నా చిత్రమ్మకి..

1985.. చెన్నై.. మ్యాస్ట్రో ఇళయరాజా గారి రికార్డింగ్ స్టూడియో.. పాట రికార్డింగ్ కోసం అంతా రెడీ.. అది పాడటానికి ఒక ఫిమేల్ సింగర్ రావాలి.. అప్పుడప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన ఒక సింగర్ స్టూడియోకి వచ్చారు. వచ్చీ రాగానే ఇళయరాజా గారి దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. "సార్.. నేను ఒక సెమిస్టర్ పరీక్ష(MA-music)కి అటెండ్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్.. వెళ్లాలి. అందుకని ఈ పాట ఇప్పుడు నేను పాడలేను" అని. దానికి ఇళయరాజా గారు ఒక్కటే అన్నారు "ఇప్పుడు ఇదే నీ అసలైన పరీక్ష. ఈ పరీక్ష(పాట) పాస్ అయితే చాలు. ఇక ఏ పరీక్ష అయినా నువ్వు పాస్ అయినట్లే" అని. మొత్తానికి ఆ సింగర్ తండ్రి కూడా కన్విన్స్ చేయడంతో ఆ రోజు ఆ పాట పాడాల్సి వచ్చింది తను. ఆ రోజు తీసుకున్న ఆ చిన్న నిర్ణయమే ఆ సింగర్ కెరీర్‌కి ఒక పెద్ద దారి చూపించింది. ఆ పాట ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే పాటకి మొదటి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఆ సింగర్. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ ఎన్నో మంచి పాటలు పాడుతూ ఎంతో మంది సంగీత ప్రియుల గుండెల్లో గాన సరస్వతిగా కొలువై ఉన్నారు. ఆ పాటే 'సింధుభైరవి' సినిమాలోని 'పాడరియేన్..(తెలుగులో పాడలేను పల్లవైనా..). ఆ సింగర్ మరెవరో కాదు.. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.కె.ఎస్.చిత్ర గారు.

నా చిత్రమ్మకి..చిన్నప్పటి నుంచి సంగీతమన్నా, పాటలన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ప్రాణం. అలా ఎన్నో పాటలు వింటూ వెళ్తున్న నన్ను ఒక గొంతు ఆపేసింది. ఆ గొంతునే మళ్లీ మళ్లీ వినాలనేంతగా కట్టిపడేసింది. నా చెవులను బంధించేసింది. ఇక ఇంతకన్నా గొప్పగా ఎవరూ పాడలేరు అనుకునేలా చేసింది. అదే మీ అమృత స్వరం చిత్ర గారు. ప్రేమగా నేను మిమ్మల్ని చిత్రమ్మ అని పిలుచుకుంటా. అలా పిలిస్తే మీకు కూడా ఎంతో ఇష్టం కదా..! అమ్మా అని పిలిస్తే మీ మొహంపై ఎప్పటిలాగే చిరునవ్వు వస్తుందని నాకూ తెలుసులే.  
నా చిత్రమ్మకి..
ఎలా చిత్రమ్మా.. ఒక పాటని అంతలా ప్రాణం పెట్టి పాడుతావు. ఎన్నోసార్లు పాడిన పాటే అయినా మళ్లీ పాడాలంటే అంత క్రమశిక్షణతో నేర్చుకుని మరీ పాడి మమ్మల్ని మెస్మరైజ్ చేస్తావు. ఎప్పుడు పాడినా, ఎన్నిసార్లు పాడినా ఆ పాటకి ఉన్న అందం ఏ మాత్రం తగ్గకుండా వినిపిస్తావు. మీ గొంతులాగే మీ పాటకి కూడా వయసు అవ్వదేమో ఎప్పటికీ. నాకైతే ఎప్పుడూ ఒక డౌట్. మీరు స్టేజ్ మీద ఏదైనా పాడినప్పుడు.. అది టీవీలో విన్నా, లైవ్‌గా విన్నా నిజంగా మీరే అక్కడ పాడుతున్నారా లేక బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్నారా అని. ఎందుకంటే, సినిమాలో విన్నప్పుడు ఎలా అయితే అనిపించిందో.. అదే పాటని ఇన్నేళ్ల తర్వాత మీరు పాడుతున్నా అదే ఫీల్ ఉంటుంది. ఇది చెప్పడానికి కొంచెం అతిశయోక్తిగా ఉన్నా, నా లాంటి చాలా మంది చిత్రమ్మ అభిమానులు అందరూ అనుకునేదే.. ఏమంటారు?

