తల్లి కడుపు నుంచి ఈ భూమి మీద పడిన మరుక్షణం నుంచే ఏడుపు మొదలవుతుంది బిడ్డకి. ఈ లోకాన్ని చూడాలని పరితపించే పసిపాప ఏడుపులో ఎంత బాధ ఉంటుందో తెలియదు కానీ, ఓ బిడ్డకు జన్మనిస్తున్న తల్లి మాత్రం చావు అంచుల వరకూ వెళ్లి మళ్లీ పుడుతుంది. అంత నరకాన్ని కూడా ఆనందంగా అనుభవించి ఒక నిండు ప్రాణానికి ఊపిరి పోస్తుంది తల్లి. మరి అంత కష్టపడి బిడ్డను కన్న ఆ తల్లి ఉన్నఫళంగా కన్నపేగుని వదులుకోవాల్సి వస్తే..? ఇక తన బిడ్డను ఎప్పటికీ చూడకూడదని వదిలేసే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే..? ఆ తల్లి వేదన ఎంత నరకంగా ఉంటుందో తెలుసుకోగలమా?.. కన్నవాళ్లు ఎవరో కూడా తెలియకుండా పెరిగిన ఆ పురిటి బిడ్డ రోదన ఊహించగలమా?.. ఆ ఏడుపులో తల్లి పాల కోసం పడే ఆరాటాన్ని తీర్చగలమా? చిట్టి చిట్టి చేతులు చాచుతూ కన్నతల్లి స్పర్శ కోసం ఎదురుచూసే ఆ పసిపాప జీవితాన్ని దగ్గరి నుంచి చూద్దాం.. ఆ పసిపాపను పొత్తిళ్లలో పొదువుకుందాం.. ఆ పసిపాపను ఎత్తుకుని ఆడిద్దాం.. వీలైతే ఆ పసిపాప కథ విని మనమూ ఏడుద్దాం...'అమృత'.. తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్ల మధ్య గారాబంగా పెరుగుతున్న ఒక ఆడపిల్ల. తను చేసే అల్లరి పనులకు ఎంత విసుక్కున్నా.. అమ్మకు తనంటే ఆరోప్రాణం. నాన్నకు అయితే తనే లోకం. తాతయ్య దగ్గర ముద్దుల మనవరాలిగా గారాబం పోయినా, టీచర్ల చేత చీవాట్లు తిన్నా, చుట్టుపక్కల అందరూ అమ్మో రాక్షసి పిల్ల అనుకున్నా అమృత ఎప్పుడూ స్పెషలే.. అది ఎంత అపురూపం అంటే 'ఏ దేవి వరము నీవు..' అని మురిసిపోతూ పాడుకునేంత.. ఆ పసిపాపను చూస్తూ లోకాన్ని మర్చిపోయేంత. తన ప్రపంచం ఇంత అందంగా ఉందని, తనకు ఏ లోటు లేదని, తనని ప్రేమించే మనుషులు చుట్టూనే ఉన్నారని, అమ్మానాన్నకి తనంటే ఎంతో ప్రేమ అని అప్పుడప్పుడే ఎదుగుతూ లోకాన్ని తెలుసుకుంటున్న ఒక పసిపిల్ల.. తనతో ఉన్నవాళ్లు సొంత అమ్మానాన్న కాదు అని తెలుసుకుంటే..? ఆ చిన్ని గుండె ఎంత బాధ పడి ఉంటుంది.. కల్లాకపటం తెలియని ఆ కళ్లు ఎంత ఏడ్చి ఉంటాయి?
తొమ్మిదో పుట్టినరోజు.. ఇంకా లోకం పోకడ కూడా సరిగా తెలుసుకోలేని వయసు.. పుట్టినరోజున గుడికి వెళ్లిన అమృత అమ్మ ప్రేమ, నాన్న అనురాగాల మధ్య మళ్లీ కొత్తగా పుట్టినంత ఆనందంగా గంతులేస్తుంది. సముద్రం ఒడ్డున నాన్న ఇసుకలో కూర్చుని ఉంటే, తన చుట్టూ తిరుగుతూ ఎప్పటిలాగే లొడలొడా కబుర్లు చెప్పేస్తుంటుంది. పాపం.. ఆ పసిగుండెకి అప్పటికి తెలియదు కదా.. తను భరించలేని ఓ చేదు నిజం వినబోతున్నానని. ఇసుకలో పరిగెడుతూ ఆయాసపడుతున్న అమృత మాటలకు అడ్డు పడుతూ 'నువ్వు మా కూతురివి కావు' అని అసలు విషయం బయటపెడతాడు ఆ నాన్న. ఆ మాటలను అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని ఆ పసిపాప ముఖంలో ఆనందం మాసిపోయి ఆయాసం మాత్రమే మిగులుతుంది.. పరుగు కాస్తా నెమ్మదిస్తుంది.. నాన్న ఏం చెప్తున్నాడు?.. అసలెందుకు చెప్తున్నాడు? ఏమీ అర్థం కాదు అమృతకి. 'నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాం' అని అంటున్న నాన్నని చూస్తున్న ఆ కళ్లల్లో సన్నటి తడి చేరుతుంది. బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూస్తూ నిజం చెప్పేస్తున్న నాన్నని.. ఏడుస్తున్న ఆ పసిదాని కళ్లు ఆ రోజు కొత్తగా చూడడం మొదలుపెడతాయి.
ఊయల బల్ల ఊగుతూ అమ్మ ఒడిలో కూర్చుని గోరుముద్దలు తింటున్న అమృత.. 'నేను నీలాగే ఉన్నానని ఎందుకమ్మా అబద్దం చెప్పావు?' అని అడిగే ప్రశ్నలకు ఆ తల్లి సమాధానం ఇవ్వగలదా? నువ్వు నాలాగే ఉన్నావు కదే అని తల్లి నచ్చజెప్తున్నా.. పెంచుకున్న ప్రేమలే కానీ పంచుకున్న రక్తం తనది కాదు కదా..! చెత్తకుప్పలో దొరికానా అమ్మా.. నా అసలు అమ్మానాన్న ఎవరు? నన్ను మళ్లీ పంపేస్తారా? అని ఆ పసి మనసును కోసేస్తున్న ప్రశ్నలకు మన దగ్గర కూడా తనని సముదాయించే సమాధానాలు ఖచ్చితంగా ఉండవు. ఈ విషయం ఇప్పుడే నీకు చెప్పడం మంచిదని అనుకున్నాం.. అబద్దంతో పెంచడం మాకు ఇష్టం లేదని బిడ్డకు సమాధానం ఇస్తున్న ఆ తల్లితో.. ఎందుకమ్మా చెప్పావు? తర్వాత చెప్పి ఉండాల్సింది కదా అంటున్న ఆ పసిదాని ఆశలు వింటే కంటతడి పెట్టకుండా ఉండగలవా? నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన గుండెతో తను దిగమింగుతున్నది అమ్మ తినిపించే గోరుముద్దలా?.. లేక ఆ చేదు నిజాలా?
చెప్పా పెట్టకుండా నువ్వు ఇల్లు విడిచి వెళ్లిపోతే అమ్మానాన్న నీ కోసం ఎంత కంగారుపడ్డారో తెలుసా అమృతా.. ఎంత వెతికారో తెలుసా..! అమ్మయితే నీ కోసం ఎంత ఏడ్చిందో తెలుసా? "ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.. సిరుల దీపం నీవే.. కరువు రూపం నీవే.. సరస కావ్యం నీవే.. తగని వాక్యం నీవే.." అమ్మానాన్నకి నువ్వు అంటే ఎంత ప్రేమ చూడు. చివరికి ఎక్కడో ఉన్నావని నిన్ను వెతుక్కుంటూ రాగానే పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నని గట్టిగా హత్తుకున్నావు.. నువ్వు దొరికేసావ్ మొత్తానికి అని కుదుటపడి వెనకే ఉండి చూస్తున్న అమ్మకు మాత్రం ప్రేమతో పాటు కోపం కూడా వచ్చేసింది. నీతో మాట్లాడకుండా బెట్టు కూడా చేసింది ఆ పిచ్చితల్లి. ఉండదు మరీ.. ఎందుకు రాదు మరి కోపం.. నువ్వు చేసిన పని అలాంటిది.. వాళ్ల ప్రేమకు నువ్వు పెట్టిన పరీక్ష అలాంటిది.. ఎవరి గురించైనా ఆలోచించావా అసలు అలా వెళ్లిపోవాలి అనిపించినప్పుడు.. Selfish...
అందరూ ఇష్టానికే కంటారు.. కానీ, కొందరు ఇష్టం లేకుండా పుడతారేమో..! నా అనేవాళ్లు ఎవరో తెలియకుండా ఇంత పెద్ద లోకంలో ఒంటరి బతుకును నెట్టుకు రావాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి.. సమాజంలో ఒకరిగా నిలబడి తనకంటూ ఒక అడ్రెస్ లేని జీవితాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు నడిపించాలంటే ఆ మనసుకి ఎంత నిబ్బరం కావాలి.. అమ్మ కడుపును చీల్చుకుని పుట్టేటప్పుడు అనుకుంటామా.. నాదైన జీవితం ఇలాగే ఉండాలని. ఈ లోకంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఆలోచిస్తామా.. నేనంటూ బతికితే ఇలాగే బతకాలని.. ఏదీ మన చేతుల్లో ఉండదు.. ఏ బంధం మనకు శాశ్వతంగా ఉండిపోదు. అమ్మ పేగు అనే ఆధారంతో బయటికి రావాలని మాత్రమే భగవంతుడు నిర్ణయిస్తాడు.. కానీ, ఆ పేగు బంధమే ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఒక మనిషి ఉంటే, అది ఎంత నరకమో.. ఆలోచించండి..!
పాత పేపర్లు అమ్మి నన్ను కొన్నారా?.. డబ్బులిచ్చి కొన్నారా?.. నా అసలు అమ్మ ఎక్కడుంది?.. ఎందుకు నన్ను ఇచ్చేసి వెళ్లింది?.. పేరేంటి?.. ఎలా ఉంటుంది?.. ఎందుకు నన్ను దత్తత తీసుకున్నారు?.. అని వరుసగా అడుగుతున్న అమృత ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా?.. తనకు సమాధానం చెప్పలేక ఏడుస్తున్న ఆ పసిపాప కన్నీటిని తుడిచే ధైర్యముందా? నీకు వెలకట్టగలమా అమృతా..? నువ్వు మా బంగారు పాపవి.. ఆ దేవుడు ఇచ్చిన వరానివి.
శ్రీలంక అంతర్యుద్ధం.. జన్మభూమిని, జన్మనిచ్చిన వాళ్లని వదులుకుని.. పడవలెక్కి వలస వచ్చిన దేశంలో ఆదరణ లేక నిర్దాక్షిణ్యంగా నడి సముద్రంలోకి నెట్టివేయబడినవాళ్లు ఎంతో మంది. శరణార్ధుల శిబిరాలలో తలదాచుకున్న అమాయకపు జనం మరెంతో మంది.. వాళ్లల్లో ఒక స్త్రీ.. ఆమె గర్భంలో ఈ ప్రపంచపు వెలుగుని చూడాలని తొందరపడుతున్న ఓ పసిపాప. అమ్మ అని పిలుపించుకున్నాకే ఏ ఆడ పుట్టుకకు అయినా ఒక పరిపూర్ణత లభిస్తుంది. కానీ, ఆ తల్లికి ఆ అదృష్టం ఎంతోసేపు నిలవలేదు. జన్మనిచ్చిన మరుక్షణం.. కిటికీ నుంచి కన్నబిడ్డను మరోసారి తనివితీరా చూసుకుంది.. ఇదే ఆఖరి చూపా? పొత్తిళ్లలోని పాప పసి చేతివేళ్లను తన చేతితో తాకి అక్కడి నుంచి ఆ తల్లి ముందుకు కదిలింది.. ఉన్నఫళంగా ఆ బంధాన్ని తెగతెంచుకుని వెళ్లిపోయే స్థితికి ఆ తల్లి తెగించడానికి కారణమేంటి? జన్మభూమి మీద తనకున్న మమకారమా? కర్తవ్యమా? కట్టుకున్నవాడా?.. యుద్ధమా? ఇదంతా ఏమీ తెలియక కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ తల్లి పాల కోసం తల్లడిల్లుతున్న ఆ బిడ్డను కాదనుకుని విడిచి వెళ్లిపోతున్న ఆ మాతృత్వపు కాఠిన్యం ఎలా చూసినా సరైనది కాదు. ఇదేమీ అర్థం కాని ఆ పసికందు తొలి రోదన 'అమృత'గీతంలా వినిపించింది. అలా తల్లి ప్రేమకు దూరమైన పసిపాపే మన 'అమృత'.
పుట్టగానే ఏదో ఓ కారణంతో తల్లిదండ్రులకు దూరమయ్యే బిడ్డలు ఎంతో మంది.. చెత్తకుప్పల్లో ప్రాణం లేకుండా దొరికేవారు కొందరైతే, అనాథ శరణాలయాల్లో, ఎవరైనా దయ తలిచి పెంచుకుంటే వారి ప్రేమానుబంధాల్లో మరికొందరు. ఎక్కడ ఉన్నా.. ఎలా పెరిగినా ఆ బిడ్డలందరి ఏడుపుకు కారణం ఒకటే.. సొంతవాళ్లకు దూరమయ్యామని. ఎన్నో శరణాలయాల్లో అనాథలుగా ఊయల్లో పడుకోబెట్టిన పసిపాపల ఏడుపుకు కారణం తెలుసుకుని అమ్మని తెచ్చివ్వగలమా? ఎదుగుతున్న వయసులో నా అనేవారు తనకు ఎవరూ లేరని తెలుసుకుని ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకునే ఆ కల్లాకపటం లేని మనసులకు సాంత్వన మనం అందివ్వగలమా? ఇంత పెద్ద ప్రపంచంలో చుట్టూ ఎంతో మంది మనుషులు ఉన్నప్పటికీ.. నా అనే ఆ ఒక్క బంధం ఎక్కడుందో వెతుక్కునే ఆ కళ్లకి మనం నచ్చజెప్పగలమా? కన్నవాళ్లను ఒక్కసారైనా చూడాలని తహతహలాడే ఆ అమాయక హృదయాల సవ్వడి వెనక ఘోషని మనం వినగలమా?
కావాలి.. అమ్మ కావాలి.. నన్ను కన్నతల్లిని చూడాలని అనుకునే వారి ఆరాటం ఎంత బలమైనదో మనం ఊహించలేం కూడా. అమృతకు ఆ రోజు రానే వచ్చింది. కన్నతల్లి తనను చూడటానికి వచ్చింది.. తన కోసం వచ్చింది.. అన్ని బంధాలను తెంచుకుని, కన్నప్రేమను కూడా దూరం చేసుకుని.. దేశం కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఆ తల్లికి తన మాతృత్వపు ప్రేమను గుర్తు చేయడానికి అమృత వచ్చింది. ఒకప్పటి పొత్తిళ్లలోని పసిపాప.. ఇప్పుడు ఎదిగిన కూతురిలా ఆ తల్లిని ప్రశ్నిస్తున్న చూపులతో తన ముందు నిలబడింది.
కన్నతల్లి ఎదురుగా తన కోసం వస్తుంటే గుండెల్లో దడగా ఉందని అమృత అంటుంది.. ఎందుకు? చూడబోయేది తన అమ్మనే కదా..! కలుసుకోబోయేది తన కన్నపేగునే కదా. ప్రేమంటే ఇదేనా? కన్నార్పకుండా తల్లినే చూస్తున్న అమృత కళ్లు.. ఎన్ని ఆశలు నింపుకున్నాయో.. ఎన్ని ప్రశ్నలు తనను సతమతం చేస్తున్నాయో..! చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫోటోలు, రాసిన కవితలు చూపిద్దామని తల్లి చేతిలో ఆల్బమ్ పెట్టి ఒక్కోటీ చెబుతున్న ఆ చిన్నదాని మాటల వెనక తల్లికి ఇంకేదో చెప్పాలనే ఆరాటం ఉండకపోతుందా? ఆ జ్ఞాపకాల ఆల్బమ్‌ని అలాగే చేతిలో ఉంచేసుకున్నప్పుడు.. 'తెరిచి చూడరా' అని మళ్లీ గుర్తు చేస్తున్న ఆ బిడ్డ మాట తల్లిని నిలదీసినట్లుగా తోస్తుంది. 'నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్లారు?' అని సూటిగా ప్రశ్నిస్తున్న బిడ్డ ముఖం కూడా చూసే ధైర్యం ఇప్పుడు ఆ తల్లికి ఉండదు. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. రాసుకొచ్చిన తెల్లటి కాగితాన్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుని తల్లినే తదేకంగా చూస్తూ సమాధానం కోసం వేచి చూస్తుంది అమృత. 'పుట్టినప్పుడు నన్ను ఎత్తుకున్నారా?' అని తల్లినే అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఏ బిడ్డకీ రాకూడదు. 'నిన్ను కన్న తక్షణమే నేను వెళ్లిపోయాను.. ఒకే ఒక్కసారి ఒక్క వేలితో నిన్ను తాకాను' అని చెప్పుకోవాల్సిన దుస్థితి కూడా ఏ తల్లికీ రాకూడదు. ఆ సమాధానం విన్న ఆ పసిపిల్ల ఉబికివస్తున్న కన్నీటిని, గుండెలో మొదలైన అలజడిని ఎవరు మాత్రం ఆపగలరు? 'ఇప్పుడు ఎత్తుకోవచ్చుగా మరి..?' అని కొండంత ఆశతో బిడ్డ ఎదురుగా నిలబడి ఉంటే, ఆ తల్లిని ఇంకేదో కారణం అడ్డుకుంటుంటే, ఆ పసిదాని కళ్లల్లో నుంచి ధారలుగా వస్తున్న ఆ కన్నీరు చాలదా.. చూసే ఆ చూపులు చెప్పట్లేదా అమ్మ అంటే అమృతకి ఎంత ప్రేమో..!
