హలో.. మిమ్మల్నే..!

హలో.. మిమ్మల్నే.. ఎలా ఉన్నారు..? మనిషితో మనిషి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని చాలా ఏళ్లు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్‌లలో, ల్యాప్‌టాప్‌లలో కాలం గడిపే వ్యసన జీవులం అయిపోయాం మనం. పైగా ఎంతగా బిజీ అయిపోయాం అంటే.. పనులన్నీ పక్కన పెట్టేసి ఫోన్ మొహాన్ని చూస్తూ రోజంతా ఉండమన్నా ఉండిపోయే స్థితికి చేరుకున్నాం. అందుకే చాలా బిజీగా ఉండే మీరు.. ఈ మధ్య మాట్లాడదామంటే దొరకట్లేదని, ఇలాగైనా నాకు అవకాశం ఉంటుందేమోనని ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు వచ్చానన్నమాట.హలో.. మిమ్మల్నే..!ఫోన్ వాడకం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో అది లేకుండా ఉండలేమని చాలా మంది చెప్పే మాట. అవును.. నిజమే.. కానీ, అవసరానికి మించి తీసుకుంటే ఏదైనా మన వినాశనానికే దారి చూపిస్తుంది. అలా అని ఫోన్ వాడొద్దు అనట్లేదు.. ఫోన్ వల్ల మనకు చాలానే ఉపయోగాలు ఉంటాయి. దూరంగా ఉన్న బంధువులతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవచ్చు.. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉన్నారు, మనకు దగ్గరగానే ఉన్నారని ఫీల్ అవ్వొచ్చు.. బంధాలను మరింత పెంచుకోవచ్చు.. మంచిదే. కానీ, అదే సమయంలో అది ఒక వ్యసనంలా కూడా మారిపోయి ఉన్న సమయం వృథా చేస్తున్నామనే విషయం మనం తప్పక గుర్తుంచుకోవాలి.హలో.. మిమ్మల్నే..!సోషల్ మీడియా.. ఇది మనకు ప్రపంచాన్ని చాలా దగ్గర చేసింది. ఏది కావాలన్నా క్షణాల్లో తెలిసిపోతుంది. నీ అరచేతిలోనే మొత్తం బ్రహ్మాండం కనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగి మనిషి ఎదుగుతుండడం, ఎప్పటికప్పుడు డెవలప్ అవ్వడం మంచిదే. కానీ, ఎంత మంది సోషల్ మీడియాని ఈ రోజు అవసరమైన పద్దతిలో వాడుతున్నారు? సోషల్ మీడియా ద్వారా మన టాలెంట్‌ని బయటపెట్టొచ్చు. మనలో ఉన్న ప్రతిభని పది మందికి తెలిసేలా చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మంచి విషయాల కంటే చెడు వైపే ఎక్కువ వెళ్తున్నారు. అందులో మునిగిపోయి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక రీల్స్, టిక్ టాక్ అని చేసే వికృత చేష్టల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.హలో.. మిమ్మల్నే..!ఇక మన ఇళ్లల్లో చిన్నపిల్లల గురించి కాసేపు మాట్లాడుకుందామా? ఎంత మంది ఇంట్లో పిల్లలు ఫోన్ లేకుండా ఈ రోజు అన్నం తింటున్నారు? నాకు తెలిసి ఎవరూ ఉండరు. అన్నం తినమంటే ఫోన్ కావాల్సిందే అని మారాం చేస్తారు. అది వాళ్లకు అలవాటు అవ్వలేదు.. అలా మనం అలవాటు చేశాం. సరేలే ఇలా అయినా నాలుగు ముద్దలు తింటారని వాళ్ల ముందు ఫోన్ ఆన్ చేసి, యూట్యూబ్ వీడియోలు పెట్టేసి వదిలేస్తున్నాం. తినే దాని కన్నా ఫోన్‌లో కదులుతున్న బొమ్మల మీదే వాళ్ల