తెలివి కన్ను తెరుసుకుందయ్యా
శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా
మాయ గంతలు తీయ్యా..
భక్త కన్నప్ప.. పరమశివుడికి పరమ భక్తుడు. ఈ ప్రపంచానికి అతనెవరో తెలియక ముందు వరకు అతడి పేరు తిన్నడు. తన అచంచలమైన, నిస్వార్థమైన భక్తితో శివుడికి తన కళ్లనే అర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. కళ్లు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు నుంచి తిన్నడు కన్నప్పగా పేరొందాడు.
మహా శివుడి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ అంతా శివమయం అనుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోయి ఆనంద తాండవం చేస్తున్న తిన్నడు.. తన ప్రభువు శివయ్యని ఇలా స్తుతిస్తున్నాడు. 'శివా శివా శంకరా.. తెలివి కన్ను తెరుసుకుందయ్యా..' తెలివి కన్ను.. ఈ పదమే కొత్తగా ఉందనిపిస్తుంది కదా. అప్పటివరకూ శివతత్వం ఏంటో గుర్తించక మూసుకుపోయిన తన మనోనేత్రం ఇప్పుడే నిజమేంటో తెలుసుకుని తెరుచుకుందని చెప్తున్నాడు. 'మనసు నిన్ను తెలుసుకుందయ్యా.. మాయ గంతలు తీయ్యా..' నువ్వెంటో తెలిసింది.. నేనెందుకు పుట్టానో అర్థమైంది.. మనసు నిన్ను గుర్తించింది.. అప్పటివరకూ మాయతో మూసుకుపోయిన తన కళ్లకు ఉన్న గంతలు తొలగిపోయాయంటూ తన శివుడికి భక్తితో తిన్నడు చెప్పుకుంటున్నాడు.
మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు
నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి
నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి
ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా
గతంలో నీ విలువను గుర్తించక.. అసలు నువ్వనేవాడివి ఉన్నావని తెలుసుకోలేక నా పాత బతుకు అలా గడిచిపోయింది. 'నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి.. నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి'.. ఆహా ఎంత భక్తి పరవశంలో ఉన్నాడో కదా ఆ తిన్నడు.. నీ దయను విభూదిగా తన ఒంటికి పూయమని వేడుతున్నాడు, తనను మరో నందిగా మార్చుకో అంటున్నాడు. శివుడికి ప్రధాన భక్తుడు నంది అని మనకు తెలుసు.. ఏ శివాలయంలో అయినా ఆ లింగ రూపం ముందు నంది ఖచ్చితంగా ఉంటాడు. తన స్వామి మీద ఓ కన్నేసి ఉన్నట్లు తదేకంగా చూస్తూనే ఉంటాడు.. శరణంటూ వచ్చిన భక్తుల కోరికలు నంది చెవిలో చెప్తుంటే.. నంది ఏమో తన స్వామికి అవి విన్నవిస్తాడు. అంత ప్రాముఖ్యత ఉన్న నందిలా తనను మార్చుకోమని
శివయ్యని కోరుతున్నాడు తిన్నడు. ముఖ్యంగా ఇక్కడ రచయిత కూడా చక్కని పదాలతో వివరించారు తిన్నడి మనసుని. దయని విభూదిగా, తనని నందిగా ముడి వేయమని రాయడం చక్కని పద ప్రయోగం.