నా చిత్రమ్మకి..
మిమ్మల్ని కలవాలి చిత్రమ్మ.. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు ఊహ తెలిసి, మీ గొంతు విని, మీకు ఫ్యాన్ అయిపోయిన ఆ రోజు నుంచి రోజూ అనుకుంటూనే ఉన్నా. అప్పటికీ మీరు చేసిన కన్సర్ట్స్‌కి చాలా సార్లే వచ్చాను. నాకు దూరంగా మిమ్మల్ని, నా చెవులకు దగ్గరగా మీ గొంతుని విని ఆనందపడ్డా. ఎన్నో దేశాల్లో మీరు షోస్ చేసి, ఎంతో మంది ముందు ఎన్నోసార్లు పాడి ఉన్న మీరు, మళ్లీ స్టేజ్ మీదికి రాగానే కొత్తగా టెన్షన్ పడిపోతారు ఏంటమ్మా..? అప్పుడు మీలో కనిపించే ఆ అమాయకత్వం, గొంతులో అంత అమృతం దాచుకున్నా ఏమీ తెలియదన్నట్లు కనిపించే మీ స్వభావం, ఎప్పుడూ మొహంపై కనిపించే మీ చిరునవ్వుని చూసి నేను కూడా పొంగిపోయి నవ్వుకున్నాలే..!

నా చిత్రమ్మకి..
పుట్టింది కేరళలో అయినా, మాతృభాష మలయాళం అయినా.. మా తెలుగుని ఎంత చక్కగా పలుకుతావు తల్లీ. ఒక్కో పదాన్ని తెలుసుకుని, దాని అర్థాన్ని అర్థం చేసుకుని, ఇన్నేళ్ల నుంచి ఇన్ని రకాల పాటలు పాడాలంటే దానికి ఎంతో కృషి, పట్టుదల కావాలి. ఇన్ని పాటలు పాడి, ఇంత పేరు తెచ్చుకున్నా ఎప్పటికీ ఒదిగి ఉండే మీ మనస్తత్వమే మిమ్మల్ని అంత ఎత్తులో కూర్చోబెట్టింది. పెద్దలంటే గౌరవం, అంత ఎత్తుకు ఎదిగినా మీలో ఎప్పుడూ కనిపించని అహంకారం.. మీ పాటల కన్నా ముందుగా మీలో ఉన్న ఆ స్వభావమే నన్ను కట్టిపడేసింది. మిమ్మల్ని అమ్మా అని పిలుచుకునేలా చేసింది. ఎలా సాధ్యం చిత్రమ్మా అలా ఉండడం.. మీలాంటి గొప్పవాళ్లు అందరూ ఇలాగే ఉంటారా..?

నా చిత్రమ్మకి..
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఒకసారి మీ ప్రోగ్రాం జరిగితే చూడటానికి వచ్చా.. మిమ్మల్ని మొదటిసారి నా ముందు స్టేజ్ మీద ప్రత్యక్షంగా చూశా. ఒక్కో పాటను మీరు పాడుతుంటే చెవుల నిండా విన్నా, కళ్లారా మిమ్మల్ని దూరం నుంచి చూశా. ఆ రోజు చాలా ట్రై చేశా మిమ్మల్ని కలుద్దామని. అక్కడ ఉన్న కొందరి హెల్ప్ కూడా అడిగా, అయినా కుదరలేదు. మీ చుట్టూ అభిమానులు, వాళ్ల నుంచి మీరు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి చుట్టూ బౌన్సర్లు.. ఆ రోజు కూడా నా కోరిక తీరలేదు. మొత్తానికి మీరు షో ముగించుకుని వెళ్తూ కారులో ఎక్కాక, కారు బయట నిలబడి మీకు తెలియకుండా సెల్ఫీ తీసుకున్నాలే. ఇప్పటికైతే అదే నాకు జీవితంలో ఒక మెమరబుల్ ఫోటో.

నా చిత్రమ్మకి..
ఆ రోజు జరిగిన ఇంకో సంఘటన గురించి చెప్తా. మీరు పాడాల్సిన పాటలన్నీ అయిపోయాక, షో ముగించే సమయంలో చిన్న సన్మానం జరిగింది మీకు. స్టేజ్ మీద మీతో పాటు మిగతా చిన్న చిన్న సింగర్స్, ఆ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన పెద్దలు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న అందరూ మీ గురించి, మీ పాటల గురించి గొప్పగా పొగుడుతున్నారు. వాళ్లు అలా చెప్తుంటే, అది వేరే ఎవరి గురించో అన్నట్లు, ఆ గొప్పతనం మీది కాదు అన్నట్టు వాళ్ల మధ్యలో నిలబడి నవ్వుతున్న మీరు చేసిన పని ఎవరైనా చూశారో లేదో కానీ నేను గమనించాను. సైలెంట్‌గా నిలబడి అంతకు ముందు మీకు కప్పిన శాలువాని శుభ్రంగా మీరే మడత పెట్టేస్తున్నారు. అది చిన్న విషయమే కావచ్చు.. కానీ అక్కడ మీరే స్పెషల్ అట్రాక్షన్. అది మీకు జరిగిన సన్మానం. అలాంటిది మీరే అంత పద్దతిగా ఆ శాలువాని సర్దాల్సిన అవసరం లేదుగా. కప్పిన శాలువాని అలా కుర్చీలో పెట్టేసినా మిమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరు. కానీ మీరు అలా చేయలేదు. ఆడవాళ్లలో ఉండే సహజ గుణాన్ని, అమ్మతనాన్ని అప్పుడు మీలో నేను చూశాను. అందుకేనేమో మీరు అంటే మీ అభిమానులందరికీ అంత ఇష్టం.

నా చిత్రమ్మకి..
'గీతాంజలి'లో హీరోయిన్ వర్షంలో తడుస్తూ 'జల్లంత కవ్వింత' అని పాడుతుంది.. ఆ చిరుజల్లు మన ఒంటి మీద పడినప్పుడు కలిగే పులకరింత గొంతులో చూపించాలని ఇళయరాజా గారు మిమ్మల్ని అడిగారట. ఇది తెలుసుకున్నాక ఆ పాట వింటే, ఆ ఫీల్ తెప్పించడానికి మీ గొంతు ఎలా మార్చారో అర్థమైంది. 'కన్నానులే..' అంటూ 'బొంబాయి' సినిమా కోసం పాడిన పాట.. సింగింగ్ కాంపిటీషన్‌కి వెళ్లే ప్రతి అమ్మాయికి ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్. ఇక 'మాతృదేవోభవ'లోని 'వేణువై వచ్చాను..' గురించి మాట్లాడే అర్హత అయినా నాకు ఉందా అసలు? మీరు ఈ రోజుకీ ఏదైనా కాన్సర్ట్‌లో ఈ పాట పాడినప్పుడు చివర్లో మీకు ఆడియన్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ రావడం చాలాసార్లు చూశాను. 'నిన్ను కోరి వర్ణం..' అని పాడినా, 'తెలుసా మనసా..' హమ్ చేసినా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అద్భుతాలు. 'అంజలి అంజలి..' పాట మధ్యలో వచ్చే హమ్మింగ్ మీకన్నా గొప్పగా ఎవరైనా హమ్ చేస్తే తన సింగింగ్ కెరీర్ వదిలేస్తానని బాలు గారే ఒకసారి స్టేజ్ మీద ఛాలెంజ్ చేశారంటే ఇక చెప్పేదేముంది మీ పాట గురించి..!

నా చిత్రమ్మకి..
ముఖ్యంగా బాలు గారిలాంటి మహానుభావులు స్వరాభిషేకం లాంటి ప్రోగ్రాముల్లో మిమ్మల్ని ఆట పట్టించడం నేను చాలా సార్లు వీడియోల్లో చూశాను. ఎవరు ఎన్ని అన్నా, ఆట పట్టించినా హద్దులు దాటకుండా ఒక్క చిన్న చిరునవ్వుతో స్వీకరిస్తావు. మీరు ఎదిగారు, మీ పాట ఎదిగింది.. ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. నేషనల్, ఇంటెర్నేషనల్ లెవెల్లో మీకు పేరుంది.. కానీ, మీలో ఉన్న పసిపాప మనసు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పసిపాప గొంతెత్తి పాడితే అది విని మైమరచిపోయి నేనూ పసివాడిని అవుతూనే ఉన్నాను.. మీకు మళ్లీ మళ్లీ అభిమానిని అవుతూనే ఉన్నాను.. ఉంటాను.

నా చిత్రమ్మకి..
ఏ రోజుకైనా మిమ్మల్ని కలుస్తానని, ఇప్పుడు రాసినవన్నీ మీతో స్వయంగా చెప్పుకుంటానని, అవన్నీ విని మీరు నవ్వుతూ నన్ను ఆశీర్వదిస్తారని మీ కోట్లాది అభిమానులలో ఒకడిగా ఎదురుచూస్తున్నాను. 

చిత్రమ్మా.. I LOVE YOU.

మీకు కూడా చిత్ర గారి పాటలంటే ఇష్టమా? అయితే చిత్రమ్మ పాడిన పాటల్లో మీ ఫేవరేట్ ఏదో నాకు కింద కామెంట్ చేయండి. నా ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి.


THANK YOU   

PC: CH. VAMSHI MOHAN

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి