురుగా పుత్తడి బొమ్మలా కూర్చుని, ఎడమ మోకాలిని మడిచి, దానిపై రెండు చేతులను ఉంచి, తలను ఆనించి ఓరకంట నిన్నే చూస్తున్న ఆ తల్లి వైపే నీ చూపంతా అని తెలుసులే స్వామీ.. ఇక జానకీరాముడివి అయ్యే ఆ శుభ తరుణం దగ్గర పడింది.. సీతమ్మవారి మెడలో మూడు ముళ్లు వేసి ఒక్కటయ్యే ఘడియలు సమీపించాయి.. ఎప్పుడెప్పుడు రామపత్నిగా మారిపోతానా అని ఎదురుచూస్తూ కూర్చుండిపోయిన జనక మహారాజు కూతురిని సొంతం చేసుకుని, నీ ఎడమ తొడ మీద పదిలం చేసుకునే అద్భుత సమయం ఆసన్నమైంది. మూడు సూత్రాలు ఉన్న ఆ తాళిని అమ్మవారి మెడలో అలంకరించి లోక కళ్యాణం జరిపించమని సకల దేవతలు ఆశీర్వదిస్తున్నారు.. అన్నట్లు మూడు సూత్రాలు ఉన్న తాళి మా సీతమ్మవారికే ప్రత్యేకం.. ఒకటి తండ్రి జనకుడి తరపున చేయించింది.. ఇంకోటి అత్తింటివారు చేయించింది.. మరొకటి ఆ భక్త రామదాసు చేయించింది.. ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా ఆ రామదాసు నిజంగా.
హా.. ఈ సందర్భంలో ఎందుకో నాకు ఆనాటి సీతా స్వయంవరం ఘట్టం గుర్తుకు వస్తోంది. విశాలమైన సభా ప్రాంగణం.. సింహాసనంపై జనక మహారాజు.. వరుసలో దేశవిదేశాల నుంచి వచ్చిన పేరున్న యువరాజులు.. అందులో ఒకడిగా నవ యవ్వనంతో, ప్రశాంత వదనంతో, ముద్దుగారే మోముతో, చేతిలో ధనుస్సు పట్టుకుని, పక్కనే తమ్ముడు లక్ష్మణుడిని వెంటబెట్టుకున్న రఘువంశ పురుషోత్తముడు. స్వయంవరానికి విచ్చేసిన యువరాజులను, సభాసదులను ఒక్కసారి తేరిపార కలియజూస్తున్న జనకుడు.. ఆయన పక్కనే చేతిలో వరమాలతో సిగ్గు పడుతూ నిలుచున్న జానకి. దించిన తలను ఎత్తకుండానే, కమల పూవుల్లాంటి ఆ కళ్లు మెల్లగా కదులుతూ ఎవరి కోసమో వెతుకుతున్నాయి. హా.. అదిగో.. అయోధ్య యువరాజు, దశరథ మహారాజు గారాల బిడ్డ రాముడు.. దూరంగా కనిపిస్తున్నాడు. ఏమి ఆ సౌందర్యం.. ఏమి ఆ రాజసం.. కనుచూపు తిప్పుకోనివ్వడం లేదు సీతకి.. పాదాల నుంచి పైన శిరస్సు వరకు ఓ ముగ్ధ మనోహర రూపం మూర్తీభవించి ఎదురుగా అలా కూర్చున్నట్లుంది. ఈ యువరాజే తనను వివాహమాడితే బాగుండునని ఆ సమయంలో జానకి మనసులో ఖచ్చితంగా ఆశ పుట్టే ఉంటుంది. సభా మధ్యలో ఉంచిన శివధనస్సును ఎత్తాలని ప్రయత్నించి తమ వల్ల కాక ఒక్కొక్కరుగా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇక రఘురాముడి వంతు వచ్చింది.. ముందుగా శివ ప్రసాదమైన ఆ ధనుస్సును తన రెండు చేతులతో నమస్కరించాడు.. ఎడమ చేతితో ఆ విల్లు మధ్యలో పట్టుకుని అవలీలగా పైకెత్తేశాడు.. అసాధ్యమనుకున్న ఆ కార్యాన్ని అయోధ్య యువరాజు చేసి చూపగానే సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.. సీతకైతే పట్టరాని ఆనందం.. అప్పటివరకు బెదురుబెదురుగా చూస్తున్న ఆమె కళ్లు సంతోషంతో విచ్చుకున్నాయి. మనసును ఎవరో ఊయల ఊపినట్లు, పరవశమై తనువు ఊగిసలాడుతుండగా, తండ్రి జనకుడు వెంటరాగా పరుగు లాంటి నడకతో ముందుకు కదిలింది. రామచంద్రుడి చెంతకు చేరింది.. చేతిలో ఉన్న వరమాలను ఆ పురుషోత్తముడి మెడలో అలంకరించింది. పైనుంచి దేవదేవాదులు పూలవర్షం కురిపించారు.. వరమాల మెడలో వేసే సమయాన ఒక్కసారిగా రాముడి కళ్లలోకి సూటిగా చూసింది.. ఆ చూపులు తన మనసుని తాకి చక్కిలిగిలి పెట్టడంతో మొహంలో చిరునవ్వు విరబూసింది.. అదిగో అచ్చంగా అదే నవ్వు.. ఈ రోజు తన మెడలో మూడు ముళ్లు వేయడానికి వంగిన రామచంద్రుడిని చూడగానే వచ్చేసింది. ఆ నవ్వుకు అర్థం తెలుసుకున్నవాడిలా ఒక్కో ముడి వేస్తూ కొంటెగా నవ్వాడు ఆ సీతాపతి.
'సీతా కళ్యాణ వైభోగమే.. శ్రీరామ కళ్యాణ వైభోగమే.. కనగ కనగ కమనీయమే.. అనగ అనగ రమణీయమే..' ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం కనుల ముందు ప్రత్యక్షమవగానే భక్తులందరూ చేతిలో ఉన్న అక్షింతలను చల్లుతూ కొత్త దంపతులకు దిష్టి పెట్టేస్తున్నారు. మండపం చుట్టుపక్కల అంతా 'జైశ్రీరామ్' అనే దివ్యనామం మార్మోగిపోతుంది. 
శ్రీరామ.. సీతారామ.. రఘుకులసోమ.. జగదభిరామ.. జానకీరామ.. పట్టాభిరామ.. అయోధ్య రామ.. నిత్యము నిన్నే కొలిచెద రామ.. అనుకుంటూ నాలోని రామభక్తుడు ఉద్వేగంతో ఆ రామభద్రుడిని తనివితీరా తిలకిస్తూ మైమరచిపోతున్నాడు. పెళ్లి బట్టల్లో కొత్త కళ ఉట్టిపడుతుండగా.. సీతాసమేతుడై సింహాసనం మీద పట్టాభిషిక్తుడై కూర్చున్న నా శ్రీ రామచంద్ర ప్రభువు తన అభయహస్తంతో నన్ను ఆశీర్వదిస్తున్నట్లు పిలుస్తుంటే.. పరుగున వెళ్లి ఆ పురుషోత్తముడి పసిడి పాదాల మీద నా తలను వాల్చాను.. తల మీద చేయి ఉంచి నిమురుతూ నన్ను దీవిస్తున్న నా ప్రభువుని నీళ్లు నిండిన కళ్లతో ఆర్తిగా చూస్తూ, రెండు చేతులను చాస్తూ.. 'బంటురీతి కొలువు ఈయవయ్య రామా..' అని వేడుకున్నాను.











🙏 JAI SRI RAM 🙏
THANK YOU
PC: CH.VAMSI MOHAN
Jai Sri Ram
రిప్లయితొలగించండి