స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన
లింగమయ్య నీవే నాకు తోచినావుగా
దారెంట … కొమ్మలు శివ శూలాలే
మబ్బుల్లో… గీతలు నీ నామాలే
లోకమంతా నాకు శివమయమే
యాడ చూడు నీ అనుభవమే
ఓంకారము పలికినవి పిల్ల గాలులే…
స్వర్ణముఖి నది.. ఆ
కాళహస్తీశ్వర సన్నిధిలో ఆహ్లాదంగా ఉరకలెత్తే నది.. ఆ నీటిలో తడుస్తున్న రాయి కూడా తిన్నడికి శివలింగంలాగే తోస్తుంది అంట. దారిలో పోతున్నప్పుడు చెట్టు కొమ్మలు కూడా శివుడి శూలంలా కనిపిస్తున్నాయట. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనిపించే మబ్బుల్లో గీతలు కూడా శివుడి నుదుటన నామాలుగా అనిపిస్తున్నాయంట. గాలితో పాటు వచ్చే ఆ సన్నని సవ్వడి కూడా ఓంకారంలాగే వినిపిస్తుందట. అంతే కదా మరి.. మనసు, బుద్ధి శివమయం అయినప్పుడు ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్పా అన్నీ శివుడి రూపాలుగా అనిపించడం, కనిపించడం సహజమే కదా మరి..!
ఓ.. కొండ వాగు నీళ్లు నీకు లాలపోయానా..
అడివి మల్లె పూలదండ అలంకరించనా
నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు
ముప్పొద్దు.. నీతో నవ్వుల కొలువు
దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా.. ఓ శివయ్య
ఇప్ప తేనే ఉంది విందు చేయనా
నిన్ను సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా...
ఒక మనిషిని బాగా ఇష్టపడితే అది నమ్మకం.. అదే ఒక దేవుడిని ఇష్టపడితే అది
భక్తి. భగవంతుడిని విగ్రహ రూపంలోనో, ఏదో శక్తి రూపకంలోనో కొలవడం మాత్రమే భక్తి అనిపించుకోదు. నా దృష్టిలో భక్తి అంటే ఆ భగవంతుడిని మనం సొంతం చేసుకోవడం.. మనతోనే ఉన్నాడు.. మాట్లాడుతున్నాడు.. వింటున్నాడని సంపూర్ణంగా నమ్మడం. ఇక్కడ తిన్నడు కూడా ఆ పరమశివుడిని చంటిబిడ్డలా ఊహించుకుంటున్నాడు, పసిపాపలా సాకుతున్నాడు. అభిషేక ప్రియుడైన ఆ దేవదేవుడికి కొండవాగు నీళ్లతో లాల పోయనా అని ఎంత ముచ్చటగా అడుగుతున్నాడో చూడండి.. అడివి మల్లె పూలదండతో అలంకరించనా అని ఎంత మురిపెంగా కోరుతున్నాడో వినండి.. నిత్యం ఆ దేవుడు కడుపారా భుజించే నైవేద్యాలకు సరిసాటిగా దుప్పి మాంసం తెచ్చానంటున్నాడు, ఇప్ప తేనే ఉంది విందు చేస్తానంటున్నాడు.. ఎంత నిర్మలమైన మనసు ఆ తిన్నడిది. మాంసం కదా అపచారం అనుకోవాల్సిన పని లేకుండా తన వద్ద ఉన్నది సంతృప్తిగా అందించాలంటే దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. తిన్నడి భక్తి కూడా అంతే.. ఎలాంటి హద్దులు, అడ్డంకులు లేని అంచంచలమైన విశ్వాసం. భక్తుడు మనస్ఫూర్తిగా ఏది సమర్పించినా ఆ భగవంతుడు కాదనడు, ఇక భోళా శంకరుడి సంగతి చెప్పేదేముంది..!


ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో
చలి మంచుకు విలవిల ఏ పాటు పడితివో
ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా..
కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య
ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా
ఏమైనా.. నీకు న్యాయంగుందా
ఈ పైనా.. నిన్ను వదిలేదుందా..