కన్నపేగు ప్రేమ ఎంత విలువైనదో ఆ దేవుడికేం తెలుసు.. ఒక్క అమ్మకి తప్ప. ఎంత పట్టుదలనైనా, ఎంత పంతాన్ని అయినా ఆ కన్నప్రేమ ఇట్టే దూరం చేస్తుంది. గుండెల్లోంచి ఉప్పొంగుతున్న ప్రేమ కళ్లల్లో నుంచి నీళ్లలాగా తన్నుకు వస్తుంటే ఇక ఉండబట్టలేక బిడ్డను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది ఆ తల్లి. మర్చిపోయిన మాతృత్వపు మధురిమను మరోసారి తడిమి చూస్తుంది. మల్లెచెట్టును పెనవేసుకున్న తీగలాగా ఆ బిడ్డ తల్లిని మరింత హత్తుకుంటుంటే.. మబ్బులు కూడా కరిగి వర్షం రూపంలో ఏడ్చేస్తాయి. తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చిందని లేచి వెళ్లిపోబోతుంటే.. గట్టిగా అమ్మనే హత్తుకుని బిడ్డ వెళ్లొద్దని ఆపడం ఏ తల్లికి అయినా కఠిన పరీక్షే. కానీ, వెళ్లక తప్పదు. అందుకే కష్టమైనా వెళ్లబోతున్న రాయి లాంటి ఆ తల్లి గుండెని.. 'అమ్మా' అనే ఒక్క పిలుపు కరిగిస్తుంది. ఒకే ఒక్కసారి నా దగ్గరికి వచ్చి వెళ్లండని చేతులు చాచి అర్థిస్తున్న ఆ పసి మనసును దగ్గర తీసుకుని తల్లి ముద్దాడుతుంది. ప్రేమలోని స్వచ్ఛతను, అమ్మతనంలోని ఆప్యాయతను, అనుబంధాల విలువను ఇలా చూస్తున్న నా హృదయం కరగకుండా ఉంటుందా? నా కళ్లల్లో తడి ఇప్పట్లో ఆరుతుందా?
ఇది సినిమా కాదు.. 'అమృత' అనే అద్భుతాన్ని పొత్తిళ్లలో నుంచి తీసి మణిరత్నం గారు మన చేతుల్లోకి అందించిన పసిపాప రూపం. ఆ పాప ఏడుస్తుంటే, నవ్వుతుంటే, ఉంగా ఉంగా అంటూ కబుర్లు చెప్తుంటే మనం విన్న తన కథ. తన కథని వింటూ ఆ పాపకు మనం పాడిన జోల. ఆ పాప బుగ్గలపై మనం ప్రేమగా కురిపించిన ముద్దుల తాలూకు జ్ఞాపకం.
THANK YOU
PC: CH.VAMSI MOHAN
కామెంట్లు
అబ్బా ఎంత బాగా చెప్పారండి, వెంటనే మళ్ళీ ఈ సినిమా చూడలినిపించేతగా
రిప్లయితొలగించండి
తొలగించండిధన్యవాదాలు