దృష్టి అంతా. ఇక తిన్నది ఎక్కడ ఒంటికి పడుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే.. ఫోన్ తీసేసుకుని ఈజీగా వాళ్లకు కావాల్సింది పెట్టుకుని చూసేస్తున్నారు. మరి నాకేమో డిగ్రీ చదివే వరకు ఫోన్ లాక్ ఓపెన్ చేయడం కూడా తెలియదే. ఒకప్పుడు అమ్మ అన్నం తినిపిస్తూ 'చందమామ రావే..' అని బుజ్జగిస్తూ తినిపించడం మనం చూశాం. ఎలాగో ఆ చందమామ రాదు అని తెలుసుకున్నారేమో ఈ రోజుల్లో మమ్మీలు. నెట్ ఉన్న ఒక ఫోన్ వాళ్ల చేతికి ఇచ్చేసి వాళ్ల పనిలో వాళ్లు పడిపోతున్నారు. చిన్నపిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్లు ఆ వయసులో ఏదైనా నేర్చుకుంటే ఇట్టే పట్టేస్తారు. అందుకే ఆ వయసులో పిల్లలకు పనికొచ్చే విషయాలే నేర్పించాలి.. అది వదిలేసి లేనిపోని చెత్త అంతా ఆ బుర్రలో నింపేసి భవిష్యత్తు తరాన్ని మనమే పాడు చేస్తున్నాం.. కాదంటారా..?హలో.. మిమ్మల్నే..!యూత్ గురించి మరి ప్రత్యేకంగా చెప్పాలా? చెప్తే అర్థం చేసుకునే వయసా వాళ్లది..? అర్ధరాత్రుళ్ల వరకు గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుకోవడాలు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అపరిచితులతో పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు, ఆకర్షణలు, అవి బెడిసికొడితే ప్రాణాలు తీసుకోవడాలు.. ఇదంతా యంగ్ ఏజ్‌లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అనుభవాలే. ఆ వయసులో తాము చేసేదే కరెక్ట్ అనే మెంటాలిటీతో ఉంటారు. వాళ్లని ఎవరు ఆపుతారులే అన్నట్లు చెలరేగిపోయి చెడు దారులు తొక్కుతారు. తర్వాత తాము చేసింది తప్పు అని రియలైజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు చదివే చదువు, కెరీర్ విషయాల్లో వెనకబడిపోతారు. ఇది ఇప్పటి యూత్ నడుసున్న దారి.హలో.. మిమ్మల్నే..!మొబైల్, సోషల్ మీడియా అనేవి మీ అందరితో పాటు నేనూ దాటి వచ్చినవాడినే. ఇలా చెప్తున్నా అంటే నేనేదో కరెక్ట్‌గా ఉండి అందరికీ నీతులు బోధిస్తున్నా అనుకోకండి. ఎవరికైనా అనుభవం ద్వారానే ఏదైనా అవగాహనలోకి వస్తుంది. ఇప్పటి యూత్ సోషల్ మీడియాని సరిగ్గా వాడుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఎంతో నేర్చుకోవచ్చు. అందుకు కావాల్సిన అవకాశాలు ఎన్నో మన కళ్ల ముందే ఉన్నాయి. కానీ, అది ఎలా మన జీవితంలో ఉపయోగించుకుంటున్నామనేదే పెద్ద సమస్య.హలో.. మిమ్మల్నే..!మార్పు అనేది మన దగ్గరి నుంచే మొదలుపెడదాం. ముఖ్యంగా పిల్లల చేతికి మొబైల్ ఇచ్చే అలవాటు ఇప్పటినుంచైనా మానుకుందాం. మనం ఒకప్పుడు తెలుసుకోలేకపోవచ్చు.. లేదా మనకు చెప్పేవారు లేకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఇంకొకరికి చెప్పగలం. మన భవిష్యత్తు తరాన్ని కాపాడగలం.. కాస్త ఆలోచించండి..!హలో.. మిమ్మల్నే..!


THANK YOU 

PC: CH.VAMSI MOHAN 


కామెంట్‌లు