కారడవిలో వెలసి దిక్కూమొక్కూ లేకుండా ఉన్న తన శివయ్యని ఎండకు, వానకు, చలికి ఎలా తట్టుకున్నావో అని ఆ లోకాలను ఏలేవాడి మీదే జాలి పడుతున్నాడు ఆ పరమ భక్తుడు తిన్నడు. భగవంతుడే కదా శక్తి స్వరూపుడు, ఏమీ కాదనే విచక్షణ లేదు.. ఎక్కడ తన దేవుడు కష్టాలు పడుతున్నాడో అని కరుణ కురిపిస్తున్నాడు. అఖిలాండ బ్రహ్మాండాన్నే శాసించే ఆ భగవంతుడికే నీడ, గూడు తానే అవుతానంటూ సాయపడతానని అంటూనే చెలికాడిలా ఎప్పుడూ వెంటే ఉంటానని దేవుడికే అభయం ఇస్తున్నాడు. 'కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య.. ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా'.. కొంచెం ముందు నాకు కనబడితే ఏమయ్యుండేది.. నీ ఆస్తులేమైనా కరిగిపోతాయా అంట.. తాను నమ్మిన దేవుడిపై ఆ భక్తుడికి ఎంత అధికారమో.. ఎలా చేరదీస్తున్నాడో..!
ఎట్టగట్టనో తల తిరిగి
మొగసిన తపమంతా కరిగి
శివయ్య నీ సిగముడిలో సిక్కుకుంటిరా…
పొమ్మని ఇదిలించినా.. కసురుతూ కరిగించినా
శులముతో పొడిచినా.. పాములు కరిపించినా
నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా…
ఇన్నాళ్లూ ఎలాగోలా బతికేసా.. ఇక నువ్వే దిక్కు, నీతోనే బతుకు అంటూ శివయ్యకు వివరిస్తూ నీ సిగముడిలో చిక్కుకుంటి అని తిన్నడు పలకడం వెనుక ఎంత ఆరాటం దాగి ఉందో అతని భక్తిని ఊహించగలమా? ఆ పరమశివుడి సిగముడిలో గంగాదేవి ఆవాసం ఏర్పరుచుకుని ఉంటుంది.. ఆ గంగకే నిలయమైన సిగముడిలో భక్తుడు చిక్కుకున్నానని చెప్పడం ఎంత గొప్ప వర్ణన. ఇక నువ్వు వద్దన్నా నిన్ను విడిచి ఉండలేనని, నువ్వు లేకుండా బతకలేనని, నీ పూజ చేయకుండా జీవించలేనని తిన్నడు చెప్తున్నాడు. పొమ్మని ఇదిలించినా, కసిరినా, శూలముతో పొడిచినా, పాములు కరిపించినా నిన్ను వదిలే ప్రసక్తే లేదని మారాం చేస్తున్నాడు. ఇకపై నిన్ను వదిలి వెళితే తన పేరు తిన్నడు కాదంటూ తండ్రి చాటు బిడ్డలా నువ్వు ఎక్కడికెళ్లినా వస్తా అన్నట్లుగా ఆ గారాబం చూడండి. అది కదా నమ్మిన దేవుడి దగ్గర ఒక నిజమైన భక్తుడు తీసుకునే చొరవ.


ఇలాంటి అచ్చ తెలుగు పదాలతో, అర్ధవంతమైన భావంతో పాటలు తగ్గిపోయిన ఇప్పటి మన సినిమాల్లో ఇలాంటి ఒక అద్భుతమైన పాట రావడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. పరమశివుడి మీద ఓ భక్తుడి భక్తిని, ప్రేమను, అనురాగాన్ని ఇంత అందంగా వివరిస్తూ ఈ పాట రూపుదిద్దుకోవడం వెనుక ఉన్న ప్రతి కళాకారుడికి నిజంగా ధన్యవాదాలు. ఈ పాటను ఇంత అర్థవంతంగా రాసిన
రామజోగయ్య శాస్త్రి గారిని, ఇంత ఆర్ద్రతతో పాడిన
విజయ్ ప్రకాష్ గారిని, మనసులో నిలిచిపోయేలా సంగీతం అందించిన
స్టీఫెన్ దేవస్సీ గారిని, ఇలాంటి మంచి పాటను మన ముందుకు తెచ్చిన 'కన్నప్ప' మూవీ టీమ్‌ని అభినందించకుండా ఉండలేం.
THANK YOU
PC: CH.VAMSI MOHAN
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి