'బాలు' గారి మీద ప్రేమతో..

'బాలు' మీద ప్రేమతో..

సంగీత సామ్రాజ్యం ఒంటరిదై అప్పుడే నాలుగేళ్లు కావస్తోంది. ఆ గొంతు సవరించక మూగబోయి ఏళ్లు గడుస్తున్నా వినాలనే ఆతృత నా చెవులకు, విని తరించాలనే ఆశ నా మనసు నుంచి పోవట్లేదు. సంగీతమే ప్రాణంగా, స్వరాలే సర్వస్వంగా జీవించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ గాత్రం ఇప్పుడు ఓ జ్ఞాపకంగా మిగిలింది. గొంతునే గుండెగా చేసుకుని పాటకి పట్టాభిషేకం చేసిన గాన గంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి జయంతి జూన్ 4న. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా తన ప్రతిభని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావులు ఎస్పీ బాలు గారి మీద నాకున్న ప్రేమతో ఇలా...

'బాలు' మీద ప్రేమతో..

బాల సుబ్రహ్మణ్యం గారు అంటే ఇష్టపడని మనిషే ఉండడేమో కదా..! ప్రపంచానికి తెలిసిన బాలు గారు సంగీత సామ్రాట్, గాన గంధర్వుడు అయి ఉండొచ్చు.. కానీ, ఆ గొంతును ఇష్టపడే ప్రతి అభిమానికి 'బాలు'నే. మన దగ్గరివాడిలా, మన బాలు అని ప్రేమగా పిలుచుకునే స్థాయికి ఆయన ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పాటలు, ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు.. మనకు అందించి మన ఇంటి మనిషిలా మనతో కలిసిపోయారు. బాలు గారి గొంతు వినకుండా ఒక్కరోజు కూడా మనకు గడవదు అంటే ఆశ్చర్యం లేదు. పాటకు ఆకారం ఉంటే అది మీలాగే ఉంటుందేమో బాలూ..!

'బాలు' మీద ప్రేమతో..

ఏమైపోయావు బాలూ...? మీ అభిమానులకు మర్చిపోలేని పాటల సముద్రాన్ని అందించి ఎందుకు ఉన్నట్లుండి దూరమయ్యావు...? మీ గొంతులో మాధుర్యం నచ్చి అది మనుషులకు మాత్రమేనా.. మాకు వద్దా అని ఆ దేవతలు కుళ్లుకున్నారేమో...! మిమ్మల్ని గంధర్వుడు అని మేం పిలుచుకున్నందుకు మీ స్థానం భూమిపై కాదు, స్వర్గంలో అని నిర్ణయించుకున్నావా...? పాడాల్సింది చాలా ఉంది.. చేయాల్సింది ఇంకా ఉందని ఎప్పుడూ చెప్పుకునే మీరు.. మరి ఉన్న పనులన్నీ సగంలోనే వదిలేసి వెళ్లిపోవడం న్యాయమా...? మీ సంగీత అభిమానులకు, మీ తర్వాతి తరం వాళ్లకి మార్గదర్శిగా ఉన్న మీరు దిక్కు లేని వాళ్లని చేసి వెళ్లిపోవడం సమంజసమా...? అయినా మమ్మల్ని తప్పించుకుని ఎటు పోతావులే. అందరూ ఎప్పుడో మిమ్మల్ని వాళ్ల గుండెల్లో బంధించేశారుగా.

'బాలు' మీద ప్రేమతో..

ఆ రోజు నవంబర్ 30, 2019లో 'LEGENDS' అనే కన్సర్ట్ కోసం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని స్టేజీపై చూశాను. కానీ, చాలా దూరం నుంచి. ఆ రోజు నాకింకా గుర్తుంది. మీరు స్టేజీపైకి రాగానే అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం చెప్పారు. అంతటి ప్రేమకు ఈ 'బాలు'డు ఎప్పుడూ దాసుడే అని మీరు పలికిన మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి. 50 ఏళ్ల పాటల అనుభవం మా ముందు నిలబడి గొంతు విప్పితే అది విని మైమరచిపోయి చప్పట్లు కొట్టడం తప్ప మీ కోసం మేం ఏం చేయగలం బాలూ..? మీ కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే.. 'సింగారాల పైరుల్లోన..', 'తాళికట్టు శుభవేళ..', 'అంజలి అంజలి..', 'తెలుసా మనసా..' లాంటి ఎన్నో పాటలను ఆ రోజు లైవ్‌గా విన్న ఈ మామూలు అభిమాని ఎంత పొంగిపోయాడో ఎలా చెప్పగలను. మీరు పాడుతున్న ఆ ప్లేస్‌లో నేనూ అక్కడే ఉన్నానని, మీ గొంతు విన్నానని, మిమ్మల్ని ప్రత్యక్షంగా ఒక్కసారైనా చూశాననే ఆనందం చాలు నా ఈ చిన్న జీవితానికి.

'బాలు' మీద ప్రేమతో..

అప్పుడే మీరు మమ్మల్ని విడిచి వెళ్లి మూడేళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది తలుచుకుంటే. ఇంకా మాతోనే ఉన్నారని అనిపిస్తుంది. ఎక్కడో ఏదో ప్రోగ్రాంలో, ఏదో సినిమాలో ఇంకా పాట పాడుతున్నట్లే ఉంది. మీరు ఇక ఈ లోకంలో లేరు అని తెలుసుకున్న ఆ రోజు మీ గొంతే మూగబోయింది అనుకున్నా.. కానీ, గుండెలో బాధతో తన్నుకువచ్చిన ఏడుపుతో నా గొంతు కూడా మూగబోయింది. ఒంటరిగా ఏడుస్తున్న నాకు అప్పుడే అనిపించింది.. అసలు మీకు, నాకు ఏం సంబంధం ఉందని ఈ కన్నీళ్లు ఇలా వస్తున్నాయని? నాకు ఊహ తెలిశాక మీ పాట విన్న ప్రతిసారి అబ్బా ఎంత బాగుందో అనిపించేది.. కానీ, ఇప్పుడు అదే పాట వింటుంటే ఎందుకు ఇంత బాధగా ఉంది.

'బాలు' మీద ప్రేమతో..

మీరు ఎక్కడికీ పోలేదు బాలూ.. మీ పాటల ద్వారా, మీరు పోషించిన పాత్రల ద్వారా, మీ సంగీతం ద్వారా, మీరు చెప్పిన మంచి మాటల ద్వారా ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు కూడా. పాట ఉన్నంతవరకు బాలు మనతోనే ఉంటాడు. ఈ సందర్భంలో మీరు పాడిన పాటే ఒకటి నాకు గుర్తొస్తుంది.. మిమ్మల్ని ఇలా అడగాలని ఉంది.

పాడవా తీయగా కమ్మని ఒక పాట

పాటగా బతకవా మా అందరి నోట

ఆరాధనే అమృత వర్షం అనుకున్నా

ఆవేదనే హాలాహలమై పడుతున్నా

నీ గానమాగదులే..

ఇక నీ గానమాగదులే...

'బాలు' మీద ప్రేమతో..

స్మరణం తప్ప మరణం లేదు బాలు మీకు.....!


THANK YOU

PC & SUPPORT BY: CH. VAMSHI MOHAN


https://therakeshblogs.blogspot.com/2023/06/blog-post.html

కామెంట్‌లు

  1. Adbutam ga varnicharandi Eppatiki Balu Garu mana gundelo patallo chirastayiga undipotaru....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంత బాగా రాశారు అన్నా మీరు వ్రాసినది చదువుతూ ఉంటే అసలు మా అన్నయ్య రాసింది అనిపిస్తుంది..

      తొలగించండి
  2. చంద్రబాబు .. నితీశ్ .. ఇద్దరూ ఇద్దరే .. వీళ్ళతో మోడీకి కష్టమే